Advertisement


Home > Movies - Movie News
ఆ రేర్‌ ఫీట్‌ వరుణ్‌ ఖాతాలో పడుతుందా.?

50కోట్ల రూపాయల వసూళ్ళకు అతి చేరువలోకి వచ్చేశాడు నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ. 'ఫిదా' రూపంలో వరుణ్‌ తేజకి, సూపర్‌ సక్సెస్‌ దొరికిన విషయం విదితమే. సినిమాలో మేగ్జిమమ్‌ క్రెడిట్‌ సాయిపల్లవికి వెళ్ళిపోయినాసరే, వరుణ్‌ డెడికేషన్‌ని తక్కువగా చూడ్డానికి వీల్లేదు. శేఖర్‌ కమ్ముల, దిల్‌ రాజు.. ఇలా 'ఫిదా' సక్సెస్‌లో ఒకర్ని మించిన క్రెడిట్‌ ఇంకొకరికి దక్కుతుందన్నది నిర్వివాదాంశం. 

ఇక, హీరోగా తొలిసారి 50కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం రావడం అంటే వరుణ్‌కి అది చిన్న విషయమేమీ కాదు. తొలి సినిమా 'ముకుంద'తోనే ప్రామిసింగ్‌ హీరో అన్పించుకున్న వరుణ్‌, రెండో సినిమా 'కంచె'తో మరింతగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే, 'లోఫర్‌', 'మిస్టర్‌' సినిమాలు మాత్రం వరుణ్‌ని తీవ్రంగా నిరాశపర్చాయనే చెప్పాలి. సరిగ్గా ఈ టైమ్‌లోనే వరుణ్‌కి 'ఫిదా' రూపంలో అదృష్టం కలిసొచ్చింది. 

ఓవర్సీస్‌లో అయితే 'ఫిదా' ఇప్పటికే సంచలనాల మీద సంచలనాల్ని నమోదు చేస్తోంది. ఆల్రెడీ 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని దాటేసిన 'ఫిదా', తాజాగా 'నాన్నకు ప్రేమతో' వసూళ్ళను దాటి ముందుకు దూసుకెళ్ళింది. ఇక్కడితో 'ఫిదా' పరుగు ఆగుతుందా.? ఇంకా మరికొన్ని స్థానాలు పైకెగబాకుతుందా.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 

మొత్తంగా 44కోట్ల వసూళ్ళు ఇప్పటికే సాధించిన 'ఫిదా', 50కోట్ల మార్క్‌ని అందుకోవడానికి కాస్త గట్టిగానే ప్రయత్నిస్తోంది. కొంచెం కష్టమేగానీ, అసాధ్యమైతే కాదు. 40కోట్ల క్లబ్‌లో చేరడమే వరుణ్‌కి ఓ ల్యాండ్‌ మార్క్‌.. అదీ చిన్న సినిమాతో సాధించేశాడు. ఆ 50కోట్ల మార్క్‌ కూడా వరుణ్‌కి అందుతుందా.? వేచి చూడాల్సిందే.