Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సూపర్‌ స్టార్‌ - ఆ ఒక్కటీ అడక్కు.!

సూపర్‌ స్టార్‌ - ఆ ఒక్కటీ అడక్కు.!

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని, 'రాజకీయం' గురించి మాత్రం అడక్కూడదట. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారనీ, కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారనీ చాలాకాలంగా గుసగుసలు విన్పిస్తున్నాయి. కానీ, ఆయన ఇప్పటిదాకా రాజకీయ రంగ ప్రవేశంపై క్లారిటీ ఇవ్వలేదు. 'అధికారం అంటే నాకూ ఇష్టమే..' అని ఈ మధ్యనే ఓ కార్యక్రమంలో నోరు జారేసి, ఆ తర్వాత నాలిక్కర్చుకున్నారు రజనీకాంత్‌. 

ఇక, తాజాగా తమిళనాడులో ఉప ఎన్నికల హంగామా నెలకొంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్‌కే నగర్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలోనే. అక్కడ రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క కమల్‌హాసన్‌ తన అభిమానులతో ఎడాపెడా సమావేశాలు నిర్వహించేస్తుండగా, మరోపక్క రజనీకాంత్‌ చుట్టూ పలువురు రాజకీయ నాయకులు చక్కర్లు కొడుతున్నారు. అన్నట్టు కమల్ హాసన్, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకి మద్దతు ప్రకటించిన విషయం విదితమే.

రజనీకాంత్‌ భలే తెలివైనోడు.. ఆయన అందరికీ అయినవాడే. అక్కడే వస్తోంది అసలు సమస్య. ప్రధాని నరేంద్రమోడీకి రజనీకాంత్‌ అత్యంత సన్నిహితుడే అయినా, బీజేపీకి అనుకూలంగా రజనీ ఎప్పుడూ మాట్లాడలేదు. కాంగ్రెస్‌తోనూ రజనీకాంత్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. ఒకప్పుడు అన్నాడీఎంకేతో విభేదాలున్నా, ఆ పార్టీతోనూ ఆ తర్వాత సఖ్యత ఆయనకు కుదిరింది. ప్రతిపక్షం డీఎంకేతోనూ రజనీకాంత్‌కి ఎలాంటి వివాదాల్లేవు, పైగా.. ఆ పార్టీ అంటే రజనీకాంత్‌కి ప్రత్యేకమైన అభిమానం. 

తమిళనాడులో తాజాగా విన్పిస్తున్న ఊహాగానాల సారాంశమేంటంటే, ఆర్‌కేనగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీకి రజనీకాంత్‌ మద్దతిచ్చాడని. ఈ విషయమై రజనీకాంత్‌ సన్నిహితులు, 'తూచ్‌.. అదేం లేదు..' అనేస్తున్నారు. ఆ మాటేదో రజనీకాంత్‌తో చెప్పించొచ్చు కదా.? అనడిగితే, 'ఆయన రాజకీయాలపై పెదవి విప్పరుగాక విప్పరు..' అంటూ గుస్సా అవుతున్నారు ఆయన సన్నిహితులు. 

అయినా, ఏదో ఒక విషయం ధైర్యంగా చెప్పేయాల్సింది పోయి, రజనీకాంత్‌ ఈ 'సూపర్‌ పొలిటికల్‌ సస్పెన్స్‌' ఎందుకు మెయిన్‌టెయిన్‌ చేస్తున్నట్టో.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?