Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పాకిస్తాన్‌ సెల్ఫ్‌ గోల్‌.!

పాకిస్తాన్‌ సెల్ఫ్‌ గోల్‌.!

భారతదేశంపైకి తీవ్రవాదాన్ని ఎగదోస్తోన్న పాకిస్తాన్‌కి, అదే తీవ్రవాదం పక్కలో బల్లెంలా తయారవుతోంది. వాస్తవానికి, భారతదేశంలో పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదం సృష్టించే మారణహోమం కన్నా, అదే పాకిస్తాన్‌ పెంచి పోషించిన తీవ్రవాదం పాకిస్తాన్‌లో సృష్టించే మారణహోమమే ఎక్కువ. పాకిస్తాన్‌లో పాలకులు అక్కడి తీవ్రవాదుల కనుసన్నల్లో పనిచేస్తే సరేసరి, లేదంటే తేడాలొచ్చేస్తాయి. ఇదిప్పటి మాట కాదు. చాలాకాలంగా జరుగుతున్న తంతే. 

ఇక, తాజాగా మరోసారి పాకిస్తాన్‌ ఇరకాటంలో పడ్తోంది. అక్కడ సైనిక పాలన దిశగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ సమాజంలో 'యురీ తీవ్రవాద ఘటన' తర్వాత పాకిస్తాన్‌ ఏకాకి అయ్యింది. భారత్‌లోకి పాక్‌ సైన్యం తీవ్రవాదుల్ని ఎగదోసిన వైనాన్ని ప్రపంచమంతా గుర్తించింది. 'ముందు మీ దేశంలో తీవ్రవాదాన్ని అదుపులో పెట్టండి.. తీవ్రవాదులకు సాయాన్ని ఆపేయండి..' అని అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కి తేల్చి చెప్పడంతో, అక్కడ తీవ్రవాద సంస్థలు, సైన్యం అప్రమత్తమయ్యింది. 

అదే సమయంలో, బలూచిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. చైనా - పాకిస్తాన్‌ పారిశ్రామిక కారిడార్‌కి వ్యతిరేకంగా జనం రోడ్ల మీదకు వస్తున్నారు. వారిని అణచివేసే క్రమంలో సైన్యం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఏం చేసినా, బలూచిస్తాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆందోళనలు తగ్గే పరిస్థితులు కన్పించడంలేదు. పైగా, ఈ రెండు ప్రాంతాల్లో భారత అనుకూల నినాదాలు ఊపందుకుంటున్నాయి. 

బలూచిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ఆందోళనలు పెరిగితే, అంతర్జాతీయ సమాజం ముందు మరోమారు దోషిగా నిలబడాల్సి వస్తుంది పాకిస్తాన్‌కి. ఈ వ్యవహారాలేవీ బయటకు రాకుండా పాకిస్తాన్‌ సైన్యం అక్కడ, భారత్‌పై యుద్ధానికి ముందస్తు సన్నాహాల్లో నిమగ్నమైపోయాయి. పాకిస్తాన్‌ ఆర్మీతోపాటు, అక్కడి వాయసేన కూడా తమ బలాన్ని ప్రదర్శించే పనిలో బిజీగా వుంది. 

ఓ వైపు ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతున్న వేళ, పాకిస్తాన్‌ రెచ్చగొడుతున్నా భారత్‌ సంయమనం పాటించడం.. వ్యూహాత్మక ఎత్తుగడగానే భావించాలి. ఈ సంయమనం ద్వారా పాక్‌ దమననీతిని ఐక్యరాజ్యసమితిలో ఎండగట్టేందుకు భారత్‌కి వీలు దొరికింది. అయితే, పాకిస్తాన్‌లో ఎప్పుడు సంక్షోభం తలెత్తినా, అది భారత్‌కి పరోక్షంగా ప్రమాదకరంగా తయారవుతుంది. అక్కడి సైన్యం, పాకిస్తాన్‌ ప్రభుత్వంపై తిరగబడ్డంతోపాటు, భారత్‌పైకీ దండెత్తే అవకాశాలు సుస్పష్టం. ఇప్పుడే భారత్‌ మరింత అప్రమత్తంగా వుండాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?