Advertisement

Advertisement


Home > Movies - Interviews

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇంటర్వ్యూ

డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ ఇంటర్వ్యూ

పూరి జగన్నాథ్‌... పరిచయం అక్కర్లేని పేరు ఇది. తన పేరునొక బ్రాండ్‌గా మార్చేసిన అతి కొద్ది మంది దర్శకుల్లో పూరి ఒకరు. ఏ దర్శకుడైనా ఏడాదికి ఒక్క సినిమా తీయడం గగనం అయిపోతున్న ఈ రోజుల్లో హిట్టొచ్చినా, ఫ్లాపొచ్చినా... బ్రేక్‌ లేకుండా, రెస్ట్‌ తీసుకోకుండా వరుసగా సినిమాలు తీసే అలవాటున్న ఏకైక దర్శకుడు. ఇప్పటికే పాతిక సినిమాలు పూర్తి చేసేసిన పూరి చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ స్వీయ నిర్మాణంలో ‘హార్ట్‌ ఎటాక్‌’ తెరకెక్కించారు. ఇకపై ‘పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌’ బ్యానర్‌పై వరుసగా సినిమాలు నిర్మిస్తానని, కొత్త దర్శకులతో కాన్సెప్ట్‌ సినిమాలు, చిన్న చిత్రాలు రెగ్యులర్‌గా నిర్మిస్తానని అంటున్న పూరి జగన్నాథ్‌ తన కొత్త సినిమా ‘హార్ట్‌ ఎటాక్‌’ గురించిన విశేషాలతో పాటు మరెన్నో ముచ్చట్లు గ్రేట్‌ఆంధ్రకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారు. 

‘హార్ట్‌ ఎటాక్‌’... అసలేమిటిది, కమర్షియల్‌ సినిమానా, ఎక్స్‌పెరిమెంటా?    

హార్ట్‌ ఎటాక్‌ ఒక లవ్‌స్టోరీ. కంప్లీట్‌ లవ్‌ స్టోరీ. నేను లవ్‌స్టోరీ చేసి చాలా రోజులైంది. ‘ఇడియట్‌’ తర్వాత మళ్లీ నేను చేసిన ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌ లవ్‌స్టోరి ఇది. ఎక్స్‌పెరిమెంట్‌ అయితే ఖచ్చితంగా కాదు. కమర్షియల్‌ లవ్‌స్టోరీ.. యాక్షన్‌, సాంగ్స్‌ అన్నీ ఉంటాయి. 

పోకిరి తర్వాత ఎక్కువగా కమర్షియల్‌ సినిమాలు చేస్తున్న మీరు సడన్‌గా ఇప్పుడు లవ్‌స్టోరీ చేయడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా?

యస్‌ ఉంది... ఒక పాట ఈ కథ రాయడానికి నన్ను ఇన్‌స్పయిర్‌ చేసింది. ‘ఇద్దరమ్మాయిలతో’ షూటింగ్‌లో ఉన్నప్పుడు హిందీ సినిమా ‘రాక్‌స్టార్‌’లోని ఏ.ఆర్‌. రెహమాన్‌ కంపోజ్‌ చేసిన ‘ఔర్‌ హో’ అనే సాంగ్‌ విన్నాను. ఆ సాంగ్‌ వినగానే నాకెందుకో బాగా నచ్చేసింది. ఆ సాంగ్‌ విన్న తర్వాత కూర్చుని గంటలో ఈ కథ రాసేసాను.

నితిన్‌ పిలక వేసుకుని చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడిందులో...

ఇందులో తనది ట్రావెలర్‌ క్యారెక్టర్‌. హిప్పీ! ఈ ఊరూ, ఆ ఊరూ తిరుగుతూ ఏదో ఒక పని చేసుకునే క్యారెక్టర్‌ అన్నమాట. ఆ క్యారెక్టర్‌కి తగ్గట్టుగా లుక్‌ ఉండాలని అలా ట్రై చేశాం. యూరప్‌లో ఇలాంటి హిప్పీస్‌ని చాలా మందిని చూసా. చాలా డిఫరెంట్‌ లైఫ్‌స్టయిల్‌ వాళ్లది. మొబైల్‌ కిచెన్‌, మొబైల్‌ బెడ్‌ అన్నీ పెట్టుకుని తిరుగుతా ఉంటారు. మన ఆడియన్స్‌కి కూడా కొత్తగా ఉంటుంది కదా అని హీరో క్యారెక్టర్‌ని అలా డిజైన్‌ చేసానంతే.

మీ హీరో హిప్పీ అయినా, ఇంకేదైనా బై డిఫాల్ట్‌ ‘ఇడియట్‌’లో రవితేజలా మాట్లాడాల్సిందేనా?

రవితేజ గుర్తొస్తున్నాడా. బేసిగ్గా నా హీరోలంతా అంతే. అలాగే మాట్లాడతారు. నితిన్‌ని చూస్తే ఇడియట్‌లో రవితేజ గుర్తొస్తే మంచిదే కదా. మంచి క్యారెక్టర్‌ అది కూడా. పైగా హిట్‌ సినిమా (నవ్వుతూ). 

నితిన్‌ ఈమధ్య యాక్షన్‌ తగ్గించేసి వరుసగా రెండు లవ్‌స్టోరీస్‌ చేసాడు. మళ్లీ మీ సినిమాలో ఫైట్లు ఎక్కువ చేయించినట్టున్నారు?

యాక్షన్‌ పార్ట్‌ అంత ఎక్కువేమీ ఉండదిందులో. పార్ట్‌ ఆఫ్‌ ది స్టోరీ అంతే. కొన్ని ఫైట్స్‌ ఉంటాయి కానీ బాగా వయొలెంట్‌గా ఉండే యాక్షన్‌ పార్ట్‌ ఏమీ ఉండదు. బేసిగ్గా ఇది లవ్‌స్టోరీ. మిగతా ఎలిమెంట్స్‌ అన్నీ ఉంటాయి. 

నితిన్‌కి హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ అవుతుందనుకోవచ్చా?

డెఫినెట్‌గా. తన లాస్ట్‌ టూ ఫిలింస్‌ చాలా మంచి హిట్స్‌. ఇది కూడా అలానే సూపర్‌ హిట్‌ అవుతుంది. మంచి యాక్టరతను. ఐ యామ్‌ వెరీ హ్యాపీ విత్‌ నితిన్‌. 

మరి అదా శర్మ సంగతేంటి?

అదా శర్మ నాకు త్రీ ఇయర్స్‌ నుంచి తెలుసు. గుడ్‌ పర్‌ఫార్మర్‌.. అండ్‌ ఆల్సో కథక్‌ డాన్సర్‌ తను. చాలా షోస్‌ ఇచ్చింది. వాళ్ల మదర్‌ కూడా మంచి డాన్సర్‌. ఎప్పట్నుంచో కలిసినప్పుడల్లా చేద్దాం, చేద్దాం అనుకునేవాళ్లం. కానీ కుదర్లేదు. ఈ సినిమాకి చాలా మంది అమ్మాయిల్ని స్క్రీన్‌ టెస్ట్‌ చేసాను. ఆ టైమ్‌లో స్క్రీన్‌ టెస్ట్‌ కోసం అదా వచ్చింది. ‘నువ్వు అందరినీ స్క్రీన్‌ టెస్ట్‌ చేస్తున్నావ్‌. నన్ను మాత్రం చేయట్లేదు’ అని కూర్చుంది. సరే అని తనని కూడా స్క్రీన్‌ టెస్ట్‌ చేసాను. యూజువల్‌గా ఎప్పుడూ నాకు నచ్చిన అమ్మాయిని నేనే సెలక్ట్‌ చేస్తుంటాను. ఎవరినీ అడగను. కానీ ఈ సినిమాకి మాత్రం ఒక పది మంది అమ్మాయిల్ని సెలక్ట్‌ చేసి, ఆ వీడియోస్‌ యూనిట్‌ అందరికీ వేసి... వీళ్లలో ఏ అమ్మాయి నచ్చిందంటే అందరూ అదా శర్మకి ఓటేసారు. సో అలా మా సినిమా యూనిట్‌ మొత్తం సెలక్ట్‌ చేసిన హీరోయిన్‌ తను. వెరీ గుడ్‌ పర్‌ఫార్మర్‌. చాలా బాగా చేసింది. 

బిజినెస్‌మేన్‌కి ముందు ఇది సూపర్‌హిట్‌ సినిమా అని నా గట్‌ ఫీలింగ్‌ అన్నారు. మరి హార్ట్‌ ఎటాక్‌కి కూడా అలాంటి గట్‌ ఫీలింగ్‌ ఉందా?

యా.. ఇది కూడా సూపర్‌హిట్‌ సినిమా అవుతుందనేదే నా గట్‌ ఫీలింగ్‌. ప్రతి సినిమాకీ ఖచ్చితంగా హిట్‌ అవుతుందనే అనుకుంటాం. అలా అనుకోకపోతే ఏ సినిమా తీయం కదా. కాకపోతే ఈ సినిమాకి ఎక్కువ నమ్మకం ఉంది. ఎందుకంటే సెన్సార్‌ చేసిన తర్వాత సినిమా చూసిన బోర్డ్‌ మెంబర్స్‌ అంతా కూడా చాలా బాగుందని అన్నారు. మా సినిమాకి బయటి వాళ్ల నుంచి వచ్చిన ఫస్ట్‌ టాక్‌ అదే. ఆ టాక్‌ విన్న తర్వాత ఐ యామ్‌ వెరీ హ్యాపీ. కాన్ఫిడెన్స్‌ ఇంకా పెరిగింది. 

సినిమా ఏమాత్రం బాగోకపోయినా ‘హార్ట్‌ ఎటాక్‌’ అనే టైటిల్‌ని ఈజీగా కామెడీ చేస్తారు, కామెంట్స్‌ వేస్తారు. ఈ సంగతి తెలిసి కూడా ఈ టైటిల్‌ ఎందుకు పెట్టారు. 

అవును నిజమే... ‘నేను హార్ట్‌ ఎటాక్‌ ఇవ్వకపోతే నాకొస్తది గురూ’ (నవ్వుతూ). బట్‌ నచ్చుతుందిలెండి. సినిమా బాగుంటే ఏ టైటిల్‌ అయినా బాగుంటుంది. ఈ సినిమాకి హార్ట్‌ ఎటాక్‌ అనే టైటిల్‌ పెట్టడానికో రీజన్‌ ఉంది. హీరోయిన్‌ కనిపించినపుడు హీరో హార్ట్‌ ఎటాక్‌ వచ్చినట్టు యాక్ట్‌ చేస్తాడు... ఆ అమ్మాయితో పరిచయం కోసం. తెలీకుండానే వాడు ఆ అమ్మాయి లవ్‌లో పడి తర్వాతొక రోజు నిజంగానే హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది వాడికి. దట్స్‌ ది ఐడియా. 

ఈ కథ వరుణ్‌తేజ్‌ (నాగబాబు తనయుడు) కోసం రెడీ చేసారంట కదా..

అవును. ఈ కథ వరుణ్‌తేజ్‌ కోసం చేసిందే. తనతోనే చేయాల్సింది. కానీ ఎందుకో అది ఆగింది. ఫైనల్‌గా నితిన్‌తో చేసా.

మీనుంచి వచ్చిన గత చిత్రాలు డిజప్పాయింట్‌ చేసాయి. స్క్రిప్ట్‌పై పూరి జగన్నాథ్‌ ఎక్కువ టైమ్‌ స్పెండ్‌ చేయడం లేదని, అందుకే మీ సినిమాలు నిరాశ పరుస్తున్నాయనే కంప్లయింట్‌ ఉంది. 

ఇప్పటికి నేను ఇరవై అయిదు సినిమాలు చేసాను. ప్రతి సినిమా కథ కోసం నేను పది, పదిహేను రోజుల కంటే ఎక్కువ వర్క్‌ చేయలేదు. ఏ సినిమాకైనా నేను కథ రాసుకునే టైమ్‌ అంతే. ఒకోసారి వర్కవుట్‌ అవుతాయి. ఒక్కోసారి అవ్వవు (నవ్వుతూ). బట్‌ ఈ సినిమా స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. ఈ సినిమాని చాలా మందికి చూపించాను. సజెషన్స్‌ ఏమైనా ఉంటే తీసుకున్నాను. చిన్న చిన్న కరెక్షన్స్‌ ఉంటే చేసాను. కొన్నిటిని ఎడిట్‌ చేసి, కొన్ని సీన్స్‌ యాడ్‌ చేసాను. ఈ సినిమాకి అయితే మీరనేలాంటి కంప్లయింట్స్‌ అయితే ఏమీ ఉండవు. 

మీరు స్క్రిప్ట్‌ రాసుకునే ప్రాసెస్‌ ఎలా ఉంటుంది?

నేను ఏదైనా ఒక లైన్‌ అనుకుంటాను. అనుకున్న వెంటనే బ్యాంకాక్‌ వెళతాను. అక్కడ బీచ్‌లో కూర్చుని కథ రాసుకోవడం అలవాటు నాకు. అక్కడో వన్‌ వీక్‌ ఉంటాను. ఆ వన్‌ వీక్‌లో సీనిక్‌ ఆర్డర్‌ వేస్తాను. అది అయిపోగానే వచ్చేస్తాను. వచ్చి షెడ్యూల్‌ ప్లాన్‌ చేసేయమని నా టీమ్‌ అందరికీ ఇచ్చేస్తాను. వాళ్లు లొకేషన్స్‌, షెడ్యూల్స్‌ అన్నీ ప్లాన్‌ చేసుకునే పనిలో ఉంటారు. అప్పుడు మళ్లీ బ్యాంకాక్‌ వెళ్తాను. వెళ్లి ఇంకో వన్‌ వీక్‌ కూర్చుని డైలాగ్స్‌ రాస్తాను. వచ్చేసి షూటింగ్‌ స్టార్ట్‌ చేసేస్తాను. ఇన్ని సినిమాలు చేసాను... అన్నిటికీ జరిగిన ప్రాసెస్‌ ఇంతే... అంతకంటే ఏమీ ఉండదు. 

రెండు వారాల్లో మొత్తం రాసేస్తారా?

అంతే. రెండు వారాలు కూడా పూర్తిగా ఉండదు. డైలాగ్స్‌ రాయడానికి మాగ్జిమమ్‌ ఫైవ్‌ డేస్‌ తీసుకుంటాను. 

పోకిరి స్క్రిప్ట్‌ కూడా రెండు వారాల్లోనే రాసేసారా?

అన్నీ. ఒక్క పోకిరి అనే కాదు.. దేనికైనా అంతే టైమ్‌ తీసుకుంటాను. ఒక్కోసారి ఫుల్‌గా కాన్సన్‌ట్రేట్‌ చేయలేకపోవచ్చు. ఫోకస్డ్‌గా ఉండకపోవచ్చు. కథ రాస్తున్న ఆ ఏడు రోజుల్లో ఫోకస్డ్‌గా ఉంటే ఒకలా, డిస్టర్బ్‌డ్‌గా ఉంటే ఒకలా ఉంటుంది అవుట్‌పుట్‌. అందువల్లే రిజల్ట్స్‌లో తేడా వస్తుందేమో కానీ దేనికి పని చేసేది అయినా అదే టైమ్‌. 

పోకిరి తర్వాత దాదాపుగా ప్రొడక్షన్‌ ఆపేసారు. మళ్లీ ఇప్పుడు ఈ సినిమాని మీరే నిర్మించడానికి కారణమేంటి? 

యా.. ప్రొడక్షన్‌ మానేసి చాలా రోజులైంది. మళ్లీ స్టార్ట్‌ చేద్దాం.. ఈ బ్యానర్‌లో నేను మాత్రమే కాకుండా కొత్తవాళ్లతో కూడా ప్రొడ్యూస్‌ చేయాలి అనే ప్లాన్‌తో హార్ట్‌ ఎటాక్‌తో మళ్లీ ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేసాను. 

వైష్ణో అకాడమీ సక్సెస్‌ఫుల్‌ బ్యానర్‌ కదా. మరిప్పుడు పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ అంటూ పేరు మార్చేసారేంటి? 

ప్రత్యేకించి కారణాలేమీ లేవు. జస్ట్‌ ఫర్‌ ఏ ఛేంజ్‌ అంతే. మన ఇంటికి సున్నాలు వేసి, ఫర్నీచర్‌ అదీ మారుస్తూ ఉంటాం... ఇది కూడా అంతే. కొత్త ఎనర్జీ కోసమే తప్ప అంతకంటే ఏమీ లేదు. మళ్లీ ఈ బ్యానర్‌లో చాలా సినిమాలు తీయాలి అనుకుంటున్నాను. ప్రొడక్షన్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నాను. 

మీ నెక్స్‌ట్‌ సినిమా మహేష్‌తో అని న్యూస్‌ వచ్చింది..

అవును. శ్రీనువైట్లతో మహేష్‌ చేస్తున్న సినిమా అయిపోగానే మా సినిమా ఉంటుంది. 

మహేష్‌తో పోకిరి 2 అన్నారు, తర్వాత బిజినెస్‌మేన్‌ 2 అన్నారు... ఇప్పుడు మీరు చేయబోతున్న సినిమా దేనికి సీక్వెల్‌?

అవేవీ కాదు. ఈసారి కొత్త స్టోరీతోనే చేస్తాం. ఒక ఐడియా అయితే ఉంది. హార్ట్‌ ఎటాక్‌ రిలీజ్‌ అయిపోగానే బ్యాంకాక్‌ వెళ్లి మహేష్‌ సినిమాకి స్క్రిప్ట్‌ రాయాలి. 

ఎన్టీఆర్‌కి కూడా రీసెంట్‌గా కథ చెప్పారంట కదా..

ఎన్టీఆర్‌కి ఎప్పుడో చెప్పాను. నాలుగైదు సార్లు కథలు చెప్పాను. ఇద్దరం చేద్దామనుకుంటాం... కానీ ఎందుకో అది లేటవుతూ వస్తోంది. మేమిద్దరం కలిసి చేసి చాలా రోజులైంది... తనతో ఒక సినిమా అర్జంట్‌గా ప్లాన్‌ చేయాలి. వీలయితే ఈ సంవత్సరంలోనే ఎన్టీఆర్‌తో కూడా చేయాలనుంది నాకు. 

పవన్‌కళ్యాణ్‌తో మళ్లీ ఎప్పుడు?

కళ్యాణ్‌గారు ఎప్పుడంటే అప్పుడు. ఇంతకుముందు కూడా రెండు సినిమాల మధ్య గ్యాప్‌ వచ్చింది. అలాగే మళ్లీ ఎప్పుడో ఆయనకి చేద్దామనిపించి పిలుస్తారు. అప్పుడు చేస్తాను. ఈసారి మాత్రం ఆయనతో చేస్తే ఎంటర్‌టైనరే చేస్తాను. లాస్ట్‌ టైమ్‌ కూడా ఆయనతో కంప్లీట్‌ కమర్షియల్‌ ఫిల్మ్‌ చేద్దామనే వెళ్లాను. గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌ జరుగుతున్నప్పుడు కలిస్తే సొసైటీ గురించి ఏదైనా సినిమా చేయమని ఆయన నన్ను అడిగారు. ‘ఎందుకు... కమర్షియల్‌ సినిమా చేద్దాం. సొసైటీ గురించి సినిమా అంటే పబ్లిక్‌కి అది నచ్చుద్దో లేదో’ అన్నా. ‘లేదు నా ఫాన్స్‌కి నేను ఏదోటి చెప్పాలి. ఫాన్స్‌ నన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటారు’ అని అన్నారాయన. ఆయన అలా అన్న తర్వాత వచ్చి ప్రొడ్యూసర్‌ దానయ్యగారితో చెప్పాను... ‘ఈయన సొసైటీ అంటున్నారు... మరేం చేద్దాం’ అని (నవ్వుతూ). అంత డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రొడ్యూసర్‌ని కూడా నేను అడగాలి కదండీ. కళ్యాణ్‌గారు ఇలా చేద్దామంటున్నారు అని అంటే దానయ్యగారు ఆయన ఎలా అంటే అలా చేయండి అన్నారు. అలా ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమా చేసాం. కళ్యాణ్‌గారు అయితే ఆ సినిమాతో వెరీ హ్యాపీ. ‘నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిం ఇది’ అని నాతో చెప్పారు. ఆయన పర్సనల్‌గా ఎంజాయ్‌ చేసిన సినిమా అది. బట్‌ ఫాన్స్‌ అంత రియాక్ట్‌ అవలేదు. ఫాన్స్‌ ఏమో ‘గబ్బర్‌సింగ్‌’ మూడ్‌లో ఉండి... ఇంకో గబ్బర్‌సింగ్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు కదా. నెక్స్‌ట్‌ టైమ్‌ చేస్తే కమర్షియల్‌ సినిమానే చేస్తాను తప్ప ఇలాంటివి మాత్రం వద్దు అంటాను (నవ్వుతూ). 

అప్పట్లో మీ ఇద్దరి మధ్య ఏవో డిఫరెన్సెస్‌ వచ్చాయని టాక్‌ వినిపించింది

లేదండీ.. అలాంటిదేమీ లేదు.

కెమెరామెన్‌ గంగతో రాంబాబుకి ఆడియో ఫంక్షన్‌ జరగకపోవడానికి కారణం మీ ఇద్దరి మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలే అని రూమర్స్‌ వచ్చాయి. 

ఆయన ఏదో పర్సనల్‌ రీజన్స్‌ వల్ల ఆడియో ఫంక్షన్‌ వద్దన్నారు. ఆయన వద్దంటే ఫంక్షన్‌ ఆగుతుంది కానీ... నేనొద్దంటే ఆగదు కదా (నవ్వుతూ). 

డైరెక్టర్స్‌ ఎక్కువ రెమ్యూనరేషన్‌ కావాలని డిమాండ్‌ చేస్తున్నారనే కంప్లయింట్‌ ఉంది. దీనికి మీరేమంటారు?

డైరెక్టర్స్‌ ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారనే జెలసీ ఉన్నోడు కంప్లయింట్‌ చేస్తాడు తప్ప ఇంకెవరూ దాని గురించి మాట్లాడరు. అయినా మన ప్రొడ్యూసర్లు ఏమైనా అమాయకులా? ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరి వర్త్‌ ఏమిటో వాళ్లకి తెలుసు. హీరో రెమ్యూనరేషన్‌ ఎంత.. డైరెక్టర్‌ ఎంతలో తీస్తాడు? ఇతడికి ఎంత ఇవ్వవచ్చు అని వాళ్ల క్యాలిక్యులేషన్‌ వాళ్లకి ఉంటుంది. సినిమా తీయడానికే ఎక్కువ ఖర్చు పెట్టించేసామనుకోండి.. డైరెక్టర్‌కి ఎక్కువ ఇవ్వడానికి వెనకాడతారు. అదే చెప్పిన బడ్జెట్‌లో కాంపాక్ట్‌గా తీస్తే ఒక పది రూపాయలు ఎక్కువైనా డైరెక్టర్‌ అడిగింది ఇవ్వడానికి నిర్మాతలేమీ బాధ పడరు. డిమాండ్‌ చేసేవాడు ఎంతయినా చేయవచ్చు. కానీ ఇచ్చేవాడైతే అమాయకుడు కాదుగా. ఎంతివ్వాలో వాళ్లకి తెలుసు. అంతే ఇస్తారు. 

ఒక ప్రొడ్యూసర్‌గా హార్ట్‌ ఎటాక్‌కి మీ రెమ్యూనరేషన్‌ ఎంత ఫిక్స్‌ చేసుకున్నారు?

ఈ సినిమాకి నా రెమ్యూనరేషన్‌ ఎంతనేది నాకూ తెలీదు. కొన్ని ఏరియాల్లో నేనే ఓన్‌గా రిలీజ్‌ చేస్తున్నాను. రేపు సినిమా రిలీజ్‌ అయ్యాక ఎంత వచ్చిందో అదే నా రెమ్యూనరేషన్‌. ఇప్పుడు చెప్పలేను కానీ సినిమా రిలీజ్‌ అయిన తర్వాత మళ్లీ మనం కలిసినపుడు దీనికి నా రెమ్యూనరేషన్‌ ఎంతనేది చెప్తాను (నవ్వుతూ). 

హార్ట్‌ ఎటాక్‌ బడ్జెట్‌ ఎంతయింది?

నా రెమ్యూనరేషన్‌ కాకుండా పదిహేను కోట్లు అయింది. 

చాలా సాధించారు... కొంత పోగొట్టుకున్నారు..

కొంత కాదు... మొత్తం పోగొట్టుకున్నాను.

అదే మొత్తం పోగొట్టుకున్నారు. ఇంకా సాధించాల్సింది మాత్రం ఉండిపోయింది అనే లోటు ఏదైనా ఉందా మీకు?

ఎవరికైనా మధ్యలో కష్టాలు వస్తుంటాయి... పోతుంటాయి, అది వేరే విషయం కానీ... ‘ఎవడూ ఎప్పుడూ ఎల్లకాలం సుఖంగా ఉండడు. జీవితం అందరికీ సరదా తీర్చేస్తది. నాకే కాదు, మీకే కాదు.. ఎవరికైనా సరే. నాకేంటంటే ఎక్కువ సినిమాలు చేయాలనుంటది. అది తప్ప కోరికలు కానీ, లోటు కానీ ఏమీ లేవు. అండ్‌ మనకి ఇది తప్ప ఇంకో పని రాదు. కంటిన్యూస్‌ ఫ్లాప్స్‌ వచ్చినపుడు మళ్లీ ప్రూవ్‌ చేసుకోవాలని ఉంటుంది. ఇప్పుడే కాదు... ఇంకో ఇరవయ్యేళ్లు పోయినా అదే ఉంటది.

మొత్తం పోగొట్టుకున్నారు కదా. మళ్లీ అవన్నీ తిరిగి సంపాదించేసారా?

యా.. ఆ స్టేజ్‌ అయిపోయింది. మళ్లీ ఇళ్లూ అవీ కొనుక్కుని... ఆఫీస్‌ కూడా రెడీ అవుతుంది. మళ్లీ బ్యాక్‌ అన్నమాట. 

ఈ సినిమా తీసాను.. చాలు నా లైఫ్‌కి అనిపించిన సినిమా ఏదైనా ఉందా? 

ఇది చాలు నా జీవితానికి అనిపించిన సినిమా అయితే ఏమీ లేదు. కానీ ‘బుడ్డా’ స్క్రిప్ట్‌ ఆస్కార్‌ లైబ్రరీలో పెడితే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. బచ్చన్‌గారితో సినిమా చేయడం... ఇలాంటి మొమెంట్స్‌ ఆనందాన్నిచ్చాయి. అలాగే నేనింతే, బిజినెస్‌మేన్‌ని ఎంబియే స్టూడెంట్స్‌కి మోటివేషన్‌ కోసం ఎక్కడైనా క్లాసుల్లో వాడుతుంటారట. అలాంటివి విన్నప్పుడు హ్యాపీగా ఉంటుంది. 

ఈ సినిమా తీసుండకూడదు అనిపించినది ఏదైనా ఉందా? 

అలా ఏమీ ఉండదు. అన్నీ నచ్చే చేస్తాం. కొన్నిసార్లు యావరేజ్‌ కథలు కూడా సినిమా హిట్‌ అయిపోయే సరికి అందరికీ నచ్చేస్తాయి. అదే సినిమా పోతే మంచి కథ ఉన్నా కానీ బాలేదంటారు. నేనైతే ఇది తీసుండకూడదు అని బాధ పడింది అయితే ఏదీ లేదు. 

క్రిటిక్స్‌పై మీకు ఓ విధమైన కోపం ఉన్నట్టు కనిపించింది ‘నేనింతే’లో. అది పోయిందా, ఇంకా ఉందా?

లేదండీ... నేను క్రిటిక్స్‌కి వ్యతిరేకం కాదు. నాకు వాళ్లపై ఏ కోపం లేదు. సినిమాలో క్యారెక్టర్‌కి అనుగుణంగా ఏవో డైలాగ్స్‌ ఉంటాయి. ఓ సినిమాలో ప్రకాష్‌రాజ్‌ పోలీసుల్ని తక్కువ చేసి మాట్లాడతాడు. ఒక సినిమాలో సయాజీ షిండే ప్రెస్‌ వాళ్లని తిడతాడు. అది ఆ క్యారెక్టర్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూ తప్ప అవన్నీ నావే అంటే ఎలాగ (నవ్వుతూ). ఒకసారి నా కూతురు అడిగింది... ‘చూడు నాన్నా... దేవుడు చేసిన మనుషులు రివ్యూ ఛండాలంగా రాసారు’ అని. ‘మరి ఇంతకుముందు మంచి సినిమాలు తీసినప్పుడు మంచిగానే రాసారు కదా’ అన్నాను. మంచిగా రాసినప్పుడు ఆ క్రిటిక్స్‌ గురించి ఆలోచించం మనం. అదే చెడ్డగా రాసినప్పుడు మాత్రం ‘ఈడెవడీడు.. ఈడి పేరేంటి అని పేరు గుర్తు పెట్టుకుంటాం’ (నవ్వుతూ). అదే మంచిగా రాస్తే పేరు కూడా చూడం. ఎందుకంటే మంచి సినిమా తీసామనే ఫీల్‌ మనలో ఉంటుంది. కాబట్టి మంచిగా రాసినా పట్టించుకోం. అది మనిషి నైజం. అప్పుడు చెప్పా నా కూతురితో... ‘నేను తర్వాత మంచి సినిమా చేస్తా. అప్పుడు మంచిగా రాస్తారు. దీని గురించి బాధ పడకు’ అని.

రాజమౌళి కూడా మొదట్లో మీలానే కమర్షియల్‌ సినిమాలు తీసారు. కానీ ఇప్పుడు ఆయన మగధీర, ఈగ, బాహుబలిలాంటి చిత్రాలు చేస్తున్నారు. మీరెందుకు అలాంటివి చేయడానికి ట్రై చేయడం లేదు?

నేను చేయలేను అలా. అది ఒక్క రాజమౌళి మాత్రమే చేయగలడు. ఎంత గొప్ప సినిమా అయినా కానీ ఒకే సినిమాపై రెండు, మూడేళ్లు కూర్చోవాలంటే నా వల్ల కాదు. ఒక్కో మనిషిని బట్టి అది ఉంటుంది. సంవత్సరానికి నా నుంచి రెండు, మూడు సినిమాలు వస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. రాజమౌళి సినిమా తీస్తే చూస్తాను. చూడ్డం ఈజీ కదా... చేయడం కంటే. అందుకే మనం కలిసి చూసేద్దాం, అది బెటర్‌ (నవ్వుతూ).  బట్‌ బాహుబలి మాత్రం వండర్స్‌ క్రియేట్‌ చేస్తది... ఇండియన్‌ ఫిలిం హిస్టరీలో. అంతగా ఖర్చు పెట్టి అంతలా కష్టపడుతున్నారు. ప్రభాస్‌, రాణా ఏం చేస్తున్నామనేది చెప్తూ ఉంటారు. అదొక రేంజ్‌లో ఉంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను.

                 ---------------------సరదా కబుర్లు --------------------

మీరు తీసిన చిత్రాల్లో మీకు బాగా ఇష్టమైంది ఏది?

ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, పోకిరి, బిజినెస్‌మేన్‌, నేనింతే... ఇవి నాకు బాగా నచ్చిన సినిమాలు.

మీతో వర్క్‌ చేసిన హీరోల్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు?

ఇలాంటి క్వశ్చన్స్‌ వేసి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఏ కన్ను ఇష్టమంటే.. ఏ కన్ను పేరు చెప్పినా ఇంకో కన్ను బాధ పడుతుంది. 

మీ ప్రతి సినిమాలో ఒకే హీరోయిన్‌ ఉండాలంటే ఎవరిని పెడతారు?

అమ్మో. ప్రతి సినిమాలో ఒకే హీరోయిన్‌ అంటే నాకే వద్దు... అండ్‌ పబ్లిక్‌కి కూడా వద్దు. వాళ్లకి ఎప్పుడూ కొత్త హీరోయిన్లు కావాలి. వాళ్ల ఫేవరెట్‌ హీరోకి అయినా ఎప్పుడూ హీరోయిన్లు మారుతుండాలి. ఆ హీరోకి ఇష్టమైనా కానీ వీళ్లు ఒప్పుకోరు. 

ఎన్టీఆర్‌, చరణ్‌, అల్లు అర్జున్‌, చిరంజీవి... బెస్ట్‌ డాన్సర్‌ ఎవరు?

చిరంజీవిగారు...

ఈ లిస్ట్‌లో చిరంజీవి లేకపోతే?

బన్నీ

మీరు తీసిన సినిమాల్లో చిరంజీవికి బాగుంటుందని అనిపించిన కథ ఏదైనా ఉందా?

నేను ఇంతవరకు తీసిన సినిమాల్లో అయితే చిరంజీవిగారికి సూటయ్యేది ఏదీ లేదు. ఆయనకి ఇలాంటివి కాదు. వేరే రాయాలి. 

రామ్‌గోపాల్‌వర్మ తీసిన సినిమాల్లో ఏదైనా రీమేక్‌ చేయాల్సి వస్తే ఏది చేస్తారు?

రామ్‌గోపాల్‌వర్మ గారి సినిమాలు అసలు రీమేక్‌లు చేయలేమండీ. ఏవైనా రీమేక్‌ చేయాల్సి వస్తే... నేను చేసేవి.. శివ, క్షణక్షణం, రంగీలా. ఇవైతే రీమేక్‌ చేయగలను... ఇంకో వెర్షన్‌లో. 

డైరెక్టర్‌ కాకపోయి ఉంటే?

వ్యవసాయం చేసుకునేవాడిని. మా ఊళ్లో పొలాలున్నాయి. డైరెక్టర్‌ అవకపోయి ఉంటే వ్యవసాయానికి తప్ప ఇంకెందుకూ పనికిరాం (నవ్వేస్తూ). 

పవన్‌తో మళ్లీ సినిమా చేస్తే ఎలాంటి క్యారెక్టర్‌లో చూడాలని అనుకుంటున్నారు?

కళ్యాణ్‌తో సినిమా చేస్తే... పోకిరిలాంటిది ఏదైనా చేయాలనుంది. అలాంటి క్యారెక్టర్‌లో అంత డైనమిక్‌గా చూడాలనుంది.

నేషనల్‌ అవార్డ్‌ వచ్చేదా... వంద కోట్లు వచ్చేదా... ఎలాంటి సినిమా తీయాలనుకుంటారు?

వంద కోట్లు వచ్చే సినిమానే తీస్తాను. ఎందుకంటే... సొసైటీకి మేలు చేసే సినిమా అంటూ ఉంటారందరూ. ఏ సినిమాకి అయితే ఎక్కువ డబ్బు వస్తుందో అదే సొసైటీకి ఎక్కువ మేలు చేస్తుంది. మెసేజ్‌ ఉన్న సినిమా అయితే సొసైటీకి పనికొస్తుందని జనం అనుకుంటారు. కానీ మెసేజ్‌ ఉన్న సినిమాని ఎవడూ చూడడు. ఏ సినిమా అయితే నచ్చి జనం చూస్తారో అదే సొసైటీకి పనికొస్తుంది. ఎందుకంటే... అందరికీ డబ్బొస్తది. అందరం గవర్నమెంట్‌కి టాక్స్‌ కడతాం. కాబట్టి నా దృష్టిలో సొసైటీకి పనికొచ్చే సినిమా అంటే కమర్షియల్‌ సినిమానే. దానికి అవార్డులు వచ్చినా రాకపోయినా ఏం ఫర్లేదు. 

కమర్షియల్‌ సినిమాల వైపు వెళ్లిపోయి.. పూరి జగన్నాథ్‌ ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’లాంటి కథలు రాయడం లేదనే విమర్శ ఉంది?

కరెక్టది. మీరు చెప్పింది హండ్రెడ్‌ పర్సెంట్‌ రైట్‌. స్టార్స్‌తో పని చేయడం వల్ల, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉండడం వల్ల సెన్సిటివ్‌ స్టోరీస్‌ నేను రాయట్లేదు. అది నేను కూడా మిస్‌ అవుతున్నాను. అలాంటివి నా బ్యానర్‌లో ఇకపై రెగ్యులర్‌గా ప్రొడ్యూస్‌ చేస్తాను. 

త్రివిక్రమ్‌, పూరి జగన్నాథ్‌... బెస్ట్‌ డైలాగ్స్‌ ఎవరివంటారు?

ఏవండీ.. నన్ను అడిగితే నా పేరే చెప్పుకుంటానండీ (నవ్వుతూ). జంధ్యాలగారు, ముళ్లపూడి వెంకటరమణగారు, పెద్ద వంశీ గారు, త్రివిక్రమ్‌... వీళ్ల నలుగురూ నాకు బాగా ఇష్టం. వీళ్ల డైలాగ్స్‌లో ఒక ఫ్లేవర్‌ ఉంటుంది. ఇప్పుడున్న రైటర్స్‌లో అయితే నాకు నచ్చింది త్రివిక్రమే. 

వేరే డైరెక్టర్స్‌ తీసిన సినిమాలు చూసి, ఈ థాట్‌ నాకెందుకు రాలేదు అని ఫీలయిన సందర్భం ఏదైనా ఉందా?

నేను సినిమాలు చూసేదే చాలా తక్కువ. అలా అనిపించినవి అయితే ఏమీ లేవు.

ఇతర డైరెక్టర్ల సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌కి మీరెలా రియాక్ట్‌ అవుతుంటారు?

యాక్చువల్‌గా నా తప్పులు నేను సరిదిద్దుకోవడానికే నాకు టైమ్‌ ఉండదు ఇక్కడ నాకు. మీరైనా సరే... ఈ చిన్న లైఫ్‌లో మన తప్పులు మనం దిద్దుకోవడానికే టైమ్‌ సరిపోదు. ఇంకెందుకు పక్కోడి గురించి ఆలోచించడం. 

-గణేష్‌ రావూరి

[email protected]

http://twitter.com/ganeshravuri

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?