Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'రుద్రమదేవి' తెలంగాణ చిత్రమా?

'రుద్రమదేవి' తెలంగాణ చిత్రమా?

'నంది' అవార్డులపై వివాదాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ అవార్డులు ప్రకటించినప్పుడల్లా విమర్శలు వచ్చేవి. అన్యాయం జరిగిందని కొందరు ఫిర్యాదులు చేసేవారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రభుత్వం మూడేళ్లకు నంది అవార్డులు ప్రకటించడం విశేషం. చేసింది మంచి పనే అయినప్పటికీ పూర్తిగా వందశాతం న్యాయంగా అవార్డులు ఇచ్చారని చెప్పలేం.

ఈ అన్యాయం ఉద్దేశపూర్వకంగా జరిగిందా? తెలియక జరిగిందా? అనేది నిర్ధారించలేం. 'మా సినిమాకు అవార్డు ఎందుకు ఇవ్వలేదు' అని కొందరు ప్రశ్నిస్తున్నారు. బయటవున్నవారు దీనికి సమాధానం చెప్పలేరు. అవార్డుల కమిటీ ఛైర్‌పర్సన్‌, సభ్యులు చెప్పాల్సిందే. మిగతా సినిమాల విషయం ఎలావున్నా గుణశేఖర్‌ నిర్మాతగా వ్యవహరించి తన దర్శకత్వంలో నిర్మించిన 'రుద్రమదేవి' సినిమాకు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేశారనే అనుమానం కలుగుతోంది.

ఇందుకు ఒక టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో అవార్డుల కమిటీ ఛైర్‌పర్సన్‌ జీవిత ఇచ్చిన జవాబునే ఆధారంగా తీసుకోవచ్చు. ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వడానికి తిరస్కరించినప్పుడే గుణశేఖర్‌ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అవార్డుల్లో అన్యాయం జరగడంతో కుమిలిపోతున్నారు.

మూడు అవార్డుల్లో (బంగారు, రజతం, కాంస్యం) దేనికీ అర్హత లేదా అని ప్రశ్నించారు. రుద్రమదేవికి వినోదపు పన్ను మినహాయింపు ఎందుకు ఇవ్వలేదనేది తనకు స్పష్టంగా తెలియదని అంటూనే అది తెలంగాణ చిత్రమనే ఉద్దేశంతో ఇవ్వకపోయుండొచ్చన్నారు. ఇదే భావన అవార్డుల విషయంలో జరిగిందనే భావన ఆమె మాటల్లో ధ్వనించింది. కేసీఆర్‌ కూడా ఆమె తెలంగాణకు చెందిన వీరవనిత అని చాలాసార్లు చెప్పారు.

దురదృష్టమేమిటంటే రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి తెలుగు ప్రజలందరికీ సంబంధించిన చరిత్రను, మహామహులను, సంస్కృతీసంప్రదాయాలను తెలంగాణ, ఆంధ్రగా విడదీశారు. రుద్రమదేవిని కూడా ఆ కోవలోకి చేర్చారు. ఇప్పటి పాలకులకు చరిత్ర సరిగా తెలియదు. కాకతీయుల కాలంలో ఆంధ్రా, తెలంగాణ అనే విభజన ఉందా? అనేది మౌలిక ప్రశ్న.

కాకతీయ రాజులు ఓరుగల్లును రాజధానిగా చేసుకొని కేవలం తెలంగాణను మాత్రమే పరిపాలించలేదు. దాదాపు దక్షిణ భారతదేశమంతా వారి పాలనలో ఉండేది. ఇప్పుడు ఆంధ్రాగా వ్యవహరిస్తున్న చాలా భాగం కాకతీయుల పాలనలో ఉండేది. ఆంధ్రాలోని విక్రమసింహపురి (నెల్లూరు) వరకు వారి సామ్రాజ్యం విస్తరించింది. 'సామ్రాజ్యం' అనే పదంలోనే విశాలమైన భూభాగం అనే అర్థం ఉంది కదా.

అలాంటప్పుడు కాకతీయులు కేవలం తెలంగాణ రాజులే అని అంటామా?  ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని అమరావతి నిర్మాణ ప్రాంతంలో ఉన్న 'మల్కాపురం' కాకతీయుల పాలనలో విద్యకు, వ్యాపారాలకు, కళలకు కేంద్రంగా ఉండేది. దాని అసలు పేరు 'రుద్రమాంబపురం'. రుద్రమదేవిపురం అని కూడా వ్యవహరించేవారు.  రాణీ రుద్రమదేవి పేరుతో ఈ నగరం నిర్మితమైంది. అప్పట్లో ఇది నగరం. ఇప్పుడొక చిన్న గ్రామం. కాకతీయుల పాలనలో ఇది వైభవంగా వెలిగినట్లు చరిత్ర చెబుతోంది.  గణపతిదేవుడు, రుద్రమదేవి ఈ నగరాన్ని సందర్శించారట.

ఇక్కడ కూడా కాకతీయుల పాలనకు సంబంధించిన శాసనాలు, శిల్ప సంపద బయటపడింది. ఈ గ్రామాన్ని చారిత్రక ప్రాంతంగా గుర్తించి పరిరక్షించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కాకతీయుల పాలన తరువాత మల్కాపురం గోల్కొండ ప్రభువుల పాలనలోకి వచ్చింది. కాకతీయులు ఈ నగరంలో 'శైవ విజ్ఞాన విశ్వవిద్యాలయం' స్థాపించారు. మల్కాపురం చరిత్ర చెప్పుకోవడానికి చాలా ఉంది. ఆంధ్రలో కాకతీయుల వైభవానికి ఇదొక ఉదాహరణ.  రుద్రమదేవిని తెలంగాణకే పరిమితం చేసి ఆమె కీర్తి ప్రతిష్టలను తగ్గించకూడదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?