Advertisement

Advertisement


Home > Articles - Special Articles

‘మహాత్ముడికి’ అవమానం తప్పదా?

‘మహాత్ముడికి’ అవమానం తప్పదా?

జాతిపిత మహాత్మాగాంధీ అనే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి ఈ దేశంలో అవమానం జరగబోతున్నదా? మహాత్ముడి స్ఫూర్తి ఈ దేశంలో ఎప్పటికీ సజీవంగా నిలచి ఉంటుందని జాతి యావత్తూ భావిస్తున్న వేళలో.. అసలు మహాత్ముడి మర్యాదకు భంగం వాటిల్లే పరిణామం కొత్తగా చోటు చేసుకోబోతున్నదా? దేశంలోని తటస్థుల్లో, గాంధీ భక్తుల్లో ఇప్పుడు ఇలాంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి.

దేశంలోని రెండో అత్యున్నత పదవి ఉపరాష్ట్రపతి స్థానం కోసం జరుగుతున్న ఎన్నికలో మహాత్మాగాంధీ మనవడు అనే అర్హతతో.. కాంగ్రెస్ కూటమి తరఫున బరిలో తలపడుతున్న గోపాలకృష్ణ గాంధీ ఓటమి పాలైతే గనుక.. ఆ ఓటమి జాతిపిత స్ఫూర్తికి పెద్ద గొడ్డలిపెట్టు అని పలువురు భయపడుతున్నారు. 

ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఆగస్టు 5న జరగాల్సి ఉంది. కాగా, కొన్ని రోజుల కిందట జరిగిన రాష్ట్రపతి ఎన్నిక ఫలితాలు గురువారం వెలువడ్డాయి. పాలకపక్షం ఎన్డీయే కూటమి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఘనవిజయం సాధించారు. నిజానికి కోవింద్ విజయం సాధిస్తారని ముందునుంచి ఊహాగానాలు ఉన్నాయి. కానీ, ఫలితాల అనంతరం గమనిస్తే.. అనుకున్న దానికంటె భారీ వ్యత్యాసంతో ఆయనకు విజయం దక్కింది. రాంనాధ్ కోవింద్ కు 2930 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరచిన మీరాకుమార్ కు కేవలం 1844  ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ వ్యత్యాసం అంత సులువుగా పూడగలిగేది కాదు. 

సరిగ్గా ఈ వివరాలు చూసిన తర్వాత దాదాపుగా ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. రాష్ట్రపతి ఎన్నికలకంటె ఇవి చాలా భిన్నంగా ఉంటాయని అనుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. దాదాపు 1100 ఓట్ల వ్యత్యాసాన్ని కాంగ్రెస్ మద్దతుతు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయిన గోపాలకృష్ణ గాంధీ అధిగమిస్తారని అనుకోవడం భ్రమ. తాను మహాత్మా గాంధీ మనుమడిని అనే ట్రంపు కార్డును ప్రయోగించినా సరే.. ఆయన విజయం అంత సునాయాసం కాకపోవచ్చు. ఆ రకంగా తెలుగువాడైన  ముప్పవరపు వెంకయ్యనాయుడు చేతిలో, గాంధీ మనుమడు ఓడిపోయే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. 

ఇదే జరిగితే.. అది మహాత్ముడి స్ఫూర్తికి విఘాతం కలిగినట్లవుతుందా? చాలా మంది అంటున్నదేంటంటే... ఆ రకంగా భావించే బదులుగా, మహాత్ముడిని కూడా తమ రాజకీయ వక్ర వ్యూహాల్లో ఒక పావుగా వాడుకోదలచుకున్న కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధులకు తగిలిన ఎదురుదెబ్బగా దీనిని పరిగణించాలని! గాంధీ అనే ముసుగును అడ్డు పెట్టుకుని స్వప్రయోజనాలను ఈడేర్చుకోవాలని చూసే వారి వెర్రి మొర్రి పోకడలకు ఇక్కడితో చెక్ పడుతుందని, భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కావని కూడా పలువురు అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?