Advertisement

Advertisement


Home > Articles - Special Articles

'సిస్సీ.. మమ్మల్ని పవన్‌కళ్యాణ్‌ తిట్టలేదు..'

'సిస్సీ.. మమ్మల్ని పవన్‌కళ్యాణ్‌ తిట్టలేదు..'

నవ్విపోదురుగాక మనకేటి.. అన్న చందాన వ్యవహరిస్తోంది భారతీయ జనతా పార్టీ. తిరుపతిలో హుటాహుటిన భారీ బహిరంగ సభ పెట్టి మరీ, భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని మోసం చేస్తోందని పవన్‌ దుమ్మెత్తిపోసిన విషయం విదితమే. 

'అక్కడున్నది బ్రహ్మరాక్షసి ఏమీ కాదు కదా.. వాళ్ళూ మనుషులే..' అని పవన్‌ అనడం ద్వారా, కేంద్రంపైకి టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునీ ఉసిగొల్పే ప్రయత్నం చేశారు. 'మా సహనాన్ని పరీక్షించొద్దు.. సహనం కోల్పోతే మీ పీఠాలు కదులుతాయ్‌..' అని పవన్‌ హెచ్చరించారు తిరుపతి వేదికగా. 'ఇక్కడే, నా సమక్షంలోనే ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు, నిలబెట్టుకోండి.. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదు..' అంటూ పవన్‌ అల్టిమేటం జారీ చేసేశారు. 

కానీ, ఇవన్నీ పవన్‌కళ్యాణ్‌ ద్వారా తమకు అందిన దీవెనలుగానే భారతీయ జనతా పార్టీ భావిస్తోందట. ఇది భావదారిద్య్రం అనుకోవాలా.? ఇంకేమన్నా అనుకోవాలా.? సోషల్‌ మీడియాలో అయితే, 'ఛీ కొట్టి ఉమ్మేసినా.. నిస్సిగ్గుగా నవ్వుతోంది బీజేపీ..' అంటూ నెటిజన్లు బీజేపీ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పరిస్థితి అంత గొప్పగా వుంది మరి.! 

బీజేపీ నేత, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ సిద్దార్ధనాథ్‌సింగ్‌ తాజాగా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయమై స్పందిస్తూ, మీడియా ప్రశ్నించేసరికి పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలపైనా వివరణ ఇచ్చుకున్నారు. ఆ వివరణలో 'పవన్‌కళ్యాణ్‌ బీజేపీని ఏమీ విమర్శించలేదు..' అని తేల్చి చెప్పేశారు. ప్రత్యేక హోదా విషయానికొస్తే, దానికి రాజ్యాంగపరమైన అడ్డంకులున్నాయంటే, పనికిమాలిన స్టేట్‌మెంట్‌ ఇచ్చారాయన. 

బయటి హామీల్ని తప్పించి, విభజన చట్టంలో వున్నవన్నీ నెరవేర్చుతాం.. అని సిద్దార్ధ నాథ్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. అంటే, ఇక్కడ మేటర్‌ క్లియర్‌. ప్రత్యేక హోదాపై కేంద్రం ఏమాత్రం సుముఖంగా లేదన్నమాట. ప్యాకేజీ లేదు, ఇంకేమీ లేదన్నమాటే కదా.! విభజన చట్టంలో వున్న రైల్వే జోన్‌కి కొన్ని సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టు సంగతీ అంతే. ఓవరాల్‌గా, విభజన చట్టాన్ని కూడా చెత్తబుట్టలో పడేసేలానే కన్పిస్తోంది బీజేపీ తీరు. 

నిన్ననే కదా, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ప్రత్యేక హోదాపై రెండు మూడు రోజుల్లో కేంద్రం నుంచి తీపి కబురు అందుతుందని సెలవిచ్చింది. అంతలోనే, బీజేపీ ఇలా.. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చేసింది. ఇదేమన్నా కొత్త విషయమా.? ఎప్పుడూ బీజేపీ - టీడీపీ మధ్య జరిగే పొలిటికల్‌ గేమ్‌ ఇలానే వుంటోంది కదా.! మధ్యలో సుజనా చౌదరి తాను మళ్ళీ మళ్ళీ వెర్రీ వెంగళప్ప అవుతూ, ఆంధ్రప్రదేశ్‌ని కూడా అభాసుపాల్జేస్తున్నారు. ఈమాత్రందానికి ఆయన కేంద్ర మంత్రి పదవిలో వుండటమెందుకట.! 

మిగతా విషయాలెలా వున్నా, బీజేపీ సంగతి తేల్చేందుకు కాకినాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తానంటూ విరుచుకుపడినా, బీజేపీ ఎలా దులుపుకుపోతోందో, పవన్‌కళ్యాణ్‌ని ఇంకా తమ మిత్రపక్షంగా ఎలా చూస్తోందో ఎవరికీ అర్థం కావడంలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?