Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రాజధాని రాజకీయ ప్రహసనం

రాజధాని రాజకీయ ప్రహసనం

రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన అనంతరం మీడియా ముందుకు వచ్చిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నేటి గౌరవ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వర్యులు నాడు రాజధాని నిర్మాణానికి 5 లక్షల కోట్లు అడిగినారు. కానీ యిపుడు కేంద్రాన్ని అయిదు లక్షల కోట్లిమ్మని అడగటం మానేసి దాదాపు 37,000 ఎకరాలు భూసమీకరణ చేసి ప్రస్తుతం భూసేకరణ చేస్తాననటం చూస్తుంటే ప్రజలు ఓట్లేసి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది కేంద్ర ప్రభుత్వం నుండీ నిధులు తెచ్చి రాజధానిని నిర్మించి మనల్ని పాలించడానికా లేక 50,000 ఎకరాలు రైతుల భూముల్ని తీసుకొని విదేశీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు, సంస్థలకు అప్పచెప్పటానికా? యిది ప్రభుత్వమా లేక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీనా అనే అనుమానం కలుగుంది.

గత కాంగ్రెస్‌ పాలకులు 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించి ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ను కొత్తగా ఏర్పాటుచేసింది. రాష్ట్రానికి రాజధానిని ఎంచే అధికారాన్ని భావి ప్రభుత్వాలకు వదిలి పునర్‌ వ్యవస్థీకరణ చట్టం తెచ్చింది. దానిని నాటి ప్రతిపక్షం నేటి అధికార పక్షం భాజపా ఆమోదించింది. ప్రత్యేక హోదా ఇస్తామని రాజ్యసభలో సభానాయకుడైన ప్రధానమంత్రి ప్రకటించారు. ఎన్నో ఆశలతో మరెన్నో ఊహలతో సామాన్యుల నుండీ అసామాన్యుల వరకూ అనుభవమున్న నాయకుడు వస్తే మంచిదని ప్రజలు కోరుకుంటే దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభమున్న నాయకుడుని అధికారంలోకి తెస్తే మంచిదని ఆంధ్రరాష్ట్ర ప్రజలు తెలుగుదేశంపార్టీని అధికారంలోకి తెచ్చారు. రాష్ట్రం విడిపోయేటపుడు అక్కరకు రాని అనుభవము నూతన రాష్ట్ర రాజధాని నిర్మాణం, 16,000 కోట్ల లోటు బడ్జెట్‌ 50,000 వేలకోట్ల పైబడి రైతు, డ్వాక్రా ఋణమాఫీ మరెన్నో సమస్యలు తీర్చమని అధికారమిచ్చారు. ఆశావాహులైన ఆంధ్రరాష్ట్ర ప్రజలు, 13 జిల్లాల ఆంధ్రాను పరిపాలించటానికి మంగళగిరిలో ప్రభుత్వం అంగరంగ వైభవంగా పట్టాభిషేకంతో కొలువుతీరింది. పైన పేర్కొన్న సమస్యలతో రాష్ట్రం ఉంటే ముఖ్యమంత్రి మరియు మంత్రులు సింగపూర్‌ని మించిన రాజధానిని నిర్మిస్తామని అదే పనిగా చెప్పారు.

అనుభవలేమితో మున్సిపల్‌ మంత్రి రాజధాని గురించి పూటకోమాట, రోజుకొక ప్రెస్‌మీట్‌, నెలకో సమీక్షలతో ప్రెస్‌నోట్‌లతో, ప్రజల్ని గందరగోళ పరుస్తూ ఉంటే దానికి భిన్నంగా మరికొంతమంది మంత్రులు, శాసనభ్యులు, తలా ఒక ఊరుపేరు చెప్పి తలా ఒకటీ మాట్లాడి ప్రజల్ని అయోమయానికి గురిచేసి గందరగోళంలోకి ప్రజలను నెట్టేశారు.  ఆ గందరగోళ పరిస్థితులలో రాజధాని అమరావతా, నూజివీడా, దొనకొండా అని రాష్ట్రం యావత్తు ఊహాగానాలు జోరందుకున్న వేళ ప్రభుత్వం రాజధానిగా తుళ్ళూరుని ప్రకటించింది. తదుపరి రాజధాని ప్లాను నమూనాల డెమోని మనకు కాకుండా సింగపూర్‌వారికి వారి దేశంలో చూపించింది. ఓట్లేసి రాజ్యాధికారం ఇచ్చిన ప్రజలకు చెప్పకున్నా ప్రజలు పట్టించుకోలేదు. మీడియా కూడా పట్టించుకోలేదు. ప్రింట్‌ మీడియా మాత్రమే ఉన్న రోజులలో నిజాన్ని శాస్త్రీయంగా హేతుబద్దంగా బాగా లోతుగా అద్దంలో చూసినట్లు వ్రాయటం మనమెరుగుదుము. పత్రికలు, పాత్రికేయ విలువలు సమాజహితాన్ని గతంలోలాగా ఆకాంక్షిస్తున్నాయా లేదా అని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఉంది. 

రాజధానికి కమిటీని వేసింది ప్రభుత్వం. ఆరేడుగురు పారిశ్రామిక వేత్తలతో వేసిన కమిటీ ఏమి రిపోర్టు యిచ్చిందో నేటికీ ఎవరికీ తెలియదు. వివిధ రంగాల్లోని నిష్ణాతులను కాకుండా వారిని నియమించిన వారికే తెలియాలి. వాళ్ళ సామర్ధ్యం. నాడు రాష్ట్రాన్ని విడగొట్టే ముందు వేసిన శ్రీకృష్ణ కమిటీలో ఒక్క తెలుగువాడు లేడు. యిపుడందరూ తెలుగు వాళ్ళని ఆనందించటం తప్ప. అసలెంత ఆలోచించినా అర్ధంకాని విషయం సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాలు లేదా కంపెనీలు మన రాష్ట్రానికి రాజధాని నమూనా ప్లాన్‌ యిస్తున్నపుడు ప్రయోజనం ఆశించకుండా, లాభాపేక్ష లేకుండా ఎందుకు చేస్తున్నాయనే విషయం సామాన్యులైన ప్రజలకు అర్దంకాదు. అంతా అయోమయం.  ప్రభుత్వం అసలు ప్రజలకు తెలియచేయదు.

రాజు ఉండే ప్రాంతమది, పాలించేక్షేత్రమది. అదే రాజధాని. రాజధానిగా తుళ్ళూరును ప్రకటించాక మనకి రాజధాని నిర్మించాల్సిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి అది ఏమి చేస్తుందో అడిగి వాస్తవాలు ప్రజలకు వివరించకుండా రాష్ట్రప్రభుత్వం ఢిల్లీని అడగకుండా నేరుగా విదేశాలైన సింగపూర్‌ మరియు జపాన్‌లతో పనిచేస్తుంటే గతంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రులను ఢిల్లీలో నిర్ణయించినపుడు, ఆయా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ప్రతి పనికి ఈ ఢిల్లీ వెళుతున్నారని, సింహగర్జనలాగా ఆంధ్రుల అన్నగారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్నారని, తెలుగోడి ఆత్మగౌరవం మంట గలిసిందని ఆవేశంగా ప్రశ్నిస్తే పత్రికలు పతాకశీర్షికలు పెట్టాయి ఆనాడు. రాష్ట్ర రాజధానికి సంబంధించిన నమూనాలు మరియు ఎక్కడ ఏమి పెట్టదలచుకున్నారనే డెమోలు అసెంబ్లీకి ఓట్లేసి ఎన్నుకున్న మనకన్నా ముందు సింగపూర్‌ వారికి జపాన్‌కి చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని సింగపూర్‌, జపాన్‌ల్లో తాకట్టు పెట్టినట్లుకాదా?

నూతన రాజధానిని ప్రకటించిన ప్రభుత్వం తదుపరి చర్యగా రైతుల నుండి వేల ఎకరాలను భూసమీకరణ చేస్తామని ప్రకటించింది. గతంలో మనదేశంలో నూతన రాష్ట్రాల రాజధానులైన చండీగర్‌, గాంధీనగర్‌, నయా రాయ్‌పూర్‌ నగరాల నమూనాలతో ఆర్ధికాభివృద్ది చెందిన వివిధ విదేశీనగరాలైన షాంగై, సింగపూర్‌, పుత్రజయ మరియు ఇస్తాంబుల్‌లను మంత్రినారాయణ నేతృత్వంలో పర్యటించటం మనం చూశాము. గతంలో కేంద్రం ఇతర రాష్ట్రాల రాజధానిని నిర్మాణాల నిమిత్తం గరిష్టంగా యిచ్చింది వెయ్యికోట్లు రూపాయలలోపు మాత్రమేన్న విషయం సామాన్య ప్రజలకు తెలియదేమో కాని ప్రభుత్వానికి, ప్రభుత్వాదినేతలకూ తెలియనిది కాదు, అయినా ఆచరణ సాధ్యంకాని సింగపూర్‌ని మించిన రాజధానిని నిర్మిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటానికి ఈ రియల్‌ వ్యాపారానికి ప్రభుత్వం వచ్చినట్లనిపిస్తుంది.

జై జవాన్‌, జైకిసాన్‌ నినాదం నుండీ జైకిసాన్‌ అన్నది తీసేశారు. రైతే రాజు అనేది గతం, గత రాజరికపు కాలంలోని రాజు ప్రజాస్వామ్యంలో కానట్లే ప్రస్తుతం రైతు కూడా రాజు కాదు. సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్‌ రాజధాని నగరంలో నీది నాది ఏదీ లేదు అని సినిమా కవి వ్రాసినట్లుంది. రాజధాని ప్రాంతంలో పరిస్థితి. మొన్నామధ్య సామాజిక మాధ్యమంలో బోయపాటి సుధారాణి ఆవేదన చూస్తే అది ప్రస్ఫుటమవుతుంది. సింగపూర్‌ దేశం బహుళ అంతస్తుల ఆకాశ హార్మియా భవనాలున్న నగరమేకాని అక్కడ ఏ ఆహార ధాన్యాలు పండవు. అన్నీ దిగుమతి చేసుకుంటారు. అలాంటి రాజధానిని కడుతున్నామా మనం. భారతీయులలో ప్రత్యేకంగా నాధి మాధి అనే భావన అధికం.

తరతరాలుగా పూర్వీకులనుండి వారసత్వంగా వాటుగా ఆస్తి పూర్వీకులనుండీ సంక్రమించే భూమి వారి సొంతం. మాతాత, తల్లితండ్రులు, నాభార్య, నా పిల్లలు అని ఎంతగొప్పగా చెబుతారో నా ఊరు, నా పొలం అని కూడా అలానే గొప్పగా చెబుతారు. కర్షకులు అప్పులున్నా పొలం అమ్మడానికి ఇష్టపడకుండా పంటలమీద అప్పుతీర్చుదామనే పరిస్థితి మనకు తెలుసు. అలాంటిది భూసమీరణ చేద్దామని నిర్ణయానికీ వచ్చిన తర్వాత తరతరాలుగా రైతుల వద్ద దాన్ని  వారి పొలాన్ని తీసుకునేటపుడు వారిని సముదాయించాల్సింది పోయి ప్రభుత్వం పౌరులపై పౌరుషాలకు పోవటం వివేకమా? ఆలోచించాలి.

ప్రస్తుత వర్తమాన రాజకీయాలలో ప్రతిపక్షపార్టీలు శాసనసభ్యులు ముఖ్యమంత్రిని తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించమని కలిసే పరిస్థితి లేదు. ఒకవేళ కలిస్తే మీడియాలో భిన్న విభిన్న కథనాలు ఈ పరిస్థితి మారాలి. రాష్ట్ర విషయాల్ని ముఖ్యంగా రాజధాని మరియు అత్యంత ముఖ్యమైన విషయాల్లో అన్ని పార్టీల అభిప్రాయాన్ని తీసుకొని వెళ్లే సత్‌సాంప్రదాయాన్ని తీసుకురావాలి. ఆ రోజు రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినపుడు పార్లమెంటు ద్వారాలను మూసివేసి, ప్రజాస్వామ్యాన్ని హత్యచేసి కాంగ్రెస్‌, భాజపాలు చట్టం చేసినపుడు ఆంధ్రులందరూ ఉమ్మడిగా తప్పుపట్టినట్లు, ఈనాడు రాజధాని విషయంలో నేటి పాలకులు చేస్తే ఇక చట్టసభలు వాటిలో ప్రతిపక్ష పార్టీలుండి ఉపయోగం ఏమిటి కనీసం అభిలపక్ష భేటీకి కూడా పిలవనపుడు పార్టీలుండి ఉపయోగం ఏమిటి అది వారిని గుర్తించినట్లా లేక గుర్తించనట్లా, ఏదైనా ఒక రాకీయ పార్టీ అధికారంలోకి వస్తేనే దానికి పని రానపుడు వారితో అవసరం లేదన్నట్లుగా మారుతుందా అనిపిస్తుందీ వ్యవస్థ.

రెండు మూడు జిల్లాల కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి ప్రజలకు వినోదం అయిన కోళ్ళపందాల విషయంలో ఈ మధ్య అత్యున్నత న్యాయస్థానం ఒకటి రెండు రోజుల్లో కోర్టు గుమ్మం తొక్కిన 48 గంటల్లో పరిష్కరించింది. అదే అత్యున్నత చట్టసభ నాడు రాష్ట్ర విభజన నేపధ్యంలో సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి, సభా నాయకుడు కోర్టు తలుపుతట్టినా సమయం ఇదిగాదు పొమ్మంది. ఈ నాడు రాజధాని నిర్మాణంలో మన సర్కార్‌ సింగపూర్‌, జపాన్‌ ప్రభుత్వాలు లేదా కంపెనీలు ప్రయివేటు బృందాలతో కలిసి పనిచేస్తున్నది. రేపు ఏమైనా సమస్యలు వస్తే ఇరు ప్రభుత్వాలు  ఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి.

అసలు మనదేశంలోని చట్టసభలు, సర్వోన్నత న్యాయస్థానం విషయాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటం బాధాకరం. రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది కేంద్రం ఆదేశాలతో అనుమతులతో స్వదేశీ అనే దిశలో రాష్రాలను ఉంచకపోతే అది దేశ సమగ్రతకు ప్రమాదం. కాదా లేదంటే ఏ రాష్ట్రానికా రాష్ట్రం సొంతంగా విదేశాలతో ప్రత్యక్షంగా పనిచేస్తే అది ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలిగించదా? ఆలోచించాలి. ఈ మధ్య సింగపూర్‌ మాజీ ప్రధాని మరణిస్తే నివాళులర్పించటానికి వెళదామనుకున్న మన ముఖ్యమంత్రికి విడిగా సింగపూర్‌ వెళ్ళడానికి కేంద్రం అంగీకరించలేదని మనం పత్రికల్లో చదివాం. మరి ఇలా రాజధాని విషయంలో సింగపూర్‌ మరియు జపాన్‌లతో పనిచేయటానికి ఢిల్లీ సర్కార్‌ అనుమతిచ్చిందా అనే విషయం ప్రజలకు ప్రభుత్వం తెలియచేయాలి. పోలవరం ప్రాజెక్టుకట్టి సాగునీరందించి కొత్తగా సాగులోకి భూముల్ని తెస్తామనే ప్రభుత్వం, మూడు పంటలు పండుతున్న వ్యవసాయ భూముల్లోనే రాజధాని నిర్మాణానికి పూనుకుంది కాబట్టి ఆ ప్రాంత రైతుల్ని ఆకట్టుకుని నిర్మించాల్సిన వ్యవహారాన్ని జటిలం చేయటం మంచిది కాదేమో ఆలోచించాలి. ఈ విషయంలో ప్రభుత్వం విజ్ఞులు, మేధావులు, సామాజిక కార్యకర్తల సలహాలతో ముందుకెళితే బాగుంటుంది.

కడు విచారకరమైన విషయం రైతుల భూమి తీసుకొని ఎకరాకు 4840 గజాలకు గానూ 1000 గజాల నివాస స్థలం మరియు 200 గజాల వాణిజ్య స్థలం ఇస్తామని, అదే జరీ భూములైతే 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తామని చెబుతుంటే రైతుల తరపున ఇంకా ఎక్కువగా అంటే 1/3వ వంతు భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని వామపక్షాలు సైతం ఒత్తిడి చేయటం లేదు. ఉద్యమరూపంలో దానికి ప్రజల్ని కూడా తప్పుపట్టాలేమో. వారు కనీసం ప్రజాఉద్యమాల్లో ఉండి పోరాడే నైజం ఉన్నా ఉభయ కమ్యూనిస్టు పార్టీలలో ఒక్క దానికి కూడా కనీస ప్రాతినిద్యం ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కొన్ని పార్టీలు రైతులగోడు పట్టించుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు.

మూడు నాలుగు దశాబ్ధాల పూర్వం వరకూ కుటుంబంలో ఉమ్మడి కుటుంబాలలో పెత్తనంతో కూడిన బాధ్యత కుటుంబ పెద్ద రూపంలో ఉండేది. ఆ కుటుంబ పెద్ద కూడా కుటుంబం మెచ్చేటట్లుగానే పెత్తనం చేసేవాడు. రాజరికంలో రాజు కూడా రాజ్యాన్ని జనరంజకంగానే పరిపాలించేవాడు. అది ప్రజాస్వామ్యంలోని నాయకులు గుర్తెరిగి జనం మెచ్చే విధంగా పాలించాలి.

ఇలా పార్టీలు అధికారంలోకి రావటం వారికి నచ్చిందే చేయటం అప్రజాస్వామికంగా, తర్వాత మరో పార్టీ అధికారంలోకి రావటం వారు వారికి నచ్చింది చేస్తే అది ప్రజాస్వామ్య మనుగడకు విఘాతం కలిగించదా? అధికారపక్షం వారు చేసే పనులు స్వపక్షం వారే కాకుండా విపక్షం, ప్రతిపక్షాలు కూడా ఆమోదించే స్థితికి సభల్లో మెజారిటీ మార్చాల్సిన పరిస్థితుల్ని లేక ప్రజలనుండీ ఓటింగ్‌ కోరటం వంటివి చేయాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి.

నాడు ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేకహోదా యిస్తామని సభకు సభానాయకుడిగా హామీ ఇస్తే ఆ ప్రకటనకు ఇపుడు విలువలేదంటున్నారు. ఆ హామీకి దిక్కులేదిపుడు. ఇటీవల విశాఖపట్ణణంలో హుద్‌హుద్‌ తుఫాన్‌ తాకిడిని వీక్షించడానికి విచ్చేసిన మన ప్రధాని నరేంద్రమోడీ ప్రెస్‌ మీట్‌లో ప్రకటించిన సాయం 1000 కోట్లు. ఇచ్చింది సుమారు 400 కోట్లు మాత్రమే ప్రెస్‌మీట్‌లో నాయకులు చెప్పిన దానికి విలువెంతుంటుంది. పార్లమెంటు సాక్షిగా ప్రధాని మాటలకు హామీలకు దిక్కులేనపుడు ప్రెస్‌మీట్‌లో హామీలకు విలువెంత.

ప్రత్యేక హోదాకోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు, ప్రజాసంఘాలు ఉద్యమించి ప్రత్యేక హాదా కోసం కేంద్రం మెడలు వంచాలని ఆశిద్దాం ఆశావాహులుగా.
ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు,  జీతభత్యాల మీద పన్నులు కూడా మనం యిప్పటికీ పక్క రాష్ట్రానికి కడుతున్నాం. మనం విడిపోయి 10 మాసాలైనా ఇంకా ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలూ, అధికారులు మీరే అమరావతికి రాకపోతే మీరు బయటివారిని అమరావతి దిశగా నడపటం కష్టసాధ్యం గదా.

23 జిల్లాల ప్రజల వలసలతో నాలుగైదు దశాబ్ధాల అనంతరం అభివృద్ది చెందినది నేటి హైదరాబాద్‌ భాగ్యనగరం. అభివృద్దినంతా కేంద్రీకరించి అక్కడొక్కచోటే కుప్ప పోసారు. గడిచిన ఇరవై సంవత్సరాలుగా అలాంటి తప్పు పునరావృతం అవకుండా 13 జిల్లాల ఆంధ్రరాష్ట్రంలో కొత్త రాజధాని 50,000 ఎకరాలలో కనీసం 3వ వంతు స్థలంలో మీరు రాజధానిని నిర్మిస్తే (దాదాపు హైద్రాబాదులో కూడా ఇంత భూముల్లో రాజధాని లేదు) మళ్లీ అభివృద్ధిని కేంద్రీకరించినట్లు తుళ్ళూరులో కుప్పపోస్తే అంతకన్నా తెలివితక్కువ పని మరొకటి ఉండదు. ఇంత భూమిని సేకరించటం ప్రజలకు అలాంటి అనుమానాలు కలిగిస్తున్నాయి. చరిత్రనుండి పాఠాలు నేర్చుకొని అదికారాన్ని వికేంద్రీకరిస్తూ చేసిన తప్పుల్ని పునరావృతం చేయకుండా ఇప్పటికైనా పాలక పక్షం కళ్లు తెరిచి ప్రజాస్వామ్యయుతంగా అన్ని పార్టీలతో అఖిల పక్ష బేటీలతో ప్రజల భాగ్యస్వామ్యంతో ప్రతిపక్షపార్టీలను కలుపుకొని అన్ని పార్టీలు ఆంధ్రరాష్ట్ర అభివృద్దినే కోరుకుంటాయనే నిజాన్ని గుర్తెరిగి రైతుల సమస్యలను, పరిష్కరిస్తూ,  రైతు కూలీలకు జీవనోపాధిని చూపించి తక్షణం పరిపాలనను మీరు ప్రకటించిన అమరావతి నుండి పాలన సాగించి అక్షర క్రమంలో తప్ప అన్ని విషయాలలో వెనకబడిన ఆంధ్రరాష్ట్రాన్ని అభివృద్ది పధంలో నడపాలని, నడుపుతారని ఆశిస్తున్నాం.

యార్లగడ్డ వెంకట్రావు
డల్లాస్‌, టెక్సాస్‌

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?