Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమా ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి

సినిమా ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి

అభిమానం అనేది అందరికీ వుంటుంది. ఎవరో ఒకరిపై..ఏదో ఒక స్థాయిలో..కానీ అది దురభిమానంగా మారకూడదు. ఒకప్పుడు ఈ హీరో సినిమా పోస్టర్ పై పేడ జల్లితే, ఆ హీరో పోస్టర్ పై మరోసారి పేడ పడేది. కాలం మారింది. టెక్నాలజీ మారింది. తెలుగు సినిమా విశ్వవ్యాప్తమయింది..అయినా అభిమానుల వ్యవహారం మారలేదు. ఎటొచ్చీ అప్పుడు పేడను వాడుకుంటే ఇప్పుడు టెక్నాలజీని వాడుకుంటున్నారు అంతే.

ఏ సినిమా హీరో అయినా అన్నీ హిట్ లే ఇవ్వలేడు..ఏ నిర్మాత అయినా అన్నీ హిట్ లే తీయలేడు..ఏ డైరక్టర్ అయినా అన్నీ హిట్ మూవీలే అందించలేడు. అలా అయి వుంటే టాలీవుడ్ లో ఎందరో ఉద్దండులైన నిర్మాతలు ఇలా మాయమై వుండకూడదు. అదే నిజమైతే టాలీవుడ్ లో ఎందరో దర్శకులు ఇప్పటికీ ఇంకా సినిమాలు తీస్తూనే వుండాలి.

సినిమా ఫ్లాప్ లో హీరో, దర్శకుడు ఇద్దరికీ భాగస్వామ్యం వుంటుంది. నిర్మాతది కేవలం పెట్టుబడి మాత్రమే. హీరోకి వున్న ఆబ్లిగేషన్ కావచ్చు..స్క్రిప్ట్ ను తెరకెక్కించడంలో జరిగిన లోపాలు కావచ్చు..సినిమా పరాజయానికి కారణం అవుతాయి. వాటిని ప్రస్తావించినా, వాటి గురించి వివరించినా తప్పలేదు. లేదు, సహేతుకమైన విమర్శ చేసినా తప్పులేదు. కానీ అభిమానులు ఇప్పుడు ఆ గీతలు దాటేస్తున్నారు.

సినిమా విడుదల కావడానికి కొన్ని నిమషాల ముందే సామాజిక మాధ్యమాలను మోత మోగించడం ప్రారంభమైపోతోంది. టెక్నాలజీ ని వాడుకుని, తమ సృజనకు పదును పెడుతున్నారు. అంతవరకు ఒకె. కానీ ఆ సృజన, ఆ చాకచక్యం అంతా అవతలి హీరోపై, లేదా అవతలి సినిమాపై బురద జల్లడానికి మాత్రమే వాడుతున్నారు. కానీ ఇక్కడ ఓ విషయం మరిచిపోతున్నారు. ఇప్పుడు తాము చేసిన పని, రేపు వాళ్లు చేసేందుకు అవకాశం వుందని.

ఇప్పుడు అదే జరిగింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో మహేష్ అభిమానులు కావచ్చు, వేరే హీరోల అభిమానులు కావచ్చు.. రెచ్చిపోయారు. సర్దార్...సినిమా ఫ్లాపే. దాంట్లో సందేహం లేదు. ఆ మేరకు సమీక్షలు వచ్చేసాయి..వార్తలు వచ్చేసాయి. అక్కడితో ఆగిపోతే బాగుండేది. కానీ సామాజిక మాధ్యమాల్లో అలా జరగలేదు. పోనీ సహేతుకమైన విమర్శ జరిగిందా అంటే అదీ లేదు. కానీ ఆ సమయంలో ఈ విమర్శ చేసిన ఫ్యాన్స్ అంతా మరిచిపోయింది ఒకటే. భవిష్యత్ లో తమ తమ హీరోలకు ఇలాంటి పరిస్థితి ఎదురయితే...అన్న పాయింట్ నే.

చిత్రంగా బ్రహ్మోత్సవంతో అవతలి ఫ్యాన్స్ కు భయంకరమైన అవకాశం దొరికేసింది. దాంతో వాళ్లు రెచ్చిపోయారు. దీంతో ఇప్పుడు..తూచ్..ఇది అన్యాయం అని వీరంటున్నారు.  ఇదంతా మిగిలిన న్యూట్రల్ జనాలకు భలే సంబరంగా వుంది. వాట్సప్ లో ఫార్వార్ట్ చేసేందుకు, ఫేస్ బుక్ లో షేర్ చేసేందుకు మాంచి పోస్టింగ్ లు దొరికినట్లయింది. మీడియాకు వార్తల పంటగా మారింది. కానీ కాస్త కాకుంటే కాస్తయినా సినిమా నిల్చుంటుంది అనుకునే నిర్మాతకు ఇదంతా ప్రాణ సంకటంగా మారింది.

నిజానికి బ్రహ్మోత్సవం లాంటి సినిమాపై ఈ సోషల్ నెట్ వర్క్ హడావుడి కనుక లేకుంటే పరిస్థితి మరోలా వుండేది. ఓవర్ సీస్ లో కావచ్చు. ఇక్కడకావచ్చు..ఈ హడావుడి లేకుంటే కనీసం మరికాసిన్ని కోట్లు వసూలు చేసుకునే అవకాశం వుండేది. కానీ అభిమానులను ఇలా ప్రశ్నిస్తే, వారు, తిరిగి మీడియాను క్వశ్చను చేస్తున్నారు..’మీరు ఎందుకు సమీక్షలు రాస్తున్నారు..మీరు ఎందుకు అనాలసిస్ లు రాస్తున్నారు..మీరు ఎందుకు కలెక్షన్ల రిపోర్టులు రాస్తున్నారు అని నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీడియా పనే అది అని కానీ, తమ పని సామాజిక మాధ్యమాల్లో అవతలి హీరో మీద బురద జల్లడం కాదు అని అభిమానులు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. 

కానీ దీనివల్ల ఏ అభిమానులైతే హీరోలకు అండగా వుంటున్నారో, వారి వల్లే ఇప్పుడు హీరోలకు తలవంపులు కూడా తప్పడం లేదు. నిన్నటి రోజున పవన్ ఫ్యాన్స్ ను కెలక్కుండా వుండి వుంటే, ఇప్పుడు మహేష్ కు సామాజిక మాధ్యమాల్లో ఇంతటి అభాసు వుండేది కాదు. కానీ అది కూడా అభిమానులు గ్రహించడం లేదు. ఈ వైనం అంతటిని వార్తలుగా రాస్తున్న మీడియాపై గుర్రుమంటున్నారు.

ఏమైతేనేం సినిమా హిట్ కావడానికి కారణమయ్యే అభిమానులే కుదలైపోవడానికి కూడా కారణమవుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?