Home > Movies - Movie News
10 లక్షలు.. పెద్ద మేటరేం కాదు

మామూలుగా అయితే, పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' ట్రైలర్‌, యూ ట్యూబ్‌లో ఇరవై నాలుగ్గంటలు దాటకుండానే 10 లక్షల వ్యూస్‌ దాటేసిందంటే అది పెద్ద విషయమే. కానీ, 'బాహుబలి-2' ట్రైలర్‌ యూ ట్యూబ్‌ని షేక్‌ చేసేసిన దరిమిలా, 'కాటమరాయుడు' హవా ఇప్పుడెవరూ లెక్క చేయడంలేదు. కోటి వ్యూస్‌ని 'కాటమరాయుడు' టీజర్‌ దాటేసిందన్నది ఒకప్పుడు పెద్ద న్యూస్‌. అది కూడా చిన్నబోయిందిప్పుడు. దాంతో, 10 లక్షల వ్యూస్‌ని ఎవరూ కేర్‌ చేయని పరిస్థితి. 

వ్యూస్‌ సంగతి అటుంచితే, అల్లు అర్జున్‌ అభిమానుల పేరుతో యూ ట్యూబ్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది. ట్రైలర్‌ అలా విడుదలయ్యిందో లేదో, ఇలా డిస్‌ లైక్స్‌ మొదలెట్టేశారు సోకాల్డ్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌. 'మా డిజె సినిమాకి మీరు డిస్‌ లైక్స్‌ కొడతారా.? మా ప్రతాపం చూపిస్తాం..' అని చెప్పి మరీ డిస్‌ లైక్స్‌తో హోరెత్తించేశారు. ఈ నేపథ్యంలో అటు పవన్‌ అభిమానులకీ, ఇటు అల్లు అర్జున్‌ అభిమానులకీ మధ్య పెద్ద రచ్చే జరిగిపోతోంది. 

యూ ట్యూబ్‌లో 'కాటమరాయుడు' ట్రైలర్‌ కింద, కామెంట్స్‌లో అల్లు అర్జున్‌ అభిమానుల సందడే ఎక్కువగా కన్పిస్తోంది. వారికి రిటార్ట్‌ ఇవ్వడంతోనే సరిపెట్టారు పవన్ అభిమానులు. మరోపక్క, చిత్రంగా 'కాటమరాయుడు' ట్రైలర్‌కి తమిళ హీరో అజిత్‌ ఫ్యాన్స్‌ నుంచి మద్దతు లభిస్తోంది. 'వి సపోర్ట్‌ కాటమరాయుడు..' అంటూ అజిత్‌ అభిమానులు సందడి చేస్తున్నారు. అజిత్ తమిళంలో నటించిన ’వీరం‘ సినిమానే తెలుగులో ’కాటమరాయుడు‘ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే కదా.

అన్నట్టు, 'కాటమరాయుడు' టీజర్‌ కోటి వ్యూస్‌ దాటేస్తే, ఆ కోటి అనే ఫిగర్‌ని తాజాగా టచ్‌ చేసేసింది 'డిజె'. 'బాహుబలి-2' తెలుగు వెర్షన్‌ ఏ తెలుగు సినిమాకీ అందనంత ఎత్తులో వుంది.. అదిప్పుడు మూడు కోట్లకు దగ్గర్లో వుంది.