Advertisement

Advertisement


Home > Articles - Special Articles

ఎన్ని ప్రపంచ సభలు జరిపినా ఏం లాభం?

ఈమధ్య విజయవాడలో మూడో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరిగాయి. ఇవి  ప్రపంచ తెలుగు రచయితల  మహా సభలైనా ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితమయ్యాయి. తెలంగాణలో మీడియా ఈ మహా సభలను అసలు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎక్కువగా ప్రచురిస్తున్న ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు ఈ మహా సభలను కవర్ చేశాయి. తెలంగాణ నుంచి ఎంత మంది రచయితలు హాజరయ్యారో తెలియదు. అసలు ఎన్ని దేశాల నుంచి ఎంతమంది రచయితలు వచ్చారో తెలియదు.. ఇవి ప్రపంచ తెలుగు మహా సభలు కావు. ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు. ఆ సభలకు, ఈ సభలకు తేడా ఉంది. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా మొట్టమొదటిసారి హైదరాబాదులో ప్రపంచ తెలుగు మహా సభలు జరిగాయి. తెలుగు భాషాభిమానులకు గుర్తున్న, వారు గుర్తుంచుకున్న ప్రపంచ తెలుగు మహా సభలు ఇవే. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆ సభలు అత్యంత వైభవంగా జరిగాయి. అప్పట్లో జలగం మంత్రివర్గంలో విద్యా మంత్రిగా ఉన్న మండలి వెంకట కృష్ణారావు (ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఉన్న మండలి బుద్ధప్రసాద్ తండ్రి) ఈ మహా సభలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత మరో మూడు మహా సభలు విదేశాల్లో జరిగాయి. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో నాలుగో ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించారు. మొన్న విజయవాడలో నిర్వహించినవి మూడో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు.

యధావిధిగా ఈ మహా సభల్లోనూ తెలుగు భాష గొప్పతనం గురించి వక్తలు వివరించారు. తెలుగు భాష సొగసును, అందాన్ని గురించి వర్ణించారు. ‘లేదురా ఇటువంటి భాష’ అంటూ ప్రశంసలు కురిపించారు. తెలుగు భాషా పరిరక్షణ గురించి గొప్పగా చెప్పారు. దీన్ని అందరం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఏ సభలోనైనా ఇదంతా సాధారణమే. ఎన్ని ప్రపంచ తెలుగు మహా సభలు, రచయితల సభలు జరిగినా తెలుగుకు ఒరిగేది ఏమైనా ఉందా? అని ప్రశ్నించుకుంటే శూన్యమనే చెప్పొచ్చు. భాషాభిమానుల ప్రసంగాలు కంఠశోష, అరణ్య రోదన తప్ప మరేమీ కాదు. అంతరించిపోతున్న భాషల సరసన తెలుగు కూడా చేరే ప్రమాదం పొంచి ఉందని భాషా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా తెలుగు ప్రజలు బాధపడరు. దాన్ని అంతరింపచేసేందుకు యధాశక్తి కృషి చేస్తూనే ఉన్నారు. పొట్ట నింపుకోవడానికి అంటే ఉద్యోగాలు సాధించుకోవడానికి తెలుగు పనికిరాదు అని తేలిపోయింది కాబట్టి అది అంతరించినా, ఉన్నా ఒక్కటే అనే భావన ఉంది. ఏ భాష నేర్చుకుంటే లేదా ఏ భాషలో విద్యాభ్యాసం చేస్తే ఉద్యోగాలు దొరుకుతాయో ఆ భాష నేర్చుకోవడమే ప్రధానం అనే అభిప్రాయం ఉంది. దీన్ని కూడా కాదనలేం. 

వందేళ్ల పైబడిన గురజాడ అప్పారావుగారి   ‘కన్యాశుల్కం’ నాటకం చదవండి. తెలుగువారి ఇంగ్లీషు భాషా మోజు ఎలా ఉందో అర్థమవుతుంది. వాస్తవం చెప్పాలంటే ఉపాధికి తెలుగు ఏనాడూ పనికిరాలేదు. స్వాతంత్య్రానికి ముందు బ్రిటిషు ఇండియాలో ఉన్న తెలుగు ప్రాంతాల్లోని ప్రజలు ఇంగ్లీషు చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. నిజాం రాష్ర్టంలోని ప్రజలు ఉర్దూ చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఆ రోజుల్లో తెలుగు చదువుకున్నవారు చేసిన ఉద్యోగాల్లో ఎక్కువభాగం బడి పంతులు ఉద్యోగాలే. ఇప్పుడు అవి కూడా రావడంలేదు. నిజాం రాజ్యంలో తెలుగులో నిష్ణాతులైనవారంతా స్వశక్తితో పాండిత్యం సాధించినవారే. మహా కవులు డాక్టర్ సి.నారాయణ రెడ్డి డిగ్రీ వరకు ఉర్దూ మాధ్యమంలో చదువుకొని ఆ తరువాత తెలుగుపై పట్టు సాధించారు. దాశరథి కూడా ఇలాగే. కొన్ని పండిత కుటుంబాల్లో పెద్దలు పిల్లల మీద సంస్కృతాన్ని రుద్దారు. అలాంటివారి ఇళ్లలో చాటుమాటుగా తెలుగు పుస్తకాలు చదువుకునేవారు. కొందరు తెలుగు ప్రముఖుల ఆత్మకథలు చదివితే అప్పటి విద్యావిధానం తీరుతెన్నులు, తెలుగు భాష దుర్భర స్థితి అర్థమవుతాయి. తెలుగు ప్రాంతాల్లో విద్యాపరంగా తెలుగుకు ఉన్న ఆదరణ అంతంతమాత్రమే. ప్రపంచీకరణ ఉధృతమైన తరువాత తెలుగు మాధ్యమంలో చదువుకోవడమంటే ఆత్మహత్య చేసుకున్నట్లేనని భావిస్తున్నారు.

తెలుగు మీడియంలో చదువుతున్నామని చెప్పకోవడానికి పిల్లలు, తల్లిదండ్రులు కూడా నామోషీ పడుతున్నారు. ‘మా పిల్లలకు తెలుగు రాదు’ అని చెప్పుకోవడం తల్లిదండ్రులకు సంతోషం కలిగిస్తోంది. ఎల్‌కేజీలోనే తమ పిల్లలు ఆంగ్లాన్ని రుబ్బుకొని తాగాలని అనుకుంటున్నారు. ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో పిల్లలు తెలుగులో మాట్లాడితే టీచర్లు చావబాదుతున్న సంఘటనలు అప్పుడప్పుడు  పత్రికల్లో కనబడుతున్నాయి. ‘భాష మీదా దాడిజేస్తిరి....బతుకు మీదా దాడి జేస్తిరి’ అని ఓ కవి తన పాటలో రాశారు. ఈ దాడి చేసేది ఎవరు? ప్రపంచీకరణ, సామ్రాజ్యవాదం. గ్లోబలైజేషన్ కులవృత్తులను, కుటీర పరిశ్రమలను, సంస్కృతిని, సంప్రదాయాలను నాశనం 
చేసింది. కుటుంబ బంధాలను విచ్ఛిన్నం చేసింది. అనురాగాలను, ఆప్యాయతలను నాశనం చేసింది. ఇన్ని జరుగుతున్నప్పుడు మాతృ భాషలు లేదా ప్రాంతీయ భాషలు ఎలా మనుగడ సాగిస్తాయి? తెలుగు మాధ్యమాన్ని క్రమంగా ఎత్తేయాలని ప్రభుత్వాలే ప్రయత్నాలు చేస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్ల ధాటికి సర్కారు బడులు మూతపడుతున్నాయి. కారణం సర్కారు బడుల్లో తెలుగు మాధ్యమంలో బోధన జరగడమే. ఈ బడులు మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా ఇంగ్లీషు మీడియంలో బోధన సాగాలి. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న పని ఇదే. కార్పొరేట్ స్కూళ్లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు విద్యను ప్రయివేటీకరించే దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. కూటికి గతిలేని పేదలు కూడా ఇంగ్లీషు మాధ్యమంలో చదవాల్సిందే. లేకపోతే వారికి కూలి పని కూడా దొరికే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఎన్ని ప్రపంచ తెలుగు మహా సభలు నిర్వహించినా సామాన్యులకు ఒరిగేది ఏమీ లేదు. 

సునయన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?