Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..!

ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి..!

ఆచార్య ఆత్రేయ ఓ పాటలో 'ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి' అన్నారు. నీతి నిజాయితీ అనేవి సొంతంగా ఆచరించడానికి కాదు. ఎదుటివారికి పాఠాలుగా బోధించడానికే. అలా బోధించేవారు తాము గొప్ప నీతిపరులమని చాటింపు వేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కోవకే చెందుతారనే విషయం తెలిసిందే.

అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక తనను తాను గొప్ప నాయకుడిగా, నిజాయితీపరుడిగా చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది. ఇంకా చెప్పాలంటే ఇదో వ్యాధిలా  ముదిరిపోయింది కూడా. నైతిక విలువలకు ఏనాడో తిలోదకాలిచ్చిన చంద్రబాబు ఏం మాట్లాడకుండా (నీతి గురించి) గమ్మున ఉన్నా బాగుంటుంది. అలా కాకుండా తాను అత్యంత నిజాయితీపరుడినని చెప్పుకోవడం చూస్తే జాలి కలుగుతోంది.

తాను నిజాయితీపరుడినని చెప్పుకోవడమే కాకుండా అవినీతికి పాల్పడేవారి అంతు చూస్తానని, ఎవ్వరినీ వదలిపెట్టనని చెబుతుంటారు. కాని అందరినీ వదిలిపెట్టడమే ఆయన పని. ఏపీ అవినీతిలో అగ్రస్థానంలో ఉందనే విషయం ఆయన గుర్తుంచుకోరు. నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో అక్కడ కొందరు నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన చంద్రబాబు నీతినిజాయితీపై ఉపన్యాసమిచ్చారు.

ఏమన్నారాయన? ''డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడమంటే అవినీతిని ప్రోత్సహించడమే. దీనికి నేను వ్యతిరేకం. ఓటుకు రూ.500, 1000 ఇస్తే నష్టపోయేది మనమే. ఓటుకు 500 ఇవ్వడం నాకు చేతకాదా? అది ఇవ్వాలంటే నేను రూ.5 లక్షలు సంపాదించాలి. నేను కొంత మిగుల్చుకొని కొంత మీకివ్వాలి. అది సరైందేనా? దీన్ని నేను ప్రోత్సహించను'' అన్నారు బాబు.

ఉపన్యాసం బాగానే ఉంది. చెప్పిందాంట్లో తప్పేమీ లేదు. ఇలాంటి సూక్తిముక్తావళి వినిపించడానికి చంద్రబాబుకు అర్హత ఉందా? ముందు తాను స్వచ్ఛంగా ఉండి ఎంత నీతిబోధైనా చేయొచ్చు. కాని తానే ఒక్క ఓటు కోసం కోట్లు లంచంగా ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు నీతిపరుడినని చెప్పుకోవడం ఎంతవరకు సమర్థనీయం? మావాళ్లు ఇచ్చిన కోట్లు తీసుకొని మా అభ్యర్థికి ఓటేయండి. మీ రక్షణ నేను చూసుకుంటానని కూడా చెప్పారు. ఇది అవినీతిని ప్రోత్సహించడం కాదా?

ఓటుకు నోటు కేసు ఇప్పటివరకు అంతు తేలలేదు. అంటే చంద్రబాబును నిర్దోషిగానో, అపరాధిగానో న్యాయస్థానం నిర్ధారించలేదు. కోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వకపోయినా తనను తాను పులు కడిగిన ముత్యంలా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన ఎంత చెప్పుకున్నా ప్రజలకు అసలు విషయం తెలుసు. కాబట్టి నాయకులు ఆయన నీతిబోధను ఓ ప్రవచనంలా విని తమ పని తాము చేసుకుంటూపోతారు.

ఇక బాబు పాటించే నైతిక విలువలకు పార్టీ ఫిరాయింపులు చక్కటి ఉదాహరణ.  పార్టీ ఫిరాయింపుల అంశం ఆయనకు తెచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. మరి పొరుగు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదే పని చేస్తున్నారు కదా అని ప్రశ్నించవచ్చు. కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మంచి పని చేశారని ఎవ్వరూ అనడంలేదు. ఆయన చేసింది, చేస్తున్నది అనైతికమే. అదే అనైతికమైన పని చంద్రబాబు ఎందుకు చేయాలి? అనేదే ప్రజాస్వామ్య ప్రియుల ఆవేదన.

కేసీఆర్‌కు, బాబుకు చాలా తేడా ఉంది. కేసీఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. కాని బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడు. సమర్థ పాలకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అదీగాకుండా తాను నిప్పులాంటివాడినని, ఏనాడూ తప్పు చేయలేదని, చేయనని పదేపదే చెప్పుకుంటూవుంటారు.

ఇలాంటి నాయకుడు ఏం చేయాలి? తన పార్టీలోకి వచ్చినవారితో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో పోటీ చేయించి తనవారిగా అంటే టీడీపీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో స్థానం కల్పించాలి. ఆయన ఆ పని చేసుంటే కేసీఆర్‌ సైతం సిగ్గుతో చితికిపోయేవారేమో...! ఫిరాయింపుల చట్టానికి సవరణలు టీడీపీ కోరుతుండగా,  ఈ చట్టానికి సవరణలు చేయాలని ప్రతిపక్ష  వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది.

చట్ట సవరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గతంలో నిర్ణయించింది. ఒక్క జగన్‌ పార్టీయే కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ నాశనం కాకూడదని ఆకాంక్షించే పార్టీలన్నీ ఫిరాయింపుల చట్టానికి సవరణలు చేయాలని కోరుతున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడూ ఇదే మాట అన్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?