Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మనోభావాలు.. అంటే కుదరదిక.?

ఇప్పుడంటే సినిమా వివాదాలు కాస్త తగ్గాయిగానీ, నిన్న మొన్నటిదాకా తెలుగులో ఏ సినిమా వచ్చినా, అది వివాదం నుంచి తప్పించుకోలేకపోయేది. అంతలా ప్రతి సినిమానీ వివాదం వెంటాడేది. ‘మనోభావాలు దెబ్బతిన్నాయ్‌..’ అంటూ సినిమా ప్రదర్శనల్ని అడ్డుకోవడం ఫ్యాషన్‌గా మారిపోయింది తెలుగు గడ్డమీద.

ఉద్యమాల సెగ పుణ్యమా అని ప్రతి సినిమా విడుదల విషయంలోనూ నిర్మాత టెన్షన్‌ పడాల్సిన పరిస్థితి నిన్న మొన్నటిదాకా కన్పించినా, ఇప్పుడు కాస్త ప్రశాంతంగానే వున్నాయి పరిస్థితులు. అసలు మనోభావాలేంటి.? అనేవారూ లేకపోలేదు. ఒకసారి సెన్సార్‌ అయ్యాక.. సినిమాపై అభ్యంతరాలు తెలపడానికి ఏమీ వుండదని తాజాగా మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్మం.

తమిళనాడులోనూ ఈ తరహా వివాదాలు ఇటీవలికాలంలో బాగా పెరిగిపోయాయి. మొన్నామధ్య కమల్‌హాసన్‌ రూపొందించిన ‘విశ్వరూపం’ సినిమా విడుదలకు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. విజయ్‌ హీరోగా రూపొందిన ‘కత్తి’ సినిమా కూడా అనేక వివాదాల్ని ఎదుర్కొంది. ‘కత్తి’ సినిమా వివాదంపైనే మద్రాస్‌ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

సెన్సార్‌ బోర్డ్‌ అన్ని అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటుంది గనుక, ఒకసారి సెన్సార్‌ అయ్యాక.. ఆ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదనీ, సినిమాని కేవలం ఓ కళగానే పరిగణించాలనీ, దాంట్లో లోటుపాట్లను ఎంచడం, మనోభావాలంటూ వ్యాఖ్యానించడం మంచిది కాదని మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.

తమిళ, తెలుగు సినిమాలకే కాదు, ఈ మధ్యకాలంలో ఏ భాషకు చెందిన సినిమా అయినా ఏదో ఒక రకంగా వివాదాల్లోకెక్కాల్సి వస్తోంది. తద్వారా సినిమా నిర్మాణమంటేనే టెన్షన్‌ పడాల్సిన పరిస్థితి. మద్రాస్‌ హైకోర్టు తీర్పుతో, సినీ పరిశ్రమ ఇప్పటిదాకా ఎదుర్కొన్న వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లేనని సినీ జనం భావిస్తున్నారు.

అయితే, సెంటిమెంట్‌ పేరుతో గందరగోళం సృష్టించేవారు, ఎలాగైనా సినిమాల్ని వివాదాస్పదం చేయకుండా వుండరనుకోండి.. అది వేరే విషయం. సెంటిమెంట్‌ / మనోభావాలు.. అంతలా బలపడిపోయాయ్‌ మరి.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?