Advertisement

Advertisement


Home > Articles - Special Articles

విచారణలో సెలబ్రిటీల ‘‘ఎక్స్‌ ట్రా తెలివితేటలు’’

విచారణలో సెలబ్రిటీల ‘‘ఎక్స్‌ ట్రా తెలివితేటలు’’

ఒక్కసారి వెనక్కు వెళ్లిచూస్తే.. సినీ సెలబ్రిటీల విచారణ పర్వం మొదలైన మూడోరోజున విచారణాధికారులు కొన్ని రకాల అనుమానాలను వ్యక్తం చేశారు. ‘‘విచారణకు వస్తున్న వారంతా.. ఒకే లాయరు దగ్గర ట్రైనింగు తీసుకుని ఒకే తరహా జవాబులు చెప్పడానికి ప్రిపేరై వచ్చినట్లుగా కనిపిస్తోంది అని! ఇవాళ్టి వరకు గమనిస్తే.. అందరూ పనిగట్టుకుని (శ్యామ్ తప్ప) తెల్లచొక్కాలే వేసుకురావడం కూడా అందరూ కూబలుక్కున్నట్టు జరిగిందనే మాట కూడా వినవచ్చింది. ఇవాళ విచారణాధికారి అకున్ సభర్వాల్ చెప్పిన మాటలను గమనిస్తోంటే.. ఇంకా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 

అకున్ మీడియాతో మాట్లాడుతూ.. విచారణకు వస్తున్న వారందరూ కూడా.. అలోవీరా డ్రింక్స్ తీసుకుని వస్తున్నారని, వీటిద్వారా కడుపు ఖాళీ చేసుకుని వస్తున్నారని చెప్పారు. అది కూడా అందరూ కూడబలుక్కున్నట్టుగా ఒకే తీరుగా చేస్తున్నారన్నమాట. వీరిని విచారించడానికి ప్రత్యేకంగా అథ్లెట్స్ కోసం వినియోగించే డోప్ టెస్ట్ మెషిన్ ను ఢిల్లీనుంచి తెప్పించబోతున్నట్లు కూడా అకున్ వెల్లడించారు. అకున్ చెప్పిన మరో కీలక విషయం ఏంటంటే.. వీరంతా కూడా సినీ రంగంలోని అనేక మంది ప్రముఖులు,  పెద్ద నిర్మాతల పేర్లు చెబుతున్నారని కూడా ఆయన వెల్లడించారు. 

కాస్త లోతుగా ఆలోచిస్తే.. అలోవీరా డ్రింకులు తీసుకుని.. ఆనవాళ్లు దొరకకుండా ముందుజాగ్రత్తలతో విచారణకు వస్తున్న వీరు.. పోలీసులతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా అనిపిస్తోంది. ఎటూ తాము కేసులో చిక్కుకున్నాం గనుక.. వీలైనంత బురదను పరిశ్రమలోని పెద్దలందరి మీద చల్లేస్తే.. వాళ్లందరినీ విచారణకు పిలిపించి ప్రశ్నలు అడుగుతారో లేదో చూద్దాం.. చేయకపోతే.. విచారణ పక్షపాతంతో జరుగుతున్నదంటూ మరికొన్ని నిందలు వేసేద్దాం అని వారు మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా ఉంది. అలాగని.. పరిశ్రమలో పెద్ద తలకాయలు ఎవ్వరూ ఈ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధంలేని పవిత్రులు అనేది మన ఉద్దేశం కాదు. అయితే.. ఈ విచారణకు వస్తున్న వారు ఎవరెవరి పేర్లను వెల్లడిస్తున్నారు అనేది తెలిస్తే తప్ప, వారి మాటల్లో నిజాయితీ మనకు బోధపడదు. 

అయితే అకున్ మాత్రం సంయమనంతోనే మాట్లాడుతున్నారు. విచారణకు తెలంగాణ- ఆంధ్ర అనే రంగు పులమడానికి కూడా ప్రయత్నిస్తున్నారని దయచేసి అలాంటి పనిచేయవద్దని ఆయన అంటున్నారు. అలాగే ప్రముఖుల పేర్లను వీళ్లు విచారణలో చెప్పినంత మాత్రాన సరిపోదని, సరైన ఆధారాలు ఉంటే తప్ప ఎవ్వరినీ విచారణకు పిలవబోమని కూడా ఆయన అంటున్నారు. దాన్నిబట్టి చూస్తే విచారణ సెలబ్రిటీల పాచిక పారకపోవచ్చు.. కానీ వారు ప్రయోగిస్తున్న ఎక్స్ ట్రా తెలివితేటలే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?