Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వివాదాస్పదుడే...కాని హేతుబద్ధత ఉంది...!

వివాదాస్పదుడే...కాని హేతుబద్ధత ఉంది...!

తమిళనాడులో జల్లికట్టు కోసం సాగిన ఉద్యమాన్ని తమిళ సినిమా పరిశ్రమ మొత్తం మూకుమ్మడిగా సమర్థించింది. ఆ పోరాటంలో ముందు నిలిచింది. అక్కడి సినిమా వారికి అంతకు మించి మార్గం లేదు. అంత భారీఎత్తున ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా వారు సినిమా పరిశ్రమలో మిగలరు. వారి వ్యక్తిగత అభిప్రాయాలు ఎలావున్నా జల్లికట్టుకు జై కొట్టక తప్పలేదు.

తెలుగు సినిమా ప్రముఖులు కూడా కొందరు జల్లికట్టును సమర్ధించారు. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబు వంటివారు బహిరంగంగా మద్దతు పలికారు. ప్రస్తుతం వీరు టాప్‌ రేంజ్‌లో ఉన్న హీరోలు. వీరి సినిమాలు తమిళంలో కూడా డబ్‌ అవుతుంటాయి. వీరంటే తెలియని తమిళులు ఉండకపోవచ్చు. నిజానికి వీరు మౌనంగా ఉన్నా వచ్చిన నష్టమేమీలేదు. కాని జల్లికట్టుకు సమర్థనగా మాట్లాడితే తమ సినిమా వ్యాపారానికి ఇబ్బంది ఉండదనుకున్నారేమో. అందరితోపాటు వీరూ గొంతు కలిపారు కాబట్టి వీరి ప్రత్యేకత ఏమీ లేదు.         

ప్రత్యేకత కలిగిన ఒకే ఒక సినిమా ప్రముఖుడు దర్శకుడు రాంగోపాల్‌ వర్మ. వివాదాస్పద ప్రకటనలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ఆర్‌జీవి జల్లికట్టు ఉద్యమాన్ని దుమ్మదులిపిన తీరు సమర్థకులకు ఆగ్రహం కలిగించవచ్చుగాని అది హేతుబద్ధంగా ఉందనేది వాస్తవం. ఈ ఒక్క స్టేట్‌మెంటే కాదు, చాలా విషయాల్లో రామూ వాదనలో లాజిక్‌ ఉంటుంది. ఇందుకాయన హేతువాది (సామాన్యులు నాస్తికత్వం అంటారు) కావడం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం కారణం కావొచ్చు. ఎవరు ఏమనుకున్నా అనుకున్నది చెప్పడమే రామూయిజం. జల్లికట్టు విషయంలోనూ అదే చెప్పారు. జల్లికట్టు తమిళ సంప్రదాయం అంటున్నారు. కరెక్టే. కాని చట్టానికి దీంట్లో క్రూరత్వం కనబడుతోంది. అందుకే నిషేధించింది. సంప్రదాయం పేరుతో ఎద్దులను క్రూరంగా హింసిస్తున్నారన్న రామూ వాదనలో నిజముంది. 

దీన్ని జల్లికట్టు సమర్థకులు కాదంటున్నారు. కాని ఒకసారి ఈ క్రీడలోకి దిగాక ఎద్దులకు హింస తప్పదు. ఇదేమైనా క్రికెట్టా, టెన్నిసా నిబంధనల ప్రకారం ఆడటానికి. ఎద్దుల చెవులు, కొమ్ములు విరిగిపోయి, తోక ఎముకలు తొలిగిపోయి, ముక్కుకు కట్టిన తాడు వల్ల అవి విపరీతమైన బాధను అనుభవించి మరణిస్తాయి అని రామూ అన్నారు. ఇందులో అవాస్తవం లేదు. క్రీడలో పాల్గొన్న ప్రతి ఎద్దూ ఇలా చనిపోతుందని చెప్పలంగాని హింసను అనుభవిస్తాయనేది నిజం. ఇది అనాగరిక క్రీడ అనే రామూ అభిప్రాయం వంద శాతం కరెక్టు. జల్లికట్టు, కోడి పందాలు, బండలాగుడు పోటీలు..ఇంకా ఇలాంటి కొన్ని క్రీడలు రాజరికంనాటి, భూస్వామ్య ఫ్యూడల్‌ వ్యవస్థనాటి అవశేషాలు. తమిళనాడును నాయక రాజులు, ఇంకా కొన్ని తెలుగు రాజవంశాలకు చెందిన రాజులు పరిపాలించారు. వారి హయాంలోనే జల్లికట్టు పుట్టుకొచ్చిందనే వాదన ఉంది.

అది నిజమైనా కాకపోయినా  అప్పటి సమాజంలో వినోదానికి ఇప్పుడున్నన్ని మార్గాలు లేవు. చదువులు, అక్షరాస్యత చాలా తక్కువ. మూఢ నమ్మకాలు ఎక్కువ. సమాజమంతా వ్యవసాయం మీద ఆధారపడిన కాలం. పెత్తందారులదే రాజ్యం. ఈ పరిస్థితిలో జంతువులను ఉపయోగించి ఆడే కొన్ని క్రీడలు పుట్టుకొచ్చాయి. ఇలాంటివి ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఉన్నాయి. ఈ అనాగరిక క్రీడలను ఈ ఆధునిక సమాజంలో చదువుకున్నవారే, అధికారంలో ఉన్నవారే ప్రోత్సహించడం విచారకరం. సమాజం అభివృద్ధి చెందుతున్నకొద్దీ సంప్రదాయం పేరుతో చెలామణిలో ఉన్న అనేక దురాచారాలు వదిలేశాం. సతీసహగమనం, బాల్య వివాహాలు..ఇలాంటివాటిని కాదన్నాం. ఎందుకు? ఇందులో హింస ఉంది కాబట్టి. మనుషులు తమకు బాధాకరంగా ఉన్న సంప్రదాయాలను వదిలేసి జంతువులకు బాదాకరంగా ఉన్నవాటిని మాత్రం సంప్రదాయం పేరుతో కొనసాగిస్తున్నారు. 

ఈమధ్య ఉన్నత విద్య చదువుతున్నవారిలోనూ పైశాచికానందం పెరుగుతోంది. కొందరు మెడికోలు కుక్కలను డాబా మీది నుంచి రోడ్డు మీదకు విసిరేసి చంపిన ఘటన, కొందరు కోతిని సజీవ దహనం చేసి పూడిపెట్టిన ఘటన, ఒకడు కుక్క పిల్లలను మంటల్లో వేసి కాల్చేసిన దారుణం..ఇలాంటివన్నీ మనుషుల్లో పెరుగుతున్న క్రూరత్వానికి నిదర్శనాలుగా చెప్పుకోవచ్చు. మనుషులను నిలబెట్టి ఎద్దులను వారి మీదికి ఉరికిస్తే ఎలా ఉంటుంది? ఆర్‌జీవి అడిగిన ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారు? ఎద్దులు అమాయక జీవులు కాబట్టి జల్లికట్టు పేరుతో వాటిని హింసిస్తూ ఆనందిస్తున్నారు. పులులతోనో, సింహాలతోనో జల్లికట్టు ఆడి వీరత్వం ప్రదర్శించగలరా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?