Advertisement


Home > Movies - Movie News
ఆమె ఏడ్చింది: ఎయిర్‌లైన్స్‌ కాదు నాన్సెన్స్‌.!

మొన్న బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు తన ఆవేదనను సోషల్‌ మీడియాలో వ్యక్తం చేసింది. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది తనతో అమర్యాదకరంగా ప్రవర్తించిందన్నది ఆమె ఆరోపణ. అయితే, ఆ ఆరోపణల్ని సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఖండించిందనుకోండి.. అది వేరే విషయం. మరో ఘటనలో ఇంకో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది, ఓ ప్రయాణీకుడ్ని చావగొట్టారు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యేసరికి, సదరు ఎయిర్‌లైన్స్‌ సంస్థకు బుకాయించడానికి ఛాన్స్‌ లేకుండా పోయింది. 

తాజాగా, సినీ నటి జైరా వాసిమ్‌ ('దంగల్‌' ఫేం) విమాన ప్రయాణంలో తోటి ప్రయాణీకుడి కారణంగా పడ్డ ఇబ్బందిని వెల్లడిస్తూ కంటతడిపెట్టింది. ప్రయాణీకుడొకరు, తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడన్నది ఆమె ఆరోపణ. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. జైరా వాసిమ్‌ ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేయడం జరిగిందనుకోండి.. అది వేరే విషయం. 

ప్యాసింజర్స్‌ ఫ్రెండ్లీగా దేశంలో విమానయానాన్ని మార్చేస్తామని కేంద్రం చెబుతోంది. సామాన్యుడికీ విమానయానాన్ని అందుబాటులోకి తెస్తామంటోంది. కానీ, ప్రయాణీకుల పట్ల కనీస గౌరవం, ప్రయాణీకులకు కనీస భద్రత లేకపోవడమేంటి.? కాస్త ఆలోచించాల్సిన విషయమే ఇది. ఇంతకీ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం చేస్తున్నట్టు.? ఆ ఒక్కటీ అడక్కూడదంతే. 

ప్రజా ప్రతినిథులేమో, ఎయిర్‌లైన్స్‌ సిబ్బందిని చితక్కొడతారు.. అది వారి అసహనం. ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ప్రయాణీకుల మీద విరుచుకుపడతారు.. ఇది వీరి అసహనం. ప్రయాణీకుల్లో కొందరేమో తోటి ప్రయాణీకులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు.. అది వారి పైత్యం. నేరానికి శిక్ష లేనప్పుడు.. ఇదిగో, ఇలాంటివే జరుగుతాయి. శివసేన ఎంపీ, టీడీపీ ఎంపీ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది మీద దాడి చేసినప్పుడు, ప్రయాణీకుడిపై ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది దాడి చేసినప్పుడు కఠిన చర్యలు తీసుకోలేదు. 

ఎయిర్‌పోర్ట్‌లోనో, విమానంలోనో.. ఏం చేసినా ఫర్లేదన్న 'తేలికపాటితనం' వచ్చేయడం వల్లేనేమో, జైరా వాసిమ్‌పై అసభ్య ప్రవర్తన.!