Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సల్మాన్ గొప్పతనాన్ని కీర్తించిన విజయేంద్రుడు...

సల్మాన్ గొప్పతనాన్ని కీర్తించిన విజయేంద్రుడు...

హిట్ అండ్ రన్ కేసు దగ్గర్నుంచి నిన్నటి యాకూబ్ మెమన్ ఉరిశిక్షపై వ్యాఖ్యానాల దాకా రోజుకో వివాదంలో కూరుకుపోతూన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్... బయట జనం అనుకున్నట్టు కాదని అతనో మనసున్న మనిషి అని అంటున్నారు బాహుబలి, భజరంగి భాయీజాన్ చిత్రాల కధా రచయిత విజయేంద్రప్రసాద్. రెండే చిత్రాలతో అంతర్జాతీయ ప్రతిష్ట దక్కించుకున్న విజయేంద్ర గత రెండ్రోజులుగా తెలుగు టివి చానెళ్లకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చారు. 

ఈ సందర్భంగా... ఓ చానెల్‌లో మాట్లాడుతూ  సల్మాన్‌ఖాన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. తన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు హిందూ మతస్థులతో పెళ్లిళ్లు చేయడం దగ్గర్నుంచి సల్మాన్‌లో మచ్చుకైనా మతమౌఢ్యం కనిపించదని అంటున్నారు విజయేంద్ర. నిరుపేద చిన్నారులకు గుండె సంబంధ ఆపరేషన్లు చేయించిన సల్మాన్ గొప్ప మానవత్వం ఉన్న మనిషి అని, అతనితో సన్నిహితంగా మెలిగినవాళ్లకి ఇది అర్ధమవుతుందని అన్నారు. 

అతను చేసే గుప్తదానాలు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. భజరంగి భాయీజాన్ సినిమా కధ వినగానే తానే చేస్తానని సల్మాన్ పట్టుబట్టాడని, మరెవరినో నిర్మాతగా చేయడం కూడా ఇష్టం లేక తానే ప్రొడ్యూస్ చేశాడని ఆయన వివరించారు. ‘భజరంగి’ విడుదలైన తొలిరోజే తనకు సల్మాన్ ఫోన్ చేసి... ‘ఈ సినిమా హీరో మీరే’ అని పొగిడాడని కూడా విజయేంద్ర ఆనందం వ్యక్తం చేశారు.

సినిమా ముగింపు కలెక్షన్లకు మరింత ఊపుని ఇవ్వాలనుకున్నారో, ‘మాస్ హిస్టీరియా’లో తామూ పడిపోయిన మీడియా అందులో నుంచి బయటపడి, ఇప్పుడిప్పుడే  సినిమా లోపాల్ని ఎండగట్టే పని మొదలు పెట్టడంతో ‘కూల్’ చేయాలనుకున్నారో గాని...బాహుబలి టీమ్ సమయోచితంగా కధారచయిత ఇంటర్వ్యూలను చానెళ్లకు ప్లాన్ చేశారు. అంత వరకూ బానే ఉందికానీ... సదరు ఇంటర్వ్యూల్లో ఆయన సల్మాన్‌ఖాన్‌ను అదే పనిగా కీర్తించడం, హిందీ సినిమా చూసే అలవాటు లేని తెలుగోళ్లకి కూడా భజరంగి భాయీజాన్ గురించి తెలియజెప్పడంతో పరోక్షంగా సల్లూభాయ్ సినిమాకు మంచి ప్రచారమే లభించింది. 

 -ఎస్బీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?