Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ట్యాంక్‌బండ్‌ విగ్రహాలపై కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్యలు సమంజసమేనా?

ట్యాంక్‌బండ్‌ విగ్రహాలపై కెసిఆర్ వివాదస్పద వ్యాఖ్యలు సమంజసమేనా?

రవీంద్రభారతిలో మహాకవి దాశరధి జయంతి దాశరథి 89వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన విగ్రహం ఉందని,దాశరది వంటి గొప్పవారి విగ్రహాలు ట్యాంక్‌బండ్‌పై ఉండాలని కేసిఆర్ అబిప్రాయపడ్డారు. తెలంగాణ సాహితీ లోకం గర్వించే విధంగా దాశరథి విగ్రహం ఏర్పాటు చేస్తామని ఆయన చేసిన  శపథం తో  విభేదించే వారు ఎవరూ ఉండరు. కానీ ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని అలాగే బళ్లారి రాఘవ ఎవరో తెలియదని ఆయన విగ్రహం ట్యాంక్‌బండ్‌పై  ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన వ్యాఖ్యలతో ప్రజలు విభేదిస్తున్నారు. అంటే ట్యాంక్‌బండ్‌పై ఉన్న మహనీయులలో,  తనకు తెలియని వారందరనీ కేసిఆర్ పనికిమాలిన వారుగా జమకడుతున్నారు అనుకొవాలి. నిజంగా ఇదే ఆయన అంతర్యం అయితే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఎందుకంటే, తనకు తెలియని వారి విషయాలని తెలుసుకోవాలనే తపన లేకపోగా వారిని పనికిమాలిన వారు గా పరిగణించే కేసిఆర్ వైఖిరి ని ఏమనాలి? నిద్ర పోయే వాడిని  లేపవచ్చు కానీ;  నిద్ర పోతున్నట్లు నటించేవాడిని  లేపలేము కదా? 

మహాకవి దాశరధి విషయానికి వస్తే, ఆయన స్వతంత్ర పోరాటం లో అరెస్ట్ కాబడి వరంగల్ సెంట్రల్ జైలు లో 1947 లో ఉంచబడి, జైలు నుండి విడుదల అయిన తదుపరి తెలంగాణా ను వదలి విజయవాడ నుండి తెలుగు దేశం అనే దినపత్రిక లో నిజాం కు వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించారు అన్నది వాస్తవం. తన" తిమిరంతో సమరం" పుస్తక రచనతో సాహిత్య అకాడమి పురస్కారాన్ని 1974 లో దాశరధి అందుకొన్నారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనకు  కళాప్రపూర్ణ  బిరుదు ఇచ్చి గౌరవించింది. 1977 ఆగస్టు15వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దాశరధిని ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆస్థానకవిగా నియమించారు.   స్వర్గీయ ఎన్ టీ ఆర్ ట్యాంక్‌బండ్‌పై మహనీయుల విగ్రహాల స్థాపనకు 1983  లోనే అంటే దాశరధి (1927 – 1987) కాలం లోనే శ్రీకారం చుట్టారు. అయితే బ్రతికి ఉన్నవారి విగ్రహాలను పెట్టే సంస్కృతి భారతదేశం లో లేదు కాబట్టి ఆ సమయం లో దాశరధి విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై పెట్టే ప్రస్తావనకు రాలేదు అన్నది వాస్తవం.  "ఓ నిజాం పిశాచమా, కానరాడు, నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్నిలో దింపినావు. నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని గర్జించిన దాశరధి, అదే గొంతుకతో  "కమ్మని నా తెలంగాణా తొమ్మిది జిల్లాలేనా? బహులాంధ్ర కు తెలంగాణా పర్యాయ పదం కాదా?"  అని ప్రశించిన విషయాన్ని వేర్పాటు వాదులు ఉద్దేశ్య పూర్వకంగా విస్మరిస్తున్నారు (రంగారెడ్డి జిల్లా పదవ జిల్లా గా తదుపరి ఏర్పడింది). నిజాం రాజులు మంచివారని, వాళ్ల పాలన భేషుగ్గా ఉందని కేసిఆర్  ప్రస్తుతించటంతో పాటు తర్వాత అదేమాట వెయ్యి సార్లు అంటానని ప్రకటించుకున్నారు.  ప్రజాకంటకంగా సాగిన నిజాం పాలనను పొగడటం ద్వారా తెలంగాణ విముక్తి పోరాటాన్ని కేసీఆర్ అవమానించడం లో చాలా దూరం వెళ్ళారని చెప్పక తప్పదు. నిజాం పాలన 20వ శతాబ్దకాలంలో ఉండకూడనిది,  పౌరహక్కులు లేకుండా, రజాకర్ల దౌర్జన్యం, వెట్టిచాకిరీ, దోపిడీ వ్యవస్థతో కూడిన ఆ దుర్మార్గ పాలనపై ప్రజలే తిరుగుబాటు చేశారు అన్నది వాస్తవం. "తరతరాల బూజు నిజాం రాజు" అని సాక్షాత్తు దాశరధే చెప్పగా, అటువంటి నిజాం ను కేసిఆర్ కీర్తించడం తో స్వర్గీయ దాశరధి పై కెసిఆర్ కు ఎంత ప్రేమ ఉందొ అవగతం అవుతుంది. 

ఇక బళ్ళారి రాఘవ విషయానికి వస్తే,  తెలుగు నాటకరంగం అందించిన అతిగొప్ప నటులలో ఆయన (1880-1946) ఒకరు. బళ్లారి రాఘవ గా పేరొందిన తాడిపత్రి రాఘవాచార్యులు అనంతపురం లో జన్మించిన ఆయన కు చిన్నతనంనుండి నాటకరంగంపై ఆసక్తి ఉండేది. కొద్దికాలంలోనే రాఘవ న్యాయవాదిగా, ముఖ్యంగా క్రిమినల్ కేసులు వాదించడంలో, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమించింది అంతే కాదు "రావు బహద్దూర్" అన్న బిరుదు కూడా ఇచ్చింది. "హరిశ్చంద్ర, పాదుకా పట్టాభిషేకం, సావిత్రి, బృహన్నల, రామరాజు చరిత్ర" వంటి పేరు తెచ్చిన నాటకాలు తో పాటు బళ్ళారి రాఘవ లిస్టు లో భద్రాచల "రామదాసు" నాటకం కుడా ఉందని కెసిఆర్ కు తెలియవలసిన అవసరం ఉంది. స్రీల పాత్ర పరిమితం గా ఉన్న రోజుల్లో స్త్రీలను నాటకాలలో పాల్గొనడానికి రాఘవ ప్రోత్సహించాడు. 1927లో మహాత్మాగాంధీ బెంగుళూరు సమీపంలోని నందికొండలలో విశ్రాంతి నిమిత్తం కొద్దిరోజులు బసచేసినప్పుడు- ‘అమెచ్యూర్‌ డ్రమెటిక్‌ అసోసియేషన్‌’ వారు తమ నాటక ప్రదర్శనను వచ్చి చూడవలసిందిగా గాంధీజీని అర్థించారట. పండిత తారానాథ్‌ హిందీలో రచించిన దీన బంధు కబీర్‌ నాటక ప్రదర్శనం ఆ రోజు.  వారిని నిరుత్సాహపరచలేక ‘ఒక పది నిముషాలు చూస్తాను’ అనే షరతు పై గాంధీజీ నాటక ప్రదర్శన చూడటానికి వచ్చారు, కానీ నాటకం ముగిసిందాకా కదలలేకపోయారు. ఆయనతో పాటే వచ్చిన రాజాజీ, మీకు ప్రార్థన సమయమైందని గుర్తు చేయగా ‘ఈ నాటకం దర్శించటం కన్న నాకు మరి ప్రార్థన ఏముంది?’   అంటూ గాంధీజీ "రాఘవ నటన అద్భుతం" అన్నారనే విషయం కెసిఆర్ తెలుసుకోవలసిన అవసరం ఉంది. గాంధీ ప్రశంసలతో పాటుగా, అఖిల భారత్ లో రాఘవను మించిన నటుడు లేడనీ, అభినయంలో ఆయన అగ్రగణ్యుడని విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మన్ననలందుకున్న మేటి నటుడు రాఘవ అని ఒక పక్క చరిత్ర మనకు చెబుతుంటే, మరోపక్క కెసిఆర్ తనకు బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన విగ్రహం ఎందుకు ట్యాంక్బండ్‌పై ఉందని ప్రశ్నించడం పట్ల ప్రజలు, నాటక రంగాన్ని ప్రేమించేవారు విస్మయం చెందుతున్నారు.  

లండన్‌లోని గారిక్‌ క్లబ్‌లో రాఘవకు జరిగిన సన్మానానికి సర్‌ రాబర్ట్‌ సన్‌ దంపతులు, అప్పటి బ్రిటిష్ ప్రధాని  విన్‌స్టన్‌‌ చర్చిల్‌, సర్‌ ఆర్థర్‌ పినెరో వంటి ప్రముఖులు వచ్చి ఆయనను పొగడిన విషయం  చరిత్ర లో నిక్షిప్తమైనది అన్న విషయం వేర్పాటు వాదులు గుర్తించాలి.  పచ్చ కామెర్లు వచ్చిన వాడికి లోకం అంతా పచ్చగా కనపడినట్లు సామెత చందాన సుదీర్ఘకాలం ఉద్యమ పార్టీ గా ప్రతిపక్షం లో ఉండి ఉద్యమ ముసుగులో ఇష్టా రాజ్యం విమర్శలు చేసిన గులాబి అధినేత అధికారం చేజిక్కినా, ఇంకా ప్రతి విషయం లో అయినదానికీ కానిదానికీ తెలంగాణా కు అన్యాయం జరిగింది అని మీడియా కు ఎక్కి అల్లరి చేయడం మంచి పద్దతా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ తెలంగాణా మహనీయులకు అన్యాయమే జరిగి ఉంటే, దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా కేవలం ఆరోపణలతో సరిపెడితే చివరికి ఢిల్లీ లో నెల రోజులకే రాజీనామా చేసి ఇంటిబాట పట్టిన కేజ్రేవాల్ గతే గులాబి నేతలకు పడుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. వెనకటి ఎవడో "అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట",  బొటాబొటి చరిత్ర జ్ఞానం తో బళ్ళారి రాఘవ మీద కెసిఆర్ చేసిన విమర్శలు కుడా ఇలాగే ఉన్నాయి అనడం లో వాస్తవం ఉంది కదా?

వ్యాసకర్త: నాగం వెంకటేశ్వరరావు (కాలిఫోర్నియా)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?