Advertisement

Advertisement


Home > Movies - Interviews

జేమ్స్ బాండ్ తో జనాలకు కితకితలే- అల్లరి నరేష్

జేమ్స్ బాండ్ తో జనాలకు కితకితలే- అల్లరి నరేష్

అల్లరి నరేష్..వర్తమాన సినిమా కామెడీ కి కేరాఫ్ అడ్రస్. చూడ్డానికి చువ్వలా వుంటాడే కానీ, మనిషి తెగ కితకితలెట్టేస్తాడు.. సినిమాకు వచ్చిన జనాలను నవ్వించి, నవ్వించి, అప్పుడు కానీ ఇక చాలు ఇళ్లకు వెళ్లండి అనడు. వర్తమాన కథానాయకుల్లో చకచకా ఎక్కువ సినిమాలు చేసింది ఇతగాడే. ఈపాత్ర ఆ క్యారెక్టర్ అని లేదు. పల్లెటూరు, పట్నం అన్న తేడా లేదు. కాస్త తేడాగా వుండే క్యారెక్టర్ ఏదైనా సరే ఇట్టే వేసేసి, అట్టే పండించేస్తాడు. బాలకృష్ణ లేదు..పవర్ స్టార్ లేదు..ఎవరి క్యారెక్టర్ అయినా, తన స్టయిల్ నవ్వురోల్..గా మార్చేస్తాడు. వాళ్లు తొడగొట్టినా, పడగొట్టినా సౌండ్ వస్తుందేమో..నరేష్ అదే పనిచేస్తే, నవ్వుల జల్లు కురుస్తుంది. 

అలాంటి అల్లరి నరేష్ తాజా సినిమా జేమ్స్ బాండ్.మచ్చ సాయి కిషోర్ దర్శకుడు. అనిల్ సుంకర నిర్మాత..శ్రీధర్ సీపాన మాటల రచయిత. ఇంక నవ్వుల పువ్వులకు కొదవే ముంది..ఏరుకున్నవారికి ఏరుకున్నంత. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది..ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ తో 'గ్రేట్ ఆంధ్ర' చిట్ చాట్.

ఎలా చూపిస్తున్నారు..మిమ్మల్ని జేమ్స్ బాండ్ గా?

నేను కాదండీ బాబు..నా పెళ్లాం..అదేగా మా టైటిల్ ట్యాగ్ లైన్. 

ఎన్నాళ్లిలా పెళ్లాం చాటు భర్తలా? కితకితలు పెడతారా మళ్లీ.?

నాకు తెలుసు మీరు అలా అంటారని..ఆ సినిమా వేరు..ఈ సినిమా వేరు. ఇది..సాఫ్ట్ గా వుండే ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి కధ. అందమైన భార్య, చిన్న ఇల్లు వుంటే చాలనుకుని, రక్తం కళ్ల చూస్తే కిందపడిపోయే మనస్తత్వం వున్న వాడికి ఓ మాఫియా డాన్ పెళ్లాంగా వస్తే ఎలా వుంటుంది..అదీ కథ. వీడేమో నెత్తురు చూస్తే ఫట్. ఆమేమో..నెత్తురు చూడకుంటే నిద్దరోదు. 

జేమ్స్ బాండ్ గురి కరెక్ట్ గా వుంటుందా?

మీరు ఎందుకడిగారో నాకు తెలుసు. నా సినిమాలు కొన్ని ఆశించనంతగా జనాలను అలరించలేదు. దానికి చాలా కారణాలు వున్నాయి. కొన్ని మిస్ కాలుక్యులేషన్లు. కొన్ని టైమ్ రీత్యా జరిగినవి. ఏమీ చేయలేని సమస్యలు కొన్ని. ఇలా

ఈసారి మరి ఈ అనుభవాలతో జాగ్రత్త తీసుకున్నారా?

ఎప్పుడూ జాగ్రత్తగానే వుంటానండీ. కానీ ఒక్కోసారి ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. లైన్ చెప్పినపుడు సూపరెహె అన్నట్లు వుంటుంది. తీరా తీస్తుంటే తేడాగా వుంటుంది. అక్కడ ఆపేయలేం..నిర్మాత కోట్ల పెట్టుబడి. ప్రెజర్..కాస్త రాజీ..ఇలా. సెట్ మీదకు వెళ్లాక డైలాగ్ కాగితం చేతికి వస్తుంది. కొంచెం తేడా అనుకుంటాం..మనకున్న నాలెడ్జ్ తో కాస్త సరిచేయగలం. అంతే. కానీ అలా అని మార్చండి. ప్యాకప్ అనేయలేం. కాస్త రాజీ. ఇలా చాలా వుంటాయి. అందుకే ఈ సారి పక్కా బౌండ్ స్కిప్ట్..అన్ని విధాలా చూసుకున్నాకే ముందుకు వెళ్లాం.

జేమ్స్ బాండ్ లో నవ్వుల తూటాలు ఎన్ని?

అన్ లిమిటెండ్ అండీ..నేనే కాదు, మిగిలిన కమెడియన్స్ అంతా కూడా నవ్వుల పువ్వులు పండించారు. బాహుబలి లాంటి సీరియస్ ఎమోషన్ సినిమా చూసి వున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఈ జేమ్స్ బాండ్ మాంచి రిలీఫ్ ఇస్తుంది. నా ప్రేక్షకులకు నవ్వులు గ్యారంటీ. రెగ్యులర్ ప్రేక్షకులకు కాస్త రిచ్ గానే వుండే పాటలు వగైరా కూడా వున్నాయి. 

బాహుబలి వెనుక రావడం మంచి టైమింగ్ అనుకుంటున్నారా?

అవునండీ. బాహుబలి మాంచి హిట్. స్వీట్ హాట్ కాంబినేషన్ అన్నట్లుగా, అది హెవీ స్కేల్, సీరియస్ ఎమోషనల్ మూవీ. దాన్ని చూసిన తరువాత ఇప్పుడు ప్రేక్షకులు మా సినిమా లాంటి కామెడీ కితకితలను ఎంజాయ్ చేస్తారనే అనుకుంటున్నాను. 

బందిపోటు డిస్సపాయింట్ మెంటేనా?

నిర్మాతగా ఏమిటి అన్నది పక్కన పెట్టండి..డబ్బులు వస్తాయి..పోతాయి..హీరోగా కూడా హిట్, ఫ్లాపులు అన్నీ చూసా..కానీ ఫాదర్ బ్యానర్..దాన్ని మళ్లీ స్టార్ట్ చేసాం..మంచి సినిమా చేయాలి అనుకున్నాం. అదే కుదరలేదు. అదే కాస్త వెలితి.

ఎక్కడ కాలుక్యులేషన్ తప్పింది?

అల్లరి నరేష్ అంటే బి. సి సెంటర్ల ప్రేక్షకులే కాదు, ఎ సెంటర్ల ఆడియన్స్ కు ఓ క్లాస్ కామెడీ చూపిద్దాం అనుకున్నాం. కానీ జనాలు ఈవీవీ బ్యానర్ అనగానే ఆయన గత సినిమాల్లా వుంటుందనుకున్నారు. అక్కడ తేడా వచ్చింది. 

సరైన కథలు రావడం లేదన్న వెలితి ఏమన్నా వుందా?

వెలితి అంటే..ఒకప్పుడు రూరల్ బేస్డ్ క్యారెక్టర్లు, కథలు వచ్చేవి. ఇప్పుడవి ఎవరూ చెప్పడం లేదు. బహుశా మన డైరక్టర్లు, కథకులు, అంతా సిటీ నేపథ్యం నుంచి రావడం వల్లనేమో? అలాగే నాన్నగారి సినిమాల్లో ప్రతి క్యారెక్టర్ కు ఓ మ్యానరిజమ్, హ్యూమర్ వుండేవి. అది ఇప్పుడు తక్కువగా వుంది. నాన్నగారు, పెద్ద వంశీగారు లాంటి సినిమాలన్నమాట.

మోహన్ బాబు గారితో సినిమా సంగతులేమటి?

మంచి సినిమా అండీ అది. మోహన్ బాబుగారు మాత్రమే చెప్పగల కామెడీ డైలాగ్ మాడ్యులేషన్ ఒకటి వుంది. అరిస్తే..కరుస్తా..కరిస్తే..చరుస్తా..అనే టైపు. ఆ చమక్కు మళ్లీ ఈ సినిమాలో వుంటుంది. పెదరాయుడులా సీరియస్ కాదు..పక్కా కామెడీ క్యారెక్టర్ చేస్తున్నారాయన. డైరక్టర్ శ్రీనివాసరెడ్డి గారి కామెడీ టైమింగ్ వుంటుంది.

నాగేశ్వర రెడ్డితో మూడో సినిమా చేస్తున్నట్లున్నారు.?

అవును..ఆయనతో అది నాకు హ్యాట్రిక్ మూవీ అవుతుంది. 

మీరేమో స్టయిల్ గా అందంగా కనిపించాలని చూస్తున్నట్లుంది..జనాలు మమ్మల్ని నవ్విస్తే చాలు అనుకుంటున్నట్లుంది?

నిజమే కావచ్చు..కాని నేను ఇంతకు ముందు అంతా అలాగే చేసాను కదా..నలిగిపోయిన చొక్కాలు, జస్ట్ క్యాజువల్ లుక్. ఇప్పడు మన దగ్గర కూడా బాలీవుడ్ ట్రెండ్ వచ్చింది. సినిమా సినిమాకు కాస్త గెటప్ చేంజ్ చేయడం. కాంటెంపరరీ హీరోలంతా అదే చేస్తున్నారు. నేను మరీ అంతలా కాదు కానీ, కాస్త నాకంటూ ఓ ఇంట్రస్ట్ వుంటుంది కదా..అదన్నమాట.

కామెడీ కథలు, దర్శకులు..ఇండస్ట్రీ నీడ్ కు సరిపడా స్టాకు వున్నట్లేనా?

అంటే ఆ మాటకు వస్తే, జంధ్యాల, నాన్నగారు, వంశీగారు తరువాత ఆ రేంజ్ కు ఫన్ ను తీసుకెళ్లి, ఆయన మంచి కామెడీ సినిమాలు తీస్తాడు అనిపించుకున్న వారు ఇంకా సరిగ్గా లేరనే చెప్పాలి. నాగేశ్వర రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇలా కొంత మంది ట్రయ్ చేస్తున్నారు అనుకోండి. ఏదైనా వెలితి వుంది. 

మొత్తానికి జేమ్స్ బాండ్ మీ కెరీర్ కు టర్న్ అరౌండ్ అవుతుందనుకుంటున్నారా?

హిట్ ఫ్లాప్ లు అన్నవి కామన్ అండీ. మనం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్లాలి. వెళ్తున్నా. జేమ్స్ బాండ్ మాత్రం మంచి నవ్వుల హిట్ అవుతుందన్న నమ్మకం నూటికి నూరుపాళ్లు వుంది.

-విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?