Advertisement

Advertisement


Home > Articles - Special Articles

పండగ దోపిడీ.. ఈసారెలా.!

పండగొస్తోందంటే ప్రయాణీకుల్ని దోచుకునేందుకు ‘రవాణా’ మాఫియా రెడీ అయిపోవడం గత కొన్నాళ్ళుగా జరుగుతోన్న వ్యవహారమే. ఈసారీ ఆ రవాణా మాఫియా ప్రయాణీకుల్ని బాదేసేందుకు సిద్ధమైపోయింది. దసరా పండుగకి తోడు.. అక్టోబర్‌ 2న గాంధీ జయంతి సెలవు కారణంగా.. ఈసారి పండుగ మరింత హాట్‌ హాట్‌గా మారిందనే చెప్పాలి. ఓ పక్క ఆర్టీసీ.. ఇంకోపక్క ప్రైవేటు బస్సులు ప్రయాణీకుల్ని నిలువునా అదనపు ఛార్జీల పేరుతో దోచేస్తోంటే, ఇంకోపక్క రైల్వే శాఖ కూడా స్పెషల్‌, ప్రీమియం పేర్లతో ప్రయాణీకుల జేబులకు చిల్లులు పెట్టేస్తున్నాయి.

ప్రతిసారీ అధికారంలో వున్నవారు, ‘ఎలాంటి దందాలకూ, మాఫియాలకూ అవకాశం కల్పించబోం..’ అని చెప్పడం.. తూతూ మంత్రంగా ప్రైవేటు ట్రావెల్స్‌పై దాడులు చేయడం జరుగుతున్నా, ప్రయాణీకుల దోపిడీ మాత్రం ఆగడంలేదు. అయితే గతంతో పోల్చితే ఈసారి దసరా పండుగకి ప్రయాణీకుల రద్దీ కాస్త తగ్గే అవకాశం వుందన్న ప్రచారం తెరపైకొచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాక వచ్చిన తొలి దసరా పండుగ ఇది. ఆ విషయం అలా వుంచితే, ఇప్పటికీ సాధారణ బస్సు సర్వీసుల్లో (ఆర్టీసీ) టిక్కెట్లు అందుబాటులో వుండడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మామూలుగా అయితే, ఓ ఇరవై రోజుల ముందే దసరా పండగ సెలవులకు సంబంధించి రిజర్వేషన్లు పూర్తయిపోతాయి. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సర్వీసుల్ని ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు. కారణాలేంటి.? అన్నదే ఇప్పుడెవరికీ అర్థం కావడంలేదు. ఆంధ్రప్రదేశ్‌కి విజయవాడ రాజధానిగా ప్రకటితమవడంతో హైద్రాబాద్‌ నుంచి కొందరు తమ స్వస్థలాలకు వెళ్ళిపోయి వుంటారనే వాదనలు విన్పిస్తున్నా.. దాన్ని కొట్టిపారేసేవారూ లేకపోలేదు.

కొన్ని ప్రైవేటు బస్సుల్లో మాత్రం అడ్వాన్స్‌ రిజర్వేషన్లు లేవు.. వాటి పరిస్థితెప్పుడూ అంతే. చివరి నిమిషంలో ఖాళీల్లేవని చెప్పి రేట్లు పెంచేయడం ప్రైవేటు ట్రావెల్స్‌కి రివాజుగా మారిపోయింది. హైద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ నగరాలకు వెళ్ళే రైళ్ళకు సంబంధించి రిజర్వేషన్‌ ఎప్పుడో పూర్తయిపోయింది. ఇక ప్రయాణీకులకు ప్రత్యేక రైళ్ళే దిక్కు.

అన్నట్టు, ప్రైవేటు దోపిడీని అరికడ్తామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మంత్రి సిద్ధా రాఘవరావు ఆల్రెడీ ఓ ప్రకటన చేశారు కూడా ఇందుకు సంబంధించి. తెలంగాణ సర్కార్‌ కూడా రంగంలోకి దిగితే, ప్రైవేటు ట్రావెల్స్‌కీ, వాటిల్లో ప్రయాణించేవారికీ ప్రయాణంలో చుక్కలు కన్పించడం ఖాయమే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?