Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఉపేంద్రజాలం మొదలయ్యిందలా..!

ఉపేంద్రజాలం మొదలయ్యిందలా..!

అతడు ఎంత పెద్ద స్టార్ అంటే.. అతడి పేరుకు ఉన్న మార్కెట్ ఎంత అంటే.. తన సొంత పేరు మీదే సినిమాన రూపొందించేంత! ప్రతి భాషకూ సూపర్ స్టార్లు ఉన్నారు కానీ.. వారిలో ఎవరికీ  తమ సొంత పేరుతో సినిమాను చేసి దాన్ని మార్కెట్ చేసుకోగలిగినంత సీన్ లేదు! ఈ మాట చెబుతున్నది వారిని తక్కువ చేయడానికి కాదు.. ఉపేంద్ర స్థాయి ఏమిటో చెప్పడానికి! ఒక సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాను రూపొందించి.. దానికి ‘‘ఉపేంద్ర’’ అని పేరు పెట్టి విడుదల చేశాడు ఈ దర్శక హీరో! ఇది ఒక బీభత్సమైన హిట్. ఈ బీభత్సం అప్పుడు మొదలైంది కాదు.. కన్నడ మొదలై.. దక్షిణాది అంతా వ్యాపించిన ఉపేంద్ర జాలం చాలా సాదాసీదాగా కదిలింది. సంచలనంగా మారింది. ‘‘ఓమ్’’ సినిమాతో!

కాశీనాథ్.. కన్నడలో ఒక కామెడీకి స్టారిజం తీసుకొచ్చిన హీరో. తన నటనతో కన్నడ ప్రేక్షకులను తెగ నవ్వించిన నట, దర్శకుడు, నిర్మాత కాశీనాథ్. ఇతడి సినిమాలు తెలుగులోకి కూడా కొన్ని డబ్ అయ్యాయి. అలాంటి కాశీనాథ్‌కు అసిస్టెంట్‌గా మొదలైంది ఉపేంద్ర రావు ప్రస్థానం. ఉడిపి ప్రాంతంలోని ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి బెంగళూరు వచ్చి డిగ్రీని పూర్తి చేసి సినిమా ప్యాషన్‌తో కాశీనాథ్ వద్ద చేరిపోయాడు. కొన్ని సినిమాలు కాశీనాథ్ దగ్గర పనిచేసే సరికి అతడిపై ఆ ప్రభావం పూర్తిగా పడిపోయింది. కాశీనాథ్ స్టైల్ ఆఫ్ కామెడీతోనే ఒక సినిమా చేశాడు. జగ్గేష్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూ రూపొందించిన ఆ సినిమా సో.. సో.. అనిపించింది. అయితే ఉప్పీకి సంతృప్తి లేదు. ఎందుకంటే.. తనను ఎవరూ ప్రత్యేకంగా గుర్తించేవారు లేరు. కాశీనాథ్ సినిమానే అనుకొన్నారంతా!

ఆ తర్వాత తన మెంటర్ కాశీనాథ్‌నే ముఖ్యపాత్రలో పెట్టి.. ‘ష్..’ అనే హారర్ సినిమాను తీశాడు. కామెడీ హీరోతో హారర్ సినిమా చేయడం.. అది కూడా హిట్ కావడంతో ఉప్పీకి వైవిధ్యతలోని కిక్కు అర్థం అయ్యింది. రెండు సినిమాలు చేసినా.. వచ్చిన గుర్తింపు లేదు. ఏదో అద్భుతం చేస్తే తప్ప కోరుకొన్న గుర్తింపు రాదు. అయితే బోలెడు పరిమితులు. బడ్జెట్ దగ్గర నుంచి.. ప్రతి విషయంలోనూ పరిమితులే. ఇలాంటప్పుడు తను చేయగలిగింది ఏమైనా ఉంటే.. కథల దగ్గరేనని గ్రహించాడు. ఆ ఆలోచనే దక్షిణాదిలో ఉప్పీని ఒక వైవిధ్యమైన స్టార్‌గా నిలిపింది. కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించడానికి కారణం అయ్యింది.

బెంగళూరు నగరం చుట్టూ ఉండే క్రైం వరల్డ్ నేపథ్యంగా.. తన స్నేహితుడొకరు చెప్పిన కథ ఆధారంగా ఊప్పీ తయారు చేసుకొన్నదే ‘‘ఓమ్’’ కథ. మొదటగా దీన్ని హీరోతో చేయాలనుకొన్నా.. సూపర్ స్టార్ రాజ్ కుమార్ తనయుడు ఈ సినిమాకు హీరో అయ్యాడు. ఉప్పీ సినిమాకు భారీ తనం వచ్చింది. బాలనటుడిగా కనిపించిన స్టార్ హీరో తనయుడిని హీరోగా చేస్తూ రూపొందించిన ఈ సినిమా ఉపేంద్రను సూపర్ హీరోను చేసింది! ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. ‘ఓమ్’ విడుదలతో ఉప్పీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది! ఫిల్మ్ ఫేర్ అవార్డులొచ్చాయి! ఇదే ఉపేంద్ర కోరుకొన్న గుర్తింపు.

ఆ తర్వాత అదే రీతిన దూసుకెళ్లాడు. 1995లో ఓమ్ విడుదల అయ్యింది. దక్షిణాదిలో తొలి ‘‘సైకాలజికల్ థ్రిల్లర్’’ అనిపించుకొంది. ఆ తర్వాత ఉప్పీకి స్టార్ హీరో అంబరీష్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఇమేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేయడంలో ఉన్న ఇబ్బంది ఉప్పీకి అర్థం అయ్యింది. అలా కాదు.. ఇమేజ్ లేని హీరో కావాలి.. అతడు తను చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండాలనుకొన్నాడు. దానికి ఛాయిస్ తను తప్ప మరొకరు కాదనుకొన్నాడు. ఇంగ్లిష్ ఆల్ఫాబెట్స్ ‘‘ఏ’’ తో మొదలయినట్టుగా ఉప్పీ యాక్టింగ్ కెరీర్ కూడా ‘‘ఏ’’తో మొదలైంది.

వివాదాస్పదమైన కథనం.. వివాదాస్పదమైన డైలాగులు.. అనేక మంది సినిమాపై దుమ్మెత్తిపోశారు... కానీ ఉపేంద్ర ఆకట్టుకొన్నాడు. కన్నడ బాక్సాఫీసు రికార్డులు చెరిగిపోయాయి. కొత్త రికార్డులు సృష్టించేశాడు. దర్శకుడిగా స్టార్‌గా ఉన్న వ్యక్తి హీరోగా కూడా స్టార్ అయ్యాడు.

ఆ తర్వాత రాజ్ కుమార్ మరో తనయుడిని ఇంట్రడ్యూస్ చేస్తూ ‘స్వస్తిక్’ను రూపొందించాడు. అది ఉప్పీని నిరాశ పరిచింది. ఈ నిరాశలో ఆయన కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయలేదు. ‘ఉపేంద్ర’ పేరుతో మరో సైకాలజికల్ థ్రిలర్‌ను రూపొందించాడు. మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమలో కదలిక. 200 రోజులాడింది ఆ సినిమా.

ఆ తర్వాత ఉప్పీకి దర్శకత్వం మీద దృష్టి తగ్గింది. పూర్తిగా హీరోయిజం మీద దృష్టి సారించాడు. ఇది తప్పో రైటో కానీ.. 1999 లో వచ్చిన ‘ఉపేంద్ర’ తర్వాత దర్శకత్వానికి దశాబ్దానికిపైగా దూరంగా ఉన్నాడు. ఈ మధ్యలోనే  ఉప్పీని హీరోగా పెట్టి కొంతమంది దర్శకులు ప్రయోగాలు చేశారు. వాటిల్లో ‘రా..’ వంటి చక్కటి సినిమాలు వచ్చాయి. 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హిట్ అయిన సినిమాలను కన్నడలో రీమేక్ చేస్తూ మరికొంతకాలం గడిపేశాడు.  కొంతకాలం కింద మళ్లీ ఉప్పీ ‘సూపర్’ సినిమాతో తన మార్కును చూపించాడు. ఉప్పీ క్రేజీ ప్రాజెక్ట్ ‘ఉప్పీ-2’ పెండింగ్‌లో ఉంది. ఈ సినిమాను బారీ ఎత్తున తెరెకక్కించడానికి అందులో విద్యాబాలన్‌ను నటింపజేసే ప్రయత్నాల్లో ఉన్నాడు ఉప్పీ.

నటన విషయంలో ఉపేంద్రది రఫ్ టచ్. దీన్ని ఆధారంగా చేసుకొని.. ఉప్పీ ఇమేజ్ మీద ఆధారపడి మంచి మంచి సినిమాలు వచ్చాయి. రక్తకన్నీరు, హెచ్2వో, హాలీవుడ్ వంటి సినిమాలు ప్రశంసలు పొందాయి. ఇక తెలుగు వారికి కూడా ఉప్పీ సుపరిచితుడే. ‘ఓమ్’ సినిమా తెలుగులో రాజశేఖర్ హీరోగా రీమేక్ అయ్యింది. ఆ సినిమాకు ఉప్పీనే దర్శకుడు!

ఇక ‘ఏ’ ‘ఉపేంద్ర’ ‘రా..’ సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్సే. ఇప్పటికే యూట్యూబ్‌లో వీటి తెలుగు వెర్షన్‌లు వీక్షకాదరణలో స్ర్టైట్ తెలుగు సినిమాలతో పోటీ పడే స్థాయిలోఉన్నాయి. మొన్నటి ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వరకూ ఉప్పీ అనేక తెలుగు సినిమాల్లో కనిపించాడాయన. రఫ్ టచ్ తో ఉన్న పాత్రలను తయారు చేసుకొన్న దర్శకులు ఉప్పీనే తలుచుకొన్నారు.

ఉపేంద్ర సినిమాల గురించి విశ్లేషించడం అంటే.. అది మానసిక విశ్లేషకులకు గొప్ప పరీక్ష. ఫ్రాయిడ్ థియరీలకు తీసిపోని రీతిలో ఉప్పీ సినిమాలుంటాయని వారు అంటారు. ఈ విషయాన్ని ఉప్పీ దగ్గరే ప్రస్తావిస్తే... ‘‘ ఆ సినిమాలు తీస్తున్నప్పటికి నాకు ఫ్రాయిడ్ గురించి కానీ.. ఆయన థియరీల గురించి కానీ తెలియదు. వైవిధ్యమైన కథలతో తప్ప మరో రకంగా సర్వైవ్ కావడానికి అవకాశం లేని సమయంలోనే.. నేను వాటిని రూపొందించాను..’ అని చెబుతాడు ఉపేంద్ర. సినిమాలు తీయడానికి అవసరం మేధస్సు కాదు.. మంచి సినిమాలు తీయాలన్న తపన అని చెప్పడానికి ఉప్పీ మాట చాలు కదా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?