Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లీక్‌.. గుండె గుభేల్‌మంటోంది.!

లీక్‌.. గుండె గుభేల్‌మంటోంది.!

తెరపై రెండున్నర గంటల సినిమా చూడటమంటే అదో సరదా. సినిమా సామాన్యుడికి అతి గొప్ప ఎంటర్‌టైన్‌మెంట్‌. సినిమాకి మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సామాన్యులకు ఇంకోటి లేదంటే అది అతిశయోక్తి కాదేమో. సినిమా గురించి సామాన్యుల్లో జరిగే చర్చ అంతా ఇంతా కాదు. ఎక్కడ ఏ డిస్కషన్‌ జరిగినా అనుకోకుండా అందులోకి సినిమా టాపిక్‌ వచ్చేస్తుంటుంది. సినిమాకి వున్న క్రేజ్‌ అలాంటిది.

జనానికి సినిమా పట్ల వున్న అభిమానం సంగతి అలా వుంచితే, సినిమా ద్వారా జనం గుండెల్లో నిలిచిపోవాలని సినీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనుకుంటుంటారు. టెక్నీషియన్‌ దగ్గర్నుంచి ఆర్టిస్ట్‌ దాకా, దర్శకులు, నిర్మాతలు సైతం సినిమాని ఓ యజ్ఞంలా భావిస్తారు. ప్రతి విభాగంలోనివారూ సినిమా అంటే ప్రాణం పెడ్తారు. సినీ జనానికీ,  ప్రేక్షకులకీ సినిమా అంటే పిచ్చి. ఇది నిజంగానే పిచ్చి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

కానీ, సినిమా ఈ మధ్య అభాసుపాలవుతోంది. చెత్త చిత్రాల కారణంగా కాదు. సినీ పరిశ్రమలో కొందరికి కమిట్‌మెంట్‌ లేకపోవడంతో. ఇదివరకటిలా కాదు, ఇప్పుడు సినిమాకి సంబంధించి కొన్ని పనుల నిమిత్తం, బయటి వ్యక్తులు అందులో చొరబడే అవకాశం దొరుకుతోంది. గ్రాఫిక్స్‌ వంటి విషయాల్లో ఇలాంటి వ్యక్తులు పేట్రేగిపోతున్నారు. ఎడిటింగ్‌ టేబుల్‌ దగ్గరో, గ్రాఫిక్స్‌ సందర్భంగానో.. ఏదో ఒక చోట నుంచి సినిమా లీక్‌ అయిపోతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే కన్పిస్తున్నాయి.

దాంతో కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాలు, రిలీజ్‌కి ముందు నానా ఇబ్బందులూ ఎదుర్కోవాల్సి వస్తోంది. ‘అత్తారింటికి దారేది’ విషయాన్నే తీసుకుంటే, ఆ సినిమా ఘనవిజయం సాధించింది కాబట్టి, నిర్మాత బతికి బట్టకట్టగలిగాడు. లేదంటే, ఆ చిత్ర నిర్మాతకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. అంతలా ఆ సినిమా రిలీజ్‌కి ముందు పైరసీకి గురయ్యి, నిర్మాత గుండెల్లో గునపం దించింది.

ఇక, తాజాగా ‘బాహుబలి’ సినిమా విషయంలోనూ దాదాపు అలాంటి సీన్‌ ఒకటి తెరపైకొచ్చింది. 14 నిమిషాల నిడివి వున్న వీడియో ఫుటేజ్‌ లీక్‌ అవడంతో దర్శకుడు రాజమౌళి తీవ్రంగా కలత చెందాడు. పోలీసులను ఆశ్రయించాడు. నిందితుల్ని పోలీసులు గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. గ్రాఫిక్స్‌ టైమ్‌లో వీడియో ఫుటేజ్‌ని కొందరు కావాలనే లీక్‌ చేశారట. ముందే చెప్పుకున్నాం కదా.. సినిమా అంటేనే కమిట్‌మెంట్‌ అని. ఆ కమిట్‌మెంట్‌ లేకపోవడంతోనే ఇలాంటివి జరుగుతున్నాయి.

జాగ్రత్తగా ఎడిట్‌ చేసి, కంప్రెస్‌ చేస్తే, మొబైల్‌ఫోన్‌లోనే సినిమా మొత్తం పట్టేస్తుంది. దాన్ని టెక్నాలజీ సహాయంతో ఆ తర్వాత ఓ మోస్తరుగా ఎన్‌లార్జ్‌ చేసుకోవచ్చు. ఈ పనికిమాలిన టెక్నికల్‌ తెలివితేటలు ఉపయోగించి, సినీ రంగంలోని సెంటిమెంట్స్‌, సినీ జనం పడే కష్టాల్ని పట్టించుకోకుండా లీక్‌ చేసి పారేస్తున్నారు. పైరసీ అంటే హత్యతో సమానం.. అంటారు సినీ జనం. దురదృష్టవశాత్తూ పైరసీ చేసినవారికి ఓ మోస్తరుగా కూడా శిక్షలు పడటంలేదు.

పైరసీ అది ఏ రూపంలో వున్నా, అది క్షమించరాని నేరం. ఈ విషయంలో సినీ జనం అంతా ఒక్కటై ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయాల్సి వుంది. ప్రభుత్వం సైతం, కోట్లాది మందికి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇస్తోన్న సినీ పరిశ్రమ పడ్తున్న కష్టాన్ని గుర్తెరిగి, పైరసీదారుల విషయంలో కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టాల్ని రూపొందించడం, లేదా వున్న చట్టాల్ని పకడ్బందీగా అమలు చేయడం చేస్తే.. భవిష్యత్తులో ఏ నిర్మాతకీ పైరసీ కారణంగా గుండె పోటు రాకుండా వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?