Advertisement

Advertisement


Home > Movies - Interviews

నేనేవర్నీ సినిమాలు చేయమని అడగలేదు

నేనేవర్నీ సినిమాలు చేయమని అడగలేదు

ఎన్టీఆర్..టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. వారసత్వం.. ప్రతిభ.. అన్నీ కలిసి వచ్చినా, అదృష్టం ఇంకా కాస్త దోబూచులాడుతూనే వున్న కెరీర్ ఎన్టీఆర్ స్వంతం. టెంపర్ నుంచి మళ్లీ బండి కాస్త గాడిలో పడింది. నాన్నకు ప్రేమతో మంచి విజయాన్నే అందించింది. ఇప్పుడు జనతా గ్యారేజ్. టాలీవుడ్ డైరక్టర్లలలో టాప్ చెయిర్ ల్లో కూర్చున్న కొరటాల శివ కాంబినేషన్ లో ఎన్టీఆర్ సినిమా. ఈ సినిమా మరి కొన్ని గంటల్లో జనం ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మనసులోని మాటలు కొన్ని.

రాను రాను మీ మాటల్లో డెప్త్ పెరుగుతోంది..ఫిలాసఫీ మరింతగా తొంగి చూస్తోంది.?

ఫిలాసఫీ అని కాదు. వాస్తవాలు మాట్లాడుతున్నాను. పాజిటివ్ థింకింగ్ తో ముందుకు వెళ్తున్నాను. నేను చెబుతున్నవి నిజాలే కదా? ఈ రోజు మాత్రమే మనది..రేపు ఎలా వుంటుందో తెలియదు. ఇవన్నీ కరెక్టే కదా?

ఇలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తోంది? చిన్న వయసులోనే విజయాలు, అపజయాలు, మీరన్నట్లు దెబ్బలు చూడడం వలనా?

కాదు..జీవితాన్ని చూడడం వలన. చిన్న కుర్రాడ్ని కాదు కదా? చూస్తుండగానే, నాకు తెలియకుండగానే ముఫై రెండు దాటేస్తున్నా. ఇప్పటికి కూడా ఇంకా ప్రాక్టికల్ గా ఆలోచించకుంటే ఎలా?

మీ ఫ్యామిలీలో నాన్నగారు కావచ్చు..బాబాయ్ కావచ్చు..కొన్ని నమ్మకాలు వున్నవారు. మాలలు, రుద్రాక్షలు ఇలా చాలా వుంటాయ్ ఒంటి మీద. మీకు కూడా అలాంటి నమ్మకాలున్నాయా?

నాన్నగారు, బాబాయ్ ల నమ్మకాలను కామెంట్ చేసేంత లేదా, వాటి గురించి మాట్లాడేంత పెద్దవాడిని కాదు. కానీ హార్డ్ వర్క్ నే నమ్ముకోవాలి ఎవరైనా. బాబాయ్ చూడండి. ఈ వయసులో కూడా శాతకర్ణి కోసం ఎంత కష్టపడుతున్నారో? నేను కూడా అంతే హార్డ్ వర్క్. ఆపై అదృష్టం ఇలాంటివి అంటారా? ఏమో?

మీకు కూడా దైవభక్తి వుందా? ఏ రేంజ్ లో?

మనకన్నా గొప్పవారు, మన కన్నా గొప్ప శక్తి ఎప్పుడూ వుంటుంది అని నమ్ముతాను నేను. అలాంటి నమ్మకం లేకుంటే మనిషిగా వుండలేం. అందుకే నమ్ముతాను.

అంటే గుళ్లు, గోపురాలు సందర్శిస్తుంటారా?

వైనాట్. అయితే పనిగట్టుకుని కాదు. వెళ్లాల్సినపుడు వెళ్తుంటా.

కమింగ్ బ్యాక్ టు మూవీ..మీరు కొరటాల శివను వత్తిడి చేసారా? తనతో సినిమా చేయమని?

హ్హ..హ్హ..హ్హ..మీకు తెలుసా..కొరటాల శివది నాది బాంధవ్యం వేరు. ఆ బాంధవ్యం లెవెల్ కు నేను శివను అడగాల్సిన పని లేదు. అయినా నేను ఎఫ్పుడూ సక్సెస్ వెంట పరుగెత్త లేదు. అసలు ఇంతవరకు నేను ఏ డైరక్టర్ ను నాతో సినిమా చేయండి అని అడగలేదు. ఇది వాస్తవం. అన్ని సినిమాలు అలా సెట్ అయ్యాయి అంతే.

మరి త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడం ఎందుకు కుదరడం లేదు.?

చెప్పాను కదా? నేను ఎవర్నీ అడగను. ఏమో, ఆ రోజు వస్తే చేస్తామేమో? త్రివిక్రమ్ గారికి నాకు మంచి స్నేహం వుంది. ఎప్పుడూ టచ్ లోనే వుంటాం. ఇక్కడ మీకు ఓ విషయం చెప్పాలి. నా పర్సనల్ సర్కిల్ అనేది ఒకటి వుంది. ప్రొఫెషనల్ సర్కిల్ అనేది వేరు. నేను ఈ రెండింటిని కలపను. ఈ పరిచయాలు, స్నేహాలు, అనుబంధాలు వేరు. సినిమాలు వేరు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎప్పుడూ సినిమా విషయం మీరు డిస్కస్ చేయలేదా?

నో..నాకైతే అలాంటి జ్ఞాపకం లేదు. బట్ ఆయన నేను చాలాసార్లు కలిసాం. మా ఇంట్లో కూడా. అదంతా ఫ్రెండ్ షిప్. 

కానీ ఇప్పుడు టాప్ హీరోలంతా, తమ తమ సినిమాలను చాలా పెర్ ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. తరువాత ఎవరితో అన్నది వారే డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇది మీకు కూడా అవసరం కదా?

లేదు. టెంపర్ నేనేమన్నా ప్లాన్ చేసానా? నాన్నకు ప్రేమతో ప్లాన్ చేసానా? లేదే..అంతెందుకు ఈ జనతా గ్యారేజ్? జస్ట్ హాపెన్డ్ అంతే. 

తరువాతి సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ లో అని ప్రకటించారు కదా?

అవును. అది నిర్మాణం వరకు. ఎవరితో అన్నది చూడాలి. 

వక్కంతం వంశీ మిమ్మల్ని వదిలి బయటకు వెళ్లారని?

లేదే...ఆయన స్క్రిప్ట్ నాదగ్గరే వుంది. డిస్కషన్ జరుగుతోంది. డిసైడ్ కాలేదంతే.

కొన్ని ప్రశ్నలను మీరు అవాయిడ్ చేస్తారు అనిపిస్తోంది?

సందర్భోచిత ప్రశ్నలు అయితే అవాయిడ్ చేయను. అసందర్భం అనుకుంటే మాత్రం నో. ఇప్పుడు సందర్భం ఏమిటి? దానికి సబంధించి అయితే నాకేం అభ్యంతరం లేదు. కొన్ని ప్రశ్నలు వుంటాయి..పదేపదే అదే అడుగుతారు. అక్కడే కాస్త ఇబ్బందిగా వుంటుంది. 

కానీ మీరు మీడియా ముందుకు వచ్చేది సినిమా విడుదల సందర్భంలోనే కదా? అప్పుడు మరి మీ మనసులోని మాటలు తెలుసుకునేది ఎలా?

మీరు అలా అంటే మరోసారి మీకు ఫ్యామిలీ ఇంటర్వూ ఇస్తాను. అన్నీ చెబుతాను. 

పోనీ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి.. బాబాయ్ బాలకృష్ణ తో మీరు మాట్లాడి ఎన్నాళ్లు అయి వుంటుంది.?

అదేంటీ..మేము మాట్లాడుకుంటూనే వుంటాం. చెప్పానుగా ఈ సారి ఫ్యామిలీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. అప్పుడు అన్నీ చెబుతాను.

పదే పదే నందమూరి ఫ్యాన్స్ అంతా ఒకటే అని ఫ్యాన్స్ కు నొక్కి చెప్పడం ఎందుకంటారు?

నొక్కి ఎక్కడ చెప్పాను? అయినా 2000 సంవత్సరం నుంచి అదే ముక్క చెబుతున్నాను. 

నేను అడుగుతున్నదీ అదే. అలా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటీ అని?

ప్రత్యేకంగా ఏమీ లేదు. మనమంతా ఓ కుటుంబం అని చెప్పడంలో భాగం తప్ప. ఇంకేం కాదు. 

టెంపర్ నలభై దగ్గర, నాన్నకు ప్రేమతో 50 దగ్గర ఆగిపోయాయి. మరి అలాంటపుడు జనతా గ్యారేజ్ 63 కోట్ల విక్రయాలు అంటే..? 80 రావాలి కదా?

అవన్నీ నేను పట్టించుకోను. సినిమాలెక్కలు, బడ్జెట్ ఇవన్నీ కావాలంటే మరోసారి కూర్చుందాం మనం. డిటైల్డ్ గా చెబుతాను.  అదంతా బిజినెస్ వ్యవహారం.

కావచ్చు. కానీ అల్టిమేట్ గా బయ్యర్ సేఫ్ కావాలి కదా?

ఎస్..సినిమా విజయం సాధించడం కోసం అందరూ కష్టపడతారు. అందులో పార్ట్ నే ఈ బిజినెస్ కూడా.

రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కీలకంగా చేపట్టిన మొక్కల పెంపకం అన్నది అండర్ కరెంట్ గా మీ సినిమా సబ్జెక్ట్ కావడం.?

నాకు చాలా ఆనందంగా వుందండీ. మీకు తెలుసుగా మేం ముందే స్టార్ట్ చేసాం సినిమాను. అయినా రెండు ప్రభుత్వాలు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినందుకు చాలా ఆనందంగా వుంది.

మీరు పర్సనల్ గా మొక్కలు పెంచుతారా? ఇష్టమేనా?

అబ్బో..మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తా ఓసారి. మీరే చూద్దురుగాని. 

జనతా గ్యారేజ్ తరువాత మీ మీద అంచనాలు మరింత పెరుగుతాయేమో? 

నా వరకు నేను అలాగే వుంటాను. హిట్, కాదు, అన్నది జస్ట్ ఫ్యూడేస్ మాత్రమే. నా పని నాదే. చేసుకుంటూ వెళ్లడమే. 

బెస్టాఫ్ లక్ సర్

థాంక్యూ

విఎస్ఎన్ మూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?