Advertisement

Advertisement


Home > Articles - Special Articles

రంగుల రాజకీయం

రంగుల రాజకీయం

కంచి గరుడ సేవ లేదా ఉచిత సేవ లేదా గిట్టుబాటు కానీ రాజకీయాలు గ్రక్కున విడవంగవలయు గదరా సుమతీ అన్నది సినిమా వాళ్ల నీతి సూత్రం.

సినిమా వాళ్లు సీన్ అయిపోయిన తరువాత మేకప్ తీసేస్తారు. మళ్లీ కాల్ షీట్లు ఇచ్చి, పారితోషికం తీసుకుంటేనే ముఖానికి రంగేసుకుంటారు. వారికి రాజకీయాలు కూడా అంతే. తమ పార్టీ అధికారంలో వుండాలి. తమకు అధికారం అందించే హోదా, హొయలు అందాలి. అప్పుడే హుషారుగా వుంటారు. లేదంటే, బై బై చెప్పేస్తారు. మళ్లీ ఎన్నికలు వచ్చేవరకు తమ సినిమా వ్యవహారాలు తాము చూసుకుంటారు. ఇది ఒకరో ఇద్దరికో సంబంధించిన వ్యవహారం కాదు. దాదాపు సినిమా వాళ్లందరి వైనం ఇలాగే వుంటుంది. 

రాజకీయాల్లోకి వచ్చిన నూటికి తొంభై తొమ్మిది మంది వ్యవహారం ఎలా వుంటుందంటే, అధికారం వుంటే రాజకీయాల్లో హుషారు. లేదంటే వాటి ఊసే పట్టదు. లోక్ సభ, రాజ్య సభ సభ్యత్వాలు ముగియగానే పార్టీ సమావేశాల్లో కనిపించరు. అధికారం చేజారగానే, పార్లమెంటు సమావేశాలకే హాజరు కారు. ఇలాంటి సినిమాజనం ప్రజలకు ఏం చేస్తారనుకోవాలి? ఏం ఉద్దరిస్తారనుకోవాలి. కేవలం వారి అధికార సరదా కోసం, లేదా వారి వ్యాపార విస్తృతి కోసం, ఇంకా కాదంటే కీర్తి కండూతి కోసం తప్ప, రాజకీయాలు వారికి ప్రజా సేవ కోసం మాత్రం కానే కాదు. 

ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి దారి తీసిన సంఘటనలు అని చెప్పుకునే వాటిలో ఓ చిత్రమైన చిన్న కథ వుంది.  కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా భవనమ్ వెంకట్రామ్ ను ఎంపిక చేసింది.ఆయన ఎన్టీఆర్ కు మిత్రుడు. ఆ సంబంధంతో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్ ను ఆహ్వానించారు. వెళ్లిన ఎన్టీఆర్ కు ఆ అధికార వైభోగం ఆశ్చర్యం కలిగించింది. మేటి నటుడు. టాలీవుడ్ సెలబ్రిటీల్లో నెంబర్ వన్ అయిన ఆయనకన్నా రాజకీయనాయకులకు అందుతున్న గౌరవ మర్యాదాలు ఆయనను ఆలోచింపచేసాయని అపట్లో వార్తలు వినిపించాయి. దీనంతటికీ కారణం..అధికారం. అంతే ఆ తరువాత పరిణామాల్లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి ఈ సంఘటన కూడా దారితీసింది అంటారు. 

అంటే అధికార, హోదా అందించే కిక్కు అలాంటిది. ఆ కిక్కు లేకుండా రాజకీయాలు చేయడం అనవసరం అన్నది మన తెలుగు సినిమా జనాల మనోభిప్రాయం. అందుకే వారు గెలిస్తే, గెలిచిన పార్టీ అధికారంలో వుంటే చురుగ్గా పాలిటిక్స్ లో వుంటారు. అదే అధికారం అందకపోయినా, తమ పార్టీ అధికారంలోలేకపోయినా, రాజకీయాలు అంటే యమా విరక్తి కనబరుస్తారు.

చెట్టాపట్టాల్

రాజకీయాలు సినిమాలు రెండూ చెట్టాపట్టాలేసుకునే వుంటున్నాయి. సినిమా రంగంలోకి కమ్యూనిస్టులు ముందుగా ప్రవేశించారు. కమ్యూనిస్టు భావజాలం వున్నవారు, కొద్దిగా సోషలిస్టు్ భావజాలం వున్నవారు తెలుగు సినిమా రంగంలోకి తొలుత ప్రవేశించారు. అంటే అప్పటి నుంచే ఈ సంబంధం ప్రారంభమైంది. అయితే సినిమా వారు ప్రారంభంలో భావజాలం దృష్ట్యా రాజకీయాల్లో ప్రవేశిస్తే, రాజకీయ పార్టీలు, సినిమా వారికి వున్న జనాకర్షణ ను దృష్టి లో పెట్టుకుని, తమ రంగంలోకి దింపడం ప్రారంభించాయి. 

జగ్గయ్యతో ప్రారంభం

కొంగర జగ్గయ్య..చదువుకునే రోజుల నుంచే రాజకీయాలంటే ఆసక్తి. అదే ఆసక్తి సినిమాల్లోకి వచ్చాక కూడా కొనసాగింది. కొన్నాళ్లు కాంగ్రెస్ లో, ఆపై జెపి ప్రజాసోషలిస్టు పార్టీలో వున్నారు. ఆఖరికి నెహ్రూ ఆయనను 1967లో ఒంగోలు టికెట్ ఇచ్చి పార్లమెంట్ కు పోటీ చేయించారు. సినిమా నటుడు పార్లమెంట్ లో అడుగుపెట్టడం అదే తొలిసారి అంటారు.

జమున 1989లో రాజమండ్రి నుంచి లోక్ సభకు వెళ్లారు. కొన్నాళ్ల తరువాత రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు. 

తరువాత కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏలూరు నుంచి ఎంపీ అయ్యారు. తరువాత రాజకీయాలు వదిలేసారు.

కృష్ణం రాజు ఎంపీ అయ్యారు. మంత్రిగా చేసారు. తరువాత పార్టీ మారి పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ పార్టీమారి ప్రస్తుతం భాజపాలోవున్నారు.

కోటా శ్రీనివాసరావు భాజపా తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాలకు దూరంగా వున్నారు.

రామానాయుడు తెలుగుదేశంలో చేరారు. ఎంపీ అయ్యారు. మరోసారిపోటీ చేసి ఓడిపోగానే, రాజకీయాలు తనకు సరిపడవని వదిలేసారు.

దాసరి నారాయణరావు..మంత్రి అయ్యారు. అది వదిలేసాక సైలెంట్ అయ్యారు.

ఇలా చాలా మంది రాజకీయ నాయకులు పార్టీల్లో చేరారు..ఎన్నికల ప్రచారాలు చేసారు, పదవులు చేపట్టారు..ఆపై విశ్రాంతితీసుకున్నారు. మోహన్ బాబు, శివకృష్ణ, నరేష్, సాయికుమార్, ఇలా జాబితా చాలా పెద్దదే వుంటుంది. కానీ వీరంతా కూడా ఒక విధంగా పార్ట్ టైమ్ పొలిటీషియన్లే.

ఎన్టీఆర్ ఫస్ట్ అండ్ లాస్ట్

సినిమా నటుల్లో రాజకీయాల్లో ఫుల్ టైమర్ ముద్రవేసింది ఒక్క ఎన్టీఆర్ మాత్రమే. ఏదో ఒక పార్టీ పంచన చేరకుండా, తానే పార్టీ ప్రారంభించడం, ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టడం, ప్రజలకు నచ్చే పనులు చేయడం ఇలా అన్నింటా ఆయన తనదైన ముద్ర కనబర్చారు. స్వంత పార్టీ కాబట్టి, గెలిచినా, ఓడినా ఎన్టీఆర్ రాజకీయాలు వదల్లేదు. కానీ మిగిలిన వారు అలా కాదు. ఎన్టీఆర్ తరువాత చిరంజీవి అదే ఫుట్ స్టెప్స్ లో వెళ్లాలని ప్రయత్నించారు కానీ, ఆయన కూడా చాలా మంది మిగిలిన నటుల మాదిరిగానే అధికారం అందకపోగానే జావగారిపోయారు. పార్టీని కాంగ్రెస్ కు అప్పగించి, బార్టర్ సిస్టమ్ లో మంత్రి పదవి తీసుకుని సెటిలైపోయారు. అది కూడా అయిపోగానే క్రియా శీలక రాజకీయాలకు మెలమెల్లగా దూరం అవుతున్నారు. 

ఏం చెబుతోంది ఇదంతా?

సినిమా నటులు రాజకీయ పదవుల కోసం అర్రులు చాచడం, అవి వున్నన్నాళ్లు క్రియా శీలక రాజకీయాల్లో పాత్ర పోషించడం అలవాటు చేసుకున్నారు. అదే కనుక అధికారం అందక పోతే రాజకీయాలకుదూరం జరగడం అలవాటైపోయింది. మరి కొంతమందయితే ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో బంధుత్వాలు కలపడం, మళ్లీ అధికారం చేతులు మారగానే అట్నుంచి ఇటు జరగడం కూడా చేసేసిన సందర్భాలువున్నాయి. చిత్రంగా తెలంగాణ ఉద్యమ సమయంలో నిమ్మకు నీరెత్తినట్లు వుండిపోయిన సినిమా రాజకీయ నాయకులు, కేసిఆర్ కు అధికారం అందగానే ఆయనతో, ఆయన పిల్లలతో చెట్టాపట్టాలకు ప్రయత్నించడం చేస్తున్నారు. 

అంటే మొత్తం మీద సినిమా నటుల రాజకీయం అంతా అధికారం చుట్టూనే తిరుగుతుంది. అధికారం అందినా, అధికారం అండ వున్నా ఓకె. లేకుంటే రాజకీయాలు అంటరానివైపోతాయి. తమ ఒంటికి సరిపడవన్న స్టేట్ మెంట్ లు పుట్టుకువస్తాయి. 

రంగుల రాజకీయాలు ఎంతగా దిగజారుతాయంటే, ఆఖరికి పదవి అంటే చాలు. అది చిన్నదా పెద్దదా అన్నది కూడా అనవసరం. ఏ అధికారం లేని మా అధ్యక్ష పదవి కోసం కూడా ఎంతలా కొట్టుకుంటున్నారో ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తూనేవుంది. మరి సినిమా నటుల రంగుల రాజకీయం కేవలం అధికారం కోసం అని కళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా, జనం ఇంకా వాళ్లంటే మోజు చూపిస్తున్నారు అన్న అనుమానం రావచ్చు. 

జనం సినిమా నటులపై మోజు చూపించడం ఒక్కసారికే పరిమితం అని చాలా సార్లు, చాలా మంది విషయంలో రుజువు చేసారు. ఒక్కసారి వారికి అవకాశం ఇస్తారు. వారు వారికి అందుబాటులో వుండరని, సినిమా నటుల అసలు రంగు ఇదని అర్థమైపోతుంది.అంతే రెండోసారి ఇంటికి పంపేస్తారు. ఇది చరిత్ర అనేక సార్లు రుజువు చేసిన సత్యం. 

ఇది తెలిసీ సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రాగానే జనం తోలిసారి కౌగిలించుకోవడం మామూలే. రాజకీయ నాయకులు దగ్గరకు తీయడం మామూలే. రెండోసారి ఓడిపోగానే వీళ్ల మొహం వాళ్లు చూడరు..వాళ్ల మొహం వీళ్లు చూడరు.జనం కూడా కొత్త మొహాల కోసం చూస్తారు.

'చిత్ర'గుప్త

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?