Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ప్రజాస్వామ్యం చచ్చిపోయింది: విశాల్‌

ప్రజాస్వామ్యం చచ్చిపోయింది: విశాల్‌

హీరో విశాల్‌కి కాస్త ఆలస్యంగా తెలిసినట్టుంది.. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని.! ఇంటర్నెట్‌లో విశాల్‌ అభిమానులు, ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు తమ అభిమాన హీరోకి. విషయం అందరికీ తెల్సిందే, తమిళనాడులోని ఆర్‌కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నిక కోసం ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా విశాల్‌ నామినేషన్‌ వేయడం, అది తిరస్కరణకు గురవడం, వెంటనే నాటకీయ పరిణామాల మధ్య స్వీకరణకు గురవడం.. మళ్ళీ కాస్త గ్యాప్‌తో తిరస్కరింపబడడం. 

ఈ మొత్తం ఎపిసోడ్‌పై విశాల్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 'డెమోక్రసీ చచ్చిపోయింది' అంటూ సోషల్‌ మీడియాలో ట్వీటేశాడు విశాల్‌. '5, డిసెంబర్‌ 2016 'అమ్మ' (జయలలిత) చనిపోయింది.. 5, డిసెంబర్‌ 2017 ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. రెస్ట్‌ ఇన్‌ పీస్‌ డెమోక్రసీ..' అంటూ విశాల్‌ చేసిన ట్వీట్‌, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్టు, న్యాయపోరాటం దిశగా విశాల్‌ అడుగులేస్తోన్న విషయం విదితమే. కాస్సేపట్లో విశాల్‌, మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. 

అయితే, ఇక్కడ ఈ ఎపిసోడ్‌లో విశాల్‌ ప్రదర్శించిన చిన్నపాటి 'నిర్లక్ష్యం' కూడా కాస్ట్‌లీ మిస్టేక్‌గా మారిందని చెప్పక తప్పదు. పదిమంది సపోర్టర్స్‌ తాలూకు సంతకాలు నామినేషన్‌ పత్రానికి తప్పనిసరైనప్పుడు, అత్యంత నమ్మకస్తుల్ని విశాల్‌ ఎంచుకోవాల్సి వుంది. ఇక్కడే విశాల్‌ 'తప్పు'లో కాలేసేశాడు. సంతకాలైతే పెట్టించుకున్నాడుగానీ, పూర్తిస్థాయిలో ఆ సంతకాల గురించీ, ఆయా వ్యక్తుల గురించీ తెలుసుకోవాలన్న 'తెలివి' ప్రదర్శించలేకపోయాడు. 

సినిమా వేరు, రాజకీయాలు వేరు. 'సినిమాటిక్‌ లిబర్టీ' పేరుతో లాజిక్‌ లేని సీన్స్‌ని 'మమ' అన్పించేయడం చూస్తూనే వుంటాం. రాజకీయాల్లో అలా కుదరదు. అన్నీ పక్కాగా వున్నా, రాజకీయ కుట్రల కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటిది, చిన్న చిన్న లూప్‌హోల్స్‌ని లైట్‌ తీసుకుని, రాజకీయాల్లోకి వచ్చేశానంటే ఎలా.? 

'ఓటమి విజయానికి తొలిమెట్టు..' అని కొందరు విశాల్‌కి మద్దతిస్తోంటే, ఇంకొందరేమో 'నామినేషన్‌ సరిగ్గా వెయ్యడమే చేతకాలేదు, చట్ట సభలకు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావ్‌.?' అని ఆయన్ని నిలదీస్తున్నారు. 'రజనీకాంత్‌, కమల్‌ ఎందుకు ఆలోచిస్తున్నారో తెలుసుకో.. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకో..' అని మరికొందరు సలహాలిస్తున్నారు విశాల్‌కి. 

జయలలిత మరణం తర్వాత తమిళనాడులో ఏం జరిగిందో, జరుగుతోందో చూస్తూనే వున్నాం. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కినట్టే దక్కి చేజారిపోయింది శశికళకి. పద్ధతి ప్రకారం అయితే ఆమె ముఖ్యమంత్రి అయితీరాలి. కానీ, గవర్నర్‌ వ్యవస్థని అడ్డంపెట్టుకుని కేంద్రంలోని బీజేపీ ఏ స్థాయిలో 'రాజకీయం' నడిపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇవన్నీ తెలిసీ, విశాల్‌ అంత 'ఔట్‌ డేటెడ్‌'గా ఎలా వ్యవహరించాడట.? ఏమోమరి, ఆయనకే తెలియాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?