Advertisement

Advertisement


Home > Articles - Special Articles

విశోకమేనా...!! బ్రాండ్ ఇమేజ్ ఢమాల్...!

మహా నగరం విశాఖ ఒక్క దెబ్బకు కుదేలైపోయింది. హదూద్ రూపంలో పెను తుపాను కాటేసింది. ఎదుగుతున్న సుందర నగరం భవిత ఇపుడు అంధకార బంధురమైంది. ఆసియా ఖండంలో శరవేగంగా ఎదుగుతున్న మెగా సిటీ ఇపుడు ప్రకృతి దగాకు బలి అయిపోయింది. తూర్పు తీరంలో అందాల ఆరబోస్తూ అందరినీ ఆకట్టుకుంటున్న నగరం కాస్తా ఛిన్నాభిన్నమైంది. విభజన తరువాత అతి పెద్ద నగరంగా ఆంధ్రప్రదేశ్‌కు లభించిన వరం కాస్తా ఇపుడు చేజారిపోయింది. నాలుగు దశాబ్దాల అభివృద్ధి, నలుగురి కష్టం పెను గాలిలో కొట్టుకుపోగా వట్టి చేతులతో వట్టిపోయిన విశాఖ మిగిలింది. హైదరాబాద్‌తో పోటీ పడుతుందనుకున్న నగరం ఇపుడు దిక్కులు చూస్తోంది. అందాల రాజధాని  కీర్తి కిరీటం కాస్తా మరుగునపడిపోయింది. విశాఖ అన్న మూడక్షరాల ప్రతిష్ట, ప్రతిభ మసకబారిపోగా, భవిష్యత్తుపై బెంగ మొదలైంది. కధ మళ్లీ మొదటికి వచ్చింది. 

అక్టోబర్ 12 ముందూ.. తరువాత...

విశాఖ గురించి ఇపుడు చరిత్ర చెప్పాలంటే ఇలానే విభజించుకోవాలి. అక్టోబర్ 12కి ముందు.. తరువాత అన్న భేదం పాటించాలి. ఆ సూత్రం ఆధారంగానే విశాఖ ప్రగతి గతిని కొలవాల్సిన దుస్థితి దాపురించింది. వందేళ్లలో ఎన్నడూ చూడని భీకరమైన హదూద్ తుపాను విశాఖను కబలించిన అక్టోబర్ 12 తేదీ దేశ చరిత్రలోనే కాదు, విశాఖ చరిత్రలోనూ ఓ చీకటి రోజుగా మిగిలిపోతుంది. గడచిన శతాబ్ద కాలంలో ఎన్నో పెను తుపానులు వచ్చాయి, వెళ్లాయి. వాటన్నిటినీ మించిన తుపానుగా హదూద్ రికార్డు నమోదు చేసుకుంది. అంతేనా. ఏ తుపానూ చేయని సాహసాన్ని కూడా చేసింది. ఏకంగా నగరంపైనే జల ఖడ్గంతో దాడి చేసింది. అతలాకుతలం చేసింది. విశాఖ వన్నెచిన్నెలను కాలరాసింది. అంతా ఒక్క రోజులోనే జరిగిపోయింది. అక్టోబర్ 12న సంభవించిన ప్రకృతి విలయం విశాఖ తలరాతను మార్చేసింది. ఇపుడు నడిరోడ్డున ఉన్న ఈ నగరం భావి కోసం అలమటిస్తోంది. రేపటి రోజు ఎలా ఉంటుందోనని కలవరిస్తోంది. పచ్చదనం లేని విశాఖగా, అనాకారి నగరంగా, భద్రత శూన్యమైన సిటీగా 12 తరువాత నుంచి విశాఖను చెప్పుకుంటున్నారు. ఐటీ హబ్, ఆర్ధిక రాజధాని, సినీ రాజధాని అన్న పేర్లు కూడా ఇపుడు తారుమారు అవుతున్న సందర్బాన్ని చూస్తే హదూద్ ఎంతటి విభజన తీసుకువచ్చిందో అర్ధమవుతుంది. ఏది ఏమైనా విశాఖ ప్రగతి ఇపుడు ప్రశ్నార్ధకంగానే మారిందన్నది వాస్తవం.

భద్రత ఇంతేనా...

తూర్పు కనుమలు రక్షణ కవచాలు, విశాఖకు ఎటువంటి ఇబ్బందీ లేదు, గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండవచ్చు. ఇదీ ఇంతకాలం వినిపించిన మాట. ఇపుడు దానిలోని డొల్లతనం విశాఖవాసులకు తెలిసివచ్చింది. కొండలను సైతం ధిక్కరించిన తుపానును చూసిన తరువాత విశాఖలో రక్షణ ఏపాటిది అన్న ప్రశ్న అటు మేదావులలోనే కాదు, సామాన్య జనంలోనూ వ్యక్తమవుతోంది. ఎత్తైన కొండలు, దట్టమైన పచ్చని వృక్ష జాతులలో అలరారుతున్న విశాఖ 2004లో సునామీ బెడద నుంచి కూడా తప్పించుకుంది. ఆ ఏడాది డిసెంబర్ 26న సమిత్రా దీవులలో వచ్చిన సునామీకి ఇటు చెన్నై తీరంతో పాటు, పలు తీర నగరాలు తల్లడిల్లినా విశాఖ మాత్రం చాలా భద్రంగా ఉంది. ఈ పదేళ్ల కాలంలోనూ విశాఖలో స్వల్పమైన భూ కంపాలు, ఎన్నో తుపానులు వచ్చాయి కానీ, ఏవీ మానవ జీవితాన్ని ఇంతలా ప్రభావితం చేయలేకపోయాయి. హదూద్ మాత్రం తనదైన ముద్రనే వేసిందని చెప్పాలి. దీనికి చాలా కారణాలు కూడా ఉన్నాయని వాతావరణ అధ్యయనకారులు చెబుతున్నారు. ఏ ఏటికి ఆ ఏడు వృక్షాలలో తరుగుదల, కొండలను కూడా ఆక్రమించుకునే మానవుని స్వార్ధ నైజం వెరసి హదూద్ విశృంలంఖత్వానికి ఆస్కారం కల్పించాయని చెబుతున్నారు. అలాగే, విశాఖ అభివృద్ధి మాటున పెచ్చరిల్లిన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ ఫలితంగా ఇబ్బడి ముబ్బడిగా వెదజల్లుతున్న కాలుష్య మేఘాలు కూడా నగర భద్రతను ప్రశ్నార్ధకం చేశాయని అంటున్నారు. ఈ పరిణామాల వల్ల ప్రతీ వేసవిలోనూ విశాఖ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. సముద్రపు జలాలు ఆవిరిని కక్కుతున్నాయి. అలా వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల పుణ్యంగానే హదూద్ వంటి భూతాలు సాగర గర్భం నుంచి బయటకు వచ్చి విశాఖ మహా నగరాన్ని చుట్టుముట్టాయన్నది అధ్యయనకారుల వాదనగా ఉంది. ఇది పూర్తిగా వాస్తవమే అయినా, విశాఖకు అదే ప్రకృతి ఒకప్పుడు రక్షణగా ఉండేది. ఇపుడు మాత్రం కొండలు కూడా మౌనం దాల్చాల్సిన పరిస్థితి వచ్చిందన్నదే విశాఖవాసుల ఆవేదనగా ఉంది. 

ఉపాధి కేంద్రం ఉసురు తీసింది..

విశాఖకు హైదరాబాద్ తరువాత ఉపాధి కేంద్రంగా మంచి పేరు ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా వాసులతో పాటు, ఇటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారు కూడా విశాఖలో ఉపాధి అవకాశాలను చూసుకుంటారు. అలాగే, పొరుగున ఉన్న ఒడిషా, చత్తీస్‌ఘడ్‌ల నుంచి కూడా విశాఖకు పొట్ట చేత పట్టుకుని వస్తూంటారు. ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్ధలతో పాటు, వందలాదిగా ప్రైవేటు రంగంలోనూ ఉన్నాయి. దాంతో, విశాఖ వస్తే చాలు ఏదో ఒక బతుకు తెరువు దొరుతుందని ఆశించే వారే ఎక్కువ మంది ఉన్నారు. విభజన తరువాత మరిన్ని పరిశ్రమలు విశాఖ కేంద్రంగా తరలిరానున్నాయన్న వార్తల నేపథ్యంలో ఇక ఎక్కడికీ వెళ్లనవసరంలేదు, విశాఖలోనే ఉండవచ్చు హాయిగా అనుకున్న వారికి  హదూద్ అశనిపాతమే అయింది. వారం రోజుల పాటు చీకటి రాజ్యమేలితే, ఏకంగా కమ్యూనికేషన్ వ్యవస్ధ కుప్పకూలిపోయింది. సెల్ టవర్లు వందలాదిగా నేలకొరిగాయి. ఈ పరిస్థితులలో పారిశ్రామికంగా నగరం ఎలా ముందుకు సాగుతుందన్నది నిలువెత్తు ప్రశ్నగా ఉంది. ఐటీ హబ్‌గా విశాఖను ఎంతో ఊహించిన వారికి రుషికొండ వద్ద ఆరేళ్ల క్రితం ఏర్పాటుచేసిన ఐటీ పార్కు ఇతరత్రావి పేకమేడల్లా వేలాడుతూంటే ఇక అటువంటి గొప్ప ఆశ పెట్టుకోగలమా అనిపించకమానదు. విదేశీ సంస్ధలతో ఒప్పందాలు చేసుకున్న ఇక్కడ ఐటీ కంపెనీలకు వారం రోజుల పాటు విద్యుత్, సమాచార వ్యవస్ధ కుప్పకూలడం వల్ల అపరాధ రుసుం కూడా భారీగా పడుతోంది. ఈ నేపథ్యంలో ఐటీ కంపెనీల యజమానులు సైతం పునరాలోచనలో పడ్డారు. విశాఖ అనుకున్నంత రక్షణ ఇవ్వదన్నది వారి మనోగతంగా ఉంది. తుపానులకు కేంద్రంగా ఉన్న విశాఖలో ఐటీ కంపెనీల భవిష్యత్తు దినదిన గండంగానే  వారంతా చూస్తున్నారు. ఐటీ పరంగా విశాఖను అగ్రగామిగా నిలబెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ తాపత్రయానికి ప్రకృతి గండి కొడుతోంది. దీంతో, ఐటీ కంపెనీలకు ఇపుడు రాజమండ్రి నగరం ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అలాగే, రియల్ బూమ్ సైతం ఒక్కసారిగా పడిపోయింది. 2004లో సునామీ వచ్చినపుడు కూడా విశాఖలో స్ధలాలు కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు, ఇపుడు మళ్లీ అటువంటి స్థితి ఏర్పడింది. దీంతో, ఆ రంగం కూడా ఎటువంటి ఎదుగుదల ఇప్పట్లో లేనంతగా దెబ్బతింది. సినిమా రాజధాని అనుకున్నారింతవరకూ, మేఘం వేస్తే చాలు షూటింగ్‌కు అంతరాయం ఏర్పడుతుంది, లక్షలలో వ్యయం వృధా అవుతుంది. మరి, తుపాన్లకు నెలవైన విశాఖలో షూటింగులు సజావుగా నడుస్తాయా అన్న ప్రశ్న కూడా తెలుగు చిత్ర ప్రముఖులలో కలుగుతోంది, విశాఖలో తొలి స్డూడియో నిర్మించిన ప్రఖ్యాత నిర్మాత డి రామానాయుడు స్డూడియో హదూద్‌కు అతలాకుతలం చూసిన వారు ఇపుడు ఇక్కడ నిర్మాణాలకూ వెనుకంజ వేస్తున్నారు. ఎన్ని రాయితీలు ఇచ్చినా నీరు, విద్యుత్, సమాచార వ్యవస్ధ లేకపోతే తామేంచేయాలన్నది పారిశ్రామికవేత్తల సందేహంగా ఉంది. ఇలా మొత్తంగా చూస్తే బహుముఖ రంగంగా విస్తరిస్తూ వర్ధిల్లుతుందనుకున్న విశాఖను హదూద్ ఏమీ కాకుండా చేసేసింది. 

స్మార్ట్ సిటీ ఒక్కటే ఆశ...

దేశంలోనే మూడు స్మార్ట్ సిటీలను కేంద్రం ఎంపిక చేసింది. అందులో విశాఖపట్నం ఒకటి. ఇపుడు ఆ ఆశ మాత్రమే వైజాగ్‌వాసులను బతికిస్తోంది. స్మార్ట్ సిటీ అంటేనే భూగర్భ విద్యుత్ వ్యవస్ధ ఉంటుంది. తుపాను వల్ల ఎటువంటి నష్టం వచ్చినా విద్యుత్‌కు అంతరాయం ఏర్పడదు, ఒకవేళ ఏర్పడినా క్షణాలలో దానిని సరిచేయగల సామర్ధ్యం కూడా ఉంటుంది. అందువల్ల స్మార్ట్ సిటీగా విశాఖను సాధ్యమైనంత వేగంగా అభివృద్ధి చేస్తే మళ్లీ ఈ నగరం వైపు పారిశ్రామికవేత్తలు తొంగి చూసే అవకాశం ఉంటుంది. అదే విధంగా కోల్పోయిన పచ్చదనాన్ని కూడా వేగంగా పెరిగే మొక్కలను నాటడం వల్ల తిరిగి సంతరింపచేసే ప్రణాళిక కూడా అవసరం. దానివల్ల ఇటు సినీ పరిశ్రమ, ఇటు పర్యాటకరంగం మళ్లీ ఇక్కడ కళకళలాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఐటీ రంగాన్ని ఇక్కడ ప్రతిష్టింపచేయాలంటే కమ్యూనికేషన్ వ్యవస్ధను పూర్తిగా బలోపేతం చేయాలి. పెను తుపానులు సంభవించినా తట్టుకునేలా చూడాలి. అలాగే, పర్యావరణ వేత్తలు చెబుతున్నట్లుగా తీరప్రాంతంలో అక్రమ కట్టడాలను నిషేధించి మడ అడవులను పెంచాలి. కొండల దురాక్రమణను అరికట్టాలి. ఐటీ వంటి వాటిని తీరానికి వీలైనంత దూరంగా ఉండేలా చూడాలి. అపుడే విశాఖకు పూర్వ వైభవం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా బ్లూ ప్రింట్‌ను తయారుచేసుకుని ముందుకు సాగితేనే మన విశాఖ నగరాన్ని తిరిగి తెచ్చుకోగలం, అందాల సిటీని పొందగలం. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం కావాలని ఆశిద్దాం.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?