Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జైలుకెళ్తాడా.? గట్టెక్కుతాడా.?

జైలుకెళ్తాడా.? గట్టెక్కుతాడా.?

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌, పదమూడేళ్ళ క్రితం తప్పతాగి కారు నడిపి, ఓ వ్యక్తి మరణానికి కారణమైన కేసులో గట్టిగానే ఇరుక్కుపోయాడు. మే 6న అతని భవితవ్యం తేలనుంది. ఈ కేసులో సల్మాన్‌ఖాన్‌ ‘దోషి’ అన్న విషయం దాదాపు రుజువైపోయినట్లే. ‘నేను కారు నడపలేదు మొర్రో..’ అని సల్మాన్‌ఖాన్‌ చెబుతున్నా, ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది తానేనని సల్మాన్‌ఖాన్‌ డ్రైవర్‌ ఒప్పేసుకున్నా.. ప్రత్యక్ష సాక్షులు మాత్రం, ఆ సమయంలో కారు నడిపింది సల్మాన్‌ఖానేనని న్యాయస్థానానికి వాంగ్మూలమిచ్చిన దరిమిలా, ఈ కేసు నుంచి సల్మాన్‌ఖాన్‌ తప్పించుకునే అవకాశాలు కన్పించడంలేదు.

ఒకవేళ సల్మాన్‌ఖాన్‌ దోషి అని నిరూపితమైతే జైలు శిక్ష తప్పదు. అది కూడా పదేళ్ళ పాటు ఆయన జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ బాలీవుడ్‌లో తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్నాడు. సుమారుగా 300 కోట్లు సల్మాన్‌ఖాన్‌ మీద పెట్టేసి వున్నారు నిర్మాతలు. సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న సినిమాలు నిర్మాణ దశలో వున్న దరిమిలా, అతనికి జైలు శిక్ష పడితే, తొలి దెబ్బ పడేది నిర్మాతల మీదనే.

బాలీవుడ్‌లో ఇప్పటికే ప్రముఖ హీరో సంజయ్‌దత్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సల్మాన్‌ఖాన్‌కి కూడా జైలుకు వెళ్ళిన అనుభవం వుంది. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో సల్మాన్‌ఖాన్‌ జైలుకు వెళ్ళాల్సి వచ్చిన విషయం విదితమే. అప్పట్లో సల్మాన్‌ఖాన్‌ కెరీర్‌ చాలా దారుణంగా వుంది. జైలు నుంచి వచ్చాకనే సల్మాన్‌ఖాన్‌ కెరీర్‌ వేగం పుంజుకుంది. విచిత్రంగా సంజయ్‌దత్‌ కూడా టాడా చట్టం కింద అరెస్టయిన తర్వాతనే అతని నుంచి ‘శంకర్‌దాదా’ సిరీస్‌ సినిమాలొచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకు సంజయ్‌దత్‌ జైలుకు వెళ్ళాడనుకోండి.. అది వేరే విషయం.

ఇక ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌ పరిస్థితి కూడా సంజయ్‌దత్‌కి భిన్నంగా ఏమీ లేదు. కోర్టులో తనకు ఊరట లభిస్తుందని సల్మాన్‌ఖాన్‌ బలంగా నమ్ముతున్నాడు. అయితే అక్కడ కేసు కూడా బలంగానే వుంది. దాంతో, సల్మాన్‌ఖాన్‌తోపాటు అతని సన్నిహితులూ మే 6 ‘జడ్జిమెంట్‌ డే’ కోసం ఎదురుచూస్తున్నారు తీవ్ర ఉత్కంఠతో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?