Home > Movies - Movie News
ఆ బాలనటులు.. ఇటువైపు చూడరేం.?

అంతర్జాతీయ బాలల దినోత్సవం మన తెలుగు గడ్డ మీద.. అందునా హైద్రాబాద్‌లో గత కొన్నేళ్ళుగా అంగరంగ వైభవంగా జరుగుతోన్న విషయం విదితమే. సినీ రంగంపై ఆసక్తి వున్న చిన్నారులు రూపొందించిన సినిమాలు, చిన్న పిల్లల కోసం తీసిన ప్రత్యేకమైన సినిమాలు.. ఇక్కడ ప్రతి యేడాదీ సందడి చేస్తుంటాయి. వాటిని తిలకించేందుకు పెద్దయెత్తున చిన్నారులు తరలి వస్తుంటారు కూడా.! 

కానీ, ఎందుకో ఈ సినీ ఉత్సవాలపై ఇప్పుడు స్టార్స్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఒకప్పటి బాల నటీనటులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. తెలుగు సినీ పరిశ్రమలో బాల నటులు.. అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు తరుణ్‌దే. కానీ, చాలామంది వున్నారు.. అలా బాల నటులుగా సత్తా చాటి, హీరోలుగా వెండితెరపై వెలిగిపోతున్నవారు. మహేష్‌ కూడా బాల నటుడిగా చిన్నప్పుడు సినిమాల్లో నటించినవాడే. ఎన్టీఆర్‌ ఒక్కటే సినిమా చేసినా, బాల నటుడిగా గుర్తింపు దక్కించుకున్నవాడే. 

నిర్వాహకులు, ఆయా స్టార్స్‌తో టచ్‌లోకి వెళ్ళడంలేదా.? టచ్‌లోకి వెళ్ళినా స్టార్స్‌ పెద్దగా ఈ ఉత్సవాలపై ఆసక్తి చూపడంలేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, 'ఆ లోటు' మాత్రం చిత్రోత్సవాల్లో స్పష్టంగా కన్పిస్తుంటుంది. స్టార్స్‌ గనుక ఈ వేడుకలకి హాజరైతే, మన తెలుగునాట జరిగే అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవానికి మరింతగా కళకళ్ళాడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదేమో. ఈ విషయంలో ప్రభుత్వం తరఫునుంచీ, అలాగే సినీ పరిశ్రమ నుంచీ ఆ స్టార్స్‌పై కాస్త ఒత్తిడి పెరిగితే మంచిదేగా.!