Advertisement


Home > Movies - Movie News
అభిమానులంటే వెర్రి వెంగళప్పలా.?

సినిమా అనేది నిఖార్సయిన వ్యాపారం. చాలామంది సినీ ప్రముఖులు ఈ విషయాన్ని పదే పదే నొక్కి వక్కాణిస్తుంటారు. అయితే, సినీ రంగానికీ సామాజిక బాధ్యత వుందని ఇంకొందరు సినీ ప్రముఖులు తమ సినిమాల ద్వారా నిరూపిస్తుండడం చూస్తూనే వున్నాం. అన్నీ కమర్షియల్‌ సినిమాలేనా.? సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయాలంటూ సినీ పరిశ్రమపై కామెంట్లు రావడం సహజమే. అయితే, ఆ సామాజిక బాధ్యత అన్ని సందర్భాల్లోనూ పనికిరాదు. ఈ రోజుల్లో అసలే కుదరదు.! 

'మెర్సల్‌' సినిమా విషయానికొస్తే, జీఎస్‌టీతోపాటు దేశంలో వైద్య రంగంలోని అక్రమాల్ని ఎత్తి చూపిందీ సినిమా. విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకుడు. తేనాండల్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. సినిమా వివాదాస్పదమవడం, బీజేపీ ఈ సినిమాపై మండిపడ్డం, వైద్యులు సినిమాకి వ్యతిరేకంగా నినదిస్తుండడం తెల్సిన విషయాలే. వైద్యుల మాటేమోగానీ, బీజేపీ బెదిరింపులకు నిర్మాత తలొగ్గారు. 'సన్నివేశాల్ని తొలగించడానికి సిద్ధం..' అని ప్రకటించేశారు నిర్మాత. 

దాంతో, సహజంగానే విజయ్‌ అభిమానులకు కోపమొచ్చేసింది. వస్తుంది మరి, బీజేపీకి వ్యతిరేకంగా.. సినిమాపై మండిపడ్తున్న వైద్యులకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు విజయ్‌ అభిమానులు. ఆ పోరాటం వృధా అయిపోతే ఒళ్ళు మండిపోదా.? 'మేం, టిక్కెట్లు కొన్న డబ్బులతోనే మీరు పండగ చేసుకుంటున్నారు.. మీకు మా సెంటిమెంట్లతో పని లేదా.?' అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

'ఇలాంటి మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తీయడమెందుకు.? తీసిన సినిమాలకు కట్టుబడి వుండలేకపోవడమేంటి.?' అంటూ ఇంకొందరు సోషల్‌ మీడియాలో చిత్ర నిర్మాతపై దుమ్మెత్తిపోస్తుండడం గమనార్హం. 'అభిమానులమంటే వెర్రి వెంగళప్పలమా.? సినిమాలోంచి సీన్లను తీసి చూడండి.. ఆ తర్వాత ఏం జరుగుతుందో..' అని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. 

సినీ నటుడు కమల్‌హాసన్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 'మెర్సల్‌' సినిమాకి మద్దతు పలకడం.. ఇంతలోనే, నిర్మాత దిగిరావడం చూస్తోంటే, కమలనాథులు నిర్మాతని ఏ స్థాయిలో బెదిరించి వుంటారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.