Home > Movies - Movie News
అరరె.. పవన్‌ ట్విట్టర్‌ పిట్ట హ్యాకయ్యిందే.!

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల 'అక్కౌంట్లు' హ్యాక్‌ అవడం కొత్తేమీ కాదు. రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా యాక్టివ్‌గా వుండేవాళ్ళకి ఈ హ్యాకింగ్‌ పెద్ద సమస్యగానే మారుతుంటుంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్‌ అక్కౌంట్లు అప్పుడప్పుడూ హ్యాక్‌ అవుతుండడం చూస్తూనే వున్నాం. తాజాగా, టాలీవుడ్‌ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ అక్కౌంట్‌ హ్యాక్‌ అయ్యింది. 

తమ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ అక్కౌంట్‌ హ్యాక్‌ అయ్యిందనీ, ఆ అకౌంట్‌ నుంచి ఎలాంటి మెసేజ్‌లు పోస్ట్‌ అయినా వాటిని ఎవరూ విశ్వసించరాదని జనసేన పార్టీ పేర్కొంది. సైబర్‌ క్రైమ్‌ సెల్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేస్తామనీ, దుండగుల దుశ్చర్యగా దీన్ని భావిస్తున్నామనీ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి వ్యాఖ్యానించడం గమనార్హం. 

చాన్నాళ్ళ క్రితమే ట్విట్టర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేసిన పవన్‌కళ్యాణ్‌, అందులో చాలావరకు పొలిటికల్‌ అప్‌డేట్స్‌ మాత్రమే పోస్ట్‌ చేస్తూ వస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి పలు అంశాలపై స్పందించాలనుకున్నప్పుడు ట్విట్టర్‌ అకౌంట్‌ని వినియోగిస్తున్నారాయన. ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై ఆయన వీలు చిక్కినప్పుడల్లా 'పోస్ట్‌లు' చేస్తూ వస్తున్నారు. ఇంతకీ పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేసిందెవరు.? ఈ ప్రశ్నకు సమాధానం కోసం పోలీసుల్ని ఆశ్రయించనున్నామని జనసేన వర్గాలు వెల్లడిస్తున్నాయి.