Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రాజధానిపై రచ్చరచ్చేనా?

మనం చెప్పుకునేది ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ గురించి కాదు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏర్పడాల్సిన రాజధాని గురించి. తెలంగాణవారికి వడ్డించిన విస్తరిలా హైదరాబాద్‌ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని కోసం ఇంకా అన్వేషణ సాగుతూనే ఉంది. చంద్రబాబు పాలన నెల రోజులు పూర్తి చేసుకున్నా ఇప్పటివరకు రాజధాని ఎక్కడో తెలియడంలేదు. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ  ఇంకా పర్యటిస్తూనే ఉంది. రాజధాని విషయం అదెప్పుడు తేలుస్తుందో తెలియడంలేదు. అయితే జరుగుతున్న పరిణామాలను, మారుతున్న పరిస్థితిని బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని విషయంలో రచ్చ రచ్చ అయ్యేలా ఉంది. రాయలసీమ నాయకులు మళ్లీ రాజధాని డిమాండ్‌ను బలంగా ముందుకు తెస్తున్నారు. రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ క్రమంగా ఊపందుకుంటున్న  సూచనలు కనబడుతున్నాయి. ఇప్పటివరకూ విజయవాడ`గుంటూరు మధ్యనే రాజధాని ఏర్పాటు కాబోతోందన్న సంకేతాలు అందాయి. నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు అలాంటి వాతావరణం కల్పించారు. వీరి వ్యవహారశైలి కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. కాబోయే రాజధాని ప్రాంతంగా దాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇందుకు దోహదం చేశారు.

 అయితే ప్రస్తుతం రాయలసీమలో రాజధాని డిమాండ్‌ ఊపందుకుంటుండటంతో కొత్త రాజధాని ఎంపిక లేదా నిర్మాణంపై పీటముడి పడే అవకాశాలన్నాయేమోననే అనుమానం కలుగుతోంది. రాయలసీమ నాయకులు ‘రాజధాని సాధన కమిటీ’ అనే పేరుతో ఉద్యమం లేవదీస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈమధ్యే హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశం విజయవంతమైంది. అందులో ప్రముఖ నాయకులు, మేధావులు, నిపుణులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ జరుగుతున్నప్పుడే కర్నూలు జిల్లా నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి కర్నూలునే రాజధాని చేయాలని పట్టుబట్టి దీనిపై బాగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన ఏవో కేసుల కారణంగా చురుగ్గా లేకపోయినా ఆయన డిమాండ్‌ మాత్రం సజీవంగానే ఉంది. గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి దాదాపు అన్ని ముఖ్యనగరాలకు రాజధాని అయ్యే అర్హత ఉందని చెప్పింది. ఇది కొంతవరకూ వాస్తవమే అయినా ఏదో ఒక నగరాన్ని లేదా ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిన ఆ కమిటీ ఇంకా అన్వేషణ సాగిస్తూనే ఉంది. నిజానికి ఆ కమిటీకి రాజధానిని ఎంపిక చేసి ప్రకటించే అధికారం లేదు. మంచి చెడులను, వివిధ అంశాలను విశ్లేషించి కేంద్రానికి నివేదిక ఇవ్వాలి. ప్రస్తుతం ఆ కమిటీ ఇంతదూరం రాలేదు.         

ఇప్పటివరకూ రాజధాని కోసం పెద్ద నగరాల పేర్లే కాకుండా ఎవరూ ఊహించని ఊళ్ల, ప్రాంతాల పేర్లు వినిపించాయి. చాలాకాలం క్రితం ప్రకాశం జిల్లాలోని దొనకొండ పేరు జోరుగా వినిపించింది. తాజాగా అమరావతి, నూజివీడు పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. సరే....విజయవాడ`గుంటూరు మధ్య మంగళగిరి ప్రాంతం ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం...ఆ రెండు జిల్లాల్లోని ఓ బలమైన సామాజికవర్గం లాబీయింగ్‌ అని వినవస్తోంది. ఈ సామాజికవర్గం తమవాడే అయిన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రభావితం చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. విజయవాడ`గుంటూరు ప్రాంతాలపై జోరుగా ప్రచారం సాగిన సమయంలోనూ కర్నూలు పేరు వినిపించలేదు. కాని ఓ వారం రోజులుగా అది తెర మీదకు వచ్చింది. రాయలసీమ టీడీపీ నాయకులు కూడా కర్నూలును రాజధాని చేయాలంటున్నారు. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడటం, 1956లో హైదరాబాద్‌ రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు కావడం తెలిసిందే. కర్నూలు కేవలం రెండున్నర లేదా మూడేళ్లు మాత్రమే రాజధానిగా ఉంది. వాస్తవానికి పొట్టి శ్రీరాములు మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్రాన్ని డిమాండ్‌ చేశారు. దాంతో ఆమరణ నిరాహారదీక్ష చేశారు. మద్రాసు కాస్తా తమిళులకు ధారాదత్తం అయింది. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయిన కర్నూలు ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడగానే ఆ హోదా కోల్పోయింది.
     
నిజానికి 1953లో విజయవాడకు రాజధాని యోగం పట్టాల్సిఉండగా అక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉందనే సాకుతో కాంగ్రెసు నాయకులు వ్యూహాలు పన్ని కర్నూలును రాజధాని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో కర్నూలు రాజధాని హోదా కోల్పోయింది కాబట్టి ఇప్పుడు శేషాంధ్రప్రదేశ్‌కు ఆ నగరాన్నే రాజధాని చేయాలని సీమవాసులు పట్టుబడుతున్నారు. అయితే రాజధానిని కోల్పోయామన్న భావన విజయవాడ ప్రజల్లోనూ ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా విజయవాడ నగరం లేదా దాని పరిసర ప్రాంతాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఒకవేళ కోస్తాంధ్రలోనే రాజధాని ఏర్పాటు నిర్ణయం జరిగితే రాయలసీమ రగులుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?