Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హద్దులు దాటుతున్న టీవీ యాడ్స్‌...!

హద్దులు దాటుతున్న టీవీ యాడ్స్‌...!

ఒకవైపు అర్జున్‌ రెడ్డి వంటి సినిమాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని కొంతమంది వాపోతూ ఉన్నారు. ఆ సినిమాలో హీరో డ్రగ్స్‌ వాడాడు అని, మందు తాగాడు అని, తాగి ఆపరేషన్లు చేసి సమాజం అనారోగ్యానికి కారణం అవుతున్నాడనేది వీళ్ల వాదన. మరి అదొక సినిమా. అది కూడా 'ఏ' సర్టిఫికెట్‌ పొందిన సినిమా. అది చిన్న పిల్లల మీదో లేక టీనేజ్‌ పిల్లల మీదో ప్రభావం చూపించదనే.. సెన్సార్‌ బోర్డు సర్టిఫై చేసింది. ఎలాగంటే.. అది ఏ సర్టిఫికెట్‌ పొందిన సినిమా కాబట్టి.. 18 యేళ్లలోపు వాళ్లకు టికెట్లు అమ్మకూడదు.

పద్దెనిమిదేళ్ల లోపు పిల్లలను తల్లిదండ్రులు ఆ సినిమాకు పంపకూడదు.. అని చెబుతున్నాయి నిబంధనలు. మరి ఎవరైనా చిన్న పిల్లలు ఆ సినిమా చూశారు.. అని అంటే, అది వ్యవస్థ ప్రాబ్లమ్‌. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల అలా జరిగినట్టే. తమ పిల్లలు తమకు తెలీకుండా సినిమాకు వెళ్తున్నారు, పద్దెనిమిదేళ్లలోపే అలా జరుగుతోంది. అది కూడా పెద్దలకు మాత్రమే అయిన సినిమాలకు వాళ్లు వెళ్తున్నారు అంటే.. అది తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం మాత్రమే. ఇందులో అర్జున్‌ రెడ్డి మూవీ మేకర్లనో, ఇలాంటి ఇంకో సినిమా మేకర్లనో నిందించడానికి ఏమీలేదు.

సభ్య సమాజం మీద చాలా బాధ్యతతో కొంతమంది అర్జున్‌ రెడ్డి వంటి సినిమాను పోస్టుమార్టం చేస్తున్నారు. అందులో ఆ సీన్లో.. హీరో అలా ఎందుకు ప్రవర్తించాడు? అలా ఎలా ప్రవర్తిస్తాడు? అని ప్రశ్నలు వేస్తున్నారు. మరి సినిమాలో పాత్ర అలా ఎందుకు ప్రవర్తించింది? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. దానికి సమాధానం ఏముంది? అది సినిమా.. ఆ సినిమాలో పాత్ర ఎలా ప్రవర్తించాలో.. నువ్వెలా చెబుతావు? మరి ప్రతి పాత్ర నీకు అనుకున్నట్టుగా ప్రవర్తించాలి అంటే... నువ్వే సినిమా తీసుకోవడం మంచిది. అర్జున్‌ రెడ్డి వంటి సినిమాను ఖండఖండాలుగా చేసి.. చెండాడుతున్న వాళ్లు ఈ విషయాన్ని గ్రహించాలి.

మరి ఒక సినిమా విషయంలో ఇంతగా రియాక్ట్‌ అయిపోతున్న ఈ హిపోక్రాట్స్‌.. తమ ఇంటిలోకి చొరబడిపోయిన చెత్త విషయంలో మాత్రం మాట్లాడటంలేదు. అర్జున్‌ రెడ్డి వంటి సినిమా నుంచి చెడును నేర్చుకోవాలి అంటే.. నిజంగానే అలాంటి తత్వం ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే.. వారు దాని కోసం థియేటర్‌ వరకూ వెళ్లాలి. పిల్లల్ని థియేటర్‌కు వెళ్లకుండా కట్టడి చేయడం చేతగాని తల్లిదండ్రులు.. చూడకూడనివి అనిపించిన సినిమాలను వాళ్లు చూడాల్సిన పరిస్థితులే ఏర్పడేటట్లు అయితే.. తమ బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టే. మరి అర్జున్‌ రెడ్డి అంత చూడకూడని సినిమా అయినప్పటికీ.. మహామహా మేధావులు దానిపై పెద్ద చర్చ రేపుతున్నారు.

ఈ చర్చ వల్ల ఏమవుతోందంటే.. చాలా మందిలో ఆ సినిమాను చూడాలనే ఆసక్తి మొదలవుతోంది. ఇంతగా చెబుతున్నారంటే..అందులో ఏముంటుందో..అనే ఆసక్తి అది. ప్రత్యేకించి టీనేజర్లలో ఇలాంటి ఆసక్తి కలిగిందంటే.. దానికి కారణం అర్జున్‌ రెడ్డి మూవీ మేకర్లు కాదు. ఈ సినిమా గురించి ఛానళ్ల వరకూ చర్చను తీసుకెల్లిన వాళ్లు. ఫేస్‌బుక్‌లలో పుంఖానుపుంఖానులుగా ఈ సినిమా గురించి రాస్తున్న వాళ్లు. అదొక సినిమా.. దాన్ని అలా వదలిపెట్టండి అంటే.. వీళ్లు వదలడంలేదు. పోస్టుమార్టాలు చూస్తే.. దాన్ని అందరికీ పంచుతున్నారు. వీలైనంత ప్రచారం కల్పించి.. ఆ సినిమాను అందరూ చూసేలా చేస్తున్నారు.

మరి సదరు సినిమా వచ్చి నెలరోజులు పూర్తి కావొస్తున్నా.. ఇంకా ఇలాంటి చర్చోపచర్చలు కొనసాగుతూ ఉండటం విస్మయకరం. మరి ఇదే సమయంలో.. టీవీల్లో ప్రసారం అవుతున్న కొన్ని యాడ్స్‌ గురించి ప్రస్తావించక తప్పదు. హద్దు మీరుతున్న టీవీ యాడ్స్‌ ఇవి. ఈ యాడ్స్‌ అర్జున్‌ రెడ్డిలా తాగుడునో, డ్రగ్స్‌నో ప్రమోట్‌ చేస్తాయని అనడంలేదు. ఇవి విషపూరితం ఆల్మోస్ట్‌. సినిమాలు చూసి.. డ్రగ్స్‌, తాగుడు అలవాటు చేసుకునే వాళ్లు ఉంటే అది వాళ్ల తెలివితక్కువ తనం తప్ప మరోటి కాదు. కానీ.. ఈ యాడ్స్‌ రక్త సంబంధాల మధ్య కూడా విషాన్ని ఇంజెక్ట్‌ చేస్తున్నాయేమో అనిపిస్తోంది.

ఒక పెర్‌ఫ్యూమ్‌ యాడ్స్‌ కొన్నాళ్లుగా వస్తోంది.. అందులో ఒక కుర్రాడు ఫెర్యూమ్‌ కొట్టుకుని వెళ్లి ఒక అమ్మాయికి పరిచయం అవుతాడు. ఆ అమ్మాయి తండ్రే అతడిని కూతురికి పరిచయం చేస్తాడు. కట్‌ చేస్తే.. మరుసటి రోజు ఉదయం అమ్మాయిని విష్‌ చేసిన తండ్రికి, ఆమె దగ్గర కుర్రాడు వాడిన స్ప్రేవాసన వస్తుంది. అంటే.. ఆ రాత్రి ఆ కుర్రాడు తన కూతురితో గడిపాడనే విషయం తండ్రికి అర్థం అవుతుంది. అప్పుడు కుర్రాడి పేరును ఆగ్రహంతో తలుచుకుంటాడు.

మరి ఇంత దరిద్రమైన ఐడియా ఎవడికి వచ్చిందో కానీ.. దీనికి ఇంకో కొనసాగింపు ఉంది. రెండో రోజు అదే స్ప్రే కొట్టుకుని వెళ్తాడు కుర్రాడు. ఈసారి అమ్మాయి వాళ్ల అమ్మ పడిపోతుంది. మొన్న తన కూతురిని, ఇప్పుడు తన భార్యను పడేసిన కుర్రాడి పేరును ఆగ్రహంతో తలుచుకుంటాడు ఆ తండ్రి. ఇక ఇదే ఫెర్యూమ్‌కు సంబంధించి మూడో యాడ్‌ ఇచ్చే సందేశం ఏమిటంటే.. ఆ ఫెర్యూమ్‌ను కొట్టుకునే కుర్రాడికి, ఆ అమ్మాయికి మధ్య లైంగిక సంబంధం రొటీన్‌ అయ్యింది అని!

ఒక ఫెర్యూమ్‌ను ప్రమోట్‌ చేసుకోవడానికి ఇలాంటి యాడ్స్‌ తీయాలా? ఇంతకీ ఏం చెప్పదలుచుకున్నారు? అయితే ఈ సెంట్లు, స్ప్రేల యాడ్స్‌కి ఈ చెత్త ఐడియాలు కొత్తేమీ కాదు. మా స్ప్రేను కొట్టుకుని మీరు రోడ్డు మీద నడుస్తుంటే.. అమ్మాయిలంతా మీ వెంట పడతారనే సందేశంతోనే వీటి రూపకల్పన జరుగుతూనే ఉంది. మరి 150 రూపాయల స్ప్రేతోనే అలా జరిగిపోతుంది.. అని వీళ్లు సందేశం ఇస్తున్నారు.

రక్త సంబంధాల మీద కూడా పైత్యాన్ని రుద్ధుతున్నారు. ఇది వరకూ ఒక స్ప్రే యాడ్‌ వచ్చేది. తన షర్ట్‌ బటన్‌ పోయిందని వదినకు చెబుతాడు ఒక కుర్రాడు. అప్పటికే అతడు ఒక కంపెనీ స్ప్రే కొట్టుకుని షర్ట్‌ వేసుకొంటూ ఉంటాడు. ఆ బటన్‌ కుట్టడానికి వదిన దగ్గరకు వస్తుంది. అతడి స్ప్రే వాసనకు ఆమె మత్తుకు లోనవుతుంది, వాళ్లు తలుపులు వేసుకొంటారు. ఇదీ టీవీ యాడ్స్‌ దేశానికి ఇస్తున్న సందేశం.

ఇక మరో యాడ్‌లో అయితే.. ఒక కుర్రాడు జిమ్‌లోనో, గ్రౌండ్లోనో తెగ శ్రమిస్తూ ఉంటాడు. అతడిని ఒక అమ్మాయి పిలుస్తుంది. నేను మరిన్ని కేలరీలు ఖర్చు చేయాలని అనుకుంటున్నాను అని అతడు చెబితే, ఆ విషయంలో నేను సాయం చేస్తాన్‌ రా.. అని ఆ అమ్మాయి కవ్విస్తుంది! ఇక మొబైల్‌ ఫోన్‌ యాడ్‌ అయితే పైశాచికం. ఒక అమ్మాయి గదిలోకి దూరి ఉంటాడొక అబ్బాయి. వాళ్లిద్దరూ రొమాన్స్‌లో ఉండగా.. ఆమె తండ్రి వస్తాడు. డోర్‌ కొడతాడు

కుర్రాడిని తలుపుచాటున దాచి.. అమ్మాయి డోర్‌ తెరుస్తుంది. అంతలోనే కుర్రాడి మొబైల్‌ రింగ్‌ అవుతుంది. అతడిని ఆ తండ్రి చూస్తాడు.. ఏమంటాడో అనుకోవద్దు. కుర్రాడి చేతిలో మొబైల్‌కు ఆ తండ్రి ఫిదా అవుతాడు. అతడు ఎందుకు అక్కడున్నాడు అని అడగడు.. ఆ మొబైల్‌ ఫోన్‌ వివరాలు అడుగుతాడు!

థియేటర్లలో ప్రసారం అయ్యే యాడ్స్‌కు ముందు సెన్సార్‌ సర్టిఫికెట్‌ను చూపుతారు. మరి టీవీల్లో యాడ్స్‌కు సెన్సార్‌ ఉండదా? ప్రమోషన్‌ పేరుతో.. వ్యాపారం చేసుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలను వేసుకోవాలా? వీటికి అడ్డుకట్టలేమీ లేవు. టీవీ అంటే.. థియేటర్లు కాదు, చిన్న పిల్లలు, ఇంట్లో వాళ్లు అంతా కలిసి కూర్చుని చూస్తారు. అలాంటి చోట ఇలాంటి యాడ్స్‌ 

'అర్జున్‌ రెడ్డి' వంటి సినిమా చూసి.. దాని గురించి విశ్లేషించి, వీలైనంత ప్రచారం కల్పించే వాళ్లకు టీవీలో వస్తున్న ఈ చెత్త కనపడదా? కావాలని వెళ్లి చూసేది సినిమా. అసంకల్పితంగా దగ్గరయిపోతున్నాయి టీవీ యాడ్స్‌. తాగుడు, డ్రగ్స్‌కు మించిన చెడు ఆలోచనలను పిల్లల్లో నాటడానికి ఈ యాడ్స్‌ తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి వీటికి లేదా అడ్డుకట్ట?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?