Advertisement

Advertisement


Home > Articles - Special Articles

టీడీపీ, వైసీపీ తెర వెనుక రాజకీయం

టీడీపీ, వైసీపీ తెర వెనుక రాజకీయం

రాజకీయాలలో దూరాలోచన, దురాలోచన రెండూ కలగలిపే ఉంటాయి, రాజకీయ పార్టీ అన్నాక రేపటి కోసం ఈ రోజే తొందరపడడం సహజం. రానున్న కాలంలో ఏం జరుగుతుందో ముందే ఊహించి దానికి తగినట్లుగా వ్యూహరచన చేసుకోవడం కూడా పాలిట్రిక్స్‌లో భాగమే. విశాఖ జిల్లా రాజకీయాలలో చూస్తే ప్రధాన పక్షాలుగా ఉన్న టీడీపీ, వైసీపీ ఇపుడు ఆ దిశగానే పయనిస్తున్నాయి., తమ రాజకీయ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల నుంచి ఎన్నికల వైపుగా అన్నట్లుగా విశాఖ రాజకీయం సాగుతోందిపుడు.  ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, త్వరలోనే జీవీఎంసీ ఎన్నికల నగరా కూడా మోగనుంది. ఈ నేపధ్యంలో  రెండు ప్రధాన పార్టీలూ ఆచీ తూచీ అడుగులు వేస్తున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికను ఓ లిట్మస్‌ టెస్ట్‌గా భావిస్తున్న ఈ పార్టీలు ఇక్కడ విజయాన్ని తమ వైపుగా మళ్లించుకోవడమే కాదు, భావిలోనూ అదే దూకుడును కొనసాగించేందుకు ఆరాటపడుతున్నాయి.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నేరుగా పోటీ చేయకున్నా అటు టీడీపీ, ఇటు వైసీపీ తెర వెనుక యుద్ధానికి సర్వం సమాయత్తం చేసుకున్నాయి. తన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అభ్యర్ధి గెలుపు కోసం టీడీపీ కసరత్తు చేస్తూంటే వామపక్షాల ఉమ్మడి అభ్యర్ధికి వ్యూహాత్మకంగా మద్దతు ప్రకటించిన వైసీపీ ఎలాగైనా జయభేరీ మోగించి అధికార మిత్రులిద్దరినీ దెబ్బతీయాలని చూస్తోంది. అదే సమయంలో రానున్న జీవీఎంసీ ఎన్నికలలో కొత్త స్నేహాన్ని అందిపుచ్చుకుని గెలుపు బాటన సాగాలని తలపోస్తోంది. ఈ నేపధ్యం నుంచి చూస్తే ఇటు టీడీపీ, అటు వైసీపీకి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ  అత్యంత ప్రతిష్టాత్మకమే కాదు, ఓ విధంగా సవాల్‌గానే పరిణమించిందని చెప్పుకోవాలి. 

టీడీపీ కమల కుతూహలం !

తెలుగుదేశం పార్టీకి ఈ దఫా ఎమ్మెల్సీ ఎన్నికలు బాగానే కలసివచ్చాయి, స్ధానిక సంస్ధల కోటాలో ఇప్పటికే తొమ్మిదింట ఆరింటిని కైవశం చేసుకుని విజయగర్వంతో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే కోటాలోనూ అయిదు సీట్లను దక్కించుకుంది. గవర్నర్‌ కోటాలో రెండు సీట్లు ఎటూ ఆ ఖాతాలోనే చేరనున్నాయి. అయితే, ఇవన్నీ ఎన్నికల సమరంలో నిలిచి గెలిచినవి కావు. అసలైన యుద్ధం మాత్రం మిగిలిన సీట్లలోనే నెలకొని ఉంది. అందులో ఆసక్తిని కలిగించే సీటుగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్ధానాన్ని పేర్కొంటున్నారు. విశాఖతో పాటు, ఉత్తరాంధ్రకు అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మొండి చేయి చూపించిన వేళ సాగుతున్న ఈ ఎన్నికల పోరులో విజయం ఎటు వైపు  అన్నది చూడాల్సిన అవసరం ఆయా పార్టీలకే కాదు, యావత్తు మూడు జిల్లాల ప్రజానీకానికీ ఉంది. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అవసరం ఉందా, రైల్వే జోన్‌ ఇవ్వాలా వద్దా, ప్రత్యేక హోదాపై జనం రాజీ పడ్డారా వంటి కీలక అంశాలు ఈ ఎన్నికలతోనే ముడిపడి ఉన్నాయి. అంతే కాదు, ఈ పట్టభద్రుల ఎన్నికలలో ప్రత్యేకించి యువత ఎటువైపు మొగ్గు చూపుతోందన్నది కూడా తెలియనుంది. అలాగే, ఉద్యోగ వర్గాల చూపు ఎటు వైపు అన్నది కూడా తేలనుంది. మూడేళ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనపైన జనాభిప్రాయాన్ని కూడా చాలావరకూ వివరించనున్న ఎన్నికగా కూడా దీనిని చూడాల్సి ఉంది. ఈ ఎన్నిక ఫలితాన్ని ఆసరాగా చేసుకుని రానున్న రోజులలో జీవీఎంసీ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని కూడా ఖరారు చేసుకునేందుకు టీడీపీకి అవకాశం ఉంటుంది. 

ఈ రకంగా అనేక ప్రత్యేకతలు కలిగిన ఎన్నిక కావడంతో బీజేపీ వెనుక టీడీపీ కూడా నిలిచి గెలుపు కోసం తపించాల్సి వస్తోంది. నిజానికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై మొదట్లో ఆసక్తిని చూపిన టీడీపీ తరువాత ఆ సీటును బీజేపీకి వదిలేసింది. అది కూడా చివరి నిమషంలో కేటాయించడంతో అడుగులు తడబడుతూనే కమలనాధులు రంగంలో నిలిచారు. మరో వైపు వామపక్షాలు, కాంగ్రెస్‌, స్వతంత్య్ర అభ్యర్ధులు ఎన్నికల గోదాలో ఉండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ మాత్రం ఈ వైపుగా కూడా కన్నెత్తి చూడలేదు. చిత్రంగా నాలుగైదు రోజుల క్రితం వామపక్ష నేతలు వైసీపీ అధి నాయకత్వాన్ని కలసి మద్దతు ప్రకటించమని కోరడంతో జగన్‌ సరేనంటూ పచ్చ జెండా ఊపేశారు. అప్పటి నుంచి ఉత్తరాంధ్ర పట్టభద్రుల రాజకీయం రసకందాయంలో పడింది. ఎపుడైతే వైసీపీ తెర వెనుక నిలిచిందో టీడీపీలోనూ కొత్త చురుకు పుట్టింది. వామపక్షాల అభ్యర్ధి కనుక విజయం సాధిస్తే దానిని వైసీపీ తన ఖాతాలో వేసుకుని జబ్బలు చరిస్తే తమ పరిస్థితి ఏంటన్న కంగారు తమ్ముళ్లలో కలిగింది.  ఇపుడున్న పరిస్థితులలో వామపక్షాల అభ్యర్ధికి విజయావకాశాలు మెరుగ్గా ఉన్న నేపధ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా మద్దతు ఇవ్వడంతో పసుపు శిబిరంలో కలవరం చెలరేగింది. 

ఇంతవరకూ బీజేపీ అభ్యర్ధికి నామ్‌కే వాస్తే ప్రచారం చేస్తూ వచ్చిన టీడీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచినట్లుగా కదన రంగంలోకి దిగిపోయారు. మంత్రులు మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా బాధ్యలు, నాయకులు ఇలా అంతా కలసి బీజేపీ అభ్యర్ధి విజయంలోనే తమ భవిష్యత్తూ దాగుందన్న సత్యాన్ని గుర్తించి మరీ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఎన్నడూ స్ధానిక రాజకీయాలపై పెద్దగా జోక్యం చేసుకోని  కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు సైతం  ప్రతీ పట్టభద్రుని ఫోన్‌కు వాయిస్‌ మెసేజ్‌ చేస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా ముద్రించిన లేఖలను ఇళ్లకు పంపడమే కాదు,  పట్టభద్రుల ఓటర్లకు స్వయంగా ఫోన్‌ చేసి మరీ ఓటు వేయమని అర్ధిస్తున్నారంటే గెలుపు ఎంతటి అవసరమో చెప్పకనే చెబుతోంది. ఎలాగోలా విజయం సాధించకపోతే ఉత్తరాంధ్రలో తలెత్తుకుని తిరగలేమన్న వాస్తవాన్ని అధినాయకత్వం హెచ్చరికలతో గ్రహించిన టీడీపీ శిబిరం చివరి దశలో ప్రచారాన్ని ఉధృతం చేయడం వెనుక వైసీపీ పరోక్ష రంగ ప్రవేశమే ప్రధాన కారణమని చెప్పకతప్పదు. 

వామపక్షానికి స్నేహ హస్తం...!

ఇదిలా ఉండగా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీపై ఆది నుంచి అనాసక్తిగా ఉన్న వైసీపీ చివరి నిముషంలో తీసుకున్న నిర్ణయం విశాఖ రాజకీయాలను ప్రభావితం చేసేదిగా ఉండడం విశేషం. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ కీలకమైన ఎన్నికలలో పోటీకి దూరంగా ఉన్నారన్న అపకీర్తిని మోసిన ఫ్యాన్‌ పార్టీకి బూస్ట్‌ ఇచ్చే విధంగా వైసీపీ అధినాయకత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేస్తూనే భావి రాజకీయాలను కూడా దృష్టిలో ఉంచుకుని జగన్‌ వామపక్ష అభ్యర్ధులకు మద్దతు ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికలలో పోటీ చేసినా ఎటూ గెలిచే అవకాశాలు లేవు, అలాగని గమ్మున ఉంటే ఓ రాజకీయ పార్టీగా అభాసుపాలవుతాం, ఈ దశలో మాతో రాజకీయంగా కలసివచ్చే శక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా రెండిందాల లాభం పడవచ్చునన్నది వైసీపీ నేతల విశ్లేషణ. జీవీఎంసీ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ ఓ వైపు ఉంటాయన్నది తెలిసిన విషయమే. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఒంటరి పోరు చేసే కంటే ఉద్యమాలతో నిత్యం జనంలో ఉండే వామపక్షాలతో కలసి పోటీకి దిగితే అనూహ్య ఫలితాలు వస్తాయన్నది వైసీపీ వ్యూహకర్తల అంచనా. దానికి సంబంధించి ఈసరికే సూత్రప్రాయంగా అవగాహన ఉన్నా దానికి మరింతగా బలోపేతం చేసేలా తాజా మద్దతు ఉందన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ఇక, ఇప్పటికి మూడేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న ఏపీ సర్కార్‌ పనితీరుపై ఇంతవరకూ ఎటువంటి ఎన్నికలలోనూ ప్రజాభిప్రాయం వెల్లడి కాలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఆ అవకాశం వచ్చిందని చెబుతున్నారు. ప్రజాభిప్రాయానికి తగినట్లుగా వామపక్ష అభ్యర్ధి విజయం సాధించే ఛాన్స్‌ కూడా అధికంగా ఉందని వారు అంటున్నారు. అదే కనుక జరిగితే జీవీఎంసీ ఎన్నికలకు ముందు సాధించిన ఈ విజయం వామపక్షాలకే కాదు, ప్రధాన ప్రతిపక్షంగా తమకూ కొండంత మేలు చేస్తుందని వారు అంటున్నారు. ఇదే ఊపుతో రానున్న జీవీఎంసీ ఎన్నికలను ఎదుర్కోవడం చాలా సులభంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద వైసీపీ వ్యూహాత్మకంగా వేసిన ఈ ఎత్తుగడ ఆ పార్టీకి మంచి ఫలితాలనే అందిస్తుందని భావిస్తున్నారు. 

విజయం మా వైపే...!

కాగా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము మద్దతు ఇచ్చిన  పిడిఎఫ్‌ అభ్యర్థి ఎ.అజశర్మ గెలుపు తథ్యమని వైసిపి జిల్లా అధ్యక్షులు గుడివాడ అమరనాధ్‌ అన్నారు. ఏపీకి,  ముఖ్యంగా ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం చేసిన బిజెపి, టిడిపిలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, జగన్‌ ఆదేశం మేరకు  వామపక్ష ఉమ్మడి అభ్యర్ధి అజశర్మ గెలుపునకు ఉత్తరాంధ్రలోని వైసిపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు కార్యోన్ముఖులై ఎన్నికల ప్రచారం చేపట్టారన్నారు. అజశర్మ గెలుపు బిజెపి, టిడిపిలకు చెంపపెట్టుకాగలదన్నారు. విజ్ఞులైన పట్టభద్రులకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు చేసిన వాగ్ధానాలు ఏమిటో, వాటిని అమలు చేయకుండా ఎలా మోసగించారో తెలుసునన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి, పట్టభద్రుల నుంచి ఓట్లు అడిగే నైతిక హక్కు వెంకయ్యనాయుడుకు లేదన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, 25 మందికి పైగా ఎమ్మెల్యేలు కలిసి బిజెపి అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నా వారికి విజయంపై నమ్మకం లేదన్నారు. అందుకే వెంకయ్యనాయుడు ఢిల్లీ నుంచి డబ్బు సంచులతో విశాఖపట్నం వచ్చి, డబ్బు వెదజల్లి అయినా సరే గెలవాలని చూస్తున్నట్లు అనుమానం ఉందన్నారు. ఎన్నికల కోడ్‌ను అతిక్రమించి, బిజెపి, టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆధారాలతో సహా కలెక్టర్‌కు తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

ఏది ఏమైనా ఈ విజయం చారిత్రాత్మకమైనదని తాము భావిస్తున్నామని, ఇదే ఎన్నికల ఫలితం జీవీఎంసీలోనూ పునరావృత్తం అవుతుందని అమర్‌నాధ్‌ ధీమా వ్యక్తం చేశారు. మరో వైపు ఇంతవరకూ తమదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ వస్తున్న వామపక్షాలకు వైసీపీ మద్దతు మరింతగా ఊతమిస్తోంది. వైసీపీకి నగర ప్రజానీకంతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఉన్న అభిమాన గణం, పార్టీ శ్రేణుల మద్దతు కలసివచ్చినట్లైతే ధీటైన విజయాన్ని నమోదు చేస్తామని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్‌  వంటి అంశాలలో భావ సారూప్యత కలిగిన పార్టీలుగా వైసీపీ, వామపక్షాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అందువల్ల ఈ విజయంతో ప్రజాభిప్రాయం తమకు అనుకూలమైతే రానున్న రోజులలో ఈ అంశాలపై మరింత గట్టిగా పోరాడి సాధించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 

తెర వెనుక సమరం !

గతంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికలకూ, ఈసారి ఎన్నికలకు గుణాత్మకమైన మార్పు కనిపిస్తోంది. అప్పట్లో పార్టీల తరఫున అభ్యర్ధులు నిలబడినా ఎవరికి వారుగానే ప్రచారం చేసుకుంటూ వచ్చేవారు. జెండాల హడావుడి పెద్దగా కనిపించేది కాదు, ఈసారి మాత్రం ఢీ అంటే ఢీ అన్న తరహాలో పోరు సాగుతోంది. ఏకంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విశాఖ నగరంలో రెండు రోజుల పాటు మకాం చేసి మరీ బీజేపీ విజయం కోసం పరిశ్రమించారు. ఆ పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర మంత్రులు వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో విస్తృతంగా పర్యటించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఏపీకి చెందిన ఇద్దరు ఎంపీలతో పాటు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇతర నాయకులు కూడా బీజేపీ విజయాన్ని ప్రతిష్టగానే తీసుకున్నారు. ఇక టీడీపీ కూడా తన వంతుగా భారీ ఎత్తున ప్రచారం చేపట్టింది. టీడీపీ నిలబెట్టిన బీజేపీ అభ్యర్ధి అంటూ కమలనాధులు ప్రచారం చేసుకోవడంతో పరాజయం పాలైతే ఆ నిందను తాము కూడా మోయాల్సి వస్తుందన్న భయంతో తమ్ముళ్లు కళాశాలలు, యూనివర్శిటీల వెంట పరుగులు తీస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మంతనాలు సాగిస్తున్నారు. ఇంటింటికీ స్వయంగా తిరిగి మరీ ఓటును అభ్యర్ధిస్తున్నారు. పేరుకు బీజేపీ, వామపక్షాల మధ్య పోటీగా కనిపిస్తున్నా తెర వెనుక టీడీపీ, వైసీపీ మద్దతుగా నిలవడంతో రాజకీయ కురుక్షేత్రాన్నే తలపించేలా పట్టభద్రుల ఎన్నికల పోరు సాగుతోంది. ఈ రకమైన రాజకీయ పోరు వల్ల స్వతంత్రులు, సామాజికవర్గాల అండతో నిలబడిన వారంతా డీలా పడిపోయారు. ప్రధాన పక్షాల పోరాటంలో తాము లేగదూడలైపోతున్నామని పలువురు స్వతంత్రులు వాపోతున్నారు. 

బీజేపీ, వామపక్షాల మధ్య పోటీని చూసి సందట్లో సడేమియాగా తమకూ ఛాన్స్‌ ఉంటుందని రంగంలోకి దూకేసిన హస్తం పార్టీకి తాజా పరిణామాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. యధా ప్రకారం టీడీపీ, వైసీపీల మధ్య సమరం జరిగితే విజయం ఆ రెండు శిబిరాల వైపే ఉంటుందని, సోది లోకి కూడా ఇతర పార్టీలకు అవకాశం ఉండదని హస్తం పార్టీ నేతలు నిరాశ చెందుతున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికల రూపేణా జనాదరణ ఏ విధంగా ఉందన్న దానిని కొంతైనా తెలుసుకోగలమన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్‌ ముందుకు సాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే త్వరలో జరగనున్న జీవీఎంసీ ఎన్నికలకు ముందస్తు సన్నాహంగా జరుగుతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలు ఆసక్తిని బాగా పెంచుతున్నాయని చెప్పకతప్పదు. 

పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌,

విశాఖపట్నం,

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?