Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఏమిటీ లింకు? - ‘కష్టాల’ సినిమా కహానీ

ఏమిటీ లింకు? - ‘కష్టాల’ సినిమా కహానీ

కోటి రూపాయిలకు నెలకు అయిదు లక్షల వడ్డీ... 

తెలుగు సినిమాలో పెద్ద నిర్మాతలు క్రమ క్రమంగా కనుమరుగ వుతున్నారు. మిడిల్‌ రేంజ్‌ నిర్మాతలు ఇప్పుడు ముందు వరుసలోకి వచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే, కొన్నాళ్లకు నిర్మాతలను వెదు క్కోవాల్సిన పరిస్థితి. కర్ణాటకలో రాను రాను పంపిణీ దారులు ఇలాగే తగ్గిపోయారు. సినిమాలు స్వంతంగా విడుదల చేసుకోవాల్సి వస్తోంది. ఇక్కడ కూడా ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది. సినిమా బడ్జెట్‌ అలవి కాకుండా పెరిగిపోవడం, పెరిగిన మేరకు అమ్ముడు కాకపోవడంతో, ఆఖరికి తెగించి స్వంతంగా విడుదల చేసి, ఆ కాస్తా కూడా రాకుండా బొక్కబోర్లా పడిన నిర్మాతల సంఖ్య కాస్త ఎక్కువగానే వుంది.

తెలుగు సినిమా అన్నాక కనీసంలో కనీసం కోటిరూపాయిల నుంచి ఇరవై కోట్ల వరకు అప్పుతేవాలి. అంటే నెలకు అయిదు లక్షల నుంచి కోటి రూపాయిల వరకు వడ్డీ కట్టాలి. సినిమా అన్నాక కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది,. చిన్న సినిమా అయితే ముఫై లక్షలు వడ్డీకే.. పెద్ద సినిమా అయితే పది పన్నెండు కోట్లు వడ్డీకే..
సినిమా ఎవరి కోసం తీస్తున్నట్లు? ప్రేక్షకులను రంజింప చేయడానికా? హీరోలు, దర్శకులను పెంచి పోషించడానికా? ఫైనాన్షియర్ల జేబులు నింపేందుకా?

అశ్వనీదత్‌ సినిమా తీసి ఎన్నాళ్లయింది. సురేష్‌ బ్యానర్‌పై సిని మాలు ఎందుకు తగ్గిపొయాయి. ఎమ్‌ఎస్‌ రాజు ఏమయ్యారు? బోగవల్లి ప్రసాద్‌ అత్తారింటికి దారేది తరువాత నాగ చైతన్యతో సినిమా తీయడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? బండ్ల గణేష్‌ రెండు పెద్ద సినిమాలు ఒకేసారి తీసి, మూడో సినిమాకు మూడు చెరువుల నీళ్లు ఎందుకు తాగాల్సి వచ్చింది. దిల్‌రాజు రెండు భారీ ప్రాజెక్టులు తలకెత్తుకుని, ఇప్పుడు ఇదిగో సినిమా..అదిగో సినిమా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవిఎమ్‌ వారు తెలుగులో లీడర్‌ సినిమా తీసిన తరువాత మరి ఇటు ఎందుకు రావడం మానేసారు. ఆర్‌బి చౌదరి జాడేది? మంచువారి సినిమాలకు కామా ఎందుకు పడిరది. చక చకా సినిమాలు తీసి.,.పంపిణీ ప్రారంభించిన ఆర్‌ఆర్‌ మూవీస్‌ ఇప్పుడు ఎక్కడ వుంది. ఆ సంస్థ అధినేత వెంకట్‌ ఎక్కడున్నారు? ఇలా రాసుకుంటూ పోతే..ఎందరో..ఎందరో?   వీళ్లే కాదు..గడచిన పదేళ్లలో ఎంత మంది ప్రొడ్యూసర్లు తెలుగు సినిమాకు దూరమయ్యారన్నది లెక్క తీస్తే..గుండెలు బాదుకునే పరిస్థితి.. 

అసలేం జరుగుతోంది..ఎక్కడుంది సమస్య? 

తెలుగు సినిమా ఇప్పుడు లెక్కల మీద నడుస్తోంది.. డబ్బుల మీద నడుస్తోంది..ఎక్కువ ఖర్చు..ఎక్కువ థియేటర్లు..ఎక్కువ రాబడి అనే సూత్రాన్ని ఎంచుకుంది. ఇది పక్కా లాటరీ వ్యవ హారంగా మారిపోయింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా వస్తే వారంలో డబ్బులు వచ్చేయాలి లేకుంటే లేదు...

సినిమా ఓపెనింగ్‌ కలెక్షన్లు చాలా చిత్రంగా మారిపోయాయి. సినిమాను బట్టి, హీరో స్టామినాను బట్టి, పబ్లిసిటీ హైప్‌ను బట్టి ఓపెనింగ్స్‌ వుంటున్నాయి. ఆ తరువాత వారం మాత్రం గాల్లో దీపమే. మౌత్‌ టాక్‌ బాగుంటే ఓకె. లేదంటే లేదు. దీంతో ఆ ఒక్కవారం కలెక్షన్ల కోసం సినిమాను అంత ఎత్తున నిల్చోపెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం కోసం కోట్లు కిందా మీదా చూడకుండా ప్రయత్నిస్తున్నారు.

‘సినిమా నిర్మాణానికి దిగినపుడు అంతా మన చేతుల్లోనే వున్నట్ల వుంటుంది..తీరా..మొదలెట్టాక..తెలుస్తుంది..మన చేతుల్లో ఏమీ లేదని..’ ఈ మాటలు అన్నది ఓ కొత్త నిర్మాత. మూడు కోట్లతో సినిమా అయిపోతుందనుకుంటే ఆరు కోట్లకు వ్యయం డేకేసింది.. పోనీ లాభం వచ్చినా అది కాస్తా వడ్డీలకే పోతుంది.. ఎందుకిలా?

కర్ణుడి చావుకు సవాలక్ష శాపాలు కారణం అన్నట్లు, తెలుగు నిర్మాత ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారడానికి సవాలక్ష కారణాలున్నాయా? అన్నింటికన్నా కీలకకారణం తెలుగు సినిమాను అలా అలా పెంచుకుంటూ పోతున్నారు. ప్రేక్షకులకు మెల మెల్లగా పెద్ద సినిమాలు మాత్రమే చూడడం, చిన్న సినిమాలు అంటే టీవీలో ఇచ్చే వరకు వేచి వుండడం అన్న ధోరణి అలవాటు పడేలా చేసేసారు. సినిమాకు ఫ్యామిలీతో వెళ్లాలంటే అయిదు వందల నుంచి వెయ్యి రూపాయిల వరకు ఖర్చయ్యే పరిస్థితిని పరిశ్రమే తెచ్చి పెట్టింది. ప్రభుత్వం దగ్గర తమ పలుకుబడి అంతా ఉప యోగించి, టికెట్‌ ధరలు పెంచేలా చేసింది. ఆ ధరలతో తొలివా రంలోనే తమ డబ్బులు వస్తే చాలు అనుకున్నారు. చిన్న సినిమాలు గాలికిపోయినా ఫరవాలేదనుకున్నారు. కానీ మళ్లీ ఇది కూడా వికటించింది. భారీ సినిమాకు భారీ కలెక్షన్లు చూసి, ఇది వాపు కాదు బలుపే అనుకుని, మరింత ఖర్చు చేసే స్థితికి చేరిపోయారు. ఇప్పుడు ఆ కలెక్షన్లు కూడా చాలడం లేదు. ఆటోనగర్‌ సూర్య లాంటి భారీ సినిమాకు తొలివారం కలెక్షన్లు ఏ మూలకూ లేవు. 

ప్రేక్షకుడి సంగతి అలా వుంచితే, సినిమా విడుదలైన రెండు నెలల లోపే టీవీలో ప్రత్యక్షమవుతోంది. ఇప్పుడంటే మారుమూల పల్లెల్లో కూడా కొత్త సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ కొన్నేళ్ల క్రితం వరకు ఈ చిన్న ఊళ్లలో సినిమా రావాలంటే విడుదలైన కొన్నివారాలు ఆగాల్సి వచ్చేది. అది ఎలాగూ అలవాటే చాలా మంది ప్రేక్షకులకు. అందుకే టీవీలో వస్తుంది కదా చూద్దాం అనే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు పైరసీ వుండనే వుంది. మనం లాంటి పెద్ద సినిమా విడుదలైన నాలుగు వారాలకు ఒరిజినల్‌ ప్రింట్‌ మార్కెట్‌లో ప్రత్యక్షమైపోయింది. అదే లేకుంటే మనం కలెక్షన్లు మరికాస్త ముందుకు వెళ్లి వుండేవి. 

ఇదంతా నిర్మాతలకు అలవికాని వైపు సంగతి. ఇక నిర్మాతల వైనం కూడా వుండనే వుంది. 

కాంబినేషన్‌ కష్టాలు

ఏ కాంబినేషన్‌లో ఏ సినిమా వుంటుందో అలవి కాని స్థితి. నిర్మాత రెడీగా వుంటున్నాడు. ఫలానా దర్శకుడు మాంచి హిట్‌ ఇచ్చాడని తెలియగానే నీ తరువాతి సినిమా నాకే..అంటూ లక్షలు తీసుకెళ్లి అడ్వాన్స్‌గా ఇస్తున్నాడు. దర్శకుడు హ్యాపీగా తీసుకుం టున్నాడు. ఇలా ఒక్క దర్శకుడితో ఆగడం లేదు. ఒకే నిర్మాత ఇద్దరు ముగ్గురు దర్శకులకు అడ్వాన్స్‌లు ఇస్తున్నాడు. ఒకే దర్శ కుడు నలుగురైదుగురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు పట్టేస్తున్నాడు. 

ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. నిర్మాత.. హీరోల చుట్టూ తిరగడం. తను అడ్వాన్స్‌లు ఇచ్చిన దర్శకుల పేర్లు ఏకరవు పెట్టడం. వారు కరుణిస్తే, వీళ్లను తీసుకెళ్లి వాళ్లకు కథలు, లైన్లు చెప్పించడం. వారికి నచ్చితే ఓకె. లేదంటే లేదు. మరో హీరో.. మరో ట్రయిల్‌. ఇక్కడ హీరోలు కూడా తెలివిగా ప్రవర్తిస్తు న్నారు. ఎవరికీ నేరుగా నో చెప్పడం లేదు. లైన్లో పెట్టి వుంచుకుంటున్నారు. అలాగే చేద్దాం..లైన్‌ విందాం..బాగానే వుంది.. కొంచెం మాడిఫై చేయాలి..చేతిలో వున్న సినిమా అయి పోనీ.. నీ సినిమానే..ఇలా రకరకాల కారణాలు చెప్పి, నిర్మాతలను, దర్శకులను వెయిటింగ్‌లో వుంచుతున్నారు. దీంతో ఇలా ఇచ్చిన అడ్వాన్స్‌లు, ఆఫీసు నిర్వహణ. అన్నీ కలిపి తడిసి మోపెడవుతు న్నాయి. 

హిట్‌ సినిమాలు ఇచ్చిన బోయపాటి శ్రీను, మారుతి, హరీష్‌ శంకర్‌, తదితరుల దగ్గర ఒకటికి మించిన అడ్వాన్స్‌లు వున్నాయి. వీళ్లందరికీ కాంబినేషన్లు సెట్‌ కావాలి..కథలు ఓకే కావాలి.. అప్పుడు కానీ ఆ అడ్వాన్స్‌లు ఇచ్చిన నిర్మాతల సినిమాలు పట్టాలకు ఎక్కవు. 

కాంబినేషన్లు..

సినిమాలకు హీరో..దర్శకుల కాంబినేషన్లే కాదు. బంగారు పళ్లా నికైనా గోడ చేర్పు అన్నట్లుగా, సినిమాకు సినిమా దన్నుగా నిల వాల్సిన పరిస్థితి ఏర్పడిరది. సినిమా కోసం చేసిన అప్పులు అన్నీ తీర్చి, నో డ్యూ..నో అబ్జెక్షన్‌ లెటర్‌ తెస్తే కానీ ల్యాబ్‌ నుంచి ప్రింట్‌ బయటకు రాదు. కానీ అదే పెద్ద ప్రొడ్యూసర్‌ అయితే ఓ సినిమా సెట్‌పై వుండగానే మరో సినిమాను ప్రకటిస్తాడు. వీలైతే కొబ్బరికాయ కొట్టి వదిలేస్తారు..ఇంకా కాదంటే, ఓ వారం రోజులు షెడ్యూలు చేస్తారు. ఆ సినిమాను చూపించి చేతిలో వున్న సిని మాకు అప్పులు తేవడం, లేదా ల్యాబ్‌ నుంచి బయటకు సులువుగా తేవడం వంటివి సాధిస్తుంటారు. హీరో..డైరక్టర్‌ కాంబినేషన్‌ చెప్పి, అప్పులు పుట్టించుకుని, ఆపై సినిమాకు తెరతీయడం లేదా చేతిలో వున్న సినిమాను పూర్తి చేయడం అలవాటైపోయింది. దిల్‌రాజు రామయ్యా వస్తావయ్యా.. ఎవడు... బండ్ల గణేష్‌ బాద్‌ షా.. ఇద్దర మ్మాయిలతో.., అనిల్‌ సుంకర అండ్‌ కో మహేష్‌తో తీస్తున్న వరుస సినిమాలు, అన్నీ ఇలాంటి వ్యవహారాలే అని టాలీవుడ్‌ జనాలు అంటుంటారు. 

ఈ భారీ నిర్మాతలను పక్కన పెడితే పాపం ఒక్క సినిమాతో కుదేలైపోయి..టాలీవుడ్‌ వదిలి పారిపోతున్న నిర్మాతలు ఎందరో వున్నారు. లడ్డూబాబు అనే సినిమాను రచయిత మహారథి వారసులు అమెరికా నుంచి వచ్చి మరీ నిర్మించి మో చేతుల వరకు కాల్చుకున్నారు. ఆర్‌ఆర్‌ మూవీస్‌ సంస్థ అన్ని హిట్‌ సినిమాలు తీసి, చివరి రెండు సినిమాలతో కుదేలైపోయి, ఆఖరికి బోర్డు తిప్పేసింది. 

మరో రకం నిర్మాతలు

సినిమా అన్నది పూర్తిగా వ్యాపారమైపోయింది. అరవై డెభై లక్షల్లో కొత్త వారితో సినిమా తీయడం.. దాన్ని శాటిలైట్‌ యాభై లక్షలకు అమ్మడం.. విడుదల చేసి, మిగిలిన డబ్బులు రాబట్టు కోవడంఅన్నది కొందరి సూత్రమై  కూర్చుంది. కొందరు నిర్మాతలు వున్నారు. అందిన అందరి దగ్గర తలా పది లక్షలు తీసుకుని సినిమా తీయడం.. ఏదో విధంగా కొన్ని ఏరియాలు అమ్మి, రెండు రూపాయిలో, మూడు రూపాయిలో వడ్డీతో తిరిగి ఇచ్చి సినిమా విడుదల చేసుకోవడం. వస్తే వస్తాయి..లేకుంటే తాము తమ వంతు పెట్టిన పదీ ఇరవై పోతాయి. అయినా వెనుకాడరు మళ్లీ మరో సినిమా తీస్తారు.. ఈ సినీ మాయ అలాంటిది. 

మరో పక్క హీరోలను బట్టి  ఖర్చు, మార్కెట్‌ అన్న అంచనాలు ఫిక్సయిపోయాయి. సునీల్‌, విష్ణు, మనోజ్‌, అల్లరి నరేష్‌, ఇలాంటి వారి సినిమాలు అంటే అయిదారు కోట్లకు మించకూడదు అన్న లెక్కలు వచ్చాయి.. నాగ్‌, వెంకీ సినిమాలైతే, పది కోట్ల వరకు ఓకె.. ఫస్ట్‌ లైన్‌లో వున్న యంగ్‌ హీరోలయితే 20 కోట్ల వరకు సేఫ్‌ అన్న లెక్కలు ఏర్పడ్డాయి. కానీ చిత్రంగా ఈ లెక్కలేవీ సినిమా ప్రారంభమయ్యాక వుండడం లేదు. అయిదారు అంటే పదికి డేకే స్తున్నాయి. 20 అనుకుంటే ముఫైకి వెళ్లిపోతున్నాయి. సినిమా హిట్‌ అయితే ఓకె. నాగ్‌ సినిమా మనం 37 దాకా వసూలు చేసిం ది. బాలకృష్ణ లెజెండ్‌ 42 దాకా వసూలు చేసింది. కానీ ఇవన్నీ అద్భుతాలు. అస్తమాటూ జరగవు. అదే వెంకీ దృశ్యం అయితే బెటర్‌ తక్కువలో చేసుకుని, ఎక్కువ వసూళ్లు సాధించింది. పది హేను నుంచి 20 వరకు వసూళ్లు సాగిస్తుందని అంచనా వుంది. అదే ఎప్పుడూ వెంకీతో చేసినట్లు 10 నుంచి 15 ఖర్చుచేసివుంటే పరిస్థితి ఏమిటి?

కానీ నిర్మాతలు ఆలోచించడం లేదు. చేతిలో డబ్బులు వున్న పుడు, అప్పు పుట్టే అవకాశం వున్నపుడు ఎంతకయినా వెళ్లిపో తున్నారు. శర్వానంద్‌ మార్కెట్‌ చూడకుండానే రన్‌ రాజా రన్‌కు ఏడు దాటి ఖర్చు చేసారని వినికిడి. వస్తుందా అన్నది వారికే తెలి యాలి. ఇలా ఎవరికి వారు రకరకాల కారణాలతో ఖర్చు చేస్తుంటే, ఇంత ఇస్తేనే చేస్తాం అని హీరోలు భీష్మించుకు కూర్చోవడం కూడా నిర్మాతలకు కీడు చేస్తోంది. సునీల్‌తో చిన్న సినిమా అయిదు కోట్లతో తీయాలి అంటే వీలు కాదు. అతగాడికే మూడు కోట్లు ఇవ్వాలి. కనీసం మరో నాలుగయిదు సినిమాకు పెట్టాలి. సునీల్‌తో తీయాలనుకున్న ప్రాజెక్టులు రెండు మూడు ఇలాగే పెండిరగ్‌లో పడ్డాయి. సుందరపాండ్యన్‌ హక్కులు తీసుకుని ఏడాది దాటిపో యింది. చేయలేకపోతున్నారు. లెక్కలు వేసుకుంటే పన్నెండు వరకు అవుతొంది. సునీల్‌పై పన్నెండు ఖర్చంటే నిర్మాత వెనుకంజ వేస్తున్నారు. హక్కుల కోసం పెట్టిన పెట్టుబడికి వడ్డీ లెక్కేసుకుంటే, ఇంకా నష్టమే. 

పబ్ల్లిసిటీ భారం

నిర్మాతలకు అన్నీ కష్టాలే..పబ్లిసిటీ కూడా భయంకరంగా పెరిగి పోయింది. అది లేకుండా సినిమాకు ఓపెనింగ్స్‌ రావడం లేదు. ఇటీవల ఊహలు గుసగుసలాడే సినిమాకు కోటిన్నర వరకు ప్రచా రానికే ఖర్చు చేసారు. రన్‌ రాజా రన్‌కూ అదే పరిస్థితి. బెల్లంకొండ సురేష్‌ తన కుమారుడి సినిమా అల్లుడుశ్రీనుకు ఏకంగా ఏడు కోట్ల వరకు ప్రచారానికే ఖర్చు చేసారట. ఇలా ప్రచారం అలవాటైపోతే, జనాలకు చిన్న సినిమాల ప్రచారం ఏమేరకు ఆనుతుంది? ఇక ఆ సినిమాలకు ఓపెనింగ్స్‌ ఎలా? ఇలా పెంచుకుంటూ పోతూ, అల వాటు చేయడం అన్ని సార్లూ సాధ్యమా? ఈ భారీతనం అనే బుడగ పేలిపోతే..సినిమా పరిశ్రమ పరిస్థితి ఏమిటో? ఇలా నిర్మాతలు ఒక్కొక్కరుగా తెరమరుగు అవుతుంటే, పరిశ్రమ పరిస్థితి ఏమిటొ?

ఇప్పటికీ కథ ఇంతే.. మిగతా ఆర్జీవీలా రెండో భాగం అంటూ వుంటే అందులో తెలియాలి.

-‘చిత్ర’గుప్త

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?