Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఎమ్బీయస్‌: తమిళనాడు కొంప ముంచిన ఉచితాలు

2011 ఎన్నికల సభలలో జయలలిత డిఎంకె ప్రభుత్వం యిస్తున్న ఉచితపథకాలను విమర్శిస్తూ తమిళనాడులో పుడుతున్న ప్రతి బిడ్డ కళ్లు తెరిచేలోగా తలపై రూ.15000 అప్పుతో పుడుతున్నాడని ఎత్తిచూపారు. ఆమె వచ్చిన తర్వాత వాటిని తగ్గిస్తుందేమోననుకుంటే తగ్గించలేదు కదా 20% పెంచింది. వాళ్లు అధికారంలోకి వచ్చాక యిచ్చిన ఉచిత పథకాలపై, సబ్సిడీలపై రూ. 78 వేల కోట్లు ఖర్చయాయి. 2014-15 సం||కి అయిన ఖఱ్చు రూ.19,486 కోట్లు. (అంచనా). వాళ్లు ఉచితంగా యిచ్చే వస్తువుల జాబితా - మిక్సీలు, వెట్‌ గ్రైండర్‌, ఫ్యాన్‌, లాప్‌టాప్‌, మంగళసూత్రాలు, పంచె, చీర, స్కూలు యూనిఫారంలు, బస్సుపాసులు, అచ్చుపుస్తకాలు, ఆవులు, గొఱ్ఱెలు, సైకిళ్లు, శానిటరీ నాప్‌కిన్స్‌... చూస్తే యింతెందుకు అయిందో అర్థమవుతుంది. ఈ పథకాలు సరిగ్గా అమలవుతున్నాయో లేదో చూసేందుకు ఏర్పరచిన ప్రత్యేక శాఖపై పెట్టిన ఖర్చు రూ.6 కోట్లు. ఈ ఉచితాలు యిచ్చే ఆర్థికబలం రావడానికి ప్రభుత్వసంస్థల సామర్థ్యం మెరుగు పరుచుకుని వుంటే బాగుండేది. కానీ అది జరగటం లేదు. 2012-13 కాగ్‌ వారి నివేదిక ప్రకారం 77 పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్లలో 11 ఏ మాత్రం ఆదాయం గడించటం లేదు. 40 యూనిట్లు కలిపి ఆర్జించినది - రూ.512 కోట్లు. 20 యూనిట్లు కలిసి మూటకట్టుకున్న నష్టం దానికి 16 ప్లస్‌ రెట్లు - రూ. 8548 కోట్లు. సరిగ్గా మేనేజ్‌ చేసి వుంటే రూ.4 వేల కోట్ల నష్టాన్ని అరికట్టగలిగేవారని కాగ్‌ అభిప్రాయం. అన్నిటికంటె పెద్ద యూనిట్‌ అయిన తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు రెవెన్యూ నష్టం రూ.5 వేల కోట్లు. గత మూడేళ్లలో దాని అప్పు రూ.72 వేలకు చేరింది. ఇక రోడ్డు ట్రాన్స్‌పోర్టు నష్టాలు రూ. 2 వేల కోట్లు. అది ఎంత దీనావస్థలో వుందంటే కోర్టులో ఎటాచ్‌ అయిన బస్సులకు జరిమానా కట్టి విడిపించుకునే స్థితిలో కూడా లేదు. 

ప్రభుత్వం పనితీరు మెరుగుపడందే పరిస్థితులు బాగుపడవు. అక్టోబరు నుంచి పేరుకు మాత్రమే ముఖ్యమంత్రిగా వున్న పన్నీర్‌ శెల్వం ఏ నిర్ణయమూ తీసుకోడు. అసలు ముఖ్యమంత్రి ఆఫీసుకే వెళ్లకుండా తన పబ్లిక్‌ వర్క్స్‌ మినిస్ట్రీ ఆఫీసు నుండే పనిచేస్తున్నాడు. ప్రతీ ఫైలు కాపీ పోయెస్‌ గార్డెన్‌లోని వేదనిలయానికి వెళుతుంది. అది జయలలిత నివాసం. అక్టోబరు 20 న బెయిలులో విడుదలయ్యాక ఆమె అక్కడే వుండి బయటకు రావడం లేదు. ఒక ఆరుగురి సహాయంతో ఆమె ఫైళ్లు చూసి తన నిర్ణయాన్ని ఒక కాగితంపై పెన్సిల్‌తో రాసి పంపుతుందట. రాష్ట్రప్రభుత్వపు కార్యాలయాలన్నిటిలో ఆమె ఫోటోయే వుంది - రిపబ్లిక్‌ డే పెరేడ్‌ పోస్టర్లతో సహా! పన్నీర్‌ శెల్వం ఫోటో ఎక్కడా వుండదు, జనవరి 16 న జరిగిన ప్రభుత్వ కార్యక్రమపు ఆహ్వానపత్రంతో సహా! ఇక మంత్రులు చెలరేగిపోతున్నారు. వ్యవసాయశాఖలో తిరునల్వేలిలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్న ముత్తు కుమారస్వామి అనే ఆయన తన శాఖలో డ్రైవర్లుగా నియమించడానికి జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసు నుంచి సీనియారిటీ ప్రాతిపదికపై నలుగురు వ్యక్తులను ఫైనలైజ్‌ చేసి, జాబితా తయారుచేశాడు. అంతలో వ్యవసాయశాఖ మంత్రిగా వున్న కృష్ణమూర్తి దాన్ని పక్కన పెట్టేసి, తన జాబితాలోని వాళ్లకు యిమ్మనమని చెప్పాడు. నిజాయితీపరుడుగా పేరున్న కుమారస్వామి అది కుదరదన్నాడు. మంత్రి అతన్ని బెదిరించసాగాడు. ఆర్నెల్లలో రిటైరు కాబోతున్న కుమారస్వామి యీ ఒత్తిడి తట్టుకోలేక ఒక రైలు కింద పడి ఫిబ్రవరి 20న చచ్చిపోయాడు. అతని సహచరులు, ప్రతిపక్షంవారు ఆందోళన చేయడంతో ఎడిఎంకె కృష్ణమూర్తిని మొదట పార్టీ పదవి నుంచి, తర్వాత మంత్రిపదవి నుంచి తప్పించింది. ఈ సంఘటన వలన రాష్ట్ర నాయకత్వం అధికారులను స్వతంత్రంగా పనిచేయనీయటం లేదని లోకానికి తెలియవచ్చింది. 

పారిశ్రామికవేత్తలకు యిదంతా యిబ్బందికరంగానే వుంది. గత రెండేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా కొత్తగా రాష్ట్రానికి రాలేదు. యమాహా వాళ్లు 2013లో రూ.1500 కోట్లు పెట్టి కాంచీపురంలో పెట్టిన ప్లాంట్‌ తయారైంది. జయలలిత చేత ప్రారంభింప చేస్తామంటే ఆవిడ ఎపాయింట్‌మెంటే యివ్వటం లేదు. చూసిచూసి వాళ్లే జనవరిలో ఆపరేషన్స్‌ మొదలుపెట్టేశారు. శ్రీపెరంబుదూరు ఎలక్ట్రానిక్‌ హబ్‌ నుండి నోకియా తప్పుకోవడం పారిశ్రామిక రంగానికి పెద్ద కుదుపే. ఇలాటి పరిస్థితుల్లో రూ.లక్షకోట్ల పెట్టుబడులు ఆహ్వానించడానికి గ్లోబల్‌ యిన్వెస్టర్ల మీట్‌ పెట్టింది తమిళనాడు ప్రభుత్వం. ముహూర్తం ఎప్పుడంటే మే నెలలో! అప్పటిదాకా ఎందుకు అంటే జయలలిత బెయిలు గడువు ఏప్రిల్‌ 18కి ముగిసిపోతుంది. ఆలోగా ఆమెపై కేసులు కొట్టివేస్తారని వాళ్ల ఆశ! 

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?