Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విడుదల ఆగిపోయిన సినిమాలన్నీ ఈ నెల్లోనే!

విడుదల ఆగిపోయిన సినిమాలన్నీ ఈ నెల్లోనే!

ఈ ఏడాది దసరా తర్వాత పెద్ద సినిమాలకు బ్రేకులు పడ్డాయి. దసరాకు కాస్త అటూ ఇటూ వచ్చిన జై లవకుశ, స్పైడర్‌ సినిమాలు.. ఏ మాత్రం ప్రత్యేకతను నిరూపించుకోలేకపోయాయి. జై లవకుశ కలెక్షన్ల పరంగా ఓకే అనిపించుకున్నా, ట్రుపుల్‌ యాక్షన్‌ సినిమా ఎన్టీఆర్‌కు మధురానుభూతిగా మారలేకపోయింది. ఇక స్పైడర్‌ సంగతి సరేసరి. నష్టాల విషయంలో దేశ సినీ చరిత్రలోనే రెండో పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. డిజాస్టర్స్‌ విషయంలో ఫస్ట్‌ ర్యాంకులో బాంబే వెల్వెట్‌ ఉండగా, రెండో ర్యాంకులో స్పైడర్‌ ఉంది.

అలా రెండు భారీ సినిమాలు నిరాశ పరిచిన తర్వాత దసరా తర్వాత చిన్న సినిమాలు వరసపెట్టి క్యూకట్టాయి. కొన్ని మిడ్‌రేంజ్‌ సినిమాలు వచ్చినా.. అవి కూడా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. ఈ విధంగా ఈ ఏడాది లాస్ట్‌ క్వార్టర్‌ చెప్పుకోదగిన విజయాలు లేకుండా గడిచిపోతోంది. అయితే డిసెంబర్లో కొన్ని ఆసక్తిదాయకమైన సినిమాలు రాబోతున్నాయి. నాని సినిమా, అఖిల్‌ సినిమా, కల్యాణ్‌ రామ్‌ సినిమా.. ఇవీ ముఖ్యమైనవి. టాలీవుడ్‌కు విజయాల పర్సెంటేజీ తక్కువగా కనిపిస్తున్న ఈ ఏడాదిలో చివరి పక్షంలో ఈ సినిమాలు రాబోతున్నాయి.

మరి ఇవి ఈ ఏడాదికి మేలి మలుపులు అవుతాయా? కొసమెరుపులుగా విజయవంతం అయిన సినిమాలుగా నిలుస్తాయా? అనేది ఆసక్తిదాయకమైన అంశం. అలాగే ఈ ఆఖరి నెలలో కొన్ని పెండింగ్‌ సినిమాలు కూడా విడుదల అవుతుండటం. అవి మొదలై చాలాకాలమే అయ్యింది. అయితే విడుదల మాత్రం అంతఈజీగా జరగడంలేదు. అవి మరీ చోటా సినిమాలు కూడా కాదు. అంతోఇంతో చెప్పుకోదగిన సినిమాలే. విడుదలకు మోక్షం లభించని ఆ సినిమాలు ఎట్టకేలకూ ఈ డిసెంబర్లో అయినా వస్తాయా? లేక ప్రకటనలు ప్రకటనలుగానే మిగిలిపోయి మళ్లీ వాయిదా పడతాయా? అనేది చెప్పలేం.

ఈ జాబితాలో ముందుంటుంది రవిబాబు 'అదుగో'. ఈ సినిమా ప్రారంభమై చాలాకాలం అయ్యిందని వేరే చెప్పనక్కర్లేదు. ఇందులో పందిపిల్ల ఒక ప్రధాన పాత్రను పోషిస్తుందన్న ప్రకటనతో రవిబాబు చాలాకాలం కిందటే దీన్ని హైలెట్‌ చేశాడు. రవిబాబు మార్కు సినిమాలు టాలీవుడ్‌లో ప్రత్యేకమే. కాబట్టి మొదటి నుంచి ఈ సినిమా ఆసక్తిని రేపింది. అయితే నెలలు గడిచిపోయాయి, సంవత్సరం గడిచిపోయింది. క్యాలెండర్లు మారిపోతున్నాయి.

అయితే ఈ సినిమా మాత్రం రావడంలేదు. అయితే ఎట్టకేలకూ డిసెంబర్లో విడుదల అంటున్నారు. అప్పుడెప్పుడో నోట్లరద్దు సమయంలో ఏటీఎం ముందు పందిపిల్లను పట్టుకుని.. నేషనల్‌ చానళ్ల న్యూస్‌కు కూడా చేరాడు రవిబాబు. మరి నోట్లరద్దు జరిగి సంవత్సరం గడిచిపోయింది... కొత్త సంవత్సరం రాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో రవిబాబు పందిపిల్ల సినిమాకు మోక్షం లభిస్తుందేమో చూడాలి.

అలాగే తరుణ్‌ హీరోగా నటించిన సినిమా ఒకటి కూడా విడుదల అవుతుందట ఈ నెలలో. మరో సినిమా శ్రీకాంత్‌ ది. రా..రా.. పేరుతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే విడుదలల విషయంలో బోలెడు వాయిదాలు పడింది. ఇది కూడా డిసెంబర్లో వస్తుందట. ఇలాంటి సినిమాలో రాబోతున్నాయి ఈ నెలలో. మరో ఆసక్తిదాయకమైన అంశం ఏమిటంటే.. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్లలో విడుదల అయిన మొత్తం సినిమాల సంఖ్య 50ని దాటింది.

వీటిల్లో మెజారిటీ వాటా స్ట్రైట్‌ సినిమాలదే. నాలుగైదు డబ్బింగ్‌ సినిమాలున్నాయంతే. మిగతావన్నీ తెలుగులో రూపొందినవే. రెండునెలల్లో 50 సినిమాలను విడుదల చేయడం ద్వారా టాలీవుడ్‌ కొత్త హైట్స్‌కు రీచ్‌ అయినట్టే. అయితే వీటిల్లో కనీసం రెండు సినిమాలు కూడా హిట్‌ అనిపించుకోకపోవడం.. టాలీవుడ్‌ ధైన్య స్థితిని చాటుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?