Advertisement


Home > Movies - Movie Gossip
లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ పాత్రలో ఆయనా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తానని అంటున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు నిర్మాత కూడా దొరకడంతో ఇప్పుడు నటీనటుల వేట మొదలైనట్టుగా ఉంది. ఈ సినిమాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అయిన రాకేష్ రెడ్డి అనే వ్యక్తి నిర్మిస్తాడని తెలుస్తోంది.

అయితే బోలెడంత వివాదాస్పదం అయ్యే అవకాశాలున్న ఈ సినిమా పట్టాలెక్కి జనాల ముందుకు వస్తుందా? అనేది పెద్ద సందేహం. ఈ సంగతిలా ఉంటే.. ఈ సినిమాలో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్ ను అనుకుంటున్నాడట వర్మ! ప్రకాష్ రాజ్ చేత ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను వేయించాలనేది వర్మ ప్రణాళిక అని తెలుస్తోంది.

అదేగనుక జరిగితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు మరింత పబ్లిసిటీ వస్తుంది. ప్రకాష్ రాజ్ నటిస్తే.. సినిమాకు కొత్త ఆకర్షణ వస్తుంది. అయితే వివాదాస్పదం అనిపించే ఈ ప్రాజెక్టులో, ప్రత్యేకించి ఏపీలోని ఒకవర్గం వారు, ఒక సామాజికవర్గం వారు ఏ మాత్రం ఇష్టపడని ఈ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో.. నటించడానికి ప్రకాష్ రాజ్ ముందుకు వస్తాడా? అని! అయినా ప్రకాష్ రాజ్ ముందుకు రాకపోతే.. మరో టాలెంటెడ్ ఆర్టిస్టును వెదుక్కోవడం వర్మకు సాధ్యంకాని పని ఏమీకాదు.

బాలీవుడ్ నుంచినో బిహార్ నుంచినో.. నటులను తెచ్చి వారి నుంచి నటనను పిండుకోవడం వర్మకు సులభమే. ఇదివరకూ రక్తచరిత్ర విషయంలో అదే జరిగింది కదా. మరి ఎన్టీఆర్ పాత్ర ఓకే కానీ, కీలకమైన లక్ష్మీపార్వతి పాత్రను, చంద్రబాబు పాత్రను, ఎన్టీఆర్ తనయుల, తనయల పాత్రలను ఎవరి చేత చేయిస్తాడో ఆర్జీవీ!