Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి.!

విగ్రహం పుష్టి.. నైవేద్యం నష్టి.!

తెలుగు సినిమా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.. ఈ మాట గత కొన్నేళ్ళుగా చెప్పుకుంటూనే వున్నాం. ‘మగధీర’, ‘ఈగ’ తదితర సినిమాలొచ్చినప్పుడు టెక్నాలజీ పరంగా తెలుగు సినిమా ఏ స్థాయిలో దూసుకుపోతోందన్న విషయమై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక, తెలుగు సినిమాల్ని హిందీలోకి రీమేక్‌ చేస్తోంటే మనం ఉప్పొంగిపోయాం.

సినిమా నిర్మాణం విషయంలో తెలుగు సినిమా ఎప్పుడూ జెట్‌ స్పీడ్‌తోనే దూసుకుపోతుంది. అది తెలుగు సినిమా ప్రత్యేకత. తెలుగులో సినిమా నిర్మించినంత వేగంగా హిందీలోనో, తమిళంలోనో ఆ పని చేయలేం.. అని ఆయా భాషలకు చెందిన ప్రముఖులు అంటుంటారు. అది నిజం కూడా. కానీ, సక్సెస్‌ రేట్‌ విషయంలోనే ఇబ్బందులొస్తున్నాయి. సక్సెస్‌ రేటు అనేది దాదాపు అన్ని సినిమాల్లోనూ ఒకేలా వుంటోంది.

తెలుగు సినిమా పరిశ్రమను తీసుకుంటే ఎక్కువ సినిమాలొస్తున్నా సక్సెస్‌ రేటు పెరగడంలేదాయె. ఓ సినిమా కమర్షియల్‌ విజయం సాధిస్తే కంటెంట్‌ పరమ వీక్‌గా వుంటోంది.. కంటెంట్‌ బావుంటే, వసూళ్ళు వుండవు.. రెండూ వుంటే.. అది ఏడాదికి ఒకసారి లేదంటే రెండు సార్లు.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఈసారి పెద్ద సినిమాల్లో ఒకటీ అరా మాత్రమే మంచి విజయాన్ని సాధించాయి. చిన్న సినిమాలు భళా అన్పించినా, పదుల సంఖ్యలో విడుదలకు నోచుకోనివీ వున్నాయి.

సక్సెస్‌, ఫెయిల్యూర్‌ సంగతి అటుంచితే, ఇదివరకెన్నడూ లేని విధంగా వివాదాలు తెలుగు సినీ పరిశ్రమని అతలాకుతలం చేస్తున్నాయి. ఓ హీరోయిన్‌ తన ఫొటోల్ని అనుమతి లేకుండా వాడేశారని మీడియాకెక్కితే, ఇంకో డైరెక్టర్‌, తనకు ప్రొడ్యూసర్‌ ఇస్తానన్న సొమ్ము ఇవ్వలేదని రచ్చ చేశాడు. ఇంకో ప్రొడ్యూసర్‌, దర్శకుడు తనను నిలువునా ముంచేశాడని ఆరోపించాడు. విడుదల విషయంలో వివాదాలూ తక్కువేమీ కాదు. ఇవి కాక కొత్తగా సినీ పరిశ్రమలో తెలంగాణ - ఆంధ్ర వివాదం ముదిరి పాకాన పడింది.

ఈ పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ మనుగడ ఎలా.? అన్న చర్చ ప్రతి ఒక్కరిలోనూ జరుగుతోంది. వంద కోట్లు ఖర్చు చేసే స్థాయికి తెలుగు సినిమా వెళ్ళినా, నిర్మాతకు చిల్లి గవ్వ మిగలని ప్రమాదమైతే పొంచి వుంది. సేఫ్‌ ప్రాజెక్ట్‌.. అని గతంలోలా సినిమాల్ని నిర్మించుకోలేని పరిస్థితుల్లో వున్నామంటే.. తెలుగు సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా వున్నట్టే కదా.!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?