Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విశ్వనటుడి రాజకీయం ఏ తీరాలకి.!

విశ్వనటుడి రాజకీయం ఏ తీరాలకి.!

వెండితెరపై ఏ పాత్రలో ఆయన కన్పించినా, ఆ పాత్రకే కొత్తదనం వచ్చేది. కమర్షియల్‌ విజయాలెలా వున్నా, ఆయన నటించిన ప్రతి చిత్రమూ విభిన్నమైనదే. ఓ సినిమాకీ, ఇంకో సినిమాకీ 'పోలిక' లేకుండా చూసు కోవడం, ఓ సినిమాలోని పాత్రకీ, ఇంకో సినిమాలోని పాత్రకీ పూర్తిగా వైవిధ్య వుండేలా చూసుకోవడం, సినిమా సినిమాకీ సరికొత్త గెటప్‌ని, ఆహార్యాన్ని ఎంచుకోవడం.. ఇవన్నీ ఆయన ప్రత్యేకతలు. అందుకే, ఆయన విశ్వనటుడయ్యాడు. ఇప్పుడీ విశ్వ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నాడు. వస్తున్నాడేంటి, వచ్చేశాడు. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడమే తరువాయి.!

నటనలో మేటి అయినా..

పరిచయం అక్కర్లేని పేరు అది. కమల్‌హాసన్‌.. ఆ పేరు తెలియనివారుండరు దేశంలో. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలకు సుపరిచితుడు. హిందీ సినీ పరిశ్రమలోనూ అంతే. ఇది చాలదా, దేశవ్యాప్తంగా కమల్‌హాసన్‌ అంటే తెలియనివారుండరని చెప్పడానికి. ఆయన చేసిన సినిమాలు అలాంటివి మరి. ముందే చెప్పుకున్నాం కదా, ఏ సినిమా చేసినా అందులో 'ప్రత్యేకత' కోసం పరితపించేవారు కమల్‌హాసన్‌. అందుకే, కమల్‌హాసన్‌కి విశ్వనటుడన్న గుర్తింపు దక్కింది.

సినిమాలే కాదు, వివాదాలతోనూ కమల్‌హాసన్‌కి దక్కిన పాపులారిటీ తక్కువేమీ కాదు. గౌతమితో సహజీవనం, ఆ సహజీవనం మళ్ళీ బ్రేకప్‌ అవడం.. ఇలా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలే కాదు, వివిధ అంశాలపై నిక్కచ్చిగా కమల్‌ వ్యక్తం చేసే అభిప్రాయాలు పెను దుమారం రేపిన సందర్భాలు కోకొల్లలు. కమల్‌హాసన్‌ దేవుడ్ని నమ్మడు. మతఛాందసవాదానికి ఆయన వ్యతిరేకం. ఇవే చాలా సందర్భాల్లో ఆయన్ని వివాదాల్లోకి నెట్టేశాయి. అలాగని, కమల్‌ వివాదాస్ప దుడు కాదు.. వివాదాలు అప్పుడప్పుడూ ఆయన్ని అలా అలా పలకరిస్తుంటాయంతే.

రాజకీయాల్లోకి 'దారి' చూపిన జల్లికట్టు

రాజకీయాలపై కమల్‌హాసన్‌కి ఆసక్తి ఎక్కువ. ప్రశ్నించడం ఆయన నైజం. రాజకీయాల్లోకి వెళ్ళే ఉద్దేశ్యం లేనప్పుడూ, ఆయన రాజకీయాల్లో అవినీతిని ప్రశ్నించాడు. రాజకీయాలకు సంబంధించి చాలా అంశాలపై జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. ఓ భారతీయుడిగా తనకు ప్రశ్నించే హక్కు వుందంటాడాయన. ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి రావల్సిన అవసరం వుండొచ్చు, లేకపోవచ్చని కూడా చెబుతుంటాడు కమల్‌హాసన్‌. 'జల్లికట్టు' వివాదానికి సంబంధించి కమల్‌హాసన్‌ పేరు నేషనల్‌ మీడియాలో మార్మోగిపోయింది.

జల్లికట్టు వివాదంలో తమిళ సినీ పరిశ్రమ చూపించిన అత్యుత్సాహాన్ని కమల్‌ ప్రశ్నించాడు కూడా. జల్లికట్టుకి మద్దతునిచ్చిన కమల్‌, అందులో రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించవద్దంటూ సినీ పరిశ్రమకు 'ఉచిత సలహా' ఇచ్చి వార్తల్లోకెక్కిన విషయం విదితమే. సహనటుడు రజనీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు కమల్‌ గతంలో. 'కెమెరాలు ఎక్కడుంటే రజనీకాంత్‌ అక్కడుంటారు' అని కమల్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి.

ప్రశ్నించి, రాజకీయాల్లోకి ప్రవేశించి..

'కమల్‌హాసన్‌ రాజకీయాల్లోకి రావొచ్చు కదా..' అంటూ కొందరు పదే పదే కమల్‌పై వెటకారం చేయడంతో, ఆయనకు ఒళ్ళు మండిపోయింది. 'రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు..' అన్న నోటితోనే, 'రాజకీయాల్లోకి వచ్చేశా..' అని ప్రకటించేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు కమల్‌. అలా ప్రకటించిన వెంటనే, రాజకీయ కార్యాచరణ షురూ చేసేశాడాయన. కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్‌తో సమావేశమయ్యారు.

'నా రంగు కాషాయం మాత్రం కాదు' అనడం ద్వారా, తాను బీజేపీ వ్యతిరేకినని చెప్పకనే చెప్పేసిన కమల్‌, తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యాక 'బీజేపీ వ్యతిరేకి' అన్న ఇమేజ్‌ని మరింత బలపర్చుకోవడం గమనార్హం. దేశంలో బీజేపీ యేతర శక్తుల్ని ఏకం చేసే దిశగా కమల్‌ పావులు కదుపుతున్నారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీ స్థాపించినాసరే, జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ బలమైన రాజకీయ వ్యవస్థ రూపొందాలనీ, అందులో తాను కూడా భాగం కావాలన్నది కమల్‌ ఆలోచన. అలాగని, కాంగ్రెస్‌కి దగ్గరవుతున్న సంకేతాలైతే ఆయన పంపడంలేదు.

సినిమాల్లో విశ్వనటుడే, రాజకీయాల్లోనో.!

సినిమా వేరు, రాజకీయం వేరు. సినీ రంగానికి చెందిన ఎందరో ఒకప్పుడు రాజకీయాల్ని శాసించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితులు కన్పించడంలేదు. తమిళనాడు లోనే విజయ్‌కాంత్‌ పరిస్థితి ఏమయ్యింది.? తెలుగునాట చిరంజీవి సంగతేంటి.? ముక్కుసూటితనం రాజకీయాల్లో పనిచేయదు. అమాయకత్వమూ పనిచేయదు. రాజకీయా లంటే చాలా చాలా చెయ్యాలి. మతవిశ్వాసాలు తనకు లేవంటే కుదరదు.

నేను మోనార్క్‌నంటే అస్సలే లాభం లేదు. వెరసి, విశ్వనటుడు చాలాచాలా మారాలి. మారి నా, పరిస్థితులు కలిసి రావాలి. తమిళనాడులో రాజకీయ సంక్షోభం కలిసొచ్చే అంశమే అయినా, అదెంతవరకు కమల్‌కి అండగా నిలుస్తుందన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పగలనని కమల్‌ నిరూపించుకోగలడా.? ఆ తర్వాతే జాతీయ రాజకీయా లపై అతని ప్రభావం ఎంత.? అన్నదానిపై ఓ క్లారిటీ వస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?