Advertisement

Advertisement


Home > Articles - Special Articles

లోకేష్ ఆలోచించాల్సిన అసలు సంగతి ఏంటంటే..

లోకేష్ ఆలోచించాల్సిన అసలు సంగతి ఏంటంటే..

ఏపీ ప్రభుత్వంలోని మంత్రి లోకేష్ తన శాఖకు చెందిన అధికార్లతో ఓ సమావేశం నిర్వహించారు. బహిరంగ మలవిసర్జన లేని రాష్ట్రగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత గురించి, బాధ్యత గురించి ఆయన మాట్లాడారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించడం గురించి, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం గురించి సుదీర్ఘంగా తన నిశ్చితాభిప్రాయాలు వెల్లడించారు. యువకుడైన మంత్రి గనుక.. స్కూళ్లలో పిల్లలు, అమ్మాయిలు ఎదుర్కొనే ఇబ్బందులను కూడా పట్టించుకుని ఈ బాత్రూముల నిర్మాణం గురించి శ్రద్ధ పెడుతున్నారని అనుకోవచ్చు. ఇందుకు అభినందించాలి. 

ఇప్పుడు అసలు విషయానికి వద్దాం...

వ్యక్తిగత మరుగుదొడ్ల విషయం పక్కన పెడితే.. స్కూళ్లలో పాత రోజుల్లోలాగా కాకుండా.. చాలా వరకు మరుగుదొడ్ల సదుపాయం ఉంటోంది. స్కూళ్ల విషయానికి వచ్చేసరికి ఇటీవలి కాలంలో వదాన్యులైన పూర్వ విద్యార్థులు ఏదో ఒక మంచి పనికి పూనుకోవడం చాలా చోట్ల జరుగుతోంది. అలాంటి వారికి తమ రోజుల్లో పడిన ఇబ్బందులు గుర్తుకు వస్తూ.. తమ పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించి ఇచ్చేస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఇలా దాతలు నిర్మించి ఇచ్చిన మరుగుదొడ్లు మూడునాలుగు కూడా చిన్న చిన్న సులభ్ కాంప్లెక్సుల్లాగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. 

అయితే అసలు సమస్య ఇక్కడే వస్తోంది. దాతలుగా పేరు కోరుకుంటున్న ప్రతివారూ వచ్చి బాత్రూములు కట్టించేస్తున్నారు. ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్ల  రూపేణా పార్టీ కార్యకర్తలకు పనులు ఇవ్వడానికి నిర్మాణ పనులు చేసేస్తుంది. ఆతర్వాత వాటి మెయింటెనెన్స్ ఎవరు చూడాలి. కనీసం కడగడానికి నీటి సదుపాయం చాలా స్కూళ్లలో లేదు. మరుగుదొడ్లను శుభ్రపరిచే సిబ్బంది కరవు ప్రతిచోటా ఉంది.

మరుగుదొడ్లను నిర్మించేవాళ్లే తప్ప.. వాటికి అవసరమయ్యే నీటి సదుపాయం గురించి గానీ.. ఎప్పటికప్పుడు శుభ్రం చేసే సిబ్బంది నియామకాల గురించి గానీ పట్టించుకునే దిక్కు లేదు. చెప్పుకుంటే సిగ్గు చేటు గానీ.. చాలా స్కూళ్లలో మరుగుదొడ్లను కడిగే దిక్కులేక.. వాటినుంచి వచ్చే దుర్గంధం భరించలేక.. వాడకుండా తలుపులకు తాళాలు వేసి భద్రంగా చూసుకుంటున్నారు.

మరి క్షేత్రస్థాయి ఆచరణలో ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు లోకేష్ ఏదో పైపైనే మరుగుదొడ్ల నిర్మాణం గురించి చెప్పేస్తే సరిపోతుందా? ముందు వాటి శుభ్రత, వాటికి అవసరమయ్యే నీటివనరుల ఏర్పాటు గురించి పాఠశాలలకు ఏమేం చేయగలరో ప్లాన్ చేసుకుని.. తర్వాత బాత్రూముల నిర్మాణం జోలికి  వెళితే.. యువమంత్రి అయినా కాస్త క్రియాశీలంగా ఆలోచించినట్లు ఉంటుందని పలువురు భావిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?