Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తేజాపై భరోసా పెట్టుకోవచ్చా?

తేజాపై భరోసా పెట్టుకోవచ్చా?

ఒక్క హిట్ పడగానే ఆ హీరో లేదా ఆ డైరక్టర్ వెంట బొలోమంటూ పడడం అన్నది మన సినిమా జనాలకు వున్న మా చెడ్డ అలవాటు. అంతే కానీ ఆ సినిమా ఎందుకు హిట్ అయింది అన్నది మాత్రం ఆలోచించరు. కథాబలమా? నిర్మాత చాకచక్యమా? నిజంగా డైరక్టర్ వల్లనా? లేక నిజంగా హీరో వల్లనా అన్నది అస్సలు ఆలోచించరు.

నేనే రాజు నేనే మంత్రి సినిమా హిట్ కాగానే అప్పుడే రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. సూట్ కేసులు పట్టుకుని డైరక్టర్ తేజ వెంట పడుతున్నారని. కొందరయితే తమ కొడుకుల్ని పరిచయం చేయించే ఆలోచనలో వున్నారని, ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి.

తేజ మంచి డైరక్టర్ నే. అందులో సందేహం లేదు. కానీ ఆయన ట్రాక్ రికార్డు వేరుగా వుంది. ఇప్పటికి ఆయన చిత్రం సినిమానుంచి వరుసగా 16సినిమాల వరకు చేసారు.  వీటిలో చిత్రం, నువ్వు నేను, జయం పెద్ద హిట్ లు. ఫ్యామిలీ సర్కస్, సంబరం, నిజం, జై,  ధైర్యం, అవునన్నా కాదన్నా, ఒక వి చిత్రం, లక్ష్మీ కళ్యాణం, కేక, నీకు నాకు డాష్ డాష్, వెయ్యి అబద్దాలు, హోరా హోరీ సినిమాల ఫలితం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్లకు నేనే రాజు నేనే మంత్రి హిట్.

నేనే రాజు నేనే మంత్రి సినిమా విడుదలకు ముందు జరిగిన 16కోట్లకు పైగా బిజినెస్ ఏదయితే వుందో అదంతా హీరో రానాకు బాహుబలి ఇచ్చిన క్రేజ్ తప్ప వేరు కాదు. రానా కాకుండా ముందు అనుకున్న రాజశేఖర్ తోనో, లేక మరో హీరోతో అయితేనో, ఇంత ప్రీ రిలీజ్ మార్కెటింగ్ అనేది సాధ్యం కాదనేది ముమ్మాటికీ వాస్తవం.

ఈ సినిమాకు ముందు తేజ జస్ట్ రెండు కోట్ల బడ్జెట్ తో హోరా హోరీ సినిమా చేస్తే, నిర్మాతలకు కోటికి పైగా పోయింది. శాటిలైట్ కాలేదు. మళ్లీ రంజిత్ మూవీస్ నుంచి సినిమా రాలేదు. నేనే రాజు నేనే మంత్రి సినిమాకు కూడా తేజకు లాభాల్లో వాటా ఇచ్చే ప్రాతిపదికన అగ్రిమెంట్ చేసుకున్నారు నిర్మాతలు. అంతే కానీ రెమ్యూనిరేషన్ కాదు.

తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఓవర్ సీస్ లో కానీ అలుముకున్న బాహుబలి మేనియా ఏమిటన్నది మరోసారి రుజువు చేసింది నేనే రాజు నేనే మంత్రి. లేదూ అంటే అంతటి ఓపెనింగ్స్ సాధ్యం కాదు. తొలివారం 15కోట్లకు పైగా టోటల్ షేర్ సాధించింది.

నిర్మాణ వ్యయం తేజ చెబుతున్నది 11కోట్లు అని. కాదు, 16దాకా అయిందన్నది నిర్మాతల మాట. అంటే ప్రీ రిలీజ్ వచ్చిన మొత్తాలు ఏవయితే వున్నాయో అవన్నీ బాహుబలి రానా క్రెడిట్. అందులో అస్సలు ఆర్గ్యుమెంట్ కు చాన్సే లేదు. బ్రాండింగ్ కానీ, హిందీ వెర్షన్ లేదా ఇతర శాటిలైట్ వ్యవహారాలు కానీ అవన్నీ రానా ఖాతాలో పడేవే.

పోనీ ఓపెనింగ్స్ రానా క్రెడిట్ కాదు, అంతా ప్రాజెక్ట్, తేజ క్రెడిట్ అనుకున్నా, ఫస్ట్ వీక్ కు బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చిందన్నమాట. అంటే బాహుబలి క్రెడిట్ వుందనుకున్నా, లేదనుకున్నా, ఈ సినిమా తొలివారంతో డబ్బులు వెనక్కు తెచ్చుకోగలిగింది. మలి వారం నుంచి లాభాలు రావాలి. మరి అలాంటపుడు ఇదే డైరక్టర్ తేజ మరో అప్ కమింగ్ హీరోతోనో లేదా, మరో కొత్త హీరోతోనో చేస్తే పరిస్థితి ఎలా వుంటుంది? ప్రీ రిలీజ్ మార్కెట్ ఏ మేరకు వుంటుంది? ఓపెనింగ్స్ ఏ మేరకు వుంటాయి?

పైగా ఇక్కడ మరో పాయింట్ వుంది. తేజ తన స్క్రిప్ట్ ను అనుకున్నది అనుకున్నట్లు తీస్తేనే సినిమా చేస్తా అని చెప్పా అంటున్నారు. కానీ మార్పులు చేర్పులు వాళ్లు చెప్పినవి చేర్చా అని కూడా అంటున్నారు. అహం సినిమా స్క్రిప్ట్ యేనా ఇది అని అడిగిన మీడియాకు, ‘లేదు.. రానాతో ప్రాజెక్టు అనుకున్నాక చాలా మారింది’ అని ఆయనే చెఫ్పారు.

అంటే ఇక్కడ దగ్గుబాటి సురేష్ కాకుండా మరే నిర్మాత అయినా అయితే ఇన్ని మార్పులు తేజ చేయించడం అన్నది అసాధ్యం. తేజ సంగతి తెలిసిన వారికి, ఆయన పట్టుదల తెలిసిన వారికి ఇది ఇట్టే అర్థం అవుతుంది. అంత మార్పులు సురేష్ చేయించారు అంటే ఒరిజినల్ స్క్రిప్ట్ ఎలా వుండి వుండాలి?

నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ థియేటర్ల స్ట్రాటజీ, సినిమా సబ్జెక్ట్ పై అవగాహన, రానా సోషల్ నెట్ వర్క్ అండ్ పిఆర్ టీమ్ తీసుకువచ్చిన బజ్ అన్నది అప్ కమింగ్ హీరోలకు, చిన్న హీరోలకు, మామూలు నిర్మాతలకు సాధ్యం కాదు. అందువల్ల నేనే రాజు నేనే మంత్రి సినిమా విజయాన్ని చూసి, తేజ తో సినిమా చేయాలనుకునేవారు, ఈ విషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకోవడం అవసరం.

అంతే కాదు హోరా హోరీ లాంటి కోటిన్నర, రెండు కోట్ల చిన్న సినిమా తీసి కూడా మళ్లీ సినిమా జోలికిపోని నిర్మాతను గుర్తు చేసుకుని, దగ్గుబాటి సురేష్ బాబులా అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?