Advertisement

Advertisement


Home > Articles - Special Articles

వ్యక్తిగత నమ్మకాలకు ప్రజాధనం వృథా

వ్యక్తిగత నమ్మకాలకు ప్రజాధనం వృథా

మన నాయకులు  నైతిక విలువలకు ఆమడ దూరంలో ఉంటారు. అధికారంలో ఉన్న వారు ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేస్తుంటారు. కోట్ల రూపాయలు అనవసరమైన పనులకు వాడుతుంటారు. పదవులను అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. చెప్పే నీతులకు, చేసే పనులకు పొంతన ఉండదు. అవినీతిని రూపుమాపుతామంటారు.  ఆ పనులు తామే చేస్తుంటారు. అధికారంలో ఉన్న వారు తమ వ్యక్తిగత అవసరాల కోసం, అభిరుచుల కోసం జనం డబ్బును వాడేస్తుంటారు. వాస్తవానికి అధికారంలో ఉన్నవారు ప్రజల సొమ్ముకు రక్షకులుగా, ట్రస్టీలుగా ఉండాలి. డబ్బు వృథా కాకుండా చూడాలి. కాని ఆ పని చేయడంలేదు. తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసమే కాదు, వ్యక్తిగత నమ్మకాల కోసం కూడా ఖజానా నుంచి భారీగా డబ్బు వాడుతున్నారు. వ్యక్తిగత పనుల కోసం జేబు నుంచి తీసి ఖర్చు పెట్టుకోవాలి. నాయకులకు డబ్బుకు కొదవా?  అయినప్పటికీ వ్యక్తిగత పనుల కోసం జనం సొమ్మునే ఖర్చు చేస్తున్నారు. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త క్యాంపు కార్యాలయ నిర్మాణం కోసం రూ.26 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. ఇది ప్రస్తుత అంచనా. అధినాయకుడి అభిరుచి మేరకు ప్లానులో మార్పులు చేర్పులు చేస్తే ఖర్చు మరింత పెరగవచ్చు. ఇప్పుడు కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించడమెందుకు? కేసీఆర్‌ రోడ్డు మీద ఉన్నారా? అంతటి దుస్థితి లేదు. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో, అన్ని హంగులతో క్యాంపు కార్యాలయం నిర్మించారు. వాస్తవానికి దాన్నే సీఎం కేసీఆర్‌ వాడుకోవాలి. కాని...ఆయనకు ఆ భవనం వాడుకోవడం ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే అందులో వాస్తు దోషం ఉందట....! సరే క్యాంపు కార్యాలయంలో వాస్తు దోషం ఉందని దాన్ని పక్కన పెట్టి నివాస భవనాన్ని వాడుతున్నారు. ‘అయ్యా..ఇందులోనూ వాస్తు దోషం ఉంది. తమరు ఉండటం మంచిది కాదండయ్యా’ అని ఎవరో ఆయన చెవిలో ఊదినట్లున్నారు. ఆయన వెంటనే రోడ్లు, భవనాల శాఖ అధికారులను పిలిపించి ‘మా కోసం పక్కా వాస్తుతో కొత్త క్యాంపు కార్యాలయం, దాని పక్కనే నివాస భవనం నిర్మించండి’ అని ఆదేశించారు. వెంటనే వారు లెక్కలు వేసి రూ.26 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. కేసీఆర్‌ దాన్ని  ఆమోదించి ‘షురూ జేయుండ్రి’ అనగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తారు. 

వాస్తు నమ్మకం ఒక్క కేసీఆర్‌కే కాదు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకూ ఉంది. అంతకు ముందు ఎన్‌టిఆర్‌కూ ఉంది. ఇంకా అనేకమందికి ఉంది. హైదరాబాద్‌ ఆయన సొంత రాజధాని కాకపోయినా  చంద్రబాబు కూడా  కోట్లు ఖర్చు చేసి వాస్తు మార్పులు చేయించారట...! ఒకవేళ అలాంటి నమ్మకాలు పెద్దగా లేనివారెవరైనా ఉంటే వారి వద్ద మెహర్బానీ కోసం భజనపరులైన నాయకులు, అధికారులు ఉన్నవి లేనివి నూరిపోసి వాస్తు మార్పులు చేయిస్తారు. రాష్ట్రంలోగాని, కేంద్రంలోగాని కొత్త ప్రభుత్వాలు ఏర్పడి మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగానే వారు ముందుగా చేసే పని తమ కార్యాలయాల్లో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయించడం. నెల రోజులు అధికారంలో ఉంటామని తెలిసినవారైనా సరే వాస్తు మార్పులు చేయించాకే ఆఫీసుల్లోకి అడుగు పెడతారు.         

ఇక్కడ ఒకసారి చరిత్రను గుర్తు చేసుకోవాలి. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబుకు క్రూరుడిగా, నియంతగా పేరుంది. కాని నైతిక విలువలున్న వ్యక్తి. ఆయన చక్రవర్తి అయినప్పటికీ తన వ్యక్తిగత అవసరాల కోసం చెప్పులు, టోపీలు కుట్టి డబ్బు సంపాదించేవాడని చరిత్ర చెబుతోంది. అంటే ఆయన ప్రజల సొమ్ముకు ట్రస్టీగా ఉన్నారు. పాలకుడు నైతికంగా ఎలా ఉండాలో ఔరంగజేబును చూసి తెలుసుకోవచ్చు.  ఇక కొన్నేళ్లుగా మీడియా ప్రధానంగా టీవీ ఛానెళ్లు విపరీతంగా విస్తరించడంతో వాస్తు పండితుల పంట పడింది. ఏ ఛానెల్లో చూసినా వాస్తు, జ్యోతిష పండితులే కనిపిస్తున్నారు. ప్రాయోజిత కార్యక్రమాల (పండితులే టీవీ ఛానెళ్లకు డబ్బు కట్టు వారి ప్రోగ్రాములు ప్రసారం చేయించుకోవడం) పేరిట బాగా ప్రచారం చేసుకుంటున్నారు. శాస్త్రమంటే ఎక్కడైనా ఒక్కవిధంగానే ఉండాలి. కాని ఎవరి వాస్తు వారిదే. నాయకులు ఎవరికివారు వారి సొంత ఇళ్లలో వాస్తు పేరుతో మార్పులు చేసుకోవచ్చుగాని ప్రజల డబ్బుతో కట్టే ప్రభుత్వ భవనాలకెందుకు?

ఎం. నాగేందర్ 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?