Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్‌

ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయ్‌

విమాన ప్రయాణం అత్యంత సురక్షితం.. అనే అభిప్రాయం వుండేది ఒకప్పుడు. ‘గాల్లో ప్రాణాలు..’ అని ఎవరెన్ని విమర్శలు చేసినా, ప్రపంచ వ్యాప్తంగా వివిధ విమానయాన సంస్థలు ప్రయాణీకుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తమ సర్వీసుల్ని కొనసాగిస్తున్నాయి. కానీ అప్పుడప్పుడూ ప్రమాదాలూ చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదం చోటు చేసుకోవడం అనేది సహజమే. కానీ, ప్రమాదం మళ్ళీ మళ్ళీ రిపీటవుతుంటే మాత్రం ప్రయాణీకుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి.

ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణీకుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఈ ఏడాదిలో.. ఆ మాటకొస్తే, గత మూడు నాలుగు నెలల్లోనే ఏకంగా మూడు పెద్ద విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మలేసియాకి చెందిన విమానమొకటి అడ్రస్‌ లేకుండా పోయింది. అదేమయ్యిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పేలిపోయిందా? కూలిపోయిందా? హైజాక్‌కి గురయ్యిందా? అన్న ప్రశ్నలే తప్ప, దేనికీ సమాధానం లేదు.

ఇటీవలే మరో మలేసియన్‌ విమానం కుప్పకూలిపోయింది ఉక్రెయిన్‌లో. రష్యా అనుకూల తీవ్రవాదులే విమానాన్ని కూల్చేశారని ఉక్రెయిన్‌ ఆరోపిస్తోంటే, ఉక్రెయిన్‌ దళాలు ఆ విమానాన్ని గాల్లో పేల్చేశాయనే వాదనొకటి తెరపైకొచ్చింది. ఏం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే. రెండు మలేసియా విమాన ప్రమాదాలు.. ఆరొందలమంది ప్రయాణీకుల్ని బలిగొన్నాయి.

తాజాగా మరో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈసారి తైవాన్‌లో. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్‌ విమానాన్ని ఎమర్జన్సీ ల్యాండింగ్‌ చేయాలనుకున్నాడు. కానీ, అతని ప్రయత్నం విఫలమయ్యింది. విమానం కుప్పకూలిపోయింది. ఇక్కడ యాభై మందికి పైగా ప్రయాణీకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ మూడూ ప్రమాదాల్లో మూడోది మాత్రమే విపత్కర వాతావరణ పరిస్థితుల్లో సంభవించింది. మిగతా రెండు ప్రమాదాలూ ప్రత్యేకమైనవి.

ఒక్క ప్రాణమైనా విలువైనదే. అలాంటిది ఆరొందలమంది ప్రయాణీకులు.. అదీ ఒకే దేశానికి చెందిన రెండు విమానాల కారణంగా ప్రాణాలు కోల్పోవడమంటే చిన్న విషయం కాదు. ఒకటి ఏమయ్యిందో తెలీదు, ఇంకోటి ఎలా కూలిందో తెలియదు. ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం  ప్రయాణీకులకు ఎలా భరోసా ఇవ్వాలో అర్థం కాక సతమతమవుతోంది. ప్రయాణీకుల ఆందోళన అయితే అంతా ఇంతా కాదు. అలాగని విమాన ప్రయాణాలు తగ్గాయా? అంటే లేదు. భవిష్యత్తులోనూ తగ్గవు కూడా. విమాన ప్రయాణం అంత తేలికైపోయింది.. అంతగా ఎక్కువమందికి అందుబాటులోకి వచ్చేసింది.

ఏం చేయాలి.? విమాన ప్రమాదాల్ని ఎలా నిలువరించాలి.? అన్నదానిపై ప్రపంచ విమానయాన రంగం దృష్టిపెట్టింది. ఇప్పటికే తీసుకుంటున్న భద్రతా చర్యలు భేషుగ్గా వున్నా, ఇంకా ఏదో చెయ్యాలన్న ఆలోచనైతే విమానాల తయారీ సంస్థల్లోనూ కలుగుతోంది. వివిధ దేశాల్లోని ప్రభుత్వాలూ విమాన ప్రయాణీకుల భద్రత విషయంలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందనే అంతర్మధనంలో మునిగిపోయాయి. అంతమాత్రాన ప్రమాదాలు చెప్పి రావు కదా.. అయినాసరే, విమాన ప్రమాదాల పరంపరకు బ్రేక్‌ పడాలనే ఆశిద్దాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?