Home > Movies - Movie Gossip
బాబు కూలీ.. భలే మంచి చౌకబేరము

దంపిన దానికి బొక్కిందే కూలి. ఈ సామెత తెలుగు ప్రజలకు చాలా మందికి తెలిసిందే. ఇప్పుడు అంటే మిల్లులు వచ్చేసాయి కానీ, గతంలో ధాన్యం దంపించుకుంటే బియ్యం తయారయ్యేవి. ఇందుకోసం కూలీలను పెట్టుకునేవారు. ఓ పక్క దంచుతూ మరోపక్క గుప్పెడు బియ్యం నోట్లో వేసుకుంటూ పనిచేసిందట ఓ మాతల్లి. సాయంత్రం అయ్యాక, పని ముగిసాక కూలి డబ్బులు అడిగితే, నువ్వు తిన్న బియ్యానికి, దంపిన బియ్యానికి లెక్క సరిపోయింది అందట పని ఇచ్చిన పెద్ద మనిషి. అప్పుడు పుట్టింది దంపిన దానికి బొక్కిందే కూలి.

ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారం సందర్భంగా బాబు చెబుతున్న మాటలు ఇదే వైనాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ‘మీ ఓటే నాకు కూలి’ అని బాబు అంటే ఆయన అనుచర గణానికి, ఆయన అను’కుల’ మీడియాకు ముద్దుగానే వుంటుంది. ఇంతకన్నా చౌక ఏముంటుంది అనిపిస్తుంది. మీరు నాకేమీ ఇవ్వక్కర్లా, మీ ఓటు ఇవ్వండి చాలు అని అంటే ఎంత చౌక బేరమో అనుకుంటే, అంతకన్నా అమాయకత్వం మరోటి వుండదు.

ఇంతకీ జనం ఇచ్చే ఓటు విలువ ఎంత? వందా? వేలా? కోట్లా? వేల కోట్లా? జనం ఓట్లతో ప్రజాప్రతినిధి అయితే వచ్చే ఆదాయం ఎంత? అధికారికంగా ఎంత? అనధికారికంగా ఎంత? అది సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, మరెవరైనా కావచ్చు. నాకు ఏమీ వద్దు ఓటు ఇవ్వండి చాలు అని అడగడం అంటే బలి చక్రవర్తిని వామనుడు జస్ట్ మూడు అడుగుల జాగా చాలు అని అడిగినట్లే. మూడో అడుగు బలి చక్రవర్తి బుర్ర మీద పడినట్లే, ఓటు తీసుకున్న మహానుభావుడు జనం నెత్తిన కాలేసి తొక్కే అధికారం సంపాదించుకుంటాడు.

అందువల్ల కూలిగా ఓటు బాబుకే కావచ్చు, మరెవరికైనా కావచ్చు, ఇచ్చే ముందు ఆలోచించుకోవడం మంచింది. పాపం, మరేటీ అడగనేదు, ఓటే కదా అడిగినాడు అనుకుని అమాయకంగా ఇచ్చేస్తే, మీ నెత్తినే ఎక్కి తాండవం చేసే ప్రమాదం వుంది. ఇలా ఎందుకు చెప్పడం అంటే, ఇప్పుడు బాబు అన్న మాట బంగారు బాట అనుకుని, ఇక అందరూ ఇదే పాట పాడతారు. నాకు కూలీగా మీ ఓటు ఇవ్వండి..మీ కాళ్ల దగ్గర పడివుంటా అంటూ. జనం పోనీలే అనుకంటే..ఇక కష్టాల పాలైపోవడమే కావచ్చు. ఆలోచించుకుని ఓటేయండి అని ఒకప్పుడు చెప్పేవారు. ఇప్పుడు కూలి కింద ఓటు పడేయండి అంటున్నారు. ఓటు ఎంత చీప్ అయిపోయింది.