Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగు సినిమా స్టోరీ.. కేరాఫ్‌ ఓవర్సీస్‌..!

తెలుగు సినిమా స్టోరీ.. కేరాఫ్‌ ఓవర్సీస్‌..!

హిందీలో కొంత ముందుగా ఈ ట్రెండ్‌ మొదలైంది. అనుకరణలా కాదు కానీ, మనోళ్లు మనదైన శైలిలో సినిమా కథను దేశాన్ని దాటిస్తున్నారు. తెలుగు కథే, తెలుగు మనుషుల కథే, తెలుగు వాళ్ల భావోద్వేగాలే, తెలుగు సంప్రదాయాలు, విలువల మధ్యన కథలే.. అయినా.. ఇవి కేరాఫ్‌ ఓవర్సీస్‌ అవుతున్నాయి. ఇక్కడ మొదలైనా, అక్కడే మొదలైనా.. తెలుగు సినిమా కథలు విదేశీ గడ్డ మీద సాగుతున్నాయి.

స్టోరీని అలా రాసుకుంటున్నారో, అలా రాసుకుంటే చిత్రీకరణ స్టైలిష్‌గా ఉంటుందని అనుకుంటున్నారో, లేక తమ కథలో అమెరికానో, మరో విదేశాన్నో భాగం చేయాలని కచ్చితంగా డిసైడ్‌ అయిపోయారో కానీ.. ఇప్పుడు కథలు విదేశీ బాట పట్టాయి. కథలో విదేశం భాగం తప్పనిసరి అవుతోంది. ఈ మధ్య వివిధ సినిమాలు ఇలానే వస్తున్నాయి.. ఇదో ట్రెండ్‌గా నడుస్తోందనే విషయాన్ని చాటి చెబుతున్నాయి.

ఏదైనా ఒక బాణీలో ఒక సినిమా హిట్టైందంటే ఆ తర్వాత అదేరూట్లో బోలెడన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. వెనుకటికి రాయలసీమ ట్రెండ్‌ అలానే నడిచింది. ప్రేమించుకుందాం రా, సమరసింహా రెడ్డి వంటి సినిమాలు కథను సీమబాట పట్టించడం మొదలుపెడితే.. అదో సక్సెస్‌ఫుల్‌ ట్రెండ్‌ అయి కూర్చుంది. ఆ తర్వాత రాయలసీమ నేపథ్యంతో డజన్ల కొద్దీ సినిమాలు వచ్చాయి. పెద్ద హీరోలు, చిన్న హీరోలు తేడా లేకుండా.. కథను సీమబాట పట్టించారు. దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆ ట్రెండ్‌ కొనసాగుతోంది.

హీరోకో, విలన్‌కో బీభత్సమైన నేపథ్యం పెట్టాలి అనుకుంటే.. కథకు ఎక్కడో రాయలసీమ ప్రాంతంతో నేపథ్యాన్ని క్రియేట్‌ చేసుకోవడం అలవాటైంది, తప్పనిసరి అయ్యింది. సీరియస్‌ నెస్‌కు అయినా, కామెడీకి అయినా.. సీమ నేపథ్యం తప్పనిసరి అయ్యింది. ఆ మధ్య కొంతమార్పు తీసుకువస్తూ కొరటాల శివ వంటి దర్శకుడు 'మిర్చి' వయోలెన్స్‌ను పల్నాడు ప్రాంతానికి షిఫ్ట్‌ చేశాడు, 'శ్రీమంతుడు' వయోలెన్స్‌ను ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాడు. అలాంటి అరకొర మినహాయింపులు మాత్రమే ఉంటాయి. కానీ వయోలెన్స్‌ అంటే.. అది చిన్నపాత్ర అయినా.. దానికి సీమతో సంబంధం ఉండాల్సిందే ఇది అసంకల్పిత ప్రతీకార చర్యగా మారిపోయింది టాలీవుడ్‌కి.

ఇక ఎన్‌ఆర్‌ఐల కథలే చూస్తామా...!

'నిన్నుకోరి', 'ఫిదా'.. గత కొన్నివారాల్లో వచ్చిన రెండు హిట్‌ సినిమాలు. మొదటిది హిట్‌, రెండోది సూపర్‌ హిట్‌. ఈతరం సినిమాలు. ఈతరం ప్రేమలు, ఈతరం భావోద్వేగాలు, ఈతరం సమస్యలు, ఈతరం పరిష్కారాలు.. ఈ సినిమా కథాంశాలు. ఆసక్తికరం అయిన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కథల్లోకి విదేశాన్ని ఎక్కడా జొప్పించిన దాఖలాలు కనిపించవు. కథానుసారం విదేశం వస్తుందంతే.

హీరోయిన్‌కి మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేయాలనుకునే ఆమె తండ్రి అమెరికాలో సెటిలైన యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, అలాగే పీహెచ్‌డీ పూర్తి చేసిన హీరో అమెరికాలోనే ఉద్యోగం సంపాదిస్తాడు.. అమెరికన్‌ పరిస్థితుల నడుమ, అక్కడి వరకూ వెళ్లిన యువత ఆలోచన స్థాయి మేరకు కథను నడిపించారు. ఓవరాల్‌గా విదేశం అనే ఫీలింగ్‌ కథలో పూర్తిగా మిళితం చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఫిదా కూడా అదే కోవకే చెందిన సినిమా అవుతుంది.

ఇలాంటి సినిమాలు వచ్చిన తర్వాత చెప్పాల్సిన అంశం ఏమిటంటే.. మనోళ్లు కథను విదేశంలో భాగంగా, విదేశాన్ని కథలో భాగంగా చేసేయడంలో విజయవంతం అవుతున్నారనేది. కేవలం ఈ సినిమాలు మాత్రమే కాదు.. రాబోయే మరిన్ని సినిమాల కథాంశాలు కూడా విదేశాల్లో సాగుతున్నవే అనేటాక్‌ వినిపిస్తోంది. ప్రత్యేకించి యువతరం హీరోల సినిమాలు.

70లలో, 80లలోనే మొదలు...

ఎప్పుడో దశాబ్దాల నుంచినే తెలుగు సినిమాలు విదేశాల్ల్లో సాగే కథలుగా రూపొందుతున్నాయి. 'పడమటి సంధ్యారాగం', 'అమెరికా అల్లుడు' వంటి సినిమాలు భారతీయులను విదేశాల పరిస్థితుల నడుమ పెట్టి చిత్రీకరించిన సినిమాలు. అదంతా ప్రధానంగా సంప్రదాయాల తేడాలను చూపించడానికే ఆ సినిమాల దర్శకులు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు.

ఎనభైలలో బోలెడన్ని సినిమాలు విదేశీ గడ్డ మీద చిత్రీకరణ జరుపుకున్నవి ఉన్నాయి.. పాటలు మాత్రమే కాకుండా, సీన్లను కూడా అక్కడ చిత్రీకరించారు. అయితే ఏ మాఫియా ముఠానో, అంతర్జాతీయ స్మగ్లింగ్‌ ముఠానో హైలెట్‌ చేయడానికి విదేశీ వేదికలను ఉపయోగించుకొంటూ వచ్చారు మనవాళ్లు. ఆ తర్వాత సంప్రదాయాల తేడాలను చూపించడానికి కథలో విదేశాన్ని ఎంచుకొంటూ వచ్చారు.

80లలోని బోలెడు సినిమాల్లో హీరో ఫస్ట్‌ సీన్లోనే విదేశం నుంచి దిగడం కథానుసారమైన ఎత్తుగడ. ఇక 90లలోకి వచ్చేసరికి విదేశీ వాతావరణంలో పెరిగిన హీరోహీరోయిన్ల అలవాట్లు విపరీత స్థాయిలో ఉంటాయనే సందేశాన్ని ఇస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత తెలుగు సినిమాలు అవసరం లేకపోయినా విదేశాల బాట పట్టడం కనిపిస్తూ ఉంటుంది. పాటల చిత్రీకరణకు విదేశీ లొకేషన్లను ఎంచుకోవడం స్టైల్‌గా మారింది. విదేశీ రోడ్ల మీద హీరోహీరోయిన్లు గంతులేస్తూ పాటలు చిత్రీకరించడం అప్పట్లో ఒక స్టైల్‌. అదే రిచ్‌నెస్‌. డ్యూయెట్లు అయితే.. విదేశాల్లోని మంచు కొండల్లో, బ్యూటిఫుల్‌ లొకేషన్లలో చిత్రీకరిస్తూ వచ్చారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. 

త్రివిక్రమ్‌ వంటి రచయితలు, దశరథ్‌ వంటి దర్శకులు వచ్చాకా.. కథలో రిలీఫ్‌మెంట్‌ కోసం సినిమాను విదేశీ బాట పట్టించడం మొదలైంది. ఇదంతా బాలీవుడ్‌ ప్రభావం, బాలీవుడ్‌లో ఎన్‌ఆర్‌ఐల కథలు మొదలయ్యాకా.. మనోళ్లూ అదే రూటును అందుకున్నారు. 'సంతోషం' సినిమాలో.. నాగార్జున, శ్రియ, ప్రభుదేవ వంటి పాత్రలు చాలాసార్లు విదేశానికి వెళ్తుంటాయి, మళ్లీ తిరిగి వస్తూ ఉంటాయి. అక్కడ విదేశానికి బదులు పక్కూరిని పెట్టుకున్నా వచ్చే నష్టం ఏమీలేదు.

కేవలం రిచ్‌నెస్‌ కోసం విదేశాన్ని వాడుకున్నారు. 'మన్మథుడు'లో కథను పారిస్‌ తీసుకెళ్లారు. కొన్ని సీన్లను అక్కడా తీశారు. 'ఎలా చెప్పను' సినిమా కూడా దాదాపు అదే బాపతు. 'సొంతం'లో హీరోహీరోయిన్ల మధ్య విరహాన్ని చూపడానికి 'కలుసుకోవాలని'లో హీరోహీరోయిన్ల రొమాన్స్‌కు కథను విదేశానికి తీసుకెళ్లారు. వీటన్నింటికన్నా ముందు రాఘవేంద్ర రావు 'పరదేశీ' పూర్తి స్థాయిలో విదేశంలో సాగిన సినిమాగా నిలిచింది.

ఇక 'జయం మనదేరా' వంటి సినిమాలు కూడా దాదాపు ఫారెన్‌లో సాగాయి. ఒక ట్రావెలాగ్‌లా సాగే ఆ సినిమాలో విదేశీ లొకేషన్లు మిళితం అయిపోయాయి. తమిళంలో శంకర్‌ తీసిన 'జీన్స్‌' మూవీ కూడా ఎన్‌ఆర్‌ఐల కథలాంటిదే. అయితే అమెరికాను భారీ ఎత్తున చూపడానికి, తన మార్కు రిచ్‌నెస్‌ కోసం మాత్రమే శంకర్‌ యూఎస్‌ వేదికగా ఆ సినిమాను రూపొందించుకున్నాడు. అలాగే కల్చరల్‌ తేడాలను చూపించాడు.

ఇప్పుడిప్పుడే అసలు ఫ్లేవర్‌..

ఇన్నేళ్లూ ఒకఎత్తు, ఇప్పుడు ఒకఎత్తు. ఏదో కల్చరల్‌ తేడాలను చూపించాలనే ప్రయత్నం దగ్గర మొదలై.. విలన్లను అంతర్జాతీయ స్థాయి వారని చూపడం మొదలు పెట్టి, ఆ తర్వాత పాటల కోసం విదేశం బాట పట్టి, రిచ్‌నెస్‌ కోసమని విదేశాల్లో సీన్లను చిత్రీకరించి... ఇలా వస్తున్న మార్పుల్లో ఇప్పుడిప్పుడే మనోళ్లు విదేశాల లొకేషన్లను కచ్చితమైన అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటున్నారు. ఇదే సమయంలో తెలుగు సమాజంలో చాలా తేడాలు వచ్చాయి.

మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు కూడా ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేసేస్తున్నారు. గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో కూడా ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న యువకుల మూలాలు కనిపిస్తున్నాయి. చాలా ఇళ్లలోని పిల్లలు ఫారెన్‌లో ఉన్నారు లేదా వెళ్లి వచ్చి ఉంటారు. కాబట్టి.. విదేశంలో సాగే ప్రేమకథనో, మరో కథనో ఓన్‌ చేసుకునే అవకాశాలు మెరుగయ్యాయి.

అలాగే ఎనభైలలో, తొంభైలలో విదేశాలకు వెళ్లి అక్కడే సెటిలైన వారూ బోలెడంత మంది ఉన్నారు. అలాంటి వారి కథలుగా 'నాన్నకు ప్రేమతో' వంటి సినిమాలు వస్తూ ఉన్నాయి. కథ బేస్‌మెంట్‌నే విదేశంగా చేసుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సామాజిక మార్పులే అలాంటి అవకాశాలు ఇస్తున్నాయి. దీంతో తెలుగు దర్శక, రచయితలు కూడా ఆ తరహా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ముందు ముందు.. ఈ తీరు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?