Advertisement

Advertisement


Home > Movies - Interviews

హరీష్‌ శంకర్‌ - సాయిధరమ్‌ తేజ్‌ ఇంటర్వ్యూ

హరీష్‌ శంకర్‌ - సాయిధరమ్‌ తేజ్‌ ఇంటర్వ్యూ

'గబ్బర్‌సింగ్‌'తో పవన్‌కళ్యాణ్‌ అభిమానుల పదకొండేళ్ల కలని తీర్చిన దర్శకుడిగా ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిన హరీష్‌ శంకర్‌ 'రామయ్యా వస్తావయ్యా' విషయంలో అదే మ్యాజిక్‌ రిపీట్‌ చేయడంలో విఫలమయ్యాడు. ఆ పరాజయంతో దర్శకుడిగా పాఠాలు నేర్చుకున్నానని చెబుతోన్న హరీష్‌ శంకర్‌ ఈసారి తనని నడిపించిన కథ, పాత్రలతో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' రెడీ చేశాడు. చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ల మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ని సుబ్రమణ్యంగా తీర్చిదిద్దిన హరీష్‌ శంకర్‌ అతడిలో ఫ్యూచర్‌ స్టార్‌ ఉన్నాడని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. మూడో సినిమాకే ఒక హాట్‌ షాట్‌ దర్శకుడితో పని చేసే అవకాశం దక్కినందుకు లక్కీగా ఫీలవుతోన్న సాయి ధరమ్‌ తేజ్‌ తన మేనమామలు సెట్‌ చేసిన స్టాండర్డ్స్‌కి తగ్గ విధంగా రాణించాలని ఆశిస్తున్నాడు. ఈ నెల 24న రిలీజ్‌కి రెడీ అవుతోన్న 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చిత్రం గురించి, ఇతర విశేషాల గురించి ఆ సినిమా డైరెక్టర్‌ అండ్‌ హీరో ద్వయం గ్రేట్‌ఆంధ్ర చేసిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో చూడండిక...

పవన్‌కళ్యాణ్‌, ఎన్టీఆర్‌.. ఇలా స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన తర్వాత సాయిధరమ్‌తేజ్‌ లాంటి యంగ్‌ హీరోతో 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' చేయడానికి కారణం?

హరీష్‌: ఈ 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' కథ స్టార్‌ హీరోలకైతే బాగోదు. ఇది ఒక యంగ్‌ లవ్‌స్టోరీ. యుఎస్‌లో ఎంఎస్‌ చేయడానికి వెళ్లే ఒక కుర్రాడి కథ. స్టార్‌ హీరోలకి సూట్‌ అయ్యే కథ కాకపోవడంతో దీనిని తేజ్‌తో చేయడం జరిగింది. 

'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాపవడం వల్ల మీకు పెద్ద స్టార్స్‌ డేట్స్‌ దొరక్క, తేజ్‌తో ఈ సినిమా చేశారని రూమర్స్‌ వచ్చాయి.

హరీష్‌: రూమర్స్‌ కాదు నిజమే. ఇప్పుడు నేను కథ చెప్పాలనుకుంటే సక్సెస్‌లో వున్న హీరోలే కావాలనుకుంటాను కదా. ఫెయిల్యూర్స్‌లో వున్న హీరోలతో సినిమాలు తీయలేం. ఎందుకు తియ్యలేమంటే, వాళ్ల టాలెంట్‌ సమస్య కాదు. ఆ టైమ్‌లో వాళ్లకి మార్కెట్‌ సరిగ్గా వుండదు కాబట్టి, సినిమా అనుకున్నది అనుకున్నట్టుగా తియ్యడానికి బడ్జెట్‌ సపోర్ట్‌ చేయదు. అలాగే నేనైనా అంతే. గబ్బర్‌సింగ్‌ సక్సెస్‌ అయినప్పుడు నెత్తి మీద పెట్టుకున్నారు, రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌ అయినప్పుడు నేలకేసి కొట్టారు. సో, సక్సెస్‌ ఎంజాయ్‌ చేశాను, ఫెయిల్యూర్‌ కూడా యాక్సెప్ట్‌ చేశాను. నాకు ఫెయిల్యూర్‌ కొత్తేమీ కాదు. షాక్‌తో ఫెయిల్యూర్‌ చూసి వచ్చాను కాబట్టి దానికి నేను భయపడను. అందుకే 'రామయ్యా వస్తావయ్యా' ఫెయిల్యూర్‌కి నాదే రెస్పాన్సిబులిటీ అని కూడా చెప్పాను. రామయ్యా వస్తావయ్యా తర్వాత కొంత మంది పెద్ద హీరోలు నాతో చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. నేను వాళ్లని తప్పు కూడా పట్టను. మే బీ సరిగ్గా చేయట్లేదు, కాన్సన్‌ట్రేట్‌ చేయట్లేదు, కొంచెం ట్రాక్‌ తప్పి వుంటాడు.. ఇలా వాళ్ల ఆలోచనలు, వాళ్ల అనుమానాలు వాళ్లకి ఉంటాయి. కాంబినేషన్‌ పరంగా జరిగే బిజినెస్‌, ఫ్లాప్‌ డైరెక్టర్‌తో చేస్తే మారే ఈక్వేషన్‌.. ఇలా చాలా ఉంటాయి. ఇండస్ట్రీ అనేది సక్సెస్‌ ప్రాతిపదికన నడుస్తుందని నమ్ముతాను నేను. కొంచెం వెయిట్‌ చేసి, కన్విన్స్‌ చేయగలిగితే పెద్ద హీరోలు చేసి ఉండే వాళ్లేమో. బట్‌ రామయ్యా వస్తావయ్యా నేను స్టార్‌తోనే చేశాను కదా. స్టార్‌ ఉన్నంత మాత్రాన సక్సెస్‌ అయిపోతుందని నేను అనుకోను. స్టార్‌ వల్ల సక్సెస్‌ యొక్క రేంజ్‌ పెరుగుతుంది. సో, స్టార్‌ ఉన్నా, చిన్న హీరో అయినా దర్శకుడనేవాడు ట్వంటీ ఫోర్‌ క్రాఫ్ట్స్‌ మీద కమాండ్‌తో తన పని తాను సరిగ్గా చేస్తేనే సినిమా సక్సెస్‌ అవుతుంది. 

గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్‌ నుంచి ఆఫర్‌ వచ్చిందని ఒప్పుకున్నారా లేక నిజంగానే మీకు కథ నచ్చిందా?

తేజ్‌: హరీష్‌ అన్నతో నాకు గబ్బర్‌సింగ్‌ కంటే ముందునుంచే పరిచయం వుంది. 

(మధ్యలో అందుకుని హరీష్‌).. నేనిప్పుడు గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్‌ కాదు, రామయ్యా వస్తావయ్యా డైరెక్టర్‌ని! (నవ్వులు)

తేజ్‌: లేదండీ.. నాకు హరీష్‌ అన్న పరిచయమయ్యే టైమ్‌కి ఆయన గబ్బర్‌సింగ్‌ డైరెక్టర్‌ కాదు, రామయ్యా వస్తావయ్యా డైరెక్టర్‌ కాదు, మిరపకాయ్‌ డైరెక్టర్‌. తనతో ఉన్న పరిచయం కంటే కూడా ఈ సినిమా కథ నాకు బాగా నచ్చడం వల్లే చేసాను. 

ఈ సినిమా చేస్తుండగా.. మీకు హరీష్‌ చేసేది నచ్చక, కానీ స్టార్‌ డైరెక్టర్‌ కనుక క్వశ్చన్‌ చేయలేక... నచ్చకపోయినా చేసిన సందర్భం ఏదైనా వుందా?

తేజ్‌: లేదండీ. అలాంటి సిట్యువేషన్‌ అయితే ఎప్పుడూ రాలేదు. కథ నాకు ముందే తెలుసు కాబట్టి, ఆయన ఏం చేస్తున్నారో, ఎందుకు చేయిస్తున్నారో నాకు స్పష్టంగా తెలిసేది. షాట్‌ చేస్తున్నప్పుడు.. ఒక్కోసారి నాకు నేనే కన్విన్స్‌ కాక, 'అన్నా ఇంకోసారి చేస్తాను' అని అడగడం జరిగింది తప్పించి, ఈయన చేస్తున్నది నచ్చకపోవడం అయితే ఎప్పుడూ లేదు. 

'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'.. 'మొగుడు కావాలి', 'బావగారు బాగున్నారా' టైప్‌ మూవీ అని టాక్‌ వినిపిస్తోంది. అది నిజమేనా?    

హరీష్‌: అది నిజమనీ చెప్పలేను, నిజం కాదనీ చెప్పలేను. ఇది కొత్త కథ అని నేను చెప్పను. అలా అని కొత్తగా అనిపించదు అని కూడా అనను. ఇది తేజ్‌కి కొత్త సినిమా. ఇందులో తేజ్‌ కొత్తగా అనిపిస్తాడు. నేను చెప్పేదేంటంటే.. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తర్వాత ఇందులో ఇక కొత్తదనం ఏముంది అని చిరంజీవిగారు అనుకుని ఉంటే మనం 'ఇంద్ర' మిస్‌ అయ్యేవాళ్లం. చిరంజీవిగారికి ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా కొత్త కాబట్టి అది చూసి మనమందరం ఎక్సయిట్‌ అయ్యాం. భారతీయుడు సినిమాలో లంచం గురించి శంకర్‌ అంత గట్టిగా చెప్పినప్పుడు, అది అన్ని భాషల్లో అంతగా సక్సెస్‌ అయినప్పుడు మళ్లీ మనం లంచం గురించిన సినిమా ఎందుకు చేయాలని అనుకుని ఉంటే 'ఠాగూర్‌' మిస్‌ అయిపోయే వాళ్లం. చిరంజీవిగారు అంతకు ముందెప్పుడూ ఆ పాయింట్‌ టచ్‌ చేయలేదు. కాబట్టి ఆయనకి అది కొత్త. అలా ఈ సినిమాలో మీరు చెప్పిన ఎగ్జాక్ట్‌ సినిమాల్లోని పాయింట్‌ ఉండొచ్చు, లేకపోవచ్చు... రిలీజ్‌కి ముందు కనుక నేను కొన్ని విషయాలు రివీల్‌ చేయలేను. కానీ ఒకటైతే చెప్తాను. ఇంతకుముందు వచ్చిన పాయింట్‌కే ఒక థ్రిల్లింగ్‌ పాయింట్‌ యాడ్‌ చేసి ఈ చిత్రం చేశాను. ట్రీట్‌మెంట్‌ పరంగా ఈ చిత్రం హండ్రెడ్‌ పర్సెంట్‌ కొత్తగా ఉంటుంది. 

ఈ సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ టైటిల్‌ అయితే చాలా కాలం క్రితమే బయటకి వచ్చింది. అంటే ఈ కథ మీరు ఎప్పుడో రాసుకున్నదే కదా. అప్పుడు దీనిని ఎవరిని దృష్టిలో పెట్టుకుని ఈ కథ రెడీ చేసుకున్నారు.     

హరీష్‌ : ఎవరినీ దృష్టిలో పెట్టుకుని కథ రాసుకోలేదు. లేదంటే ఎన్టీఆర్‌కి 'రామయ్యా వస్తావయ్యా' బదులు ఈ కథే చెప్పేవాడిని కదా. ఒక క్యారెక్టరైజేషన్‌ అనుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చే ముందు మనం కొన్ని కథలు రాసుకుంటాం. ఫర్‌ ఎగ్జాంపుల్‌ నేను 'దాగుడు మూతలు' అని ఒక కథ రాసుకున్నాడు. అందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లుంటారు. ఇంతవరకు ఆ సినిమా తీయలేదు. ఎప్పుడు తీస్తానో కూడా తెలీదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం రాసుకుని వచ్చిన కథలతోనే సినిమాలు తీయడం కుదరదు. మనకి కుదిరిన హీరో, లేదా మనకి ఓకే అయిన ప్రొడ్యూసర్‌కి కమిట్‌ అయిన హీరో ఇమేజ్‌కి తగ్గ విధంగా కథ రాసుకోవాల్సి వస్తుంది. దబంగ్‌ రీమేక్‌ నేను చేయాల్సి వస్తుందని నాకు ముందు తెలీదుగా. అనుకోకుండా కొన్ని మధ్యలో అలా సెట్‌ అవుతుంటాయి. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌ నేనెప్పుడో చేసి పెట్టుకున్నా. మిరపకాయ్‌ తర్వాత చేద్దామని అనుకున్నా. కానీ ఎవరితో చేయాలనే విషయంలో చిన్న సందిగ్ధం. ఎందుకంటే దీనికో యంగ్‌ హీరో కావాలి. ఈ కథ చాలా మందితో షేర్‌ చేసుకున్నా. అందరూ చాలా బాగుంటుంది అనేవాళ్లు. కానీ ఎవరితో చేస్తే బాగుంటుందనేది మాత్రం ప్రోపర్‌ ఐడియా లేదు. దీనికి ఎవరైతే బాగుంటారనేది ఎప్పుడూ సీరియస్‌గా ఆలోచించలేదు. అయితే తేజ్‌ని చూసినప్పుడు ఇతనైతే 'సుబ్రమణ్యం' క్యారెక్టర్‌కి పర్‌ఫెక్ట్‌గా ఉంటాడనిపించింది. తనని దృష్టిలో పెట్టుకుని మిగతా స్క్రీన్‌ప్లేలో ఛేంజెస్‌ చేసుకున్నాను. 

అంటే అల్లు అర్జున్‌తో మీరు చేద్దామని అనుకున్న మూవీ ఇది కాదా?

హరీష్‌: బన్నీతో చేద్దామని ఒక క్యారెక్టరైజేషన్‌ అనుకున్నాను. ఫుల్‌గా స్క్రిప్ట్‌ రెడీ చేసుకోలేదు.

'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాపవడం వల్ల అల్లు అర్జున్‌ డ్రాపయ్యాడా?

హరీష్‌: 'రామయ్యా వస్తావయ్యా' ఫ్లాపయిన తర్వాత బన్నీ పిలిచి మరీ సినిమా చేద్దామని అన్నాడు. కానీ నేనే తనకి కథ చెప్పలేదు. మళ్లీ ఇప్పుడు బన్నీలాంటి పెద్ద స్టార్‌తో, మాస్‌ హీరోతో సినిమా అంటే మళ్లీ అవే పంచ్‌ డైలాగులు, మళ్లీ అదే హీరోయిజం.. ఇలా ఒక కథ తయారు చేసుకోవాలి. ఈ మొనాటనీ బ్రేక్‌ చేద్దామనే ఆలోచన వచ్చింది. తనకి సూట్‌ అయ్యే కథ ఏదీ రెడీగా లేకపోవడంతో తనని నేను మీట్‌ అవలేదు. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' సెకండాఫ్‌ మొత్తంలో ఒకటే ఫైట్‌ ఉంటుంది. మామూలుగా నా సినిమాల్లో ఇక్కడో ఫైట్‌ రావాలి, ఇక్కడో సాంగ్‌ రావాలి... అంటూ అన్నీ మీటర్‌లో జరుగుతూ ఉంటాయి. కమర్షియల్‌ మీటర్‌ని నమ్మే డైరెక్టర్‌ నేను. కానీ ఈ సినిమాలో కథకి ఏది అవసరమో అదే ఉంటుంది. చిన్న ఫీల్‌తో, ఎమోషన్స్‌తో క్లయిమాక్స్‌ ఉంటుంది. ఇవన్నీ పెద్ద స్టార్‌తో చేయడం కరెక్ట్‌ కాదు. ఈ స్క్రిప్ట్‌, ఈ క్యారెక్టరైజేషన్‌ నన్ను టెంప్ట్‌ చేస్తుంది. ఎట్‌ ది సేమ్‌ టైమ్‌.. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌ అయింది. ఈ టైమ్‌లో పెద్ద స్టార్స్‌తో సినిమా అంటే వాళ్లెంత వరకు ఇంట్రెస్ట్‌ చూపిస్తారు, వాళ్ల కోసం నేనెంత కాలం వెయిట్‌ చేయాల్సి వస్తుంది.. ఇలా ఆలోచిస్తున్న టైమ్‌లో నేను ఎగ్జయిట్‌ అయిన స్క్రిప్ట్‌తో, దానికి సూట్‌ అయ్యే హీరోతో సినిమా చేద్దామని అనుకుని ఇది స్టార్ట్‌ చేశాను. 

హరీష్‌లాంటి స్టార్‌ డైరెక్టర్‌ మీతో సినిమా చేస్తానని వచ్చినప్పుడు ఏమనిపించింది?

తేజ్‌: చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. అంత పెద్ద స్టార్స్‌తో చేసిన డైరెక్టర్‌ నాతో సినిమా చేస్తానని అనేసరికి నమ్మలేకపోయాను. ఈ కథకి నేను సూట్‌ అవుతానని హరీష్‌ అన్న అనుకోవడం నా లక్‌ అనుకుంటున్నాను. 

ఈ సినిమా మీకు నటుడిగా ఎలాంటి ఐడెంటిటీ తెస్తుందని అనుకుంటున్నారు?

తేజ్‌: అన్ని విధాలుగా అండీ. నేను ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే, ఇది హోల్‌ న్యూ లెవల్‌. అన్ని ఎమోషన్స్‌ ఉంటాయి. కామెడీ, ఎమోషన్‌, ఆటిట్యూడ్‌, రొమాన్స్‌.. ఇలా అన్ని యాంగిల్స్‌ ఉన్న క్యారెక్టర్‌. నాలాంటి ఒక యంగ్‌ యాక్టర్‌కి డ్రీమ్‌ క్యారెక్టర్‌ అని చెప్పవచ్చు. 

మీలో మీ మావయ్యల పోలికలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ పోలికతో అంచనాలు కూడా పెరుగుతాయి. దీనిని మీరు ప్రెజర్‌గా ఫీలవుతున్నారా?

తేజ్‌: ప్రెజర్‌ కాదండీ. దానిని రెస్పాన్సిబులిటీగా ఫీలవుతున్నాను. వాళ్లు సెట్‌ చేసిన స్టాండర్డ్స్‌కి తగ్గకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ స్టాండర్డ్స్‌ని ఇంకాస్త పెంచనవసరం లేదు. కానీ అవి తగ్గకుండా చేయగలిగితే చాలని అనుకుంటాను. 

తనని చిరంజీవిలా, పవన్‌కళ్యాణ్‌లా చూపించడానికి కాన్షియస్‌ ఎఫర్ట్స్‌ ఏమైనా పెట్టారా?

హరీష్‌: అలాంటిదేం లేదండి. తనని చూసినప్పుడు ఎయిటీస్‌లో చిరంజీవిగారిలా ఉన్నాడని, కాస్త స్టయిలిష్‌గా చూపించినప్పుడు నైన్‌టీస్‌లో పవన్‌కళ్యాణ్‌గారిలా ఉన్నాడని నేను చాలా సార్లు ఫీలయ్యాను. అంతే తప్పించి వాళ్లలా చూపించాలని ఎప్పుడూ ట్రై చేయలేదు. ఆడియో ఫంక్షన్‌లో చెప్పినట్టు.. మేనమామ పోలికలు రావడమనేది జీన్సు, సైన్సు. ఎక్కడైనా పాటల్లో చిన్న చిన్న షాట్స్‌ వాళ్లు చేసినవి తనతో చేయిస్తే బాగుంటుందని అనిపించి అవి పెట్టామేమో కానీ అచ్చంగా చిరంజీవిగారినో, పవన్‌కళ్యాణ్‌గారినో దింపెయ్యాలని మాత్రం అనుకోలేదు. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌గారి మెడమీద చెయ్యి పెట్టుకునే మేనరిజమ్‌ ఉంటుంది.. దానిని వాడాలనుకుంటే వాడుకోవచ్చు. కానీ వాంటెడ్‌గా ఏదీ పెట్టలేదు. ఎక్కడైనా మేము అనుకున్న సీన్‌లోనే తను వాళ్లలా అనిపించినట్టయితే దానిని రిజిష్టర్‌ చేయాలని చూసానే కానీ ఇమిటేట్‌ చేయించలేదు. 

ట్రెయిలర్‌లో ఖుషీలో భుజం మీద కర్ర పెట్టుకుని నడిచే షాట్‌, తమ్ముడులో పవన్‌ వేసిన స్టెప్‌ కనిపించాయి..

హరీష్‌: తమ్ముడులో స్టెప్‌ వేయించడానికి ఒక రీజన్‌ ఉంది. మీకు సినిమా చూస్తే అది అర్థమవుతుంది. ఆ సీన్‌కి అది అవసరం కాబట్టి ఆ స్టెప్‌ వేయించాల్సి వచ్చింది. అంతే తప్ప కాపీ కొట్టాలని కాదు. చూడ్డానికి మేనమామలానే అనిపిస్తున్నప్పుడు ఇక కాపీ కొట్టించాల్సిన అవసరం లేదు (నవ్వుతూ). 

పవన్‌తో చేశారు, ఇప్పుడు తేజ్‌తో చేసారు. ఇద్దరి మధ్య బిహేవియర్‌లో కానీ, యాక్టింగ్‌ స్టయిల్లో కానీ మీరు గమనించిన సిమిలారిటీస్‌ ఏమైనా ఉన్నాయా?    

(తేజ్‌) అంత పెద్దాయనతో నన్ను కంపేర్‌ చేయకండి ప్లీజ్‌...!

హరీష్‌: కళ్యాణ్‌గారిని చూస్తే నన్ను నేను మైమరిచిపోయే వాడిని. డిసెంబర్‌ ఫోర్త్‌, 2011.. మధ్యాహ్నం పన్నెండున్నరకి పొల్లాచ్చిలో ఫస్ట్‌ టైమ్‌ ఆయనని డైరెక్ట్‌ చేశాను. అది నా లైఫ్‌లో మర్చిపోలేను. బీయింగ్‌ హిజ్‌ ఫాన్‌.. ఆయన ఏం చేసినా నాకు బానే ఉండేది. ఆ షూటింగ్‌ జరిగినన్ని రోజులు ఎప్పుడెప్పుడు సెట్స్‌కి వెళ్దామా అని ఎవ్రీడే నాలో చాలా ఎక్సయిట్‌మెంట్‌ ఉండేది. షాట్‌ గ్యాప్స్‌లో కూడా డైరెక్టర్‌లా కాకుండా ఆయన్ని ఒక ఫాన్‌లానే చూసేవాడిని. ఇక్కడికొచ్చేసరికి.. తేజ్‌ ఎనర్జీ నాకు చాలా ఇన్‌స్పయిరింగ్‌గా వుండేది. తను ఎక్కువ ఎక్సయిట్‌ అయ్యేవాడు. 'ఇదెలా చేద్దాం, ఈ కాస్టూమ్స్‌ ఇలా వేస్తే ఎలా వుంటుంది' అంటూ చూపించేవాడు. గబ్బర్‌సింగ్‌ టైమ్‌లో నేను చేసి చూపించేవాడిని. ఇక్కడ తేజ్‌ నాకు చూపించేవాడు. 

స్టార్‌ హీరోలతో చేసి ఇప్పుడిలా యంగ్‌స్టర్‌తో చేసినపుడు డైరెక్టర్‌గా మీపై ప్రెజర్‌ తగ్గిందంటారా?

హరీష్‌: పెద్ద స్టార్స్‌తో చేసినపుడు డెఫినెట్‌గా ప్రెజర్‌ ఉంటుందండీ. ప్రతి సీన్‌ ప్లాన్‌ చేసేటపుడు ఫాన్స్‌ ఏమంటారు, ఎలా ఫీలవుతారు, ఏ విధంగా రియాక్ట్‌ అవుతారు అంటూ ఆలోచించాలి. అలాగే పెద్ద హీరోలతో అన్నప్పుడు బడ్జెట్‌ ఎక్కువ ఉంటుంది. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ప్రెజర్‌ ఇంకా ఎక్కువవుతుంది. గబ్బర్‌సింగ్‌ చేసినపుడు చాలా ప్రెజర్‌ ఫీలయ్యాను. ఆల్రెడీ అక్కడ రెండొందల కోట్లు కలెక్ట్‌ చేసిన సినిమాకి కొన్ని ఛేంజెస్‌ చేసాను. 'అక్కడ ప్రూవ్‌ అయిన సినిమాని యాజిటీజ్‌గా తీయవచ్చు కదా. ఎందుకు ఛేంజెస్‌ చేసాడు. అవసరమా ఇదంతా' అంటారని చాలా ప్రెజర్‌ ఫీలయ్యాను. తేజ్‌తో చేసినపుడు అలాంటి ప్రెజర్స్‌ ఏమీ లేవు. చాలా కంఫర్టబుల్‌గా, చాలా ప్రశాంతంగా.. నలభై రోజులు యుఎస్‌లో, ముప్పయ్‌ రోజులు ఇక్కడ ఇంట్లో షూటింగ్‌ చేశాం. ఎప్పుడయిపోయిందో కూడా తెలీలేదు. 

మీరు ఇంతవరకు ముగ్గురు డైరెక్టర్లతో పని చేశారు. హరీష్‌ శంకర్‌గారితో మీ వర్కింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి చెప్పండి.

తేజ్‌: మై ఫాస్టెస్ట్‌ అండీ. ఒక సినిమా ఇంత ఫాస్ట్‌గా తీస్తారని నాకు ఈయనతో వర్క్‌ చేశాకే తెలిసింది. ఒక్క రోజులో నాలుగు సీన్లు, రెండు మాంటేజ్‌లు తీసేసరికి 'ఏంటి షూటింగ్‌ ఇంత ఫాస్ట్‌గా కూడా జరుగుతుందా అని నాకు మైండ్‌ బ్లాక్‌ అయిపోయింది' (నవ్వుతూ). ఈయనతో వర్క్‌ చేయడం చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఒక డైరెక్టర్‌కి క్లారిటీ ఉంటే సినిమా ఎంత ఫాస్ట్‌గా తీయవచ్చు అనేది చూసాను. అంత ఫాస్ట్‌గా తీసినా కానీ ఎక్కడా ఏ విషయంలోను కాంప్రమైజ్‌ ఉండదు. అవుట్‌పుట్‌ టాప్‌ క్లాస్‌ ఉంటుంది. ఇంతవరకు నాతో వైవిస్‌ చౌదరిగారు ఒకలా చేయించారు, రవికుమార్‌ చౌదరిగారు ఇంకో స్టయిల్లో చేయించారు. ఎవరు చేసినా ఇలాగే ఉంటుంది, ఈ రెండు స్టయిల్స్‌లోనే చూపిస్తారు ఎవరైనా అనుకున్నాను. కానీ నన్ను టోటల్లీ డిఫరెంట్‌ యాంగిల్‌లో ప్రెజెంట్‌ చేశారు. నన్ను నేను కొత్తగా చూసుకున్నాను. ఎంత ఎక్సయిటింగ్‌గా అనిపించేదంటే ప్రతి రోజు మార్నింగ్‌ రెడీ అయిపోయి వెళ్లిపోయేవాడిని. ఇవాళ ఏం చేస్తారు, ఏ సీన్‌ని ఎలా తీస్తారు అంటూ వెయిట్‌ చేసేవాడిని. 

'రేయ్‌' క్లయిమాక్స్‌ సాంగ్‌ కోసమే ముప్పయ్‌ మూడు రోజులు చేశారు. అదే టైమ్‌లో ఈ సినిమాకి ఒక షెడ్యూల్‌ అయిపోయినట్టుంది...

తేజ్‌: సెకండ్‌ హాఫ్‌ మొత్తం అయిపోయింది (నవ్వుతూ). వైవిఎస్‌ చౌదరిగారితో పాజ్‌/ప్లేలా వుండేది. రవికుమార్‌ చౌదరిగారితో ప్లేలా వుండేది. ఈయనతో ఫాస్ట్‌ ఫార్వర్డ్‌లా అనిపించింది. 

అమెరికా షెడ్యూల్‌ కూడా చెప్పిన టైమ్‌ కంటే తక్కువ రోజుల్లోనే కంప్లీట్‌ చేసారంట కదా...

హరీష్‌: షూటింగ్‌ మొదలు కావడానికి తొమ్మిది నెలలు ముందే వెళ్లి ఎక్కడెక్కడ షూటింగ్‌ చేయాలి, ఏ షాట్‌ ఎలా ప్లాన్‌ చేసుకోవాలి అని చూసుకుని వచ్చాను. నా డైరెక్షన్‌ టీమ్‌కి, మిగిలిన టెక్నికల్‌ క్రూకి ముందే క్లారిటీ ఇచ్చేశాను. నేననుకునేది ఒక్కటే.. క్రియేటివిటీ అనేది భగవంతుడి దయ. అది అనుకుంటే రాదు. అవతార్‌ చూసేసి మనం కూడా అవతార్‌లాంటిది తీసేద్దామంటే కుదర్దు. కానీ క్లారిటీ అనేది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి నేనెప్పుడు ఏ సినిమా తీసినా కానీ ఏం తియ్యాలనే దానిపై ఫుల్‌ క్లారిటీతో ఉంటాను. చాలా మంది అంటుంటారు.. చాలా ఫాస్ట్‌గా తీసేస్తావ్‌ అని. కానీ దాని కోసం నేను విపరీతంగా హోం వర్క్‌ చేస్తాను. ఏ లొకేషన్‌కి కూడా ముందు చూడకుండా వెళ్లి షూటింగ్‌ చేయను. షూటింగ్‌కి వెళ్లే టైమ్‌కే ఏ షాట్‌ ఎక్కడ తీస్తున్నాననేది నాకు క్లియర్‌గా ఒక పిక్చర్‌ ఉంటుంది. అలాగే నాకు, నా డైరెక్షన్‌ టీమ్‌కి మధ్య సీక్రెట్లేం ఉండవు. ఒకవేళ నా కార్‌ ట్రాఫిక్‌లో ఉండిపోతే.. నా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కూడా ఫస్ట్‌ షాట్‌ చెప్పేస్తాడు. అంత క్లారిటీ ఇచ్చేస్తాను. నేను పని చేసిన వాళ్లు కూడా అలాంటి వాళ్లే. ఎస్‌. గోపాల్‌రెడ్డి, రవిరాజా పినిశెట్టి దగ్గర్నుంచి ఫాస్ట్‌గా పని చేయడం నేర్చుకున్నాను. 

ఫారిన్‌లో షూటింగ్‌ అంటే కాంప్రమైజ్‌ అయిపోతుంటారు. మీరు ఈ సినిమా కోసం కాంప్రమైజ్‌ అయ్యారా, అనుకున్నట్టే తీయగలిగారా?

హరీష్‌: నేను, తేజ్‌ ఈ సినిమా చేద్దామని ఫిక్స్‌ అయినప్పుడు ప్రొడ్యూసర్‌ ఎవరనేది అనుకోలేదు. ఒకరిద్దరికి కథ చెప్తే తక్కువలో తీసేస్తే ఎలాగుంటుంది అనే దాని గురించే మాట్లాడారు. దిల్‌ రాజుగారికి ఈ కథ చెప్తే ఇది అమెరికాలో తీయకపోతే తీయడం వేస్ట్‌ అనేశారు. అంత ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్‌ ఆయన. తన బ్యానర్లో నేను రామయ్యా వస్తావయ్యా తీసినా, ఇప్పుడు నా మార్కెట్‌ ఏంటి, తేజ్‌ మార్కెట్‌ ఏంటని ఆయన లెక్కలు వేసుకోలేదు. కథకి ఏది అవసరమో అదే ఆలోచించారు. కాంప్రమైజ్‌ అనే మాట దిల్‌ రాజు గారి దగ్గర వినిపించదు. శ్రీ వెంకట్వేశర క్రియేషన్స్‌లో కాంప్రమైజ్‌ అనే మాటకి చోటు లేదు. 

వరుసగా దిల్‌ రాజుగారికే సినిమాలు చేస్తున్నారు. ఏదైనా మల్టిపుల్‌ మూవీ డీల్‌ ఒప్పుకున్నారా?

తేజ్‌: డీల్‌ ఏమీ లేదండి. ఆయన మంచి కథలు తీసుకొస్తున్నారు, నేను చేస్తున్నాను తప్ప డీల్స్‌ ఏమీ లేవు. (హరీష్‌: అసలు దీనిని మీరు మరోలా చూడాలి. దిల్‌రాజు లాంటి సీనియర్‌ ప్రొడ్యూసర్‌ తేజ్‌ని ఎందుకు వదలడం లేదు. ఈ క్వశ్చన్‌ అక్కడ అడగాలి) 

ఎందుకు చేస్తున్నారని మీరనుకుంటున్నారు?

హరీష్‌: తేజ్‌ ఈజ్‌ వెరీ సిన్సియర్‌ అండ్‌ వెరీ హార్డ్‌ వర్కింగ్‌ అండి. రాజుగారు తనతో ఎందుకు చేస్తున్నారంటే తేజ్‌కి ఇంకా ఒక ఇమేజ్‌ అంటూ ఫార్మ్‌ అవలేదు. రాజుగారెప్పుడూ నాలుగైదు కథలు వింటూ ఉంటారు. ఏ కథ విన్నా ఇది తేజ్‌కి బాగుంటుంది అని తనకి అనిపించడం వల్ల వరుసగా తేజ్‌తో చేస్తున్నారని అనుకుంటున్నాను. తేజ్‌కి ఇదంటూ ఒక ఇమేజ్‌ లేదు కాబట్టి ఏ కథ విన్నా ఆ హీరోలో రాజుగారికి తేజ్‌ కనిపిస్తున్నట్టున్నాడు.

తేజ్‌: నేను చాలా లక్కీ అనుకుంటున్నానండి. చిరంజీవిగారికి ఎర్లీ డేస్‌లో క్రాంతికుమార్‌ గారు ఎలా సపోర్ట్‌గా నిలిచారో నాకు దిల్‌ రాజుగారు అలాంటి సపోర్ట్‌ ఇస్తున్నారు. 

తేజ్‌ని స్టార్‌ చేద్దామని కాదు, తను ఆల్రెడీ స్టార్‌ అనుకునే ఈ సినిమా చేసానన్నారు. తనలో మీకు కనిపించిన ఆ స్టార్‌ లక్షణాలేంటి, ఎందుకు?

హరీష్‌: 'గబ్బర్‌సింగ్‌' చేస్తున్నప్పుడు, ఈ సినిమా హిట్టు కొడితే నీ లైఫ్‌ బాగుంటుందిరా అనేవాళ్లు. ఈ సినిమా చేస్తున్నానని తెలిసినప్పుడు నాకు తెలిసిన వాళ్లు చాలా మంది అన్నారు. 'తేజ్‌కి మంచి సినిమా అవుతుంది. తనకి హెల్ప్‌ అవుతుంది' అని. కానీ నేను మాత్రం తేజ్‌ని స్టార్‌ని చేస్తాననే ఉద్దేశంతో ఈ సినిమా చేయలేదు. నా దృష్టిలో తను స్టార్‌ కాబట్టే తనతో ఈ సినిమా చేసా. నా స్వార్ధం అది. నా క్యారెక్టరైజేషన్‌కి, నేను అనుకున్న బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్‌ మాడ్యులేషన్‌కి, నా హీరో ఎలా ఉండాలని నేననుకునే దానికి తేజ్‌ చాలా దగ్గరగా ఉన్నాడు. తన రెండు సినిమాలు రిలీజ్‌ అవ్వకముందే ఈ సినిమా తనతో చేద్దామని నేను ఫిక్స్‌ అయిపోయాను. 'పిల్లా నువ్వులేని జీవితం' సినిమాని నేను తనతో చేయబోతున్న 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' దర్శకుడిగా చూసాను. స్టార్‌ హీరో అయ్యే లక్షణాలు ఇతనిలో పుష్కలంగా వున్నాయని, తనతో ఎంత త్వరగా చేస్తే అంత బాగుంటుంది అనుకుని చేశాను. 'కెరీర్‌ తొలినాళ్లలో హరీష్‌ అన్నతో ఒక సినిమా చేసానని గుర్తు పెట్టుకుంటాడు కదా' (తేజ్‌ నవ్వులు) ఆ చిన్న స్వార్ధంతో చేశాను. (ఇది మరీ సర్‌.. అని ఏదో అంటూ తేజ్‌ నవ్వుతుంటే...) నో నో నో.. జోక్‌ కాదు. నాకు నీపై స్టార్‌ అవుతావనే కాన్ఫిడెన్స్‌ బాగా ఉండబట్టే ఈ సినిమా నీతో చేసాను. 

హరీష్‌గారు అన్నట్టు మిమ్మల్ని నెక్స్‌ట్‌ లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుందని అనుకుంటున్నారా?

తేజ్‌: ఆ ఫీలింగ్‌ అయితే డెఫినెట్‌గా ఉందండి. 

'గువ్వా గోరింకతో' పాట రీమిక్స్‌ చేద్దామని చెప్పినప్పుడు మీకేమనిపించింది?

తేజ్‌: చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే చిన్న భయం కూడా కలిగింది. (హరీష్‌: భయం అని చెప్తే నేను నమ్మను). అంటే భయం ఉంది.. కానీ దానిని హ్యాపీనెస్‌ ఓవర్‌కమ్‌ చేసింది. నా కెరీర్‌లో ఫస్ట్‌ డ్యూయెట్‌. అది కూడా చిరంజీవిగారి హిట్‌ సాంగ్‌ చేస్తున్నామంటే నాకంతకంటే ఏం కావాలి చెప్పండి. 

అసలు ఈ పాట రీమిక్స్‌ చేయిద్దామని ఎందుకనుకున్నారు. దానిని గ్రాండ్‌ కాన్యాన్‌లో చిత్రీకరించడానికి కారణం?

హరీష్‌: సెకండాఫ్‌లో వచ్చే పాట అది. అవుట్‌డోర్‌లో తీయాలని అనుకుంటున్నాం. అంటే ఆ పాట కోసం ఏ పొల్లాచ్చినో, ఇంకో చోటికో వెళ్లాలి. యుఎస్‌లో ఎలాగో షూటింగ్‌ చేస్తున్నాం కదా మళ్లీ దానిని వేరే లొకేషన్‌లో తీయడం దేనికి అనుకుంటూ ఉండగా గ్రాండ్‌ కాన్యాన్‌లో తీస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. దిల్‌ రాజు గారికి నా ఐడియా చెప్పగానే, ఆయన డైరెక్టర్స్‌ ప్రొడ్యూసర్‌ కాబట్టి 'తప్పకుండా చేద్దాం. బడ్జెట్‌ వేసివ్వండి' అన్నారు. గ్రాండ్‌ కాన్యాన్‌లో పాట తీయాలని ఫిక్సయ్యాం. ఏ పాట తీయాలనేది మాత్రం అప్పటికి ఫిక్సవలేదు. ఇంటర్వెల్‌కి ముందు 'యాష్‌ కరేంగే' పాట వస్తుంది. మిక్కీ సిగ్నేచర్‌ ఉన్న మంచి మాస్‌ సాంగ్‌. మళ్లీ ఇంకో మాస్‌ సాంగ్‌... మిక్కీతోనే ఆ పాట చేయిస్తే రెండిటికీ మధ్య పోటీ పెట్టినట్టవుతుందనిపించి చిరంజీవి గారి సాంగ్‌ ఏదైనా రీమిక్స్‌ చేయిద్దాం అనుకున్నాను. వంద పాటల్లోంచి మూడు పాటలు సెలక్ట్‌ చేశాం. గువ్వా గోరింక పాట అంటే నాకు బాగా ఇష్టం. దాన్నే రీమిక్స్‌ చేద్దామని ఫిక్స్‌ అయ్యాం. ఈ పాట అని రీమిక్స్‌ అని చెప్పగానే ఎవరైనా సెట్స్‌లో ఉంటుందని ఊహించుకుంటారు. కానీ మనం దీనిని గ్రాండ్‌ కాన్యాన్‌లో చేస్తే సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని అనిపించి అక్కడ ప్లాన్‌ చేశాం.

రీమిక్స్‌ అంటే దానిని ఏదో విధంగా మార్చడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇందులో యథాతథంగా ఉంచేసారెందుకని?

హరీష్‌: ఆ పాటకి ముందు వచ్చే రిథమ్‌ వినగానే ఇది 'గువ్వా గోరింక' పాట అని చెప్పేస్తాం. అంతగా రిజిష్టర్‌ అయిన సాంగ్‌ అది. అసలు రీమిక్స్‌ ఎందుకు చేస్తాం? ఆ పాట మనకి బాగా నచ్చడం వల్లే కదా. అంత నచ్చి చేస్తున్న పాటని మళ్లీ మార్చేస్తే ఇక అది నచ్చి చేసినట్టు ఎలా అవుతుంది? నాకయితే ఈ పాటని మళ్లీ బాలుగారితోనే పాడించాలని అనిపించింది. కానీ తేజ్‌కి ఆయన వాయిస్‌ ఓవర్‌ మెచ్యూర్డ్‌గా ఉంటుందేమో అన్న చిన్న భయంతో, ఎయిటీస్‌ నోస్టాల్జియా అయితే మిస్‌ కాకూడదని మనోగారితో పాడించాం. ఆ పాటలోని ఏ రిథమ్‌ని డిస్టర్బ్‌ చేయకుండా, కేవలం ఆ బీట్స్‌, రిథమ్స్‌ ఎన్‌హాన్స్‌ చేసేలా మ్యూజిక్‌ ఉండాలని దినేష్‌కి చెప్పాను. ఈ ఒక్క సాంగ్‌ మాత్రం 'కృష్ణాష్టమి' మ్యూజిక్‌ డైరెక్టర్‌ దినేష్‌ చేసాడు. నచ్చి చేస్తున్నప్పుడు దానిని బాగు చేయకపోయినా ఫర్వాలేదు, చెడగొట్టకూడదు అనుకున్నాను.

తేజ్‌: రీమిక్స్‌ సాంగ్‌ ఫస్ట్‌ టైమ్‌ విన్నప్పుడు చాలా సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఎక్కువ మార్చలేదు. ఆ ఫ్లేవర్‌ పోకుండా భలే చేసారు అనిపించింది. 

మిగతా పాటల్లో మిక్కీ సిగ్నేచర్‌ ఉంటుందని మీరన్నారు కదా. కానీ మీ సిగ్నేచరే ఉందనిపించింది...

సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌పై మీకెలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి, దీంతో ఎలాంటి ఇమేజ్‌ వస్తుందని అనుకుంటున్నారు?

తేజ్‌: ఎక్స్‌పెక్టేషన్స్‌ ఏమీ పెట్టుకోవడం లేదండీ. సినిమా బాగుంది, నేను బాగా చేసానంటే చాలు.

హరీష్‌: నేను ఒక టూ ఇయర్స్‌ కళ్యాణ్‌గారితో ట్రావెల్‌ చేసినందుకే జయాపజయాల యావ తగ్గిపోయింది. ఒక వేదాంతం వచ్చింది. వైరాగ్యం రాలేదు.. వైరాగ్యం అనేది పెస్సిమిజం. వేదాంతం అనేది క్లారిటీ.. స్పిరిచ్యువల్‌ క్లారిటీ. గబ్బర్‌సింగ్‌ అంత పెద్ద హిట్‌ అయిన తర్వాత ఆయన్ని ఫస్ట్‌ టైమ్‌ కలిసినప్పుడు 'ఏం చేస్తున్నారు. ఏంటి విశేషాలు, కొత్త పుస్తకాలేమైనా చదివారా, సంధ్యావందనం చేస్తున్నారా' అంటూ అవీ ఇవీ మాట్లాడారే తప్ప సినిమా గురించి, ఆ సక్సెస్‌ గురించి రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు. సినిమా చేస్తున్నంతసేపు చాలా ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ చేసేవారు. క్లాప్స్‌ కొడుతూ ప్రతి సీన్‌ని, డైలాగ్‌ని ఎంజాయ్‌ చేసేవారు. హిట్టయ్యాక దాని గురించి మాట్లాడ్డానికి కూడా ఆసక్తి చూపించలేదు. అంటే ఒక సినిమా తాలూకు జర్నీని ఎంజాయ్‌ చేయాలి కానీ దాని డెస్టినీ గురించి పట్టించుకోకూడదని నేను కళ్యాణ్‌గారి నుంచి నేర్చుకున్నాను. తేజ్‌ని అడిగిన దానికి నేనెందుకు చెప్తున్నానంటే రెండేళ్లు ఆయనతో ట్రావెల్‌ చేసినందుకే నేను ఇంత నేర్చుకుంటే... అక్కడే పుట్టి పెరిగిన తనపై ఆ ప్రభావం ఇక ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి. 

అన్నేళ్లు కష్టపడి చేసిన రేయ్‌ ఫ్లాప్‌ అయినపుడు ఏమీ అనిపించలేదా. రిగ్రెట్స్‌ ఏమైనా ఉన్నాయా?

తేజ్‌: ఒక గంట బాధ పడ్డానండీ. తర్వాత దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఆ సినిమా రిలీజ్‌ అయింది, రిజల్ట్‌ వచ్చింది. ఫస్ట్‌ ఆపర్చునిటీ ఇచ్చినందుకు వైవిఎస్‌ చౌదరిగారికి ఎప్పటికీ రుణపడి వుంటాను. ఆ సినిమా చేసినందుకు నో రిగ్రెట్స్‌. ఐ యామ్‌ థాంక్‌ఫుల్‌ టు వైవిఎస్‌గారు.

ఆ సినిమా పోయినా వెనుక హరీష్‌ శంకర్‌ సినిమా ఉందనే ధీమా వల్లే రిగ్రెట్స్‌ లేవేమో?

తేజ్‌: లేదండి. అదేం లేదు. హరీష్‌ అన్నతో సినిమా నాకు నా మొదటి రెండు సినిమాలు రిలీజ్‌ కాకముందే ఓకే అయింది. థర్డ్‌ మూవీ హరీష్‌ అన్నది అనే ధీమా కాదు కానీ ఒక విధమైన సెక్యూర్డ్‌ ఫీలింగ్‌ అయితే ఉండింది. 

హరీష్‌: ధీమా కాకుండా బీమా అనుకోవచ్చన్న మాట... (నవ్వులు) సెక్యూర్డ్‌ అంటున్నాడు కదా! 

పోస్టర్స్‌లో, ట్రెయిలర్స్‌లో రొమాన్స్‌ బాగా హైలైట్‌ అవుతోంది. రెజీనాతో రెండో సినిమా కావడం వల్లే రొమాంటిక్‌ సీన్స్‌లో ఆ కెమిస్ట్రీ, ఇంటిమసీ కుదిరిందంటారా?

తేజ్‌: డెఫినెట్‌గా. ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉండడం వల్ల మా ఇద్దరి మధ్య కంఫర్ట్‌ లెవల్‌ ఎక్కువ ఉంది. కాబట్టి కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌ చేసే ముందు ఓపెన్‌గా డిస్కస్‌ చేసుకుని రిహార్స్‌ చేయడానికి అవకాశం కుదిరింది. 

అయితే ఈ కెమిస్ట్రీ కారణంగా ఇద్దరి మధ్య ఏదో ఉందనే గాసిప్స్‌ కూడా వస్తున్నాయి కదా. వాటికి మీ రియాక్షన్‌ ఏంటి?

తేజ్‌: యా.. ఆ రూమర్స్‌ నేను కూడా విన్నానండీ. ఇదివరకు హిట్‌ కాంబినేషన్స్‌ అంటూ ఉండేవి. ఒకే హీరోయిన్‌తో చాలా సినిమాలు చేసేవాళ్లు. కానీ దురదృష్టం కొద్దీ ఇప్పుడిలాంటి రూమర్స్‌ వల్ల ఎక్కువ సినిమాలు ఒకే కాంబినేషన్‌లో చేయలేకపోతున్నాం (నవ్వుతూ). అండ్‌ ఈ రూమర్స్‌కి సంబంధించి నాకు చిన్న బాధ ఏంటంటే.. నేనంటే మగాడిని, నాకైతే ఫర్వాలేదు. ఒక అమ్మాయి గురించి ఇలాంటివి మాట్లాడేటపుడు వాళ్లు కూడా ఆలోచించుకోవాలి. వాట్‌ ఈజ్‌ రైట్‌, వాట్‌ ఈజ్‌ రాంగ్‌ అని. 

మీ సీత గురించి మీరు చెప్పండి?

హరీష్‌: సీత క్యారెక్టరైజేషన్‌ అనుకున్నప్పుడు రెజీనాని అనుకోలేదు. 'పవర్‌' సినిమాలో తను చేసిన చిన్న పాత్ర అయినా చాలా బాగా చేసిందనిపించింది. 'పిల్లా నువ్వులేని జీవితం' చూసాను కానీ తన మీద అంత ఫోకస్‌ పెట్టలేదు. తేజ్‌ ఎలా చేస్తున్నాడనేదే ఎక్కువ గమనిస్తూ ఉన్నాను. పవర్‌లో తన పర్‌ఫార్మెన్స్‌ బాగా నచ్చింది. అలాగే వీళ్లిద్దరూ ఆల్రెడీ ఒక సినిమా చేసి ఉన్నారు కనుక కంఫర్ట్‌ లెవల్‌ ఉంటుందనిపించింది. మీరొక మంచి పదం వాడారు.. పోస్టర్స్‌, ట్రెయిలర్స్‌లో 'రొమాన్స్‌' ఉందని. నిజంగానే ఇందులో రొమాన్స్‌ చాలా బాగుంటుంది. ఎక్కడా అశ్లీలత ఉండదు. ఇక రెజీనా గురించి చెప్పాలంటే టెర్రిఫిక్‌ పర్‌ఫార్మర్‌. వేరే లాంగ్వేజ్‌ అమ్మాయితో చేస్తున్నానని నాకెప్పుడూ అనిపించలేదు. 

ఇంతకుముందు స్టార్స్‌తో చేశారు కాబట్టి మీకు బడ్జెట్‌ రిస్ట్రిక్షన్స్‌ ఉండి ఉండకపోవచ్చు. కానీ తేజ్‌తో సినిమా అంటే కొన్ని లెక్కలకి లోబడక తప్పదు కదా. ఈ పద్ధతి ఇబ్బందిగా అనిపించిందా?

హరీష్‌: మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. ఏదైనా బడ్జెట్‌లోనే చేయడమనేది చిన్నప్పట్నుంచీ అలవాటే. నాకు ఎక్కువ బడ్జెట్‌ ఇచ్చినా కానీ నేను ఖర్చు పెట్టలేనేమో అని నా ఫీలింగ్‌. నేను ఇంతవరకు చేసిన అన్ని సినిమాలు బడ్జెట్‌ కంటే తక్కువలోనే పూర్తి చేశాను. రామయ్యా వస్తావయ్యా ఫెయిల్‌ అయినా కానీ రాజుగారికి టేబుల్‌ ప్రాఫిట్స్‌ వచ్చాయి. ఎక్కువ మాట్లాడితే.. అందుకే నాతో మళ్లీ ఇంకో సినిమా చేసారేమో (నవ్వుతూ). బడ్జెట్‌ వేసుకుని బ్రతికి వచ్చినవాళ్లం. అందుకే ఒక ఫైటు వారం రోజుల్లో తియ్యాలంటే, అయిదు రోజుల్లో ఎలా ఫినిష్‌ చెయ్యాలి, నాలుగు రోజుల్లో తీసే పాటని మూడు రోజుల్లో ఎలా తియ్యాలి అంటూ ఆలోచిస్తాను. బేసిగ్గా.. 'సేవ్‌ టైగర్స్‌'లాగా.. 'సేవ్‌ ప్రొడ్యూసర్స్‌' అనేది నా క్యాప్షన్‌ అండి (తేజ్‌ నవ్వులు). సీరియస్‌గా.. మంచి అభిరుచి వున్న నిర్మాతలని కాపాడుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్లకి ఉందని బలంగా నమ్ముతాను నేను. ఇప్పుడు తన ప్రీవియస్‌ మూవీ రేయ్‌, నాది రామయ్యా వస్తావయ్యా. అయినా కానీ రాజుగారు మా ఇద్దరితో సినిమా తీస్తూ ఏది కావాలంటే అది ఇచ్చారు. డైరెక్టర్‌కో రెమ్యూనరేషన్‌ ఉంటది, హీరోకో రెమ్యూనరేషన్‌ ఉంటది. కానీ ప్రొడ్యూసర్‌కి మాత్రం సినిమా రిలీజ్‌ అయ్యాక చూసుకుందాం అనుకుంటాడు. అలా మన క్రియేటివిటీని నమ్మి, మనపై బాధ్యత ఉంచినప్పుడు వాళ్ల బాగు కోరుకోవడం, వాళ్లని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యతే కదా!

- గణేష్‌ రావూరి

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?