Advertisement

Advertisement


Home > Movies - Interviews

మల్టీ స్టారర్లు చేయడం నాకు అంత ఇష్టం వుండదు

మల్టీ స్టారర్లు చేయడం నాకు అంత ఇష్టం  వుండదు

కార్తీ..తెలుగు మాస్ ఆడియన్స్ కు దగ్గరైన తమిళ కథానాయకుడు.  విభిన్నమైన అతని స్టయిల్, ఆ చూపు, మాట విరుపు మన జనాలకు భలే ఇష్టం. అయితే ప్రతి సినిమా భిన్నంగా వుండాలన్నది కార్తీకి ఇష్టం. ఈ రెండు మ్యాచ్ అయితే సినిమా హిట్. లేదంటే లేదు. ఇలా సినిమాలకు, సక్సెస్ కు మధ్య ఫైట్ చేస్తూనే తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతూ వస్తున్నాడు హీరో కార్తీ.

తమిళ సూపర్ స్టార్ తమ్ముడిగా కాకుండా తనకు అంటూ ఓ ప్రత్యేకమైన అయిడెంటిటీ తెచ్చుకున్న హీరో. సరైన సినిమా పడని నేపథ్యంలో ఊపిరి లాంటి డిఫరెంట్ సినిమా వచ్చి, కార్తీని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

ఆ సినిమా తరువాత మళ్లీ మరోసారి కాష్మోరా లాంటి డిఫరెంట్ క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కార్తీ. ఊపిరి సినిమాను నిర్మించిన పివిపి సంస్థ రెండేళ్ల సమయం, కోట్ల వ్యయం భరించి నిర్మించిన సినిమా కాష్మోరా. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం కేరళ నుంచి హైదరాబాద్ వచ్చి, కేవలం మూడు నాలుగు గంటల వున్న బిజీ సమయంలో, గ్రేట్ ఆంధ్రతో కాస్సేపు ముచ్చటించారు.

ఊపిరితో నవ్వించి కాష్మోరాతో భయపెట్టబోతున్నారా?

భయపడతారంటారా? నన్ను చూసి..అలా అయితే సక్సెస్ అయినట్లే. కానీ ఈ సినిమా కేవలం హర్రర్ మాత్రమే కాదండీ. ఫన్ కూడా వుంటుంది.

అసలు ఏమిటీ కాష్మోరా? ఓ రేంజ్ కు చేరుకున్నాక, మాంచి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటారు ఏ హీరో అయినా?

లేదండీ. నాకు మాత్రం కథ నచ్చితేనే సినిమా. ప్రేక్షకులకు నచ్చాలి..బాగా ఆడాలి..అది కూడా అవసరమే. కానీ అంతకన్నా ముందుగా నాకు కథ భలేగా వుంది అనిపించాలి. ఆ మధ్య తమిళ్ లో మదరాసు సినిమా చేసాను ఇలా నచ్చే.

కానీ అలా అని అభిమానులు మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో అన్నది కూడా గమనించాలి కదా?

నన్ను అభిమానించిన వాళ్లకు నేను డిఫరెంట్ గా ప్రయత్నించినా నచ్చుతుందనే నమ్మకం. కాష్మోరా కూడా ప్రయోగం ఏమీ కాదండి. రెగ్యులర్ సినిమాల్లో వుండే ఫన్ అంతా ఈ సినిమాలోనూ వుంటుంది. ఒక్క అరగంట మాత్రమే పీరియడ్ డ్రామా వుంటుంది. ఆ క్యారెక్టర్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు.

కాష్మోరాలోని ఒక క్యారెక్టర్ లో మిమ్మల్ని గుర్తు పట్టడమే కష్టంగా వుంది.

అవును..అలాగే వుండాలి. మిలటరీ క్యారెక్టర్ అంటే ఆ లుక్ వుండాలి. నేను ముందే చెప్పాను. నా క్యారెక్టర్ కు తగిన లుక్ డిజైన్ చేయమని, కష్టపడి అలాగే చేసారు. నాకు కూడా అలా చేయడమే నచ్చుతుంది.

మిమ్మల్ని అంతగా ఇన్ స్పియర్ చేసిన విషయం ఏమిటి? కాష్మోరాలో?

చందమామ కథ అంటే ఎవరికి ఇష్టం వుండదు చెప్పండి. అలాంటి ఓ కథ. ఇందులో అన్నీ వున్నాయి. కాస్త భయం, ఎక్కువ ఫన్, కానీ ముందే చెప్పేస్తున్నా, రొమాన్స్ మాత్రం వుండదండీ.

అవునా, ఊపిరిలో మీ ఇన్నోసెంట్ ఫేస్, తమన్నాకు లైనేయడం..మరిచిపోతే ఎలా?

అవును.అది ఆ సినిమా వరకు, కానీ ఈ సినిమాలో రొమాన్స్ కు ప్లేస్ లేదు. అయితేనేం ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. అందుకే ప్రేక్షకులకు ముందే చెప్పేస్తున్నా ఈ విషయం.

చాలా టైమ్ పట్టినట్లుంది ఈ సినిమా నిర్మాణానికి.

వాస్తవానికి ఈ సినిమాను ఎప్పుడో స్టార్ట్ చేసాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాం, బాహుబలి వచ్చింది. దాంతో అన్నీ ఆపేసి, మొత్తం క్వాలిటీ, స్టాండర్స్ అన్నీ పూర్తిగా అప్ గ్రేడ్ చేసాం. అంటే బాహుబలి రేంజ్ లో వుండాలని కాదు. కానీ మగధీర రేంజ్ లో అయినా వుండాలి కదా?  అందులో కూడా కొంతే కదా పీరియడ్ డ్రామా వుంటుంది.

మరి ఆ రేంజ్ సినిమా తీస్తూ, ఇంత లో ప్రొఫైల్ లో పబ్లిసిటీకి కారణం?

జనం ఏమనుకుంటారో అని. వీళ్లేదో మరో బాహుబలి తీస్తున్నారు అని భారీ అంచనాలతో వస్తే? అందుకే మన సినిమాను అలా స్మూత్ గా థియేటర్లలోకి తీసుకెళ్తే చాలు, నచ్చితే ప్రేక్షకులే ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాను నేను నిర్మాతలకు.

మలయాళ వెర్షన్ కూడా విడుదల చేస్తున్నట్లున్నారు.

అవునండీ కేరళలో వందకు పైగా, తమిళనాట 350కి పైగా, తెలుగులో 600కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. అంటే దాదాపు వెయ్యి థియేటర్లన్నమాట. ఆ విధంగా నాకు భారీ సినిమా అనే కదా.

ఊపిరి తరువాత తెలుగులో ఆఫర్లు పెరిగి వుండాలే.

అది వాస్తవమే కానీ నచ్చే కథలు ఏవీ ఇంతవరకు రాలేదండీ. అదే సమస్య.

పెద్ద డైరక్టర్లు ఎవరూ మిమ్మల్ని అప్రోచ్ కాలేదా? మీరు కూడా అడగలేదా ?

ఎక్కడండీ..అందరూ ఫుల్ బిజీ, ఒక్కొక్కరికి రెండు మూడు సినిమాలు వున్నాయి లైన్ లో.  ఇంక వాళ్లేం అడుగుతారు..వాళ్ల బిజీ తెలిసి కూడా నేనేం అడుగుతాను. వెయిట్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకో సమస్య కూడా వుందండీ. తెలుగులో నా సినిమా చేసినా, అది తమిళ్ లో కూడా మార్చాల్సిందే. అక్కడ మంచి రైటర్ కావాలి. ఇక్కడి డైరక్టర్ తో వాళ్లకు సింక్ కావాలి. వంశీ పైడిపల్లి ఆ స్ట్రైన్ అంతా తీసుకున్నారు.

మల్టీ స్టారర్ ఆఫర్లు కూడా రాలేదా?

నిజం చెప్పనా? నాకు మల్టీ స్టారర్లు ఇష్టం లేదండీ. ఊపిరి కథ నచ్చింది. నాగ్ సార్ అంటే నాకు గౌరవం. అందుకోసం చేసాను.

అంటే ఇక మీదట తెలుగులో మీ సినిమాలో సోలోనే అన్నమాట.

అంతేనండీ..మంచికో, చెడుకో, మనకు నచ్చిన సినిమా మనం చేయడమే.

మీ తరువాతి తమిళ్ ప్రాజెక్టులు తెలుగుకు కూడా పనికి వచ్చేవే అనుకుంటా?

అవునండీ ఒకటి మణిరత్నం గారిది. సో తెలుగువారికి పరిచయం అని దర్శకుడు ఆయన. ఇంకోటి యాక్షన్ ఎంటర్ టైనర్. అంటే ఇక్కడి ప్రేక్షకులకు కూడా నచ్చే సబ్జెక్ట్. ఈ రెండు సినిమాల తరువాతే మరేమయినా.

థాంక్యూ అండీ.బెస్టాఫ్ లక్

థాంక్యూ అండీ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?