Advertisement

Advertisement


Home > Articles - Special Articles

కనీసం జగన్ అయినా స్పష్టత ఇస్తారా?

కనీసం జగన్ అయినా స్పష్టత ఇస్తారా?

పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయంటే చాలు.. తెలుగు రాష్ట్రాలకు ఒక కామెడీ ఎపిసోడ్ ప్రారంభం అవుతున్నట్లుగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు ఎవ్వరూ కూడా.. కేంద్రంతో ఘర్షణ వైఖరిని అవలంబించరు. తెలుగురాష్ట్రాల్లో ప్రజల సమస్యలను, వాస్తవంగా కేంద్రం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్న అంశాలను సభలో ప్రస్తావించరు. అలాంటి అంశాల గురించి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ప్రయత్నించరు. పోరాటగళాన్ని వినిపించరు.

ఏదో తూతూమంత్రం సామెత చందంగా.. సభలో తమకంటూ మాట్లాడే సమయం వచ్చినప్పుడు.. రాష్ట్ర సమస్యల గురించి నాలుగు ముక్కలు వల్లించడం, పార్లమెంటు లాబీల్లో, చాంబర్లలో కేంద్ర మంత్రుల్ని కలిసి తమ సొంత ఆబ్లిగేషన్లు నివేదించుకుని... రాష్ట్రాన్ని ఉద్ధరించేయడానికి మంత్రితో  భేటీ అయ్యాం అంటూ ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం మాత్రమే జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలక ప్రతిపక్షాలుగా ఉన్న అన్ని పార్టీలూ మోదీ అనుకూలతతోనే అంటకాగుతుండడం విశేషం.

తెలుగుదేశం ఏకంగా ఎన్డీయే భాగస్వామి కాగా, తెరాస దాదాపు అంతే పాత్రను పోషిస్తున్నది. తెలంగాణ ప్రతిపక్షాల్లో కాంగ్రెస్ ఒక్కటే పార్లమెంటులో మాట్లాడేది. కానీ.. వారికి బలం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ కూడా మిత్రపక్షం అన్న తీరులోనే తమ దారి మార్చుకుంటున్నది. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు మొదలవుతున్నాయి, తమ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయడానికి నేతలు సన్నాహక సమావేశాలు పెడుతున్నారనే వార్తలకు విలువ లేకుండా పోతున్నది. 

ఇటీవలే చంద్రబాబునాయుడు తెదేపా ఎంపీలతో ఇలాంటి మీటింగు పెట్టి, కేంద్రంపై ఏయే అంశాల్లో ఒత్తిడి తేవాలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. వాస్తవంగా రాష్ట్రం ముందడుగు వేయడానికి ఉపయోగపడే అంశాల మీద గట్టిగా నిలదీయడం గురించి అందులో ఒక్క ముక్క లేదు. ఇప్పుడు విపక్షనేత జగన్మోహన రెడ్డి కూడా పార్లమెంటు సమావేశాలకు ముందస్తుగా తన పార్టీ ఎంపీలను సిద్ధం చేయడానికి మీటింగు పెట్టుకుంటున్నారు. పార్లమెంటు సమావేశాలు ఈనెల  17న మొదలు కాబోతున్నాయి. 

కనీసం జగన్ అయినా తన దళానికి స్పష్టత ఇస్తారా లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడం... జగన్ మీద అనేక సందేహాలకు తావిచ్చింది. కనీసం ఆ సందేహాలకు విలువలేకుండా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఒక మంచి అవకాశం అని ఆయన తెలుసుకోవాలి.

ప్రత్యేక హోదా డిమాండును తాము ఇంకా పక్కన పెట్టలేదని జగన్ మొన్న ప్లీనరీ వేదికపైనుంచి కూడా నిరూపించుకున్నారు. అదే డిమాండును తమ పార్టీ ఎంపీలతో ఆయన మళ్లీ పార్లమెంటులో వినిపింపజేయాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇచ్చినంత మాత్రాన తాము మోడీ సర్కారుకు లోబడి నట్లు కాదని ఆయన నిరూపించుకోవాలి. అందుకు తమ పార్టీ ఎంపీలకు శస్త్రాస్త్రాలను, వ్యూహాలను తానే సిద్ధం చేసి పంపాలి.

రాష్ట్రప్రయోజనాల విషయంలో ఎటూ తెలుగుదేశం స్పష్టంగా అడగలేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కనీసం తమ పార్టీ ఎంపీలైనా పార్లమెంటులో గట్టిగా వ్యవహరించగలిగితే ప్రజల్లో గుర్తింపు వస్తుందని ఆయన తెలుసుకోవాలి. శనివారం సాయంత్రం జగన్ వైకాపా పార్లమెంటరీ పార్టీతో భేటీ అవుతున్నారు. ఆయన ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా ఉంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?