Home > Movies - Movie Gossip
జై లవకుశకు ఆ ప్రచారం అవసరమా?

తమన్న హీరోయిన్ గా నటించిన సినిమాల సంగతి సరేసరి. కనీసం ఆమె ఐటెంసాంగ్ చేసిన సినిమాలైనా ఆడాయా అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అలాంటి తమన్నను అతికష్టం మీద ఒప్పించి, భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి జై లవకుశ సినిమాలో ఐటెంసాంగ్ చేయించేందుకు ఒప్పించారట. 

నిజానికి ఐటెంసాంగ్ చేయమని తమన్నను రిక్వెస్ట్ చేయనక్కర్లేదు. "కాల్షీట్లు తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ" అనే కాన్సెప్ట్ ను ఆమెకు వివరిస్తే చాలు వచ్చి డాన్స్ చేసి వెళ్లిపోతుంది. హీరో ఎవరనేది కూడా అనవసరం. ఆమె స్పెషల్ సాంగ్స్ చేసిన గత సినిమాల హీరోల్ని చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమౌతుంది. అలాంటి తమన్నను జై లవకుశ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పడం ఎంతవరకు కరెక్ట్.

పోనీ ఎన్టీఆర్-తమన్నది హిట్ కాంబినేషనా అంటే, అది కూడా కాదు. వీళ్లిద్దరూ కలిసి నటించిన ఒకేఒక్క సినిమా ఊసరవెల్లి అట్టర్ ఫ్లాప్ అయింది. ఇంత ట్రాక్ రికార్డు పెట్టుకొని కూడా జై లవకుశ సినిమాకు సంబంధించి తమన్న-ఎన్టీఆర్ సాంగ్ ను ఆఖరి నిమిషంలో ప్రచారాస్త్రంగా ఉపయోగిస్తారట. 

ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమాపై నడుస్తున్న బజ్ స్టడీగానే ఉంది. తాజాగా విడుదలైన ట్రయిలర్ కూడా అంచనాలను పెంచే విధంగానే ఉంది. విడుదల వరకు ఇదే తరహా ప్రచారాన్ని కొనసాగిస్తే మేలు. మధ్యలో లేనిపోని ప్రయోగాలు చేస్తే, మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.