Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు?

నాగ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నట్లు?

ఒక సినిమా ఫెయిల్యూర్ కు చాలా కారణాలుంటాయి. ఒక్కోసారి దర్శకుడు మాత్రమే కారణం కావచ్చు. మరోసారి సబ్జెక్ట్ కారణం కావచ్చు. ఏమైనా సినిమా ఫెయిల్ అయిన తరువాత యూనిట్ సమష్టి బాధ్యత వహించాలి కానీ ఎవరో ఒకరి మీద తోసేసే ప్రయత్నం చేయకూడదు. కానీ హీరో నాగార్జున ఎందుకో విజయాలు తన ఖాతాలోనూ, పరాజయాలు దర్శకుల ఖాతాలోనూ వేసే ప్రయత్నం తరచు చేస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇది ఇప్పుడు మొదలు కాలేదు కానీ, రాను రాను పెరుగుతోంది. భాయ్ సినిమా టైమ్ లో నాగార్జున చాలా కబుర్లు చెప్పారు. కొత్తగా ట్రయ్ చేస్తున్నా అన్నారు. అంతన్నారు, ఇంతన్నారు. తీరా సినిమా డిజాస్టర్ అయిన తరువాత వీలు దొరికిన ప్రతి సారీ దర్శకుడు వీరభద్రమ్ చౌదరిని కార్నర్ చేసే ప్రయత్నం చేసారు.

అది అయిపోయింది. ఆ తరువాత రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు నాగ్ దగ్గరుండి చాలా కట్ లు వేసారు. సినిమా సక్సెస్ అయింది. ఆ తరువాత కళ్యాణ్ కృష్ణను కాస్త పక్కన పెట్టారు. పెట్టి ఊరుకోకుండా, ప్రెస్ మీట్ ల్లో రామరాజు కథ సరిగ్గా రాలేదని, బాగా చేసుకురమ్మన్నానని చెప్పుకుంటూ వచ్చారు. అంటే కళ్యాణ్ కృష్ణ కథ బాగా చేయలేదని ఓ విధంగా దండోరా వేసారు.

రాజుగారి గది 2వచ్చింది. పబ్లిక్ గానే ఓంకార్ కట్ చేసిన టీజర్ బాగా లేదని, దాన్ని రిజెక్ట్ చేసానని చెప్పారు. గ్రాఫిక్స్ బాగా లేకపోతే డబ్బింగ్ చెప్పనన్నానని వెల్లడించారు. సినిమా హిట్ అవుతుందని ఎవ్వరూ అనుకోలేదని, హిట్ అయిన తరువాత ప్రతి ఒక్కరు వస్తున్నారని, ఆ సినిమాలో తనతో నటించిన వారిని కార్నర్ చేసే ప్రయత్నం చేసారు. 

లేటెస్ట్ గా అఖిల్ రెండో సినిమా హలో ప్రచారం మొదలయింది. ఇదే మొదటి సినిమా అనుకోవాలని, ఇదే అఫిషియల్ లాంచింగ్ అని ఇలా రకరకాలుగా నాగ్ మాట్లాడుతున్నారు. కేవలం ప్రెండ్ షిప్ కోసం హీరో నితిన్ నలభైకోట్లు ఖర్చుచేసి అఖిల్ సినిమా నిర్మించాడు. దాని వల్ల నితిన్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా బాగా దెబ్బతింది. వివి వినాయక్ కూడా కొంత మొత్తం వెనక్కు ఇచ్చాడు. ఇలా ఇంత మంది అఖిల్ సినిమా వల్ల ఇబ్బంది పడ్డారు. 

ఇప్పుడు ఇవన్నీ మరిచిపోయి, హలోనే అఖిల్ తొలి సినిమా అని నాగ్ ప్రచారం చెయడం ఎంత వరకు సబబు? నితిన్ ఏమనుకుంటాడు? వివి వినాయక్ ఏమనుకుంటాడు? వాళ్ల శ్రమ, డబ్బు అంతా బూడిదలో పోసినట్లే గా? 

మొన్నటికి మొన్న ఆర్జీవీ తో చేసే సినిమా గురించి కూడా మాట్లాడుతూ, క్వాలిటీ, టెక్నాలజీ బ్రిలియన్స్ విషయంలో వర్మ జాగ్రత్తగా వుండాలని ముందే చెప్పానని బహిరంగంగా అన్నారు. 

నాగ్ ఇలా మరీ ఇతరులను బాధపెట్టేలా ఎందుకు అనాలోచితంగా మాట్లాడుతున్నట్లో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?